
బోయలు, కాయితీ లంబాడీలపై అధ్యయనం
తెలంగాణలోని వాల్మీకి బోయ, కాయితీ లంబాడీల జీవనశైలి, సంస్కృతి, ఉద్యోగస్థాయి తదితర అంశాలపై అధ్యయనం...
- ప్రభుత్వం ఆదేశిస్తే మిగతా కులాలపై కూడా అధ్యయనం
- ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా చెల్లప్ప బాధ్యతల స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని వాల్మీకి బోయ, కాయితీ లంబాడీల జీవనశైలి, సంస్కృతి, ఉద్యోగస్థాయి తదితర అంశాలపై అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆరునెలల్లో నివేదికను సమర్పించేందుకు కృషి చేస్తామని ఎస్టీ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎస్.చెల్లప్ప తెలిపారు. ప్రధానంగా ఈ రెండు తె గలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకే తమకు బాధ్యత అప్పగించారన్నారు.
శుక్రవారం దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్‌లో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఎస్.చెల్లప్ప, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.జగన్నాథరావు, హెచ్.కె.నాగు సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం చెల్లప్ప విలేకరులతో మాట్లాడుతూ, మిగతా కులాలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలిస్తే వాటిపై అధ్యయనానికి కూడా అభ్యంతరం లేదని చెప్పారు. ఈ రెండు తెగల జనాభా పెరుగుదల వంటి అంశాలను పరిశీలిస్తామని తెలిపారు. కమిషన్ సభ్యుడు కె.జగన్నాథరావు మాట్లాడుతూ తమకు అప్పగించిన అంశంపై క్షేత్రస్థాయిలో అధ్యయనంకోసం పర్యటనలు చేపడతామని చెప్పారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్, సభ్యులకు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి జీడీ అరుణ, కమిషనర్ బి.మహేశ్‌దత్ ఎక్కా, బంజారా సోషియో కల్చరల్ రీసెర్చీ ఫౌండేషన్ ప్రతినిధులు ప్రొఫెసర్ వి.రామకోటి, ప్రొఫెసర్ రాంప్రసాద్, ప్రొఫెసర్ భట్టురమేష్, కృష్ణనాయక్ చౌహాన్, వివిధ దళిత సంఘాల నాయకులు అభినదనలు తెలిపారు.