‘‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని ‘బ్లాక్ బస్టర్ ΄పొంగల్...’ అనే పాట వెంకటేశ్‌గారికి చాలా నచ్చింది. దీంతో ఆయనే స్వయంగా ఆ పాట పాడతానని చెప్పడంతో నేను షాక్ అయ్యాను. కానీ ఆయన 20 నిమిషాల్లో ఆ పాట పాడటంతో సంగీత దర్శకుడు భీమ్స్ కూడా షాక్ అయ్యాడు’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పారు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి విలేకరులతో పంచుకున్న విశేషాలు...
⇒ వెంకటేశ్‌గారితో నేను తీసిన ‘ఎఫ్ 2’ (2019) సంక్రాంతికి వచ్చి, విజయం సాధించింది. ‘ఎఫ్ 3’ కూడా సంక్రాంతికి రావాల్సింది కానీ మిస్ అయ్యింది. మా కాంబోలో మూడో సారి చేసే సినిమాని ఎలాగైనా పండగకి తీసుకొస్తే బావుంటుందని సినిమా ఆరంభం అప్పుడే సంక్రాంతికి రావాలనుకున్నాం. కథ అనుకున్నప్పుడే ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌కి ఫిక్స్ అయ్యాం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ కథ ఒక రెస్క్యూ ఆపరేషన్‌కి సంబధించినది. సెకండ్ హాఫ్‌లో నాలుగు రోజుల ప్రయాణం సంక్రాంతికి ముందు ల్యాండ్ అవుతుంది. ఒక భార్య, మాజీ ప్రేయసి మధ్య నలిగే ఓ భర్త పాత్ర వెంకటేశ్‌గారిది. ప్రతి ఫ్యామిలీ రిలేట్ చేసుకునే సినిమా ఇది. ట్రైలర్ అందరికీ బాగా నచ్చింది. థియేటర్స్‌కి వచ్చాక సినిమా అద్భుతంగా నచ్చితే మూవీ బ్లాక్ బస్టరే.
⇒ కోవిడ్ తర్వాత సినిమా సినారియో మారిపోయింది. మంచి కథ రాసి, గొప్పగా తీస్తే సరిపోదు. థియేటర్స్‌కి జనాలు రాకపోతే సినిమాకి రీచ్ ఉండదు. ఇప్పుడు ఆడియన్స్ బాగా సెలెక్టివ్ అయిపోయారు. మన సినిమా వారి అటెన్షన్‌ని గ్రాబ్ చేస్తేనే ఓపెనింగ్స్ తెచ్చుకోగలమని నా అభిప్రాయం. ఈసారి ప్రమోషన్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాం. వెంకటేశ్‌గారి లాంటి పెద్ద స్టార్ హీరో సరదాగా అల్లరి చేయడం, రీల్స్ చేయడం ప్రమోషన్స్‌కి చాలా హెల్ప్ అయ్యింది. నేను హీరోలకి ఫ్యాన్‌గానే ఉంటాను. రిలేషన్‌ని పాజిటివ్‌గా ఉంచుతాను కాబట్టి వాళ్ల నుంచి కూడా అంతే ప్రేమ వస్తుంది.
⇒ ‘దిల్’ రాజుగారితో ‘పటాస్’ సినిమాతో నా ప్రయాణం ఆరంభమైంది. రాజుగారు, శిరీష్ గారు అంటే నా కుటుంబం లెక్క. మాది పదేళ్ల ప్రయాణం. ఇక ఉమెన్ సెంట్రిక్‌గా ఒక స్పోర్ట్స్ స్టోరీ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కొన్నాళ్ల తర్వాత ఆ నేపథ్యంలో మూవీ చేస్తాను. ‘ఎఫ్ 4’ సినిమా కచ్చితంగా ఉంటుంది. అయితే దానికి ఇంకా సమయం ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి కూడా ఫ్రాంచైజీలు చేసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment