న్యూఢిల్లీ: రానున్న పండుగల సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్టు అధిక శాతం వినియోగదారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే మరింత ఖర్చు పెట్టేందుకు తాము సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. అమెజాన్ ఇండియా తరఫున నీల్సన్ మీడియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. మెట్రోలు, చిన్న పట్టణాలకు చెందిన 8,159 మంది వినియోగదారుల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు.
సర్వేలోని అంశాలు..
► మెట్రోల నుంచి 87 శాతం మంది, టైర్–2 పట్టణాల (10–40 లక్షల జనాభా ఉన్న) నుంచి 86 శాతం మంది ఈ ఏడాది పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేయనున్నట్టు చెప్పారు. మొత్తం మీద 81 శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్‌కు మొగ్గు చూపిస్తున్నారు.
►ప్రతి ఇద్దరు వినియోగదారుల్లో ఒకరు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది షాపింగ్‌పై ఎక్కువ ఖర్చు చేస్తామని తెలిపారు.
►పెద్ద గృహోపకరణాల కొనుగోలుకు పండుగ షాపింగ్ కార్యక్రమాల వరకు వేచి చూస్తామని ప్రతి నలుగురిలో ముగ్గురు చెప్పారు. ఈ ఫెస్టివల్ సేల్ కార్యక్రమాలనేవి రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, గీజర్లు తదితర కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణకు వీలు కల్పిస్తాయన్నది వారి అభిప్రాయంగా ఉంది.
►స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు పండుగల విక్రయ కార్యక్రమాల వరకు ఆగుతామని 76 శాతం మంది తెలిపారు. 60 శాతం మంది రూ.10,000–20,000 బడ్జెట్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు 5జీ ఫోన్ తీసుకుంటామని చెప్పారు.
►76 శాతం మంది లగ్జరీ, విశ్వసనీయమైన సౌందర్య ఉత్పత్తులను పండుగల సందర్భంగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తామని తెలిపారు.
ఆనందంగా ఉంది..
‘‘ఈ ఏడాది వినియోగదారులు ఆన్‌లైన్‌లో మరింత షాపింగ్ చేసేందుకు సుముఖంగా ఉండడం మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. దేశవ్యాప్తంగా వినియోగదారులు అమెజాన్ డాట్ ఇన్‌ను విశ్వసనీయమైన, ప్రాధాన్య, ఇష్టపడే షాపింగ్ వేదికగా ఉందని తెలుసుకునేందుకు ఆనందంగా ఉంది’’అని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ పేర్కొన్నారు.
రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్
ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాల్లో ఆన్‌లైన్ అమ్మకాలు బలహీనంగా ఉంటే, చివరి మూడు నెలల్లో పండుగల వాతావరణంతో విక్రయాలు 15 శాతం వృద్ధి చెందుతాయని వర్తకులు అంచనా వేస్తున్నారు. లాభదాయక పండుగల సీజన్‌పై బుల్లిష్ సెంటిమెంట్ నెలకొన్నట్టు రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తెలిపింది. 2023 పండుగల సీజన్ ముందు వందలాది విక్రేతల (ముఖ్యంగా చిన్న వర్తకులు) అభిప్రాయాలను రెడ్‌సీర్ తన అధ్యయనంలో భాగంగా తెలుసుకుంది. అన్ని విభాగాల్లో పండుగల విక్రయాలు అధిక స్థాయిలో ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ‘‘పండుగల సీజన్‌లో 15 శాతం అధిక అమ్మకాలు నమోదవుతాయనే అంచనాతో ఆన్‌లైన్ విక్రేతలు ఉన్నారు.
ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై విక్రయాలు బలంగా ఉన్నా కానీ, ఇంతకంటే అధిక విక్రయాల కోసం విక్రేతులు చూస్తున్నారు’’ అని రెడ్‌సీర్ స్ట్రాటజీ పేర్కొంది. క్రితం ఏడాది పండుగల సీజన్‌లో అమ్మకాల్లో వృద్ధి 26 శాతంగా ఉన్న విషయాన్ని పేర్కొంది. విక్రేతల ఆశావహ ధోరణికి అనుగుణంగా తగిన పరిష్కారాలను ఈ కామర్స్ సంస్థలు రూపొందిస్తున్నట్టు వెల్లడించింది. ఈ కామర్స్ సంస్థల నుంచి డేటా అనలైటిక్స్, వినియోగ ధోరణలు ఎలా ఉన్నాయి తదితర రూపాల్లో తమకు బలమైన మద్దతు లభిస్తున్నట్టు విక్రేతలు చెప్పారు. విక్రేతల్లో బుల్లిష్ సెంటిమెంట్ నేపథ్యంలో ఆన్‌లైన్ ప్రకటనల వ్యయాన్ని పెంచుకునే అవకాశం ఉన్నట్టు రెడ్‌సీర్ పేర్కొంది.
పండుగ సీజన్ విక్రయాల్లో 40 శాతం వృద్ధి: గోద్రెజ్ అప్లయెన్సెస్
ఈసారి పండుగ సీజన్‌లో అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 30–40 శాతం మేర వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నట్లు గోద్రెజ్ అప్లయెన్సెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. ప్రస్తుతం తమ ఉత్పత్తుల్లో ప్రీమియం ప్రోడక్టుల వాటా 35 శాతంగా ఉందని, దీన్ని 40 శాతానికి పెంచుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పండుగ సీజన్ సందర్భంగా పలు ప్రీమియం ఉత్పత్తులను ప్రవేశపెట్టినట్లు నంది తెలిపారు. 4 డోర్ల రిఫ్రిజిరేటర్లు, స్టీమ్ వాష్ సదుపాయం గల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు, టర్బో చిల్ సిరీస్ ఎయిర్ కండీషనర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. వారంటీ పొడిగింపు, క్యాష్‌బ్యాక్, ఎక్సే్చంజ్ ఆఫర్లు, కొత్త ప్రీమియం ఉత్పత్తులు మొదలైన అంశాలు అమ్మకాల వృద్ధికి తోడ్పడగలవని ఆశిస్తున్నట్లు నంది వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment