కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్(Rajinikanth) మరోసారి బాలీవుడ్ చిత్రంలో నటించనున్నారా..? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం ఈయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నటి శృతిహాసన్ ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. తదుపరి నెల్సన్ దర్శకత్వంలో జైలర్– 2 చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటిది తాజాగా రజనీకాంత్ ఓ హిందీ చిత్రంలో నటించటానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. విశేషం ఏమిటంటే ఇందులో కథానాయకగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నను(Rashmika Mandanna) నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది.
ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ చిత్రంలో రష్మిక నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు మురగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను మార్చి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా మరో చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు అట్లీ( Atlee Kumar) తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. కాగా ఈ క్రేజీ చిత్రంలోనే రజనీకాంత్ కూడా ఒక ముఖ్యపాత్ర పోషించనున్నట్లు సమాచారం.
ఈ పాత్రలో ముందుగా నటుడు కమల్ హాసన్ నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. అయితే, ఆయన నిరాకరించడంతో, ఇప్పుడు రజనీకాంత్ ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అట్లీ ఇంతకుముందు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఎందిరన్ (రోబో) చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ పరిచయంతో ఇప్పుడు తాను దర్శకత్వం వహించబోయే హిందీ చిత్రంలో రజనీకాంత్‌ను ముఖ్యపాత్రలో నటింపజేయనున్నట్లు తెలుస్తోంది. అలా సల్మాన్ ఖాన్, రజనీకాంత్, రష్మిక మందన్నలతో రేర్ కాంబినేషన్లో చిత్రాన్ని చేయడానికి అట్లీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీని షూటింగ్ ఈ ఏడాదిలోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలవడ లేదు.
Comments
Please login to add a commentAdd a comment