మాట్లాడుతున్న లక్ష్మీనర్సమ్మ, పక్కన గౌరీశంకర్
- ప్రముఖ రచయిత డాక్టర్ లక్ష్మీనర్సమ్మ
కొత్తగూడెం అర్బన్ : దేశ సంస్కృతీ సంప్రదాయాలు సాహిత్యం ద్వారానే అలవడుతాయని ప్రముఖ రచయిత డాక్టర్ చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లోని రాళ్లబండి కవితాప్రసాద్ ప్రాంగణంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను గురువారం ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో లక్ష్మీనర్సమ్మ మాట్లాడారు. పుస్తక పఠనం విద్యార్థి దశ నుంచి ప్రారంభం కావాలని, దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. నిరంతరం పుస్తకాలు చదవడం వల్ల ప్రతి విషయంపై అవగాహన పెరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత స్థానిక చరిత్ర, పోరాటయోధుల గాధలు, కవులు, రచనలు, సాహిత్యం వెలుగు చూశాయన్నారు. బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు, రచయిత జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ పుస్తకం మంచి నేస్తం వంటిదని, ఇష్టమైన పుస్తకం చదవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లోని అన్ని గ్రామాలకు పుస్తకాలు తీసుకెళ్లేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కృషి చేస్తోందన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో 4వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందని, పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం సమావేశానికి హాజరైన అతిథులు పుస్తక పఠనంపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి చంద్రమోహన్, బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌బాబు, కవులు శీరంశెట్టి కాంతారావు, హనీఫ్, నలందా విద్యా సంస్థల చైర్మన్ ఎంవీ.చౌదరి తదితరులు పాల్గొన్నారు.