‘‘ఇండస్ట్రీలో బడ్జెట్ కాదు.. కథే ముఖ్యం. మేము కూడా కథలని నమ్ముకుని సినిమాలు నిర్మించాం. కొత్త దర్శకులతో తీసినప్పుడు ఎన్ని విజయాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. అయితే కాంబినేషన్స్ అంటూ నాలుగైదేళ్లుగా మేం తడబడుతున్నాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vastunam) హిట్‌తో అనిల్ మళ్లీ మాకు ఒక రహదారి వేసి ఇచ్చాడు. ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు.
వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్‌లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్‌కి బ్రేక్ ఈవెన్ అయితేనే సూపర్ హిట్. అయితే వాళ్లు నష్టపోయినప్పుడు కూడా సినిమా సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి.
90 శాతం ఫెయిల్యూర్స్, కేవలం 10 శాతం మాత్రమే సక్సెస్ ఉండే ఇండస్ట్రీ ఇది. 20 ఏళ్లుగా మాతో ప్రయాణం చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్‌కి ధన్యవాదాలు’’ అని చెప్పారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆరు రోజుల్లోనే రూ.100 కోట్లు షేర్ రాబట్టింది. ఓ రీజినల్ ఫిలింకి చూడలేనేమో అనుకున్న రూ. 300 కోట్ల గ్రాస్ నంబర్ మా మూవీతో చూడబోతున్నందుకు హ్యాపీ’’ అని తెలిపారు. ‘‘20 ఏళ్ల క్రితం డిస్ట్రిబ్యూటర్‌కి ఉన్న విలువ ఇప్పుడు లేదు. ఇలాంటి సమయంలో వాళ్లు తలెత్తుకునేలా చేసిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’’ అని శిరీష్ పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ సాయికృష్ణ, రాజేశ్, హరి, శోభన్, ఎల్వీఆర్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment