in future
-
ముందుంది అసలు పరీక్ష
విశ్లేషణ - ఎం. పద్మనాభరెడ్డి దేశ ప్రజలు 2014 ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. విపరీతమైన అవినీతి, పాలనలో అలసత్వం, సంకీర్ణ పేరుతో అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోలేక చేష్టలుడిగిన ప్రధానమంత్రి, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమ స్య వంటి రకరకాల కారణాలతో యూపీఏ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెంది బీజేపీకి పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం కాలమైనందున ప్రభుత్వ పనితీరుపై విశ్లేషణ జరగడం సహజమే. నేడు కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వమే, అందు లోను నరేంద్రమోదీ ప్రభుత్వమే అని చెప్పుకోవచ్చు. ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ పనితీరును పరిశీలించినప్పుడు ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అంతటా సానుకూల వాతావరణం ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలు హాజరు కావడంతో మొదలైన కొత్త విదేశాంగ విధానం ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సందే శాన్ని ఇచ్చింది. భారతదేశం అందరితో సత్సంబంధాలు కోరుకుంటుందని పొరుగు దేశాలతో శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకుంటుందని సందేశం. ఇందులో భాగంగానే ప్రధాని గత ఏడాది కాలంలో 18 దేశాలలో పర్యటించి ఆ దేశాధినేతలతో వ్యక్తిగత సంబంధాలు పెంచుకోవడ మే కాక దేశానికి ఉపయోగపడే ఎన్నో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. అంతే కాక చాలా సందర్భాలలో ఆ దేశ పార్లమెంటులో మాట్లాడడం అక్కడి భారత సంతతి వారితో మమేకమై ఒక చక్కటి వాతావరణాన్ని కల్పించారు. నేడు ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక బలమైన ఆర్థికశక్తిగా పెరుగుతున్న దేశంగా గుర్తింపు కూడా వచ్చింది. అయితే విదేశాంగ విధానం బాగానే ఉన్నా, దేశీయరంగంలో మోదీ ఎన్నికల సందర్భంలో చెప్పినవాటికి, జరుగుతున్న వాటికి వ్యత్యాసం ఉంది. మంచి వాక్చాతుర్యంతో, పాలనలో అనుభవంతో ఎన్నికల సందర్భంలో ఆయన ప్రజలను ఆకట్టుకున్నారు. 60 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. నాకు కేవలం 60 నెలలు అధికారం ఇవ్వండి. నేను దేశానికి, దేశ ప్రజలకు మంచి రోజులు (అచ్చేదిన్) తీసుకురాగలను అంటూ ఒక ఫీల్‌గుడ్ వాతావరణాన్ని నెలకొల్పడంలో సఫలీకృతుడయ్యారు. ఆర్థిక వనరుల బదిలీ ఇంతవరకు దేశ ఆర్థిక వనరుల్లో చాలా భాగం కేంద్రం చేతిలో ఉండేవి. రాష్ట్రా లను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 50% కేంద్ర పన్నుల నిధులు రాష్ట్రాలకు బదిలీ చేయడం మంచి నిర్ణయం. దేశాన్ని చాలా కాలంగా పట్టి పీడిస్తున్న సమస్య ధరల పెరుగుదల. మోదీ ప్రభుత్వం ధరల నియంత్రణ చేయగలిగింది. అయినా పరిస్థితి పూర్తిగా అదుపులోనికి రాలేదు. స్థూల దేశీయ ఉత్పత్తి పెరు గుతున్నా, ఉద్యోగ అవకాశాలు అనుకున్నంతగా పెరగలేదు. మేక్ ఇన్ ఇండి యా పేరుతో కార్యక్రమాన్ని చేపట్టినా, అది ఇంకా పురుడు పోసుకోలేదు. ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములను చేసే దిశలో జన్‌ధన్ యోజన ద్వారా సుమారు 15 కోట్ల కొత్త ఖాతాలు తెరవడం ఒక చక్కని మొదటి మెట్టు. ఇక దేశంలో కోట్లలో ఉన్న చిన్న వ్యాపారస్థుల సహాయార్థం 20 వేల కోట్లతో ‘ముద్ర’ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఉపాధి అవ కాశాలు పెంచుతుంది. ఇటీవలే తీసుకొచ్చిన రెండు బీమా పథకాలు పేదలకు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి. భూసేకరణ బిల్లుతో అపవాదు మోదీ నాయకత్వం వహిస్తున్న బీజేపీ పార్టీ ధనవంతుల పార్టీ అని, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా గత సంవత్సరం పెద్ద పెద్ద వ్యాపారస్థులకు కోట్లలో రాయితీలు ఇచ్చారు. అవి పరిశ్రమల అభివృద్ధికే అయినా, లాభపడింది మాత్రం కొందరు పారిశ్రామికవేత్తలు మాత్రమే. పరిశ్రమలు స్థాపించడానికి భూమి ఒక కీలకమైన అంశం. గత ప్రభుత్వం 2013లో తెచ్చిన భూసేకరణ చట్టంతో పరిశ్రమలు ఇతర అభివృద్ధి కార్యక్ర మాలకు భూసేకరణ ఒక అడ్డంకిగా మారింది. అయితే ఈ చట్టానికి కొన్ని సవరణలు తెస్తూ భూసేకరణ సులువుగా జరిగేటట్లు ప్రభుత్వం ప్రయత్ని స్తోంది. ఇది కాస్త రాజకీయ దుమారం లేపింది. సంఖ్యాబలం లేక రాజ్య సభలలో ఈ బిల్లు కాస్త గట్టెక్కక రెండవసారి ఆర్డినెన్స్ తీసుకువచ్చి బిల్లును బతికించే ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది అనే అపవాదు మూటకట్టుకుంది. మోదీ ప్రభుత్వంలోని గిరిరాజ్‌సింగ్, నిరంజన్‌జ్యోతి వంటి కొందరు మంత్రులు అల్ప సంఖ్యాక ప్రజలపై చేసిన అభియోగాలు ఆమోదయోగ్య మైనవి కావు. అసలే గుజరాత్ అల్లర్లతో మచ్చపడ్డ మోదీకి మంత్రివర్గ సహచ రుల అసందర్భ ప్రేలాపనలు అల్ప సంఖ్యాకులలో అభద్రతాభావం పెంచే విధంగా ఉండి, మోదీ ఇంకా ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి పైకి రాలేదు అనే అపవాదు వచ్చింది. కీలకమైన విద్య, ఆరోగ్య రంగాల్లో మోదీ ప్రభుత్వం గత సంవత్సర కాలంలో గట్టి చర్యలు ఏమీ తీసుకోలేదు. ఈ రెండు రంగాలలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎక్కువగా ఉండటమే కాకుండా, కేంద్ర నిధులు అంతంత మాత్రంగా ఉండటంతో ప్రాథమిక, ఉన్నత విద్యల ప్రమాణాలు దిగజా రాయి. 2014 -15లో విద్యా రంగానికి రూ.55 వేల కోట్ల కేటాయింపు ఉండగా, అది 2015-16లో రూ.42 వేల కోట్లకు తగ్గింది. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖకు గత ఏడాది రూ.21 వేల కోట్లు కేటాయించగా 2015-16లో రూ.10వేల కోట్లకు తగ్గించినారు. కేంద్ర ప్రభు త్వం కొత్తగా ఐఐటీ, ఐఐఎంలు స్థాపించడానికి పూనుకున్నా సరైన బోధనా సిబ్బంది లేక అవి ఎక్కడ వేసిన గొంగళి అచ్చటనే అన్న చందాన ఉన్నాయి. అయితే కేంద్రం ఉపాధ్యాయులకు శిక్షణ పేరుతో టీచర్ ఎడ్యుకేషన్ మిషన్ ప్రారం భించి అధ్యాపకులలో నైపుణ్యాన్ని పెంచే యత్నం చేసింది. కీలక విషయాలలో నాన్చకుండా సత్వర నిర్ణయం తీసుకోవడం మోదీ ప్రత్యేకత. ఫ్రాన్స్ పర్యటనలో వేల కోట్ల రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలు ఒప్పందం, అలాగే చైనా పర్యటనలో చైనా వారికి ఈ- వీసా మంజూరు ప్రకటన ముఖ్యమైనవి. