యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్కాట్లండ్ రాజధాని ఎడన్‌బరా నగరంలో ఏటా ఆగస్టులో జరిగే ఎడిన్‌బరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండ్ ఫ్రింజ్ సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలుస్తోంది. ఆగస్టు మొదటివారం నుంచి చివరి వారం వరకు మూడువారాలకు పైగా జరిగే ఈ వేడుకల్లో ప్రపంచం నలుమూలలకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేస్తాయి. ఈ ఏడాది ఆగస్టు 5న మొదలైన ఈ వేడుకలు ఆగస్టు 28 వరకు జరగనున్నాయి. యూరోపియన్, అమెరికన్, ఆఫ్రికన్, ఆసియన్ సంస్కృతులకు చెందిన ఎందరో కళాకారులు ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికలపై తమ కళాప్రదర్శనలు చేస్తారు. భారతీయ కళాకారులు కూడా ఈ వేదికలపై శాస్త్రీయ, జానపద సంగీత నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు.
నేపథ్యం
ఎడిన్‌బరాలో ఈ వేడుకలు దాదాపు డెబ్బయి ఐదేళ్లుగా జరుగుతున్నాయి. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు రుడాల్ఫ్ బింగ్ అనే నాజీ కాందిశీకుడు ఎడిన్‌బరా చేరుకున్నాడు. కొంతకాలానికి అతడు ఎడిన్‌బరాలోని గ్లైండెబోర్న్ నాటక సంస్థకు జనరల్ మేనేజర్‌గా ఎదిగాడు. ప్రపంచం నలుమూలలకు చెందిన సంస్కృతులన్నింటినీ ఒకేచోటకు తీసుకొచ్చి కళా సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో బింగ్ తన మిత్రుడు హెన్రీ హార్వే వుడ్‌తో కలసి ఎడిన్‌బరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండ్ ఫ్రింజ్ వేడుకలను ప్రారంభించాడు.
ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి దేశ దేశాలకు చెందిన కళాకారులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక్కడి ప్రదర్శనల ద్వారా తేలికగా ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని వారు భావిస్తుంటారు. ఈ వేడుకల సందర్భంగా ఎడిన్‌బరా వీథుల్లో భారీ ఎత్తున ఊరేగింపులు నిర్వహిస్తారు. ఊరేగింపులో పలువురు తమ కళానైపుణ్యాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతుంటారు. సాయంత్రం వేళల్లో కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా ప్రదర్శనలు భారీ స్థాయిలో నిర్వహిస్తారు. ఈసారి జరుగుతున్న వేడుకల్లో ఎడిన్‌బరా నగరం ఎటుచూసినా కోలాహలంగా పండుగ కళతో కనిపిస్తోంది.
(చదవండి: నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు")
Comments
Please login to add a commentAdd a comment