‘‘ఈ ఏడాది ఎప్పుడూ చేయనన్ని పూజలు, ప్రార్థనలు చేశా. నాకు వరాలు ఇమ్మని, దీవెనలు అందించమని కాదు. శక్తిని, ప్రశాంతతను ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించా. మన ప్రార్థనలను ఆలకించడంలో భగవంతుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడేమో కానీ, ఎలాంటి స్వార్థం లేని శాంతి, ప్రేమ, సంతోషం, శక్తిని కోరుకుంటే కాదనడు’’ అని సమంత పేర్కొన్నారు.
మయోసైటిస్ కారణంగా కొన్ని నెలలు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సమంత కోలుకుని సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్–డీకే ద్వయం తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం సెర్బియాలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడి ‘సెర్చ్ ఆఫ్ సెయింట్ సావా’ను సందర్శించి ప్రార్థనలు చేశారామె. ఆ ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసి, మయోసైటిస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ తన జీవిత ప్రయాణం ఎలా సాగిందో ఓ సుదీర్ఘమైన పోస్టు చేశారామె.
‘‘మయోసైటిస్ వ్యాధి నిర్ధారణ అయి ఏడాది అవుతోంది. ఈ ఏడాదిలో ఎప్పుడూ ఊహించని కొత్త పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను. నా శరీరంతో ఎన్నో పోరాటాలు చేశా. ఇష్టమైన ఆహారాన్ని బలవంతంగా వదులుకున్నా. మందులే ఆహారం అయ్యాయి. ఆలోచించడం, ఆత్మపరిశీలన చేసుకోవడంతోనే ఈ ఏడాది సరిపోయింది. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన పరాజయాల విషయంలోనూ ఆత్మపరిశీలన చేసుకున్నా. పరిస్థితులను మెరుగుపరచమని కోరుతూ దేవుడికి ఎన్నో ప్రార్థనలు చేశా.
అన్నీ మనకు అనుకూలంగానే జరగవన్న విషయం ఈ ఏడాది నేర్పించింది. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఫర్వాలేదని తెలుసుకున్నా. నా చేతుల్లో లేనిదాన్ని వదిలేయడం నేర్చుకున్నాను. కొన్నిసార్లు గొప్ప విజయాలు అక్కర్లేదు. పరిస్థితి నుంచి బయటపడటమూ ఒక విజయమే. ప్రతిదీ పరిపూర్ణం కావాలని ఎదురు చూడకూడదు.. గతాన్ని తలుచుకుంటూ అక్కడే ఆగిపోకూడదు. నన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తాను.. ద్వేషానికి మాత్రం నన్ను ఇబ్బందిపెట్టే అవకాశం ఇవ్వకూడదనుకున్నా’’ అని పోస్ట్ చేశారు సమంత.
Comments
Please login to add a commentAdd a comment