మన కులతూరు భాష.. సాయిమంతే! | Tribal Language And Culture In West Godavari | Sakshi
Sakshi News home page

మన కులతూరు భాష.. సాయిమంతే!

Published Sat, Jul 21 2018 7:12 AM | Last Updated on Sat, Jul 21 2018 7:12 AM

Tribal Language And Culture In West Godavari - Sakshi

కోయ భాషలో పాడుతూ నృత్యం చేస్తున్న మహిళలు

నీ పేరు ఏంటి అనడానికి ‘మీ పేదేరు బాత’, మీది ఏమి కూర అని అడగడానికి ‘మీ వాది బాత కూసీరి’, ఇటురా అని పిలవడానికి ‘ఇలావా’ అంటారు. ఇవన్నీ కోయ భాష పదాలు. అతి ప్రాచీన భాషలలో ఇది ఒకటి. మన తెలుగు భాషలాగే ద్రావిడ భాష నుంచి పుట్టింది. అందుకే ‘మన కులతూరు భాష సాయిమంతే..’ అని కోయ తెగవారు మురిసిపోతుంటారు. అంటే మన కోయ భాష మంచిది అని అర్థం.. 

బుట్టాయగూడెం :భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌లో పేర్కొన్న గిరిజన తెగల్లో కోయ తెగ ప్రధానమైనది. వీరి భాష, సంస్కృతి, సంప్రదాయ విధానం భిన్నంగా ఉంటుంది. కోయల భాషలో యాస అనేది స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో కోయ తెగ వాసులు ఎక్కువగా బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి మండలాల్లో ఉన్నారు. కోయలను రెండు విధాలుగా చెప్పుకుంటారు. మొదటి వర్గం దొరల సట్టం(కోయ తెగల్లో ఉన్నతులు–దేవుని వర్గం), రెండో వారు పుట్టదొరలు(నిజమైన దేవుళ్లుగా చెప్పుకుంటారు). గోండుల మాదిరిగానే తమను తాము వారి పరిభాషలో “కోయతూర్లు’గా చెప్పుకుంటారు. అలాగే కోయలు వారి వృత్తులను బట్టి రాచకోయ, గుమ్మకోయ, కమ్మరకోయ, ముసరకోయ, గంపకోయ, పట్టెడకోయ, వడ్డెకోయలు అనే 7 వర్గాలుగా ఉన్నారు. అలాగే కోయలుగా గుర్తింపు పొందిన మరో నాలుగు తెగలు ఉన్నట్టు భాషా పరిశోధకులు చెప్తున్నారు. డోలు కోయలు, కాక కోయలు, మట్ట కోయలు, లింగకోయలు అనే 4 తెగలను గుర్తించారు. అయితే కోయవారు కోయతూర్‌ భాషలో మాట్లాడతారు.

కోయ భాషలో అన్నం తిన్నామా అనడానికి “్ఙదూడ తింతిన్ఙే్ఙ, నీ పేరు ఏంటి అనడానికి “మీ పేదేరు బాత’, మీది ఏమి కూర అని అడగడానికి “మీ వాది బాత కూసీరి’, నీకు జ్వరం వచ్చిందా అనడానికి “మీకు ఎరికి వత్తే ‘, ఇటురా అని పిలవడానికి “ఇలావా’ అని వారి భాషలో ఎంతో చక్కగా  మాట్లాడేవారు. ఒక నాడు తెలుగు రాష్ట్రాల్లో ఉండే కోయలందరూ మాట్లాడ గలిగినా నేడు కొందరు మాత్రమే ఈ భాషలో మాట్లాడుతున్నారు. మరికొందరు భాష వచ్చినా మాట్లాడటానికి సిగ్గుపడుతున్నారని ఆ తెగకు చెందిన వారే చెప్తున్నారు. దీనికి కారణం అభివృద్ధి పేరుతో పరుగులు పెట్టడమేనని అంటున్నారు. జిల్లాలో గిరిజనులు సుమారు 97,929 వరకూ ఉండగా వీరిలో 70 శాతం కోయ భాష మాట్లాడే వారు ఉన్నారంటూ ఆ తెగకు చెందిన పెద్దలు చెప్తున్నారు. వీరిలో ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 60 వేల మంది వరకూ గిరిజనులు నివసిస్తున్నారు.

అతి ప్రాచీన భాషల్లో ఒకటి
తాము ఎంతో అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకోవడమే తప్ప తమ భాష, సంస్కృతి, సంప్రదాయం, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారుతోందని కోయ గిరిజనులు భావించలేకపోతున్నారని పలువురు కోయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోయ భాష అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. ద్రావిడ భాష నుంచి కోయ భాష పుట్టిందని చరిత్ర చెబుతోంది. అయితే కోయభాషను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కోయ భాష మీద ప్రధాన భాషల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ తెగకు చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగరికత పేరుతో జరుగుతోన్న అభివృద్దిలో భాగంగా భాషలకు ముప్పు వాటిల్లుతుందని, ఆ ప్రభావం కోయభాషపై కనిపిస్తోందని గిరిజన సంఘాల నాయకులు తెలిపారు.

ఐటీడీఏ ఆధ్వర్యంలో కోయ భారతి విద్య
కోయ భాషకు లిపి లేనప్పటికీ కేఆర్‌పురం ఐటీడీఏ ఆధ్వర్యంలో 2005లో కోయ భాషలో గిరిజన విద్యార్థులకు విద్యాబోధన జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. అనుభవజ్ఞులైన గిరిజన ఉపాధ్యాయుల ద్వారా కోయ భాషకు సంబంధించిన తెలుగు పదాలతో కోయ భారతి అనే పుస్తకాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకూ ప్రధాన భాషలతో పాటు కోయ భాషను కూడా బోధించే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ విధానం వల్ల కోయ విద్యార్థులో విద్యపై ఆసక్తి పెరుగుతుందని, ప్రాథమిక విద్యాభ్యాసం సులభతరం అవుతుందని అధికారులు అంటున్నారు. అయితే కోయ భాషకు లిపి లేనందున భాషా సంస్కృతి క్రమంగా తగ్గిపోతోందని ఆదివాసీ కోయతెగల మేధావులు అంటున్నారు. తమ తెగకు ప్రధానమైంది భాషేనని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ గిరిజనులపై ఉందని పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement