జమ్మి చెట్టుని చూడాలని..
సంస్కృతిని భావి తరాలకు అందించడానికి ‘కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యుషన్’ పనిచేస్తోంది. ఏటా విజయ దశమి సందర్భంగా జమ్మి మొక్కలను ఉచితంగా అందజేస్తోంది. ఇప్పటి వరకు విజయవంతంగా నాలుగేళ్లుగా పంపిణీ చేస్తూ వచ్చింది. పంచ మహా వృక్షాల్లో భాగమైన జమ్మితోపాటు... మారేడు, మర్రి, రావి, మేడి మొక్కలనూ అందజేస్తోంది.
ప్రకృతి - సంస్కృతి..
నీలా లక్ష్మారెడ్డి ‘గ్రీన్ రెవల్యూషన్’ సంస్థను 2010లో స్థాపించారు. వాస్తవంగా ఈ సంస్థ పర్యావరణ పరిరక్షణ కోసం ఆవిర్భవించింది. అంతటితో ఆగకుండా ప్రకృతితో ముడిపడిఉన్న సంస్కృతిని భావితరాలకు అందించడం కోసం నడుంబిగించింది. 2011 నుంచి ‘ప్రకృతి - సంస్కృతి’ పేరుతో ఐదు రకాల మొక్కలు పంపిణీ చే స్తోంది. ఇప్పటి వరకు నగరంలో మూడు వేలకుపైగా మొక్కలు నాటిం చారు. పార్కులు, ఆలయాల ప్రాంగణాల్లో, వీధుల వెంట నాటారు. కొన్ని ప్రాంతాల్లో మొదట్లో నాటిన మొక్కలు ఓ మోస్తారుగా ఎదిగాయి. ఈ దసరాకు అక్కడి స్థానికులకు జమ్మి దర్శనభాగ్యం కలుగనుంది.
జమ్మితో పాటు..
రామాయణం, మహాభారతం నుంచి పంచమహావృక్షాలను పూజించే సంస్కృతి ఉంది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ఈ సంస్కృతి కొనసాగుతోంది. నగరంలో ఆ చెట్లు లేక పోవడంతో పూజలు చేయలేకపోతున్నారు. అందుకే మేం జమ్మితో పాటు.. పంచ మహా వృక్షాల జాబితాలోని ఇతర మొక్కలను పంపిణీ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఆగస్టు 29, 30 తేదీల్లో కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ ఆలయం వద్ద మొక్కలను పంపిణీ చేశాం.
- లీలా లక్ష్మారెడ్డి, ట్రస్ట్ ప్రెసిడెంట్