కళలు అనే వర్షం కావాలి! అప్పుడే.. | Sakshi
Sakshi News home page

భావోద్వేగాలను కట్టడి చేసే మహత్తరమైన శక్తి వాటికే ఉంది!

Published Mon, Sep 4 2023 9:34 AM

If Countrys Culture Is To Stand It Needs The Rain Of Arts - Sakshi

అన్నార్భవంతు భూతాని... అసలు ప్రాణుల పుట్టుకకు, మనుగడకు అన్నం కావాలి. అన్నం దొరకాలంటే భూమికి ఆర్ద్రత ఉండాలి. ఆకాశంలో నుంచి పడిన వర్షంతో భూమి అంతా చెమ్మగిల్లి మొక్కలు పుట్టినట్లు, ఒక దేశసంస్కృతి నిలబడాలంటే కళలు.. అనే వర్షం కావాలి. కళల ద్వారా సంస్కృతి పెరుగుతుంది. సంస్కృతి పెరిగితే ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైలి, నడవడిక, ఆ దేశపు కీర్తిప్రతిష్ఠలు నిర్ణయింప బడతాయి. కళలు... అంటే కవిత్వం, శిల్పం, నృత్యం, వాద్యం.. ఎప్పుడూ అవతలివారికి సంస్కృతిని కల్పించేవి అయి ఉంటాయి.  ఇవన్నీ కళలు కాబట్టి ఇవి వర్షం లాంటివి. అవి సంస్కృతిని మొలకెత్తించడానికి కారణం కావాలి.

మన దేశానికి ఇన్ని కీర్తిప్రతిష్ఠలు రావడానికి కారణం ఏమిటి? భగవద్గీత పుట్టిన భూమి. రామాయణం, భారతం, భాగవతం వంటివి పుట్టిన భూమి. గంగానది ప్రవహిస్తున్న భూమి. ఒకనాడు తాళంకప్ప అవసరం తెలియని భూమి. సంస్కృత భాషలో తాళం కప్ప అన్నదానికి పదం లేదు.. ఆ అవసరం రాలేదు. కారణం – పరద్రవ్యాణి లోష్ఠవత్‌... రహదారిమీద రాయి దొరికితే నాది కాదు అని ఎలా అంటామో అలాగే నాది కానిదేదీ, పరవాడివస్తువు ఏదయినా నాకు దొరికితే నాది కాదు కాబట్టి అది నాకు రాయితో సమానమే... అన్న భావన. అదీ ఈ దేశ సంస్కృతి. ఇది ఎక్కడినుంచి వచ్చింది? రామాయణంలో నుంచి, భారతంలోంచి.. వచ్చింది. నీదికానిది నీవు కోరుకుంటే .. పతనమయి పోతావన్న హెచ్చరిక... దాని జోలికి వెళ్ళనీయదు.

కళలు ఈ దేశపు సంస్కృతిని ప్రతిబింబించేవి అయి ఉంటాయి. మీరు ఏది వింటున్నా, ఏది చూస్తున్నా, మనశ్శాంతికి కారకమైన భగవంతుని తత్త్వాన్ని ఆవిష్కరింపచేసేవిగా ఉంటాయి. ఒక నృత్యం జరుగుతోంది. ‘కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభమ్‌ నాసాగ్రే నవమౌక్తికమ్‌...’ అంటూ సాగుతున్న కీర్తనకు నర్తకి అభినయిస్తుంటే నర్తకి క్రమేణా కనుమరుగై కృష్ణపరమాత్మ కనబడడం మొదలవుతుంది. పాట అభినయంగా మీకు శ్రీకృష్ణ దర్శనం చేయించి, మీ ఉద్వేగాలను శాంతపరుస్తుంది. పాలగిన్నె కింద అగ్నిహోత్రం పెడితే పాలు పొంగుతాయి. నీళ్ళు చల్లితే పొంగు చల్లారుతుంది. 

అలా మనదేశంలో ఉన్న కళలు మన భావోద్వేగాలను అణచి ప్రశాంతతను, మనశ్శాంతిని కల్పించడానికి ఉపయుక్తమయ్యాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని, ఆదరణనూ పొందాయి. ఈ కళలన్నీ శాంతిని ప్రసాదించగల దివ్యత్వాన్ని సంతరించుకున్నాయి. ఇవన్నీ కూడా వేదాలకు ఉపవేదాలయినటువంటి వాటి నుంచి వచ్చాయి. సామవేదానికి గాంధర్వ వేదం ఉపవేదం. మిగిలినవి ఇతర వేదాలకు ఉపవేదాలు. వేదానాం సామవేదోస్మి... అన్నాడాయన. ఎందుకు అంతస్థాయిని పొందింది? అంటే తినడం ఒక్కటే కాదు, శరీరం పెరగడం ఒక్కటే కాదు ప్రధానం, అది ఎంత అవసరమో, మనసు సంస్కారవంతంగా తయారు కావడం కూడా అంతే ప్రధానం. 

(చదవండి: మెట్ట వేదాంతం..?)

Advertisement
 
Advertisement
 
Advertisement