ముందుంది అసలు పరీక్ష | analysis of modi's one year ruling by m. padmanabha reddy | Sakshi
Sakshi News home page

ముందుంది అసలు పరీక్ష

Published Mon, May 25 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 AM

ముందుంది అసలు పరీక్ష

ముందుంది అసలు పరీక్ష

విశ్లేషణ

- ఎం. పద్మనాభరెడ్డి

 
దేశ ప్రజలు 2014 ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. విపరీతమైన అవినీతి, పాలనలో అలసత్వం, సంకీర్ణ పేరుతో అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోలేక చేష్టలుడిగిన ప్రధానమంత్రి, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమ స్య వంటి రకరకాల కారణాలతో యూపీఏ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెంది బీజేపీకి పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం కాలమైనందున ప్రభుత్వ పనితీరుపై విశ్లేషణ జరగడం సహజమే. నేడు కేంద్రంలో ఉన్నది ఎన్‌డీఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వమే, అందు లోను నరేంద్రమోదీ ప్రభుత్వమే అని చెప్పుకోవచ్చు. ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ పనితీరును పరిశీలించినప్పుడు ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.

అంతటా సానుకూల వాతావరణం
ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలు హాజరు కావడంతో మొదలైన కొత్త విదేశాంగ విధానం ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సందే శాన్ని ఇచ్చింది. భారతదేశం అందరితో సత్సంబంధాలు కోరుకుంటుందని పొరుగు దేశాలతో శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకుంటుందని సందేశం. ఇందులో భాగంగానే ప్రధాని గత ఏడాది కాలంలో 18 దేశాలలో పర్యటించి ఆ దేశాధినేతలతో వ్యక్తిగత సంబంధాలు పెంచుకోవడ మే కాక దేశానికి ఉపయోగపడే ఎన్నో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. అంతే కాక చాలా సందర్భాలలో ఆ దేశ పార్లమెంటులో మాట్లాడడం అక్కడి భారత సంతతి వారితో మమేకమై ఒక చక్కటి వాతావరణాన్ని కల్పించారు. నేడు ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక బలమైన ఆర్థికశక్తిగా పెరుగుతున్న దేశంగా గుర్తింపు కూడా వచ్చింది.

అయితే విదేశాంగ విధానం బాగానే ఉన్నా, దేశీయరంగంలో మోదీ ఎన్నికల సందర్భంలో చెప్పినవాటికి, జరుగుతున్న వాటికి వ్యత్యాసం ఉంది. మంచి వాక్చాతుర్యంతో, పాలనలో అనుభవంతో ఎన్నికల సందర్భంలో ఆయన ప్రజలను ఆకట్టుకున్నారు. 60 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. నాకు కేవలం 60 నెలలు అధికారం ఇవ్వండి. నేను దేశానికి, దేశ ప్రజలకు మంచి రోజులు (అచ్చేదిన్) తీసుకురాగలను అంటూ ఒక ఫీల్‌గుడ్ వాతావరణాన్ని నెలకొల్పడంలో సఫలీకృతుడయ్యారు.

ఆర్థిక వనరుల బదిలీ
ఇంతవరకు దేశ ఆర్థిక వనరుల్లో చాలా భాగం కేంద్రం చేతిలో ఉండేవి. రాష్ట్రా లను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 50% కేంద్ర పన్నుల నిధులు రాష్ట్రాలకు బదిలీ చేయడం మంచి నిర్ణయం. దేశాన్ని చాలా కాలంగా పట్టి పీడిస్తున్న సమస్య ధరల పెరుగుదల. మోదీ ప్రభుత్వం ధరల నియంత్రణ చేయగలిగింది. అయినా పరిస్థితి పూర్తిగా అదుపులోనికి రాలేదు. స్థూల దేశీయ ఉత్పత్తి పెరు గుతున్నా, ఉద్యోగ అవకాశాలు అనుకున్నంతగా పెరగలేదు. మేక్ ఇన్ ఇండి యా పేరుతో కార్యక్రమాన్ని చేపట్టినా, అది ఇంకా  పురుడు పోసుకోలేదు.

ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములను చేసే దిశలో జన్‌ధన్ యోజన ద్వారా సుమారు 15 కోట్ల కొత్త ఖాతాలు తెరవడం ఒక చక్కని మొదటి మెట్టు. ఇక దేశంలో కోట్లలో ఉన్న చిన్న వ్యాపారస్థుల సహాయార్థం 20 వేల కోట్లతో ‘ముద్ర’ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఉపాధి అవ కాశాలు పెంచుతుంది. ఇటీవలే తీసుకొచ్చిన రెండు బీమా పథకాలు పేదలకు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి.

భూసేకరణ బిల్లుతో అపవాదు
మోదీ నాయకత్వం వహిస్తున్న బీజేపీ పార్టీ ధనవంతుల పార్టీ అని, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా గత సంవత్సరం పెద్ద పెద్ద వ్యాపారస్థులకు కోట్లలో రాయితీలు ఇచ్చారు. అవి పరిశ్రమల అభివృద్ధికే అయినా, లాభపడింది మాత్రం కొందరు పారిశ్రామికవేత్తలు మాత్రమే. పరిశ్రమలు స్థాపించడానికి భూమి ఒక కీలకమైన అంశం. గత ప్రభుత్వం 2013లో తెచ్చిన భూసేకరణ చట్టంతో పరిశ్రమలు ఇతర అభివృద్ధి కార్యక్ర మాలకు  భూసేకరణ ఒక అడ్డంకిగా మారింది. అయితే ఈ చట్టానికి కొన్ని సవరణలు తెస్తూ భూసేకరణ సులువుగా జరిగేటట్లు ప్రభుత్వం ప్రయత్ని స్తోంది. ఇది కాస్త రాజకీయ దుమారం లేపింది. సంఖ్యాబలం లేక రాజ్య సభలలో ఈ బిల్లు కాస్త గట్టెక్కక రెండవసారి ఆర్డినెన్స్ తీసుకువచ్చి బిల్లును బతికించే ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది అనే అపవాదు మూటకట్టుకుంది.

మోదీ ప్రభుత్వంలోని గిరిరాజ్‌సింగ్, నిరంజన్‌జ్యోతి వంటి కొందరు మంత్రులు అల్ప సంఖ్యాక ప్రజలపై చేసిన అభియోగాలు ఆమోదయోగ్య మైనవి కావు. అసలే గుజరాత్ అల్లర్లతో మచ్చపడ్డ మోదీకి మంత్రివర్గ సహచ రుల అసందర్భ ప్రేలాపనలు అల్ప సంఖ్యాకులలో అభద్రతాభావం పెంచే విధంగా ఉండి, మోదీ ఇంకా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం నుంచి పైకి రాలేదు అనే అపవాదు వచ్చింది.

కీలకమైన విద్య, ఆరోగ్య రంగాల్లో మోదీ ప్రభుత్వం గత సంవత్సర కాలంలో గట్టి చర్యలు ఏమీ తీసుకోలేదు. ఈ రెండు రంగాలలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎక్కువగా ఉండటమే కాకుండా, కేంద్ర నిధులు అంతంత మాత్రంగా ఉండటంతో ప్రాథమిక, ఉన్నత విద్యల ప్రమాణాలు దిగజా రాయి. 2014 -15లో విద్యా రంగానికి రూ.55 వేల కోట్ల కేటాయింపు ఉండగా, అది 2015-16లో రూ.42 వేల కోట్లకు తగ్గింది.
 అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖకు గత ఏడాది రూ.21 వేల కోట్లు కేటాయించగా 2015-16లో రూ.10వేల కోట్లకు తగ్గించినారు. కేంద్ర ప్రభు త్వం కొత్తగా ఐఐటీ, ఐఐఎంలు స్థాపించడానికి పూనుకున్నా సరైన బోధనా సిబ్బంది లేక అవి ఎక్కడ వేసిన గొంగళి అచ్చటనే అన్న చందాన ఉన్నాయి. అయితే కేంద్రం ఉపాధ్యాయులకు శిక్షణ పేరుతో టీచర్ ఎడ్యుకేషన్ మిషన్ ప్రారం భించి అధ్యాపకులలో నైపుణ్యాన్ని పెంచే యత్నం చేసింది.

కీలక విషయాలలో నాన్చకుండా సత్వర నిర్ణయం తీసుకోవడం మోదీ ప్రత్యేకత. ఫ్రాన్స్ పర్యటనలో వేల కోట్ల రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలు ఒప్పందం, అలాగే చైనా పర్యటనలో చైనా వారికి ఈ- వీసా మంజూరు ప్రకటన ముఖ్యమైనవి. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన నియంతగా వ్యవహరిస్తున్నాడు అనే అపవాదు కూడా వచ్చింది.

విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తెచ్చే విషయంలో మోదీ ప్రభుత్వం విఫల మైంది. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసి, నల్లధనంపై ఒక చట్టాన్ని తెచ్చి నా విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనం మాత్రం రాలేదు. మోదీ ఎన్నికల్లో ప్రజ లకు ఇచ్చిన హామీ ఇంత వరకు నెరవేరలేదు. బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పం దం ఒక చారిత్రక ఘట్టం. భారత పార్లమెంటులో ఏకగ్రీవంగా ఈ ఒప్పందం ఆమోదం పొందటం, ప్రధానమంత్రి స్వయంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలుపడం ఒక మంచి సంప్రదాయానికి ప్రతీక. సభలో ఫలవంతమైన చర్చలు జరిగి ఎన్నో బిల్లులు ఆమోదం పొందడంతో ప్రజలకు పార్లమెంటుపై గౌరవం పెరిగింది.

పారదర్శకతతో పెరిగిన ఆదాయం
దేశంలో అపారమైన బొగ్గు నిల్వలున్నా, యూపీఏ ప్రభుత్వం అవినీతి మూ లంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని బొగ్గు తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించడంతో దేశ బొగ్గు అవసరాల కొరకు విదేశాల నుండి బొగ్గు దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మోదీ ప్రభుత్వం పారదర్శకంగా బొగ్గు క్షేత్రా లను వేలం వేయడంతో ప్రభుత్వానికి లక్షల కోట్లలో ఆదాయం రావడమే కాక దేశంలో బొగ్గు లభ్యత పెరిగింది. అలాగే ధ్వని తరంగాల వేలం కూడా దేశానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చింది.

120 కోట్ల జనాభాతో ప్రపంచంలో అన్ని మతాల ప్రజలు, రకరకాల భాషలతో ఉన్న దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి సమయం కావాలి. మోదీ ప్రభుత్వం ఒక సంవత్సర పాలనలో ఏమీ జరగలేదు అనుకోవడం కానీ, ఏదో బ్రహ్మాండంగా జరుగుతుంది అని అనుకోవడం కాని పొరపాటే అవుతుంది. అయితే సంవత్సరకాలం ప్రభుత్వం అభివృద్ధి పథంలో ప్రయా ణిస్తుందా లేదా అని బేరీజు వేయడానికి సరిపోతుంది. ఎక్కడ ఉన్నామని కాదు - ఏ దిశలలో పయనిస్తున్నామన్నది ముఖ్యం. గత సంవత్సర పాలన లో మోదీ ప్రభుత్వం విదేశీ సంబంధాలలో, భారతదేశ ఇమేజ్‌ను ప్రపంచ దేశాలలో పెంచడంలో, అలాగే ఎటువంటి స్కామ్‌లు లేకుండా దేశ సంపద ను పారదర్శకంగా ఉపయోగించడంలో, త్వరితగతిన నిర్ణయాలు తీసుకుం టూ కేంద్రంలో ఒక పని చేసే ప్రభుత్వం ఉందని చెప్పడం వంటి కార్యక్రమా లలో పూర్తిగా సఫలీకృతమైంది.

ఇకపోతే ఎన్నికల్లో పెద్ద ఎత్తున గుప్పించిన హామీలలో ఇంకా నెరవేర్చవలసినవి చాలా ఉన్నాయి. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు తగ్గించి, ధరల నియంత్రణ, ఉపాధి అవకాశాలు వంటి వాటిపై ఇంకా పని చేసే అచ్చేదిన్ తీసుకొని రావాల్సిన అవసరముంది. అలాగే ప్రభుత్వ ప్రతిష్టను మసకబరిచే ప్రసంగాలు చేస్తున్న మంత్రులు, పార్లమెంట్ సభ్యులపై నియంత్రణ అవసరం. మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, నీతి ఆయోగ్, ముద్ర బ్యాంక్, జన్‌ధన్ యోజన వంటి కార్యక్రమాలు కార్యరూపం దాల్చిన ఫలితాలు కనిపిస్తాయి. మొత్తానికి ఒక సంవత్సరం మోదీ పాలన భేషుగ్గా ఉంది కానీ, అసలు పరీక్ష మాత్రం ముందుంది.

వ్యాసకర్త కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్  98492 69105

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement