పూల పండగొచ్చింది..
సిటీలో బతుకమ్మ సందడి షురూ అయింది. ఆనవాయితీ ప్రకారం కూకట్‌పల్లి గ్రామం ప్రధాన చౌరస్తాలో ఆదివారం తొలి బతుకమ్మ కొలువుదీరింది. ఇక్కడ పది రోజులపాటు వైభవంగా ఉత్సవాలు కొనసాగుతాయి. మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి వేడుకలో పాల్గొన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను తీసుకువచ్చి.. ‘ఒక్కేసి పువ్వేసి చందమామా... బతుకమ్మ... బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ పాటలు పాడుతూ సందడిగా ఉత్సవాన్ని ప్రారంభించారు.
కూకట్‌పల్లి: తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా బతుకమ్మ వేడుకలను కూకట్‌పల్లి ప్రాంతం ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుంది. దాదాపు నాలుగు శతాబ్దాల కాలం నాటి నుంచే బతుకమ్మకు ఇక్కడ ఆజ్యం పోశారు. ఆనాటి నుంచి ఎన్నో తరాలు మారినా చెక్కు చెదరని బతుకమ్మ సంస్కృతి నేటి వరకు కొనసాగుతూ వస్తుంది. ఈ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా అమావాస్యకు ముందు రోజు ఇక్కడ బతుకమ్మ వేడుకలను ఆరంభించడం ఆనవాయితీ. అందులో భాగంగా కూకట్‌పల్లి గ్రామం ప్రధాన చౌరస్తా కేంద్రంగా జరిగిన బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. రంగురంగుల బతుకమ్మలతో కూకట్‌పల్లి ప్రాంత మహిళామణులు, యువతులు, చిన్నారులు తరలివచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఒక్కేసి పువ్వేసి ఓ చందమామా..... బతుకమ్మ.... బతుకమ్మ ఉయ్యాలో.... అంటూ సాగిన పాటలతో కూకట్‌పల్లి గ్రామంలో సందడి నెలకొంది. అనంతరం స్థానికం ఉన్న ఐడిఎల్ చెరువులో నిమజ్జనం చేసి వెంట తెచ్చుకున్న పలహారాలను మహిళలు ఇచ్చిపుచ్చుకున్నారు.