పండగవేళ.. గృహ రుణం ఎక్కడ? | Where to get home loans during on festive season ? | Sakshi
Sakshi News home page

పండగవేళ.. గృహ రుణం ఎక్కడ?

Published Sat, Nov 2 2013 5:22 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

పండగవేళ.. గృహ రుణం ఎక్కడ? - Sakshi

పండగవేళ.. గృహ రుణం ఎక్కడ?

సాక్షి, హైదరాబాద్: పండగ సీజన్ ప్రారంభమైంది. సొంతిల్లు కొనుక్కోవాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ, గృహ రుణం తీసుకోవాలనే విషయంలో తికమక పడుతుంటారు. బ్యాంకు, గృహరుణ సంస్థలో రుణం ఎలా తీసుకోవాలో నిర్ణయించుకోలేకపోతుంటారు. ఇలాంటి వారికోసమే ఈ కథనం..
 
 గృహ రుణం విషయంలో ఎన్నో అనుమానాలుంటాయి. ఎంత రుణం తీసుకోవాలి? ఎన్నేళ్లకు తీసుకోవాలి? మంచి బ్యాంకు ఏది? ఇలా అనుమానాల జాబితా పెద్దదే. రుణం తీసుకోవాలనుకునే వారు తమ ఆదాయం, వాయిదాల చెల్లింపు సామర్థ్యం, కావాల్సిన రుణం ఆధారంగా ఎవరు తక్కువ వడ్డీ ఇస్తారో గుర్తించి ఆ బ్యాంకులు, రుణ సంస్థలను ఎంచుకోవాలి.
 పోలికలున్నాయి: రుణ అర్హత నిబంధనలు, పరిశీలనా రుసుములు, ఆస్తి విలువ మదింపు, ఆస్తిని తాకట్టు పెట్టుకోవటం, ఖాతాదారు గురించి తెలుసుకోవటం (కేవైసీ), రుణ చరిత్ర, ఒప్పంద పత్రాలు ఇలా దాదాపు అన్ని అంశాల్లోనూ బ్యాంకులు, హెచ్‌ఎఫ్‌సీలు పాటించే నిబంధనలు ఒకేలా ఉంటాయి.
 
 వడ్డీరేట్లలో తేడా: గృహరుణ సంస్థలు ప్రైమ్ లేడింగ్ రేటు (పీఎల్‌ఆర్) ప్రామాణికంగా వడ్డీ రేట్లను నిర్ణయించి, రుణాలను మంజూరు చేస్తాయి. జూన్ 30, 2010 వరకు కూడా బ్యాంకులు ఈ విధానాన్నే పాటించేవి. ఆ తర్వాత నుంచి మరింత పారదర్శకంగా ఉండేలా బేస్‌రేట్ విధానానికి మారాయి. గతంలో బ్యాంకుల నుంచి గృహ రుణాలు తీసుకున్న చాలామంది ఖాతాదారులు ఇంకా పీఎల్‌ఆర్ విధానంలోనే కొనసాగుతున్నారు. బ్యాంకులు బేస్‌రేట్ కన్నా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వవు. రుణ వడ్డీ రేట్లు తగ్గితే బ్యాంకులు తమ ఖాతాదార్లను నిలుపుకోవడానికి తమ బేస్‌రేటును తగ్గిస్తుంటాయి. ఒకసారి బేస్ రేటు తగ్గిస్తే.. ఈ ప్రాతిపదికన రుణం తీసుకున్న రుణ గ్రహీతలందరికీ ఆ ప్రయోజనం అందుతుంది.
 
  బ్యాం కులు బేస్‌రేటుపై కొంత శాతం అధికంగా వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. గృహరుణ సంస్థలు పీఎల్‌ఆర్‌కు కొంత శాతం తక్కువగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. వడ్డీ రేట్లు మారినప్పుడు బ్యాంకులు బేస్ రేటును తగ్గించకుండా అధికంగా ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల కొత్త ఖాతాదారులకు మేలేకానీ, ఇప్పటికే రుణం తీసుకున్న వారికి మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి రుణం తీసుకోబోయే ముందు వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బ్యాంకు బేస్‌రేటు తగ్గిస్తుందా లేదా అనేది చూసుకోవాలి. బేస్ రేటుకు, వడ్డీ రేటుకు వ్యత్యాసం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతం పండగ సీజన్ కాబట్టి చాలా బ్యాంకులు బేస్‌రేట్ మీదనే రుణాలు మంజూరు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే స్వల్ప వడ్డీ మీద రుణాలిస్తున్నాయి.
 
  బ్యాంకులు, గృహ రుణ సంస్థలు చలన వడ్డీపై రుణం తీసుకున్న వారి విషయంలో ముందస్తు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి రుసుములూ విధించడం లేదు.  స్థిర వడ్డీ, రెండు రకాల వడ్డీ (కొన్నాళ్లు స్థిరం, ఆ తర్వాత చలనం) విధానంలో తీసుకున్న వారికి మాత్రం రుసుముల భారం రెండు చోట్లా ఉంది. ఎన్‌హెచ్‌బీ నిబంధనల ప్రకారం సొంత వనరులతో రుణం తీర్చిన సందర్భాల్లో గృహరుణ సంస్థలు ఎలాంటి రుసుములూ వసూలు చేయకూడదు. వడ్డీరేట్లు, రుణాల మంజూరు, ఇతర నిబంధనల్లో తేడాలు లేనప్పటికీ చాలామంది బ్యాంకుల నుంచి మాత్రమే రుణం తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు.
 
 దీనికి కారణం చాలా రోజులుగా వాటితో అనుబంధం ఉండటం, విస్తరించి ఉండటం బ్యాంకులకు కలిసొస్తుంది. అన్నిచోట్లా సేవలు అందకపోవటం, హెచ్‌ఎఫ్‌సీల నుంచి రుణం తీసుకోవడానికి ప్రధాన అడ్డంకి. బ్యాంకు, గృహరుణ సంస్థ ఎక్కడి నుంచి రుణం తీసుకున్నా ముందుగా అవి ఇప్పటికే రుణం తీసుకున్న వారికి అందిస్తున్న ప్రయోజనాలను పరిశీలించాలి. ఒకసారి మీరు ఆసంస్థ ఖాతాదారుగా మారిన తర్వాత మీకు ఎలాంటి లాభాలు ఉంటాయో దీనివల్ల అర్థమవుతుంది. కొత్త ఖాతాదారుల్లో సమానమైన ప్రయోజనాలను అందించే బ్యాంకు/గృహరుణ సంస్థకే ప్రాధాన్యం ఇవ్వండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement