
తెలంగాణ సంస్కృతి గొప్పది
హుజూరాబాద్ రూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ గిరిజన, జానపద కళోత్సవాలు–17 వేడుకలు ఆదివారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలు కాపాడటంలో కళాకారుల కృషి అభినందనీయమన్నారు.
కళల ప్రదర్శన చాలా కష్టంతో కూడుకున్న పనిఅని, వాటిని ప్రదర్శించడంలో కళకారులు పడుతున్న కష్టాలను ప్రజలు గుర్తించి ప్రోత్సాహించాలని పేర్కొన్నారు. సంస్కృతిలో ఆట, పాటకు గుర్తింపు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళకారులకు ఉద్యోగాలు కల్పించి ఆదుకుందన్నారు. కళాకారులు ఆట, పాటల ద్వారా ప్రజలను ఆకర్షిస్తారన్నారు. మహిళలు గుట్కా, గుడుంబాను అరికట్టడంలో కీలకపాత్ర పోషించాలన్నారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ సంప్రదాయం, సంస్కృతి అడుగంటిపోయాయని, వాటికి పునర్జీవం పోయాల్సిన బాధ్యత కళాకారులపై ఉందన్నారు.
అనంతరం తెలంగాణ రాష్ట్రస్థాయి పునరంకిత పురస్కార గ్రహితలకు అవార్డులను ప్రదానం చేశారు. మంత్రిని గిరిజన సంప్రదాయ వేషధారణతో అలంకరించారు. కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్, మార్కెట్‌కమిటీ చైర్మన్ ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అ«ధ్యక్షుడు తాళ్లపల్లి రమేశ్, టీఆర్‌ఎస్ నాయకులు బండ శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, స్పందన సేవా సొసైటీ అధ్యక్షురాలు అనుమాండ్ల శోభారాణి, కళారవళి అసోసియేషన్ అధ్యక్షుడువిష్ణుదాస్ గోపాల్‌రావు, ప్రధాన కార్యదర్శి కన్నన్ దురైరాజు, విశ్రాంత ప్రిన్సిపాల్ సమ్మయ్య, రచయిత, గాయకుడు వానమామలై జగన్మోహనాచారి, గాయకులు మురళీమధు, కళాకారులు పంజాల రాంనారాయణరావు, ఎండీ.వహిదుల్లాఖాన్, బండ కిషన్, అనిల్‌కుమార్ గౌడ్ తదితరులున్నారు.