నైతిక విలువల రక్షణ పేరిట రాజ్యాధికారాన్ని చేతుల్లో తీసుకునే అధికారం ఎవరికీ లేదని ఢిల్లీ కోర్టు పేర్కొంది.
- సంస్కృతి రక్షణ పేరుతో దాడులకు పాల్పడొద్దు: ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: నైతిక విలువల రక్షణ పేరిట రాజ్యాధికారాన్ని చేతుల్లో తీసుకునే అధికారం ఎవరికీ లేదని ఢిల్లీ కోర్టు పేర్కొంది. తన కార్లో కూర్చొని ఓ స్నేహితురాలితో కలసి మద్యం సేవిస్తున్న వ్యక్తిని కాల్చేసిన గన్‌మన్‌కు యావ జ్జీవ కఠిన జైలు శిక్ష విధిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
2011 లో అశోక్ విహార్‌లో హరియాణాకు చెందిన సందీప్‌కుమార్ అనే 32 ఏళ్ల గన్‌మన్.. వీరేందర్ అనే వ్యక్తిని లెసైన్స్‌డ్ రైఫిల్‌తో కాల్చడంతో అతను మరణించాడు. కోర్టు కుమార్‌కు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. రూ. లక్ష వీరేందర్ కుటుంబానికి ఇవ్వాలని ఆదేశించింది.
విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి కామిని మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు సున్నితమైన సామాజికాంశాల్ని దెబ్బతీస్తాయన్నారు. దేశ సంస్కృతి పరిరక్షణ పేరుతో పలువురు వ్యక్తులు, సంఘాలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, అధిక సందర్భాల్లో యువతులే లక్ష్యంగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరి ప్రవర్తన సవ్యంగా ఉండాలని.. అదే సందర్భంలో అలా లేనివారిని శిక్షించే అధికారం ఏ ఒక్కరికీ లేదని అన్నారు.