reflects
-
ఆత్మపరిశీలన చేసుకున్నా!
‘‘ఈ ఏడాది ఎప్పుడూ చేయనన్ని పూజలు, ప్రార్థనలు చేశా. నాకు వరాలు ఇమ్మని, దీవెనలు అందించమని కాదు. శక్తిని, ప్రశాంతతను ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించా. మన ప్రార్థనలను ఆలకించడంలో భగవంతుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడేమో కానీ, ఎలాంటి స్వార్థం లేని శాంతి, ప్రేమ, సంతోషం, శక్తిని కోరుకుంటే కాదనడు’’ అని సమంత పేర్కొన్నారు. మయోసైటిస్ కారణంగా కొన్ని నెలలు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సమంత కోలుకుని సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్–డీకే ద్వయం తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సెర్బియాలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడి ‘సెర్చ్ ఆఫ్ సెయింట్ సావా’ను సందర్శించి ప్రార్థనలు చేశారామె. ఆ ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసి, మయోసైటిస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ తన జీవిత ప్రయాణం ఎలా సాగిందో ఓ సుదీర్ఘమైన పోస్టు చేశారామె. ‘‘మయోసైటిస్ వ్యాధి నిర్ధారణ అయి ఏడాది అవుతోంది. ఈ ఏడాదిలో ఎప్పుడూ ఊహించని కొత్త పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను. నా శరీరంతో ఎన్నో పోరాటాలు చేశా. ఇష్టమైన ఆహారాన్ని బలవంతంగా వదులుకున్నా. మందులే ఆహారం అయ్యాయి. ఆలోచించడం, ఆత్మపరిశీలన చేసుకోవడంతోనే ఈ ఏడాది సరిపోయింది. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన పరాజయాల విషయంలోనూ ఆత్మపరిశీలన చేసుకున్నా. పరిస్థితులను మెరుగుపరచమని కోరుతూ దేవుడికి ఎన్నో ప్రార్థనలు చేశా. అన్నీ మనకు అనుకూలంగానే జరగవన్న విషయం ఈ ఏడాది నేర్పించింది. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఫర్వాలేదని తెలుసుకున్నా. నా చేతుల్లో లేనిదాన్ని వదిలేయడం నేర్చుకున్నాను. కొన్నిసార్లు గొప్ప విజయాలు అక్కర్లేదు. పరిస్థితి నుంచి బయటపడటమూ ఒక విజయమే. ప్రతిదీ పరిపూర్ణం కావాలని ఎదురు చూడకూడదు.. గతాన్ని తలుచుకుంటూ అక్కడే ఆగిపోకూడదు. నన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తాను.. ద్వేషానికి మాత్రం నన్ను ఇబ్బందిపెట్టే అవకాశం ఇవ్వకూడదనుకున్నా’’ అని పోస్ట్ చేశారు సమంత. -
సాహిత్యంతోనే సంస్కృతీ సంప్రదాయాలు
ప్రముఖ రచయిత డాక్టర్ లక్ష్మీనర్సమ్మ కొత్తగూడెం అర్బన్ : దేశ సంస్కృతీ సంప్రదాయాలు సాహిత్యం ద్వారానే అలవడుతాయని ప్రముఖ రచయిత డాక్టర్ చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లోని రాళ్లబండి కవితాప్రసాద్ ప్రాంగణంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను గురువారం ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో లక్ష్మీనర్సమ్మ మాట్లాడారు. పుస్తక పఠనం విద్యార్థి దశ నుంచి ప్రారంభం కావాలని, దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. నిరంతరం పుస్తకాలు చదవడం వల్ల ప్రతి విషయంపై అవగాహన పెరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన తరువాత స్థానిక చరిత్ర, పోరాటయోధుల గాధలు, కవులు, రచనలు, సాహిత్యం వెలుగు చూశాయన్నారు. బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు, రచయిత జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ పుస్తకం మంచి నేస్తం వంటిదని, ఇష్టమైన పుస్తకం చదవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లోని అన్ని గ్రామాలకు పుస్తకాలు తీసుకెళ్లేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కృషి చేస్తోందన్నారు. కొత్తగూడెం క్లబ్లో 4వ తేదీ వరకు ప్రదర్శన ఉంటుందని, పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం సమావేశానికి హాజరైన అతిథులు పుస్తక పఠనంపై వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి చంద్రమోహన్, బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌బాబు, కవులు శీరంశెట్టి కాంతారావు, హనీఫ్, నలందా విద్యా సంస్థల చైర్మన్ ఎంవీ.చౌదరి తదితరులు పాల్గొన్నారు.