గుడ్ మార్నింగ్... 2015! | Good Morning ... 2015! | Sakshi
Sakshi News home page

గుడ్ మార్నింగ్... 2015!

Published Mon, Dec 29 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

గుడ్ మార్నింగ్... 2015!

గుడ్ మార్నింగ్... 2015!

బాధ జీవితానికి పర్యాయ పదమైనప్పుడు మనం కోల్పోయే వాటన్నింటిలోకీ సుస్థిర ఆదర్శం ఆ భగవంతుడే. న్యాయం మనకు తీవ్ర అవసరం కాబట్టే, నర కాన్ని అత్యంత క్రూరమైనదిగా ఊహిస్తాం. ప్రతి మతమూ ఇహ లోక కాలంలోని కొన్ని రోజులను ఏటా తాత్కాలిక స్వర్గం కోసం కేటాయిస్తుంది. ఆ రోజుల్లో మనుషులు తమ అంతఃచేతనలోని దేవ దూతల నేపథ్య బృందగానంలో కరుణను, ప్రేమను గుర్తిస్తారు. అధికారికంగానే ఆ కాలాన్ని ఔదార్యం, శాంతులతో కూడినవిగా ప్రకటిస్తారు.
 
మానవుడు భగవంతుని అద్భుత సృష్టి. మనం భగవంతుణ్ణి విశ్వసించడానికి కారణం మాత్రం అది కాదు. నైతికంగా రెండు భిన్న ధ్రువాలుగా చీలిపోయి ఉన్న మానవ జాతి ఇంతవరకు తాను సాధించిన దాని నుండి ఇంకా నేర్చుకోవాల్సింది పెద్దగా ఏం లేదు. గతంలో సుల్తాన్ మొహ్మద్ గజనీ భారత దేశాన్ని కొల్లగొట్టి వెళ్లాక, సూఫీ శాంతి  ప్రబోధకుడు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ వచ్చాడు. వర్తమానంలోనైతే నరహంతక తాలిబాన్‌కు ముందటి  గాంధేయ వాది ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌ను అలాగే చెప్పుకోవచ్చు.
 
ఇలాంటి పోలిక తేవడం... ఉద్రిక్తపూరితమైన ఈ భూమి అనే తిరిగే గోళం మీద మంచీచెడు సగం-సగం, ఒకదానికొకటి సరి అనే బూటకపు సమానత్వా న్ని సూచించనూ వచ్చు. హింసను, దాని ఆటవిక చుట్టపట్టాలను చల్లార్చడంతోనే లేదా వ్యవహరించడంతోనే మన సమయంలో చాలా ఖర్చయిపోతోంది.  బాధ జీవించడానికి  పర్యాయ పదమైనప్పుడు  మనం కోల్పోయే వాటన్నిటిలోకీ సుస్థిర ఆదర్శం ఆ భగవంతుడే. న్యాయం మనకు తీవ్ర అవసరం. కాబట్టే నర కాన్ని మనం అత్యంత క్రూరమైనదిగా ఊహిస్తాం.
 
ప్రతి మతమూ ఇహలోక కాలంలోని కొన్ని రోజుల భాగాన్ని ఏటా తాత్కాలిక స్వర్గం కోసం విడిగా కేటాయిస్తుంది. ఆ రోజుల్లో మనుషులు తమ అంతఃచేతనలోని దేవదూతల నేపథ్య బృందగానంలో కరుణను, ప్రేమను గుర్తిస్తారు.    అధికారికంగానే ఆ కాలాన్ని ఔదార్యం, శాంతులతో కూడినవిగా ప్రకటిస్తారు.
 
దాతృత్వం అనే పదం దర్పాన్ని సూచించే చికాకైన పదం. అందుకు ఇస్లాం సిద్ధాంతం పరిష్కారాన్ని సూచించింది. చీదర పుట్టించే  విధంగా అహంకార ప్రదర్శనకు తావే లేకుండా నిర్మూలించడం కోసం దాతృత్వం గుప్తంగానే జరగాలని శాసించింది. ఇవ్వడానికి తగిన పద్ధతి ఉండేట్టయితే, తీసుకోడానికి కూడా అలాగే తగిన పద్ధతి ఉండాలి.  తీసుకునేదాన్ని అది బాల దృష్టితో, హృదయంతో చూసేదిగా ఉండాలి. బాలలు కోరినది కావాలనుకుంటారంతే.  డబ్బు విషయం వారికి పట్టదు. అలాంటప్పుడు విలువను లెక్కగట్టేది సంతోషంతోనే తప్ప, వ్యయంతో కాదు. మనకు కనిపించేదానికి భిన్నంగా పిల్లలు వాస్తవికవాదులు. పెద్దవారు దురాశతో లేదా ఆకాంక్షతో లేదా పైకి ఎగబాకడం లేదా కిందికి దిగజారడం వల్ల ప్రేరేపితులై ఉంటారు.  కాబట్టి బెలూన్ అవసరమైన చోట అంతరిక్ష నౌక కావలసి వస్తుంది. అదే పిల్లాడైతే బెలూన్‌నే రోదసి నౌకగా మార్చేసుకోగలుగుతాడు. పిల్లవాడికి అతి మంచి కానుక... ఏ చెట్టుకో వేలాడదీసినది, చక్కగా ప్యాకింగ్ చేసి ఉన్నది కానవసరం లేదు. దాన్ని ఇచ్చిన సమయమనేదే ముఖ్యం.  
 
క్రిస్‌మస్‌కు కేంద్ర బిందువు జీసస్ క్రిస్ట్ జననం. ఆ కథనం స్థానికతను ఎప్పుడో అరుదుగా గానీ ప్రశ్నించరు. ఎందుకంటే పాత నిబంధన దాన్ని ముందుగానే చెప్పింది. రాజులు భగవంతుని పాదాల ముందు బంగారం, సాంబ్రాణి, గుగ్గిలం సమర్పించి కొలవడం ఆ వేడుక పాటలో ఉన్నాయి. ఆ బిడ్డకు తల్లి మేరీ అతను తన ఒడి నుండి శిలువనెక్కేవరకు ఏం ఇచ్చింది?
 
ముగ్గురు జ్ఞానులు లేదా రుషులు లేదా రాజులు సమర్పించిన మూడు ద్రవ్యాలు అప్పటికే చాలా కాలంగా ఏ ఒక్క మతానికో చెందనివి అన్న గుర్తింపును పొందిన సుప్రసిద్ధ  కానుకలు. జ్ఞాపకాలన్నిటిలాగే, ఈ విషయంలో కూడా ఒకటికి మించిన కథనాలున్నాయి. ఒక నక్షత్రాన్ని అనుసరించి ముగ్గురు రాజులు బెత్లహామ్‌కు చేరారని సెయింట్ మాథ్యూ నిబంధన తెలుపుతోంది. విశ్వాసాన్ని నిర్దిష్టమైన పుట్టుపూర్వోత్తరాల గొలుసుగా చూపాలని పండితులకు తెగ ఆత్రుత. ఆ ముగ్గురు రుషులు పర్షియాకు చెందినవారని, పవిత్రాగ్నికి కావలిదారులని, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం, వైద్యశాస్త్రాలలో ఉద్దండులని వారు భావిస్తున్నారు. పర్షియా లేక భారతదేశం నుండి వారు వచ్చి ఉండాలి. నేడు దేవుడేలేని చైనా, కమ్యూనిస్టు వ్యామోహంతో వెంటబడుతున్న సిల్క్ రూట్ వెంబడే వాళ్లు అక్కడికి చేరి ఉండాలి. ఏదేమైనా వాళ్లు తూర్పు దిక్కు నుంచి వచ్చిన వారేనని అంతా అంగీకరిస్తారు.
 
క్రైస్తవ మతం పాశ్చాత్య విశ్వాసంగా ఎంత ప్రబలంగా విస్తరించిందంటే... అది మనం దాని ఆసియా మూలాలను మరిచిపోయేట్టు చేస్తుంటుంది.  ఆ మతానికి చెందిన ప్రథమ కుటుంబాన్ని గోధుమ వర్ణపు ఛాయలతో ప్రాచీన చర్చి మత చిత్రకళ సరిగ్గానే చిత్రించింది. ఆ తదుపరి తొలి పునరుజ్జీవనోద్యమ కాలంనాటి శ్వేత వర్ణ ఛాయలతో కూడిన చిత్రాలకు అవి భిన్నమైనవి. మేరీ తల అప్పుడూ, ఇప్పుడూ నిరాడంబరమైన శిరోవస్త్రాన్ని ధరించి ఉంటుంది. అది ఆమె యుగపు అలవాటు. ఖురాన్‌లో మేరీ గురించి ఒక అధ్యాయం ఉన్నదని, ముస్లింలు జీసన్‌ను (ఇసాగా పిలుస్తారు) తమ గొప్ప ప్రవక్తలలో ఒకరిగా మన్నిస్తారని కూడా మనం అంతే సులువుగా మరుస్తుంటాం. ఖురాన్, ఇసాను రుహుల్లా లేదా అల్లా ఆత్మగా స్తుతిస్తుంది. జీసస్‌ను శిలువ వేశారని ముస్లింలు అంగీకరించరు. ఆయనను రక్షించి, తిరిగి ఆరోగ్యవంతుణ్ణి చేశారని, ఆ తదుపరి ఆయన రోమన్ సామ్రాజ్యానికి వెలుపల తన బోధనను కొనసాగించడానికి తూర్పు దిశకు వెళ్లాడని చెబుతుంది.

క్రిస్‌మస్ వివాదాలకు సంబంధించినది కాదు. ముస్లిం టర్కీ ఒకప్పటి తమ అత్యంత సుప్రసిద్ధ పూర్వీకులలో ఒకరైన శాంతాక్లాజ్ ఖ్యాతికి సంతోషించనిద్దాం. క్రిస్‌మస్ కానుకలకు ఉండే దైవాంశను కలిగిన స్లెడ్జిబండిపై పయనించే ముసలాయన నార్డిక్ జాతివాడు కాదు. ఆయన సెయింట్ నికోలస్. 270లో దక్షిణ టర్కీలో, అది ప్రధానంగా క్రైస్తవ ప్రాంతంగా ఉన్న కాలంలో జన్మించి, మైరాకు బిషప్‌గా ఎదిగాడు. నేడు ఆ పట్టణాన్ని దెమ్రెగా అని పిలుస్తారు. స్థానికులు తమ హీరోను ‘‘నోయెల్ బాబా’’గా గౌరవిస్తారు. ఆయన చ ర్చి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. బిషప్  తన మహిమతో తండ్రులు నరికేయగా మరణించిన ముగ్గురు కుమారులను బతికించాడు. అందుకే మరణించిన కొద్దికాలానికే  ఆయనను పవిత్ర ప్రబోధకునిగా గుర్తించారు. మరొక గాథ, వరకట్నం చెల్లించలేక బానిసలుగా అమ్మేస్తున్న ముగ్గురు కుమార్తెలకు సంబంధించినది. ఆయన సంచి నిండా బంగారాన్ని వారి ఇంటికి తెచ్చాడు. ఆ తర్వాత అంతా సంతోషంగా గడిపారు. ఆసక్తి ఉన్నవారికి మరొక విశేషం... సెయింట్ నికోలస్ ఎన్నడూ ఎర్ర గౌను వేసుకొని ఎరగడు. అది కోకా కోలా మార్కెటింగ్ శాఖ పాప్ సంస్కృతికి చే సిన చేర్పు.
 
ఎప్పటిలాగే మనమంతా భవిష్యత్తుపట్ల ఆత్రుతతో 2015 కోసం వేచి చూస్తూ, సుహృద్భావాన్ని కోరడం, శాంతి కోసం ప్రార్థించడం మరీ పెద్ద కోరికేమోనని ఎవరైనాగానీ ఆశ్చర్యపోవాల్సిందే. కాబట్టి నేను కూడా ఓ పిల్లవాడిలాగా సాధ్యమైనదానితోనే సరిపెట్టుకుంటాను. భారతదేశంలో శాంతి విలిసిల్లాలని, వచ్చే 51 వారాల్లో భారతీయులందరి మధ్యనా సుహృద్భావం నెలకొనాలని కోరుకుంటాను. ఇక ఆ 52వ వారం సంగతి అదే చూసుకుంటుంది.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement