Festival session
-
పండుగల్లో ఆన్లైన్ షాపింగ్.. 81 శాతం మంది
న్యూఢిల్లీ: రానున్న పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేసేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్టు అధిక శాతం వినియోగదారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే మరింత ఖర్చు పెట్టేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. అమెజాన్ ఇండియా తరఫున నీల్సన్ మీడియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. మెట్రోలు, చిన్న పట్టణాలకు చెందిన 8,159 మంది వినియోగదారుల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. సర్వేలోని అంశాలు.. ► మెట్రోల నుంచి 87 శాతం మంది, టైర్–2 పట్టణాల (10–40 లక్షల జనాభా ఉన్న) నుంచి 86 శాతం మంది ఈ ఏడాది పండుగల సీజన్లో ఆన్లైన్ షాపింగ్ చేయనున్నట్టు చెప్పారు. మొత్తం మీద 81 శాతం మంది ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గు చూపిస్తున్నారు. ►ప్రతి ఇద్దరు వినియోగదారుల్లో ఒకరు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది షాపింగ్‌పై ఎక్కువ ఖర్చు చేస్తామని తెలిపారు. ►పెద్ద గృహోపకరణాల కొనుగోలుకు పండుగ షాపింగ్ కార్యక్రమాల వరకు వేచి చూస్తామని ప్రతి నలుగురిలో ముగ్గురు చెప్పారు. ఈ ఫెస్టివల్ సేల్ కార్యక్రమాలనేవి రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, గీజర్లు తదితర కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణకు వీలు కల్పిస్తాయన్నది వారి అభిప్రాయంగా ఉంది. ►స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు పండుగల విక్రయ కార్యక్రమాల వరకు ఆగుతామని 76 శాతం మంది తెలిపారు. 60 శాతం మంది రూ.10,000–20,000 బడ్జెట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు 5జీ ఫోన్ తీసుకుంటామని చెప్పారు. ►76 శాతం మంది లగ్జరీ, విశ్వసనీయమైన సౌందర్య ఉత్పత్తులను పండుగల సందర్భంగా ఆన్లైన్లో కొనుగోలు చేస్తామని తెలిపారు. ఆనందంగా ఉంది.. ‘‘ఈ ఏడాది వినియోగదారులు ఆన్లైన్లో మరింత షాపింగ్ చేసేందుకు సుముఖంగా ఉండడం మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. దేశవ్యాప్తంగా వినియోగదారులు అమెజాన్ డాట్ ఇన్ను విశ్వసనీయమైన, ప్రాధాన్య, ఇష్టపడే షాపింగ్ వేదికగా ఉందని తెలుసుకునేందుకు ఆనందంగా ఉంది’’అని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ పేర్కొన్నారు. రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో ఆన్లైన్ అమ్మకాలు బలహీనంగా ఉంటే, చివరి మూడు నెలల్లో పండుగల వాతావరణంతో విక్రయాలు 15 శాతం వృద్ధి చెందుతాయని వర్తకులు అంచనా వేస్తున్నారు. లాభదాయక పండుగల సీజన్‌పై బుల్లిష్ సెంటిమెంట్ నెలకొన్నట్టు రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తెలిపింది. 2023 పండుగల సీజన్ ముందు వందలాది విక్రేతల (ముఖ్యంగా చిన్న వర్తకులు) అభిప్రాయాలను రెడ్‌సీర్ తన అధ్యయనంలో భాగంగా తెలుసుకుంది. అన్ని విభాగాల్లో పండుగల విక్రయాలు అధిక స్థాయిలో ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ‘‘పండుగల సీజన్లో 15 శాతం అధిక అమ్మకాలు నమోదవుతాయనే అంచనాతో ఆన్లైన్ విక్రేతలు ఉన్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై విక్రయాలు బలంగా ఉన్నా కానీ, ఇంతకంటే అధిక విక్రయాల కోసం విక్రేతులు చూస్తున్నారు’’ అని రెడ్‌సీర్ స్ట్రాటజీ పేర్కొంది. క్రితం ఏడాది పండుగల సీజన్లో అమ్మకాల్లో వృద్ధి 26 శాతంగా ఉన్న విషయాన్ని పేర్కొంది. విక్రేతల ఆశావహ ధోరణికి అనుగుణంగా తగిన పరిష్కారాలను ఈ కామర్స్ సంస్థలు రూపొందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ కామర్స్ సంస్థల నుంచి డేటా అనలైటిక్స్, వినియోగ ధోరణలు ఎలా ఉన్నాయి తదితర రూపాల్లో తమకు బలమైన మద్దతు లభిస్తున్నట్టు విక్రేతలు చెప్పారు. విక్రేతల్లో బుల్లిష్ సెంటిమెంట్ నేపథ్యంలో ఆన్లైన్ ప్రకటనల వ్యయాన్ని పెంచుకునే అవకాశం ఉన్నట్టు రెడ్‌సీర్ పేర్కొంది. పండుగ సీజన్ విక్రయాల్లో 40 శాతం వృద్ధి: గోద్రెజ్ అప్లయెన్సెస్ ఈసారి పండుగ సీజన్లో అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 30–40 శాతం మేర వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు గోద్రెజ్ అప్లయెన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. ప్రస్తుతం తమ ఉత్పత్తుల్లో ప్రీమియం ప్రోడక్టుల వాటా 35 శాతంగా ఉందని, దీన్ని 40 శాతానికి పెంచుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పండుగ సీజన్ సందర్భంగా పలు ప్రీమియం ఉత్పత్తులను ప్రవేశపెట్టినట్లు నంది తెలిపారు. 4 డోర్ల రిఫ్రిజిరేటర్లు, స్టీమ్ వాష్ సదుపాయం గల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు, టర్బో చిల్ సిరీస్ ఎయిర్ కండీషనర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. వారంటీ పొడిగింపు, క్యాష్‌బ్యాక్, ఎక్సే్చంజ్ ఆఫర్లు, కొత్త ప్రీమియం ఉత్పత్తులు మొదలైన అంశాలు అమ్మకాల వృద్ధికి తోడ్పడగలవని ఆశిస్తున్నట్లు నంది వివరించారు. -
నలుమూలల సంస్కృతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే "పండుగ"!