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన నియంతగా వ్యవహరిస్తున్నాడు అనే అపవాదు కూడా వచ్చింది. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తెచ్చే విషయంలో మోదీ ప్రభుత్వం విఫల మైంది. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసి, నల్లధనంపై ఒక చట్టాన్ని తెచ్చి నా విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనం మాత్రం రాలేదు. మోదీ ఎన్నికల్లో ప్రజ లకు ఇచ్చిన హామీ ఇంత వరకు నెరవేరలేదు. బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పం దం ఒక చారిత్రక ఘట్టం. భారత పార్లమెంటులో ఏకగ్రీవంగా ఈ ఒప్పందం ఆమోదం పొందటం, ప్రధానమంత్రి స్వయంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలుపడం ఒక మంచి సంప్రదాయానికి ప్రతీక. సభలో ఫలవంతమైన చర్చలు జరిగి ఎన్నో బిల్లులు ఆమోదం పొందడంతో ప్రజలకు పార్లమెంటుపై గౌరవం పెరిగింది. పారదర్శకతతో పెరిగిన ఆదాయం దేశంలో అపారమైన బొగ్గు నిల్వలున్నా, యూపీఏ ప్రభుత్వం అవినీతి మూ లంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని బొగ్గు తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించడంతో దేశ బొగ్గు అవసరాల కొరకు విదేశాల నుండి బొగ్గు దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మోదీ ప్రభుత్వం పారదర్శకంగా బొగ్గు క్షేత్రా లను వేలం వేయడంతో ప్రభుత్వానికి లక్షల కోట్లలో ఆదాయం రావడమే కాక దేశంలో బొగ్గు లభ్యత పెరిగింది. అలాగే ధ్వని తరంగాల వేలం కూడా దేశానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చింది. 120 కోట్ల జనాభాతో ప్రపంచంలో అన్ని మతాల ప్రజలు, రకరకాల భాషలతో ఉన్న దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి సమయం కావాలి. మోదీ ప్రభుత్వం ఒక సంవత్సర పాలనలో ఏమీ జరగలేదు అనుకోవడం కానీ, ఏదో బ్రహ్మాండంగా జరుగుతుంది అని అనుకోవడం కాని పొరపాటే అవుతుంది. అయితే సంవత్సరకాలం ప్రభుత్వం అభివృద్ధి పథంలో ప్రయా ణిస్తుందా లేదా అని బేరీజు వేయడానికి సరిపోతుంది. ఎక్కడ ఉన్నామని కాదు - ఏ దిశలలో పయనిస్తున్నామన్నది ముఖ్యం. గత సంవత్సర పాలన లో మోదీ ప్రభుత్వం విదేశీ సంబంధాలలో, భారతదేశ ఇమేజ్ను ప్రపంచ దేశాలలో పెంచడంలో, అలాగే ఎటువంటి స్కామ్‌లు లేకుండా దేశ సంపద ను పారదర్శకంగా ఉపయోగించడంలో, త్వరితగతిన నిర్ణయాలు తీసుకుం టూ కేంద్రంలో ఒక పని చేసే ప్రభుత్వం ఉందని చెప్పడం వంటి కార్యక్రమా లలో పూర్తిగా సఫలీకృతమైంది. ఇకపోతే ఎన్నికల్లో పెద్ద ఎత్తున గుప్పించిన హామీలలో ఇంకా నెరవేర్చవలసినవి చాలా ఉన్నాయి. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు తగ్గించి, ధరల నియంత్రణ, ఉపాధి అవకాశాలు వంటి వాటిపై ఇంకా పని చేసే అచ్చేదిన్ తీసుకొని రావాల్సిన అవసరముంది. అలాగే ప్రభుత్వ ప్రతిష్టను మసకబరిచే ప్రసంగాలు చేస్తున్న మంత్రులు, పార్లమెంట్ సభ్యులపై నియంత్రణ అవసరం. మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, నీతి ఆయోగ్, ముద్ర బ్యాంక్, జన్‌ధన్ యోజన వంటి కార్యక్రమాలు కార్యరూపం దాల్చిన ఫలితాలు కనిపిస్తాయి. మొత్తానికి ఒక సంవత్సరం మోదీ పాలన భేషుగ్గా ఉంది కానీ, అసలు పరీక్ష మాత్రం ముందుంది. వ్యాసకర్త కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ 98492 69105 -
అలుపెరుగని పర్యాటకురాలు
భారతీయ ప్రాచీన కళలు, సాంస్కృతిక, వారసత్వ సంపదను కాపాడే ప్రతిష్టాత్మక సంస్థ పేరు ‘ఇన్టాక్.’ హైదరాబాద్‌లోని వారసత్వ సంపద విశేషాలు తెలుసుకోవడానికి, ఆయా ప్రాంతాలను సందర్శించి వివరాలు సేకరించడానికి ఈ ప్రతిష్టాత్మక సంస్థ ముప్పై ఏళ్ల క్రితం ఓ గృహిణిని ఆహ్వానించింది. తమ సంస్థలో ముఖ్య సభ్యురాలిగా స్థానమిచ్చింది. గృహిణిగా ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూనే, తల్లిగా పిల్లల సంరక్షణ చూసుకుంటూనే, ట్రావెలర్‌గా ప్రపంచమంతా పర్యటిస్తూ తనదైన కలను నెరవేర్చుకుంటూ భవిష్యత్తు తరాలకు తరగని సంపదను కానుకగా ఇస్తున్న ఆమె పేరు పి.అనూరాధా రెడ్డి. కాసేపు ఆమెతో మాట్లాడితే మన జీవితానికీ ఓ కొత్త ప్రయాణమార్గం కళ్లకు కడుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అటు నుంచి ప్రపంచ దేశాల వరకు.. చారిత్రక ప్రదేశాలను సందర్శించి, అపురూపమైన వాటిని కెమరా కన్నుతో వీక్షించడం అనూరాధారెడ్డి ప్రత్యేకత. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి భాష నేర్చుకోవడం ఆమెకున్న మరో ఆసక్తికరమైన అలవాటు. పాతికేళ్ల వయసు నుంచే ఒంటరిగా దేశాలు చుట్టిరావడం, అక్కడి ప్రత్యేకతలను తెలుపుతూ పుస్తకం రూపంలో తీసుకురావడం ఆమె ఒక దైవ కార్యంగా భావిస్తూ వచ్చారు. సాలార్జంగ్ మ్యూజియంలో వారసత్వ ప్రదేశాల వివరాలు తెలిపే ప్రజెంటేషన్స్ ఇస్తుంటారు. చారిత్రక కట్టడాల సంరక్షణకు ఏం చేయాలో ఉపన్యాసాలు ఇస్తుంటారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులను ‘హిస్టారికల్ వాక్’కు తీసుకెళుతుంటారు. ప్రతి ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు ఒక ‘హెరిటేజ్ క్లబ్’ ఏర్పాటు చేయాలి అని సూచించే అనూరాధారెడ్డి ‘జీవితమంతా పర్యటనలతో ముడిపడింది’ అంటూ తన ప్రయాణమార్గం గురించి ఇలా వివరించారు... గొప్పతనం తెలియజేయాలని... ‘‘మనం ఇప్పుడు జీవిస్తున్నది ముందు తరాలకు మార్గదర్శనం చేయడానికే అన్నది నా అభిమతం. డిగ్రీ వరకు చదువుకున్న నేను ఉద్యోగాలంటూ ఏమీ ఎంచుకోలేదు. పెళ్లై అత్తవారింట అడుగుపెట్టినా, ఇద్దరు అబ్బాయిలకు తల్లినైనా నా చూపు మన ప్రాచీన సంపద పరిరక్షణ వైపే ఉండేది. హైదరాబాద్‌లో ఎన్నో చారిత్రక కట్టడాలున్నాయి. అవన్నీ నిర్లక్ష్యానికి లోనవుతున్నాయి. వాటి చారిత్రక నేపథ్యం మరుగునపడకూడదని నా తాపత్రయం. అందుకే వాటి గురించి తెలుసుకోవడం, సందర్శించడం, ఫొటోలు తీసి పత్రికలకు అందజేయడం విధిగా పెట్టుకున్నా. ఈ పని ఎంతో మందిని కలిసే అవకాశాన్నిచ్చింది. హైదరాబాద్ ఇన్టాక్ సంస్థకు కన్వీనర్‌నీ చేసింది. పరిశోధక విద్యార్థులకు నా ప్రయత్నం ఉపయోగపడుతున్నందుకు ఆనందిస్తుంటా. ఇదంతా మా అమ్మ నాలో నింపిన స్ఫూర్తి! పొత్తిళ్లలోనే పునాది మా అమ్మ స్నేహలతా భూపాల్. ఆమె తొంభై ఏళ్లకు చేరువలో ఉన్నారు. నాన్న శ్రీరామ్ భూపాల్ (ఆరు నెలల క్రితం మరణించారు) హెచ్.సి.ఎస్ ఆఫీసర్‌గా కొనసాగారు. వారు సిరినపల్లి సంస్థానాధీశులు. ఆ రోజుల్లో అమ్మకి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆసక్తితో లెక్కల టీచర్‌గా, ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేశారు. అమ్మాయిల చదువుపై ఆమె అమితమైన శ్రద్ధ పెట్టేవారు. నన్నూ, తమ్ముడినీ చూసుకుంటూనే సాంస్కృతిక కార్యక్రమాలలో, క్రీడలలో పాల్గొనేవారు. ఆ రోజుల్లోనే బ్యాడ్మింటన్‌లో జాతీయ స్థాయిలో రాణించారు. సంగీతంలో మేటి అనిపించుకున్నారు. మా ఇంట మహిళా జాగృతికి సంబంధించిన చర్చలు జరుగుతుండేవి. అమ్మ, అమ్మమ్మల ధైర్యం, జీవితం పట్ల వారికున్న ఎనలేని గౌరవం ప్రతి దశలో నాకూ స్ఫూర్తిగా నిలిచాయి. వారి నుంచే తెలుగు, తమిళం, ఉర్దూ, మరాఠీ, కన్నడం నేర్చుకున్నా. పర్యటనలతో విదేశీ భాషలు పరిచయమయ్యాయి. అమ్మాయిల పురోభివృద్ధిలో అమ్మ పాత్ర చాలా ఉంటుంది అనడానికి మా అమ్మే ఉదాహరణ. నిరంతర శోధనా భాండాగారం ఐదేళ్ల వయసులో నాన్నగారిచ్చిన చిన్న కెమెరాతో నా శోధన మొదలైంది. నాన్నతో కలిసి ఎన్నో ప్రాంతాలు సందర్శించా. వ్యవసాయం, కళలు, ధనిక, పేద.. - అన్నింటినీ దగ్గరుండి చూశా. విషయాలన్నీ వివరంగా నాకు తెలియజేసేవారాయన. నాటి నుంచి ఎక్కడికెళ్లినా అక్కడి ప్రత్యేకతలు, వాతావరణం, చారిత్రక కట్టడాలు - ఇలా ప్రతి అంశాన్నీ ఫొటోలు, వీడియోలు తీయడం అలవాటుగా మారింది. చారిత్రక అంశాలను క్రోడీకరిస్తూ వ్యాసాలుగా భావితరాలకు అందించడం వ్యాపకమైంది. జగమంత కుటుంబం ఏ దేశానికి వెళ్లినా అక్కడ కొన్ని కుటుంబాలతో అనుబంధం ఏర్పడుతుంది. నలభై ఏళ్ల వయసులో జర్మనీ వెళ్లినప్పుడు అక్కడ స్థానిక రైలులో ప్రయాణిస్తున్నాను. ఒంటరి ప్రయాణం... ఒక స్టేషన్లో ఒక పెద్దావిడ రెలైక్కి, సీట్ కోసం అడిగింది. 90 ఏళ్లుంటాయి ఆమెకు. జర్మన్ భాషలోనే ఆమెకు సమాధానమిస్తూ సీట్ ఇచ్చాను. ఆమె నా వేషధారణ చూసి ఇండియన్ అని గుర్తుపట్టింది. ఆశ్చర్యపోయి, ‘మీరు ఇండియన్. అయినా జర్మన్ భాష బాగా మాట్లాడుతున్నారే’ అంది. అలా ఆమెతో మాట్లాడు తుండగా ‘మీరు మా దేశానికి అతిథిగా వచ్చారు. ఎక్కడ ఉండబోతున్నారు?’అనడిగింది. ఇంకా నిర్ణయించుకోలేదు అని చెప్పాను. ఆవిడ తన కుమారుడి ఇంటికి వెళుతున్నట్టు చెబుతూ నన్నూ రమ్మని ఆహ్వానించింది. నేను తన వెంట వాళ్లింటికి వెళ్లేంతవరకు నన్ను వదల్లేదు. ఆతిథ్యంతో పాటు ఆ ప్రాంతంలో చూడదగిన ప్రాచీన కట్టడాలు, అందమైన ప్రదేశాలన్నింటినీ వారి కుటుంబసభ్యులంతా దగ్గరుండి మరీ చూపించారు. ఇప్పటికీ వారింటి మూడు తరాలతో నాకు అనుబంధం ఉంది. ఆ పెద్దావిడ మరణించేంతవరకు నన్ను బిడ్డగా భావించేది. ఇండియాకు వారు వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉంటారు. మన వంటలు నేర్చుకుంటారు. ఏడాదికి రెండు టూర్లు... ఇప్పుడైతే పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు కానీ వారు పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడూ సెలవుల సమయంలో టూర్లు ప్లాన్ చేసుకునేదాన్ని. నా పరిశోధనల కోసమే కాదు, కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకూ ఉత్సాహం చూపేదాన్ని. ఇందుకు నా భర్త జనార్దనరెడ్డి పూర్తి సహకారం అందించేవారు. పన్నెండేళ్ల క్రితం వరకు అయితే ఒంటరిగానే విదేశీ ప్రయాణాలు చేసేదాన్ని. ఆ తర్వాత ఒక ట్రావెల్ గ్రూప్‌ను ఏర్పాటు చేశా. వారితో కలిసి ఇప్పటికీ ఏడాదికి రెండు విదేశీ టూర్లు ఉండేలా ప్రణాళిక వేసుకుంటా. నిజానికి మా గ్రూప్ ఏర్పాటు కూడా గమ్మత్తుగా జరిగింది. ఒకసారి టాంజానియాలోని మా కజిన్ కుమారుడి పెళ్లికి నన్ను ఆహ్వానించారు. అక్కడికి దక్షిణ ఆఫ్రికా దగ్గర కావడంతో ఈ రెండు ప్రాంతాల వారసత్వ సంపదను కూడా చూసి రావాలనుకున్నాను. స్నేహితులు, బంధువులలో ఆసక్తి గలవారు తామూ వస్తామని ఉత్సాహం చూపారు. అలా పన్నెండు మందితో కలిసి కిలిమంజారో, జాంజిబార్ ఐలాండ్, అరుషా, గో రంగోరో నేషనల్ పార్క్, లేక్ విక్టోరియా, నైల్ రివర్ మొదలయ్యే ప్రాతం నుంచి మెడిటేరియన్ వరకు.. ఇవన్నీ ప్లాన్ చేసి మరీ చూసొచ్చాం. తర్వాత్తర్వాత ఈజిప్ట్, టర్కీ, బ్రెజిల్, వియత్నాం, కాంబోడియా, భూటాన్, థాయ్‌లాండ్, చైనా, రష్యా, ఇండొనేషియా, మెక్సికో, బర్మా, దుబాయ్ చూసొచ్చాం. ఇవన్నీ కాలానుగుణంగా ప్లాన్ చేసుకోవడం, వెళ్లి రావడం చేస్తూనే ఉన్నాం. మొదట 12 మందితో మొదలైన గ్రూప్ ఇప్పుడు 40 మందికి చేరింది. మా గ్రూప్‌లో 80 ఏళ్ల వయసున్నవారూ ఉండటం విశేషం!’’ అంటూ తమ పర్యటన అనుభవాలను తెలిపారు ఆమె. టైమ్ గడవడం లేదు అంటూ ఖాళీ చేతులతో కాలాన్ని వెళ్లదీయడం కాదు. భావితరాలకు సుసంపన్నమైన ప్రాచీన భాండాగారాన్ని అందజేయాలి అనే ఆలోచన కలిగించే ఇలాంటి స్త్రీ మూర్తుల కృషి ఎప్పుడూ అనుసరణీయమే! సంభాషణ: నిర్మలారెడ్డి ఏ ప్రదేశానికి వెళ్లినా మనం మాట్లాడే భాష, ఎదుటివారికి ఇచ్చే మర్యాద, అలాగే వారితో స్నేహంగా ఉండటం.. బాగా తోడ్పడతాయి. అయితే, ఒక స్త్రీ గా అప్పుడూ ఇప్పుడూ నా జాగ్రత్తల్లో నేనుంటా. స్వచ్ఛందంగా చేసే ఈ పని భవిష్యత్ తరాలకు ఓ సూచిక అవుతుందని ఆనందిస్తుంటా. చదువు క్రమశిక్షణను నేర్పుతుంది. తల్లితండ్రులు కొంతవరకు దారి చూపుతారు. ఆ తర్వాత క్రమశిక్షణతో మన దారిని మనమే వెతుక్కుంటూ ముందుకెళ్లాలి. మనిషి ఎప్పుడూ నిత్య విద్యార్థి. నేర్చుకున్నదాంట్లో కొంతైనా భావితరాలకు అందజేయడం ఆ విద్యార్థి కనీస బాధ్యత. నేను చేస్తున్నది అదే.