‘ముప్పు’తిప్పల భారతం
బైలైన్: మనమంతా శాంతినే కోరుకుంటాం. పిచ్చివాళ్లు మాత్రమే యుద్ధాన్ని కాంక్షిస్తారు. శాంతి సాధనకు బలం తప్పనిసరి. పాక్‌కు నేడు మనకంటే చాలా ఉత్తమమైన ఎత్తుగడల ప్రాధాన్యమున్న అణ్వస్త్రాలున్నాయి. నేరుగా యుద్ధరంగంలోనే వాటిని మోహరింపజేయవచ్చు. పేద దేశానికి సాయుధ బలగాలు ఒక విలాసం అని 1962 వరకు మనం భావించాం. ఆ తదుపరి కోలుకోవడం జరుగుతున్నా అది అప్పుడప్పుడు హఠాత్తుగా సాగే విస్తర ణగానే సాగుతోంది.
అఫ్ఘానిస్థాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణకు సురక్షితమైన మార్గానికి హామీని కల్పిం చడం కోసం బరాక్ ఒబామా పాకిస్థాన్‌కు పలు వ్యూహాత్మక, ఆర్థిక నజరానాలు సమర్పించుకున్నారు. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్‌నే ఖంగు తినిపించిన ఒబామా ఈ నజరానాలపై భారత్ ఎలా స్పందిస్తుందోనని నిద్రను కరువు చేసుకోవాల్సిన అవసరమేముంటుంది గనుక. ఒబామా సెప్టెంబర్‌లో మన్మోహన్‌సింగ్‌కు వీడ్కోలు విందు ఇచ్చి చక్కటి చిరునవ్వుతో సాగనంపారు. అక్టోబర్‌లో నవాజ్ షరీఫ్‌కు ఆయన అందించిన వంటకాల జాబితా భారత ప్రభుత్వానికి ఏ మాత్రం మింగుడు పడేది కాదు. పాక్ అణు పాటవాన్ని, భారత అణు పాటవాన్ని ఒకే గాటన కట్టి ఆయన దక్షిణ ఆసియా సుస్థిరతను చాటారు. అంతా సజావుగా సాగితే ఇది అమెరికా, పాక్‌ల మధ్య అణు ఒప్పందానికి కూడా దారితీయవచ్చు. పాక్‌ను మన్మోహన్ ‘ఉగ్రవాద భూకంప కేంద్రం’గా పేర్కొన్నారు. అయితే అదేమీ ఒబామా చెవికెక్కలేదు. సరికదా భారత్ ఇంకా ఎదగాలని, కాశ్మీర్ సమస్యపై చర్చలు జరపాలని నవాజ్‌తో కలిసి సంయుక్త ప్రకటన జారీ చేశారు.
కాకతాళీయంగా అదేసమయానికి నాకు ‘ఇండియా ఎట్ రిస్క్: మిస్టేక్స్, మిస్‌కన్సెప్షన్స్ అండ్ మిస్‌ఎడ్వెంచర్స్ ఆఫ్ సెక్యూరిటీ పాలసీ’ అనే జస్వంత్‌సింగ్ కొత్త పుస్తకం అందింది. లోతైన అవగాహనతోనూ, విశ్వసనీయంగానూ జస్వంత్ ఆ పుస్తకాన్ని రచించారు. అదే వారంలో నవాజ్ వాషింగ్టన్‌లో ఉండగా, జస్వంత్ చైనా రాజధాని బీజింగ్‌లో ఉన్నారు. రష్యా రాజధాని మాస్కో నుంచి ఆయన అక్కడికి వెళ్లారు.
జస్వంత్‌సింగ్ ఉన్నత సైనికాధికారే కాదు పెద్ద మనిషి. ఆయన ట్రిగ్గర్‌పై వేలు వేశారూ అంటే ఎప్పుడోగానీ గురి తప్పదు. భారత్ వ్యూహాత్మక సంస్కృతిని పెంపొందింపజేయలేదు. కాబట్టే మన దేశ భద్రత ముప్పును ఎదుర్కొంటోంది. ఒక సమగ్ర భావజాలంగా అభివృద్ధి చెందకుండానే నిలిచిపోయిన కొన్ని సమున్నతైనైతిక భావాలపై ఆధారపడి జవహర్‌లాల్ నెహ్రూ ఒక మూసలాంటి విధానాన్ని తయారు చేశారు. వాస్తవికత తన సదుద్దేశాలకు వ్యతిరేకంగా నిలిచినప్పుడలా ఆయన వాస్తవికతను తిరస్కరించారు. దేశ విభజన శాంతిని నెలకొల్పుతుందని ఆయన విశ్వాసించారు. కాబట్టే పాకిస్థాన్ ఏర్పాటును సమర్థించారు. స్వతంత్రం తదుపరి కొన్ని వారాల్లోనే కాశ్మీర్ కోసం పాక్ నిష్కారణంగా యుద్ధం ప్రారంభించింది. దీంతో ఆయన విధానాలు మతి మాలినవిగా మారాయి. శాంతి మంచిది అని ఆయన భావించారు కాబట్టే భారత సైన్యాన్ని దాని యుద్ధ లక్ష్యాలను పరిపూర్తి చేయకుండా నివారించారు. పాక్‌కు కాశ్మీర్ గేట్ అయిన ముజఫరాబాద్ వరకు మన సేనలు కదం తొక్కకుండా వారించారు. అందుకు బదులు ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరారు. నాటి కాల్పుల విరమణ ఫలితంగా నేటికీ మన దేశం నెత్తురోడుతూనే ఉంది.
చైనా కథ స్వల్పంగా భిన్నమైనదేగానీ అంతటి నషాన్ని కలుగజేసింది. చైనా తన మార్గాన్ని అనుసరించి అలీనోద్యమంలో భాగస్వామి అవుతుందని, శాంతి ప్రవక్తగా తన హోదాను ధృవీకరిస్తుందని నెహ్రూ ఆశించారు. కాబట్టే టిబెట్‌ను వ దిలి పెట్టేశారు. మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా 1950లో టిబె ట్‌ను దురాక్రమించింది. ఆ సమయంలో నెహ్రూ ‘జన చైనా రిపబ్లిక్‌తో సంబంధాలకు భారత్ చాలా విలువనిస్తుంది’ అంటూ బీజింగ్‌లోని భారత రాయబారి కేఎమ్ ఫణిక్కర్‌కు సలహా ఇచ్చారు. ఆ సూచను ఫణిక్కర్ గ్రహించారు. నెహ్రూ అతి తరచుగా చైనా ముందు మోకరిల్లుతున్నారని ఢిల్లీలోని మన విదేశాంగ శాఖ సైతం భావించింది.
ఆచరణ ప్రాధాన్యమైన వాస్తవిక దృష్టిగల సర్దార్ పటేల్ భవిష్యత్తును స్పష్టంగా గ్రహించగలిగారు. టిబెట్‌పై నెహ్రూ వైఖరిపట్ల తన అసమ్మతిని తెలుపుతూ ఆయన ఒక సుదీర్ఘ లేఖను రాసారు. చైనా ప్రభుత్వం పంపిన ఒక టెలిగ్రాం ‘పూర్తి అమర్యాదకరంగా ఉంది. చైనా సైన్యం టిబెట్‌లో ప్రవేశించడం పట్ల మన నిరసనను లెక్కలేనట్టుగా అది తోసిపుచ్చిన తీరే కాదు, విదేశీ శక్తుల ప్రభావాలే మన వైఖరిని నిర్ణయించాయనే నిరాధారమైన ఆరోపణతో అది తన చర్యను సమర్థించుకోవడం కూడా అమర్యాదకరమైనదే. చైనా మాట్లాడుతున్న భాష ఒక మిత్ర దేశం మాట్లాడుతున్నట్టు గాక శత్రువుగా మారగల దేశం మాట్లాడుతున్నట్టుంది’ అని ఆయన ఆ లేఖలో అన్నారు. 1962 నాటి హిమాలయ యుద్ధ పరాజయం తదుపరి నెహ్రూలోని భవిష్యత్తును దర్శించగల ద్రష్ట వెయ్యిసార్లు మరణించారు. అమెరికా పెట్టిన షరతులన్నిటికీ తలొగ్గి ఆయుధాల కోసం ఆయన దాన్ని అర్థించ వలసి వచ్చింది. పాక్ సరిహద్దుల్లోని భారత బలగాలను బాగా తగ్గించి, కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలనేది ఆనాడు అమెరికా విధించిన షరతుల్లో ఒకటి. ఆ విషయం ఒబామాకు కూడా బాగానే తెలుసు.
మనమంతా శాంతినే కోరుకుంటాం. పిచ్చివాళ్లు మాత్రమే యుద్ధాన్ని కాంక్షిస్తారు. కానీ శాంతి సాధనకు బలం కలిగి ఉండటం తప్పనిసరి. మిగులు సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండటమనే బ్రిటన్ విధానాన్ని స్వతంత్ర భారతం విడిచిపెట్టేసింది. కాగా పాక్, చైనాలు మిగులు సైనిక సామర్థ్యం విలువను గుర్తించాయి. పాక్‌కు నేడు మన కంటే చాలా ఉత్తమమైన ఎత్తుగడల ప్రాధాన్యమున్న అణ్వస్త్రాలున్నాయి. నేరుగా యుద్ధరంగంలోనే వాటిని మోహరింపజేయవచ్చు. అలాగే అవి ఉగ్రవాదుల చేతుల్లో పడే అవకాశాలు కూడా ఎక్కువ. పేద దేశానికి సాయుధ బలగాలు ఒక విలాసం అంటూ 1962 వరకు భారత్ సైన్యం ప్రాధాన్యాన్ని దాదాపు పూర్తిగా తోసిపుచ్చింది. ఆ తదుపరి కోలుకోవడం జరుగుతున్నా అది అప్పుడప్పుడు హఠాత్తుగా సాగే విస్తర ణగానే సాగుతోంది.
గత ఆరు దశాబ్దాలుగా భారత్, పాక్, చైనా, రష్యా, అమెరికాల మధ్య వ్యూహాత్మక అనుసంధానాలు నిలకడగా నిలిచినవీ కావు, సరళ రేఖలుగా సాగుతున్నవీ కావు. ఏ దేశం బలహీనమైన లింకు అనేదే అన్ని కాలాల్లోనూ పెద్ద ప్రశ్నగా ఉంటోందనేది స్పష్టమే. వ్యూహాత్మకమైన కథనం అంటే నీతి కథ కాదు. ద్వంద్వవాదం అంటే వంచన కాదు ప్రతి దేశమూ ప్రతి అనుబంధపు బలాన్నీ ఎప్పటికప్పుడు తిరిగి కొలవాలని చూస్తూనే ఉంటుంది. ఆధునిక భారతదేశం ఒక విలక్షణమైన జన్యువును పెంచి పోషించుకుంటూ వచ్చింది. అది ఏదో ఒక సమున్నత ఆశయాన్ని సాధించాలనే తపనతో మన ప్రభుత్వం నిర్వీర్యమైపోయేలా చేస్తోంది. మన్మోహన్ ఒక దశాబ్దమంతా పాక్‌తో శాంతి కోసం పాకులాడారు. అయితే బలహీనంగా వణికే కాళ్లతో మనం ఎవరితోనూ కరచాలనం చేయలేం. వాస్తవ ప్రపంచం ఉదాసీనంగా భుజాలెగరేసి ఇతరత్రా తన ఏర్పాట్లేవో తాను చేసుకుంటుంది.
- ఎం.జె.అక్బర్
సీనియర్ సంపాదకులు