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్కాట్లండ్ రాజధాని ఎడన్బరా నగరంలో ఏటా ఆగస్టులో జరిగే ఎడిన్‌బరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండ్ ఫ్రింజ్ సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలుస్తోంది. ఆగస్టు మొదటివారం నుంచి చివరి వారం వరకు మూడువారాలకు పైగా జరిగే ఈ వేడుకల్లో ప్రపంచం నలుమూలలకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేస్తాయి. ఈ ఏడాది ఆగస్టు 5న మొదలైన ఈ వేడుకలు ఆగస్టు 28 వరకు జరగనున్నాయి. యూరోపియన్, అమెరికన్, ఆఫ్రికన్, ఆసియన్ సంస్కృతులకు చెందిన ఎందరో కళాకారులు ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన వేదికలపై తమ కళాప్రదర్శనలు చేస్తారు. భారతీయ కళాకారులు కూడా ఈ వేదికలపై శాస్త్రీయ, జానపద సంగీత నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నేపథ్యం ఎడిన్‌బరాలో ఈ వేడుకలు దాదాపు డెబ్బయి ఐదేళ్లుగా జరుగుతున్నాయి. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు రుడాల్ఫ్ బింగ్ అనే నాజీ కాందిశీకుడు ఎడిన్‌బరా చేరుకున్నాడు. కొంతకాలానికి అతడు ఎడిన్బరాలోని గ్లైండెబోర్న్ నాటక సంస్థకు జనరల్ మేనేజర్‌గా ఎదిగాడు. ప్రపంచం నలుమూలలకు చెందిన సంస్కృతులన్నింటినీ ఒకేచోటకు తీసుకొచ్చి కళా సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో బింగ్ తన మిత్రుడు హెన్రీ హార్వే వుడ్‌తో కలసి ఎడిన్‌బరా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అండ్ ఫ్రింజ్ వేడుకలను ప్రారంభించాడు. ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి దేశ దేశాలకు చెందిన కళాకారులు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక్కడి ప్రదర్శనల ద్వారా తేలికగా ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని వారు భావిస్తుంటారు. ఈ వేడుకల సందర్భంగా ఎడిన్‌బరా వీథుల్లో భారీ ఎత్తున ఊరేగింపులు నిర్వహిస్తారు. ఊరేగింపులో పలువురు తమ కళానైపుణ్యాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతుంటారు. సాయంత్రం వేళల్లో కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా ప్రదర్శనలు భారీ స్థాయిలో నిర్వహిస్తారు. ఈసారి జరుగుతున్న వేడుకల్లో ఎడిన్‌బరా నగరం ఎటుచూసినా కోలాహలంగా పండుగ కళతో కనిపిస్తోంది. (చదవండి: నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు") -
పండగవేళ.. గృహ రుణం ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: పండగ సీజన్ ప్రారంభమైంది. సొంతిల్లు కొనుక్కోవాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ, గృహ రుణం తీసుకోవాలనే విషయంలో తికమక పడుతుంటారు. బ్యాంకు, గృహరుణ సంస్థలో రుణం ఎలా తీసుకోవాలో నిర్ణయించుకోలేకపోతుంటారు. ఇలాంటి వారికోసమే ఈ కథనం.. గృహ రుణం విషయంలో ఎన్నో అనుమానాలుంటాయి. ఎంత రుణం తీసుకోవాలి? ఎన్నేళ్లకు తీసుకోవాలి? మంచి బ్యాంకు ఏది? ఇలా అనుమానాల జాబితా పెద్దదే. రుణం తీసుకోవాలనుకునే వారు తమ ఆదాయం, వాయిదాల చెల్లింపు సామర్థ్యం, కావాల్సిన రుణం ఆధారంగా ఎవరు తక్కువ వడ్డీ ఇస్తారో గుర్తించి ఆ బ్యాంకులు, రుణ సంస్థలను ఎంచుకోవాలి. పోలికలున్నాయి: రుణ అర్హత నిబంధనలు, పరిశీలనా రుసుములు, ఆస్తి విలువ మదింపు, ఆస్తిని తాకట్టు పెట్టుకోవటం, ఖాతాదారు గురించి తెలుసుకోవటం (కేవైసీ), రుణ చరిత్ర, ఒప్పంద పత్రాలు ఇలా దాదాపు అన్ని అంశాల్లోనూ బ్యాంకులు, హెచ్ఎఫ్సీలు పాటించే నిబంధనలు ఒకేలా ఉంటాయి. వడ్డీరేట్లలో తేడా: గృహరుణ సంస్థలు ప్రైమ్ లేడింగ్ రేటు (పీఎల్ఆర్) ప్రామాణికంగా వడ్డీ రేట్లను నిర్ణయించి, రుణాలను మంజూరు చేస్తాయి. జూన్ 30, 2010 వరకు కూడా బ్యాంకులు ఈ విధానాన్నే పాటించేవి. ఆ తర్వాత నుంచి మరింత పారదర్శకంగా ఉండేలా బేస్‌రేట్ విధానానికి మారాయి. గతంలో బ్యాంకుల నుంచి గృహ రుణాలు తీసుకున్న చాలామంది ఖాతాదారులు ఇంకా పీఎల్ఆర్ విధానంలోనే కొనసాగుతున్నారు. బ్యాంకులు బేస్‌రేట్ కన్నా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వవు. రుణ వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకులు తమ ఖాతాదార్లను నిలుపుకోవడానికి తమ బేస్‌రేటును తగ్గిస్తుంటాయి. ఒకసారి బేస్ రేటు తగ్గిస్తే.. ఈ ప్రాతిపదికన రుణం తీసుకున్న రుణ గ్రహీతలందరికీ ఆ ప్రయోజనం అందుతుంది. బ్యాం కులు బేస్‌రేటుపై కొంత శాతం అధికంగా వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. గృహరుణ సంస్థలు పీఎల్ఆర్కు కొంత శాతం తక్కువగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. వడ్డీ రేట్లు మారినప్పుడు బ్యాంకులు బేస్ రేటును తగ్గించకుండా అధికంగా ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల కొత్త ఖాతాదారులకు మేలేకానీ, ఇప్పటికే రుణం తీసుకున్న వారికి మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి రుణం తీసుకోబోయే ముందు వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బ్యాంకు బేస్‌రేటు తగ్గిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. బేస్ రేటుకు, వడ్డీ రేటుకు వ్యత్యాసం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతం పండగ సీజన్ కాబట్టి చాలా బ్యాంకులు బేస్‌రేట్ మీదనే రుణాలు మంజూరు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే స్వల్ప వడ్డీ మీద రుణాలిస్తున్నాయి. బ్యాంకులు, గృహ రుణ సంస్థలు చలన వడ్డీపై రుణం తీసుకున్న వారి విషయంలో ముందస్తు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి రుసుములూ విధించడం లేదు. స్థిర వడ్డీ, రెండు రకాల వడ్డీ (కొన్నాళ్లు స్థిరం, ఆ తర్వాత చలనం) విధానంలో తీసుకున్న వారికి మాత్రం రుసుముల భారం రెండు చోట్లా ఉంది. ఎన్‌హెచ్‌బీ నిబంధనల ప్రకారం సొంత వనరులతో రుణం తీర్చిన సందర్భాల్లో గృహరుణ సంస్థలు ఎలాంటి రుసుములూ వసూలు చేయకూడదు. వడ్డీరేట్లు, రుణాల మంజూరు, ఇతర నిబంధనల్లో తేడాలు లేనప్పటికీ చాలామంది బ్యాంకుల నుంచి మాత్రమే రుణం తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. దీనికి కారణం చాలా రోజులుగా వాటితో అనుబంధం ఉండటం, విస్తరించి ఉండటం బ్యాంకులకు కలిసొస్తుంది. అన్నిచోట్లా సేవలు అందకపోవటం, హెచ్ఎఫ్సీల నుంచి రుణం తీసుకోవడానికి ప్రధాన అడ్డంకి. బ్యాంకు, గృహరుణ సంస్థ ఎక్కడి నుంచి రుణం తీసుకున్నా ముందుగా అవి ఇప్పటికే రుణం తీసుకున్న వారికి అందిస్తున్న ప్రయోజనాలను పరిశీలించాలి. ఒకసారి మీరు ఆసంస్థ ఖాతాదారుగా మారిన తర్వాత మీకు ఎలాంటి లాభాలు ఉంటాయో దీనివల్ల అర్థమవుతుంది. కొత్త ఖాతాదారుల్లో సమానమైన ప్రయోజనాలను అందించే బ్యాంకు/గృహరుణ సంస్థకే ప్రాధాన్యం ఇవ్వండి.