
ప్రముఖ అంతర్జాతీయ థియేటర్ స్పెషలిస్ట్ డాక్టర్ మాయటెంగ్ బెర్గ్ గిరిస్‌చిన్
సాక్షి,హైదరాబాద్: ‘తెలంగాణ ఆర్ట్స్ అండ్ కల్చర్‌లో ఓ ఎనర్జీ ఉంది. అది ఏంటీ? ఎలా ఉంటుంది? అనేది మాటల్లో చెప్పలేం. ఇక్కడ వారిలో ఒక ఉత్సుకత, ఆప్యాయత, మంచితనం ఉంటుంది. ఈ ప్రాంతలో చోటుచేసుకున్న ఉద్యమాల విశిష్టతను విని తెలంగాణ సంస్కృతికి ఆకర్షితురాలినయ్యాన’ని చెప్పారు ప్రముఖ అంతర్జాతీయ థియేటర్ స్పెషలిస్ట్ డాక్టర్ మాయటెంగ్ బెర్గ్ గిరిస్‌చిన్. ఈ నూతన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి నాటక విధానం తీసుకురావడమే తన లక్ష్యమంటున్న చిన్ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
హైదరాబాద్‌కు రావడం ఇది రెండోసారి. చైనాలో పరిచయమైన ఇక్కడి ప్లానెట్ జీ సంస్థ సలహాదారు కుమారస్వామి తెలంగాణ సంస్కృతి, దాని ప్రాశస్త్యం గురించి వివరించారు. తొలిసారి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలిశాయి. ఈ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలు జరిగా యి. వాటి గురించి విన్నాక ఈ ప్రాంతానికి ఒక విశిష్టత ఉందనిపించింది.
థియేటర్ నిర్మాణానికి ఇక్కడ బోలెడన్ని అవకాశాలున్నాయి. ఇందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కూడా మంచి ఆలోచనలతో ఉండడం గొప్ప విషయం. ఈ శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. నాటక రంగ అభివృద్ధి కోసం పరితపిస్తున్నారు. తెలంగాణలో కొత్త నాటక విధానం తీసుకొచ్చేందుకు నా వంతు సహాయం చేస్తాను.
300 నాటకాలకు డైరెక్షన్..
మా స్వస్థలం స్విట్జర్లాండ్. పిన్‌లాండ్‌లో ఫిజికల్ థియేటర్ ఆర్ట్స్‌లో రీసెర్చ్ చేశాను. జర్మనీలో స్థిరపడ్డాను. మొదటి నుంచి ఆసియా, ఇండియా సంస్కృతిపై ఆసక్తి ఎక్కువ. చైనా, మలేసియా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, పిన్‌లాండ్, ఇండియా.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు తిరిగాను. 300లకు పైగా నాటకాలకు డైరెక్షన్ చేశాను.యూరప్‌లో ఎంతో మంది నటీనటులను తీర్చిదిద్దాను.
తెలంగాణ ప్రభుత్వం ‘న్యూ వేవ్ థియేటర్’కి శ్రీకారం చుట్టింది. జాతీయ ప్రమాణాలతో కథలు, డ్రామాలు సరికొత్తగా వస్తాయి. కథ, కథనం, నాటకీయత, శైలి, లైటింగ్, సెట్టింగ్.. లాంటి అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తాం. ఇక్కడ యువ నటులకు కొదవలేదు. ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా ఉంది.