హైదరాబాద్‌లోని ఓ మెట్రో రైల్వే స్టేషన్.. ‘అన్యొహసేవ్.. అజొస్సి..?’ అని పిలిచింది ఒక 23 ఏళ్ల అమ్మాయి తన దారికి అడ్డంగా ఉన్న ఓ పాతికేళ్ల కుర్రాడిని. ‘ఎస్..’ అంటూ అతను పక్కకు తప్పుకున్నాడు. ‘కమ్సహమీదా’ అని చెబుతూ గబగబా ముందుకు సాగిపోయింది ఆ అమ్మాయి. తీరా ఆమె ప్లాట్‌ఫామ్ చేరుకునే సరికి అప్పుడే ట్రైన్ డోర్స్ మూసుకున్నాయి. ‘ఒమో..’ అంటూ నిట్టూర్చుంది.
అంతలోనే ఫోన్.. ‘చింగు’ అనే పేరున్న నంబర్ నుంచి. ‘అన్యొహసేవ్’ అంది ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేస్తూనే. అవతలి నుంచీ ‘అన్యొహసేవ్’ అని బదులిచ్చి ‘ట్రైన్ క్యాచ్ చేశావా?’ అని అడిగింది ఆ స్వరం. ‘లేదు.. జస్ట్ మిస్డ్’అంది ఇవతలి అమ్మాయి. ‘చించా?’ అంది అవతలి స్వరం నమ్మలేనట్టుగా. ‘ఎస్.. కానీ ఇంకో ట్రైన్ క్యాచ్ చేసి వచ్చేస్తాలే..’అని చెప్పింది ఈ అమ్మాయి నమ్మకంగా.
‘ఓకే.. తర్వగా రా.. బెగొపాయో’ అంది అవతలి స్వరం. ‘నేనూ బెగొపాయో’ అంది ఈ అమ్మాయి. ఇంతలోకే ఇంచుమించు ఆ అమ్మయి వయసు అబ్బాయి ఆమె పక్కనుంచి ‘వావ్.. యెప్పుదా..!’ అనుకుంటూ వెళ్లాడు. అసలే ట్రైన్ మిస్ అయిన చిరాకుతో ఉన్న ఆ అమ్మాయి..
ఆ మాటకు ‘షిరొ.. మీచెస్సో’ అంటూ రిటార్ట్ ఇచ్చింది.
గూఢచారుల కోడ్ భాష అనుకుంటున్నారా ఏమీ.. ఆ సంభాషణ విని?! కాదండీ.. అది కొరియన్ భాషండీ.. కొరియన్ భాష! ‘అన్యొహసేవ్.. అజొస్సి’ అంటే ‘హలో మిస్టర్’ అని, ‘కమ్సహమీదా’ అంటే ‘థాంక్యూ’ అని, ‘ఒమో’ అంటే ‘ ‘నో’ అని, ‘చింగు’ అంటే ఫ్రెండ్, ‘చించా’ అంటే ‘రియల్లీ’, ‘బెగొపాయో’ అంటే ‘అకలేస్తోంది’, ‘యెప్పుదా’ అంటే ‘ప్రెటీ’, ‘షిరొ’ అంటే ‘నాకు నచ్చలేదు’ అని, ‘మీచెస్సో’ అంటే ‘క్రేజీ’ అని అర్థం.. కొరియన్ భాషలో!
‘ఓహ్.. చించా! అయితే.. ఇక్కడ కొరియన్ భాషను నేర్పే కాలమ్ ఏదైనా మొదలుపెడుతున్నారా అనే సందేహం వలదు. దిస్ పేజ్ ఈజ్ వెరీమచ్ డెడికేటెడ్ టు కవర్ స్టోరీ ఓన్లీ. కొరియన్ మేనియా మీదే ఈ స్టోరీ!
టీన్స్ నుంచి ‘టీ (ఫిఫ్టీ..సిక్సీ›్ట, సెవెంటీ.. ఎట్‌సెట్రా)’ల దాకా అన్ని వయసుల వాళ్లు కొరియన్ డ్రామా, కొరియన్ పాప్‌కి పరమవీర ఫ్యాన్స్! ఈ అఫైర్ కొరియన్ పాప్‌తో పదేళ్ల కిందటే మొదలైనా కొరియన్ డ్రామాతో స్టార్ట్ అయింది మాత్రం కరోనా లాక్‌డౌన్‌లోనే. ఇంట్లోనే గడిపిన ఆ సమయాన్ని చాలామంది ఓటీటీతో కాలక్షేపం చేశారు. నెట్‌ఫ్లిక్స్‌లోని ‘డిసెండెంట్స్ ఆఫ్ ది సన్’, ‘బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్’, ‘రిప్లై1988’, ‘కింగ్‌డమ్’, ‘స్కైకెసిల్’ వంటి కొరియన్ సిరీస్‌తో మన వీక్షకుల ప్రేమకథ మొదలైంది.
క్వారంటైన్‌ను మనం ఓటీటీలో కొరియన్ సిరీస్, యూట్యూబ్‌లో కొరియన్ పాప్‌తో ఎంటర్‌టైన్ అయ్యామని పలు అధ్యయనాల సారాంశం. అదిగో అప్పుడే కొరియన్ డ్రామా, కొరియన్ పాప్ క్రేజ్‌ను పెంచి ఓ వేవ్‌లా మార్చింది. దీన్నే అంటే కొరియన్ డ్రామా, కొరియన్ పాప్‌తో కలసి కొరియన్ కల్చర్ పట్ల మోజు పెంచుకోవడాన్ని .. అదో వేవ్‌లా కొనసాగడాన్ని ‘హాల్యు’ అంటున్నారు.
ఎందుకంత క్రేజ్?
హై ప్రొడక్షన్ వాల్యూస్, అంతే అద్భుతమైన ప్రెజెంటేషన్‌తో మనమూ ఐడెంటిఫై అయ్యేలా కుటుంబ కథాంశాలతో కొరియన్ డ్రామాలు స్ట్రీమ్ అవుతున్నాయి. ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. అందులో విహరించాలని ఎవరికి మాత్రం ఉండదు? అందుకే వాటి వ్యూయర్‌షిప్ అంత హైలో ఉంటోంది. భాష, సెట్టింగ్స్, పాత్రలు కొరియన్ నేపథ్యం. కథనం మాత్రం అంతర్జాతీయ వీక్షకులను అలరించేదిగా ఉంటోంది.
మరీ ముఖ్యంగా మన వాళ్లకు దగ్గరగా.. ఇంకా చెప్పాలంటే మనం అన్వయించుకునేలా ఉంటాయి ఆ సిరీస్‌లు. అందుకే కదా.. ఆస్కార్ విన్నర్ ‘పారసైట్’ని చూసి ప్రపంచమంతా ‘వహ్వా’ అంటుంటే మనకు వెరీమచ్ తెలుగు సినిమాలా అనిపించింది! ‘కొత్త మనుషులు, కొత్త వాతావరణం.. కొత్త కథలుగా అస్సలు అనిపించవు’ అని చెబుతుంటారు కొరియన్ డ్రామాను అమితంగా ఇష్టపడే తెలుగు వీక్షకులు.
అప్పటిదాకా గూఢచర్య, మిలిటరీ ఆపరేషన్ నేపథ్యపు అమెరికన్ డ్రామాలు, నేరస్థులను పట్టుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ సాగే స్కాండినేవియన్ డిటెక్టివ్ సిరీస్‌లు చూసీ చూసీ పాతబడున్న ప్రేక్షకులు, వీక్షకులకు కొరియన్ డ్రామా ఓ మత్తులా పట్టుకుంది.. కొత్త సీసాలో పాత మందులాగా! ముక్కోణపు ప్రేమ, శృంగారం, అమ్మ సెంటిమెంట్, కిడ్నాప్‌లు, గతం మర్చిపోవడాలు, కుటుంబ పరువు–ప్రతిష్ఠలను కాపాడుకోవడం, పాటలు, పగ– ప్రతీకారం, పురిట్లోనే కవలలిద్దరూ విడిపోవడం, దేశభక్తి .. ముఖ్యంగా మెలోడ్రామా.. ఇలా ఇండియన్ సినిమాల్లో కనిపించే నవరస, మసాలా దినుసులన్నీ కొరియన్ డ్రామాలో పుష్కలం.
అందుకే మనవాళ్లు అంతలా కనెక్ట్ అవుతున్నారు. ‘మన సినిమాలనే ఫారిన్ లొకేషన్స్‌లో.. ఫారిన్ యాక్టర్స్‌తో చూసినట్టుంటాయి.. భలే ఎంటర్‌టైన్ అవుతాం’ అంటున్నారు కొరియన్ డ్రామా వీరాభిమానులు కొందరు. ‘ఆ డ్రామాల్లో ఉండే ఎమోషనల్ స్టిక్‌నెసే వాటి పట్ల క్రేజ్ పెరగడానికి కారణం’ అంటారు ‘క్రాస్ పిక్చర్స్’ అనే కొరియన్ మల్టీనేషనల్ ప్రొడక్షన్ కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న చిత్ర సుబ్రహ్మణ్యం. ‘సౌత్ కొరియన్ సంస్కృతీసంప్రదాయాల్లో ఒక తరహా అప్పీల్ ఉంటుంది. