- ప్రభుత్వ పాలన సమర్థవంతంగా ఉండాలి
- ఉద్యోగుల్లో పని సంస్కృతి పెరగాలి
- బాలగోపాల్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
- మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీవన్‌కుమార్
కేయూ క్యాంపస్ : ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేవిధంగా ప్రభుత్వ విధానాలు, పాలన ఉండాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జీవన్‌కుమార్ అన్నారు. మానవ హక్కుల నేత దివంగత కె.బాల్‌గోపాల్ వర్ధంతిని పురస్కరించుకుని మానవహక్కుల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల సెమినార్‌హాల్‌లో ‘ప్రభుత్వ విధానాలు -ప్రజల ఆకాంక్షలు’ అంశంపై సదస్సు నిర్వహించారు.
ముఖ్య వక్తగా ఆయన మాట్లాడుతూ ఆకాంక్షలు నెరవేరుతాయనే ఉద్దేశంతోనే ప్రజలు అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారన్న విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం చిన్న నీటి వనరులపై దృష్టి పెటాలని, వైద్య వ్యవస్థను మెరుగుపర్చాలని సూచించారు. పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ‘ఫ్రెండ్లీ పోలీస్’ ఏర్పాటు దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.
సహజ వనరులను కాపాడుకుంటూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాల్సి ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించి పాలన కొనసాగించాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో వలసవాద దోపిడీ వల్లే తెలంగాణ వెనుకబడిందని చెప్పుకొచ్చామని, ఇప్పుడు రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో నిబద్ధతతో పని చేయాలని కోరారు.
ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించినప్పుడే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని అన్నారు. ఉద్యోగుల్లోమార్పు రాకుం టే గత పాలకులే నయం అన్న భావన ప్రజల్లో వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. హక్కుల నేతగా మానవ హక్కుల ఉల్లంఘనలపై బాలగోపాల్ పోరాడారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో హక్కుల ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.
అద్భుతాలు సాధ్యం కావు..
ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నాయా అన్న ప్రశ్నకు సమాధానం అందరికీ తెలిసిందేనని సీనియర్ పాత్రికేయుడు కె.శ్రీనివాస్ అన్నారు. ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే గడిచిందని, ఇప్పుడే అద్భుతాలు సృష్టించడం సాధ్యం కాదన్నారు. రూ.25వేల కోట్లతో వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అంతగా సాధ్యం కాదన్నారు. చిన్ననీటి వనరులను అభివృద్ధి చేస్తే తెలంగాణ సస్యశ్యామలమవుతుందన్నారు.
తెలంగాణ వస్తే నిధులు, నీళ్లు, ఉద్యోగాలు వస్తాయని విస్తృత ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చాక ఒక్క దాన్ని కూడా పూర్తి స్థాయిలో సాధించలేకపోయారన్నారు. సీఎం కేసీఆర్ చేసిన పనులను పలువురు సమర్థిస్తుండడంతో వాటికి ప్రజామోదం లభించినట్లుగా భావించడం సరికాదన్నారు. కేంద్రంలో నరేంద్రమోడీ అధికారంలోకి రావడానికి యూపీఏ ప్రభుత్వ వైఫల్యమూ కారణమేనన్నారు. ఉద్యమ సమయంలో మావోయిస్టుల ఎజెండా తన ఎజెండా అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు తన పాలనలో హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రను సింగపూర్ చేస్తానని చంద్రబాబు, హైదరాబాద్‌ను న్యూయార్క్ చేస్తానని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించేవారు కచ్చితంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. పాలకు ల విధానాలను ప్రశ్నించే విధంగా పౌర సమాజం ఉండాలని, అందుకనుగుణంగా ఉద్యమా లు నిర్మించాలన్నారు. హక్కుల ఉల్లంఘనపై బాలగోపాల్ నిష్కర్షగా, నిర్మొహమాటంగా మాట్లాడేవారనిగుర్తు చేశారు. సదస్సులో మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, బాదావత్‌రాజు, సాధు రాజేష్, టి.నాగయ్య పాల్గొన్నారు.