వేడుకలో ప్లాటినం జువెల్లరీ.. | With sakshi Platinum Guild India MD Vaishali Banerjee | Sakshi
Sakshi News home page

వేడుకలో ప్లాటినం జువెల్లరీ..

Published Wed, Jun 17 2015 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

వేడుకలో ప్లాటినం జువెల్లరీ..

వేడుకలో ప్లాటినం జువెల్లరీ..

కస్టమర్లలో 85% యువతే
- చిన్న నగరాలకూ పాకిన సంస్కృతి
- 2020 నాటికి 4 రెట్ల అమ్మకాలు
- సాక్షితో ప్లాటినం గిల్డ్ ఇండియా ఎండీ వైశాలి బెనర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ప్లాటినం.. అమూల్యమైన ఈ లోహం ఇప్పుడు భారత్‌లో ప్రత్యేకతను సంతరించుకుంటోంది. వేడుకల్లో ప్లాటినం ఆభరణం ఉండాల్సిందేనని యువత అంటోంది.  2014లో భారత్‌లో 5 టన్నుల ప్లాటినం ఆభరణాలు అమ్ముడయ్యాయి. అయిదారేలళ్ల క్రితం విక్రయాలతో పోలిస్తే ఇది 10 రెట్లు అధికమని ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ) ఇండియా ఎండీ వైశాలి బెనర్జీ తెలియజేశారు. కస్టమర్లలో 85 శాతం మంది 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్నవారే. ఈ అంశమే ప్రస్తుత ట్రెండ్‌కు అద్దం పడుతోందని అన్నారు. 2020 నాటికి పరిశ్రమ నాలుగు రెట్లకు చేరుకోవడం ఖాయమని పేర్కొన్నారు. ప్లాటినం అమ్మకాలను పీజీఐ ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఆభరణాల విపణి తీరుతెన్నులను ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అవి ఆమె మాటల్లోనే..
 
ప్రత్యేక సందర్భంలో..
నిశ్చితార్థం, వివాహం, పెళ్లి రోజు వంటి ప్రత్యేక వేడుకల్లో ప్రాధాన్య బహుమతిగా ప్లాటినం నిలుస్తోంది.  మొత్తం ప్లాటినం ఆభరణాల్లో ఉంగరాల వాటా అత్యధికంగా 60% కావడం గమనార్హం. రూ.30-35 వేల మధ్య లభించే ఉంగరాలకు భారత్‌లో అధిక డిమాండ్ ఉంది. కపుల్ రింగ్స్‌లో రూ.60-70 వేల ధరవి అధికంగా అమ్ముడవుతున్నాయి. ఇక ప్లాటినం విక్రయాల్లో 12-15% వాటా పురుషుల ఆభరణాలు కాగా మిగిలిన వాటాను మహిళల ఆభరణాలు కైవసం చేసుకున్నాయి. వధూవరుల కోసం ప్రత్యేకంగా ‘ఎవరా’ శ్రేణిలో ఆభరణాలను తీసుకొచ్చాం.
 
ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ..

ప్రత్యేకత కోరుకునేవారు ఈ లోహానికి మళ్లుతున్నారు. గతంలో వజ్రాలతో కూడిన ప్లాటినం ఆభరణాల వాటా 95% ఉండేది. ఇప్పుడు ఇది 65 శాతానికి వచ్చింది. సాదాగా ఉండే ప్లాటినం ఆభరణాలను కూడా కస్టమర్లు కొనుగోలు చేయడం పెరిగింది. ద్వితీయ శ్రేణి నగరాల కూ ఇది పాకింది. భారత్‌లో 77 నగరాల్లోని 920 స్టోర్లకు ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ ధ్రువీకరణ ఉంది. సగం స్టోర్లు మెట్రోయేతర నగరాల్లో ఉన్నాయంటే డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. బంగారం, ప్లాటినం విభాగాలు రెండూ కూడా వేర్వేరుగా మార్కెట్లో వృద్ధి చెందుతాయి.
 
నాల్గవ స్థానంలో భారత్..
ప్లాటినం ఆభరణాల విక్రయంలో చైనా, జపాన్, యూఎస్ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. భారత్‌లో 2014లో 28 శాతం వృద్ధితో 5 టన్నుల ఆభరణాలు అమ్ముడయ్యాయి. విలువ సుమారు రూ.2,800 కోట్లు. ఈ ఏడాది 23 శాతం వృద్ధి అంచనా వేస్తున్నాం. 2020 నాటికి పరిశ్రమ నాలుగు రెట్లకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. భారత్‌లో 14 కంపెనీలు ఆభరణాల తయారీలో నిమగ్నమయ్యాయి. మధ్యప్రాచ్య దేశాలు, ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తున్నాయి కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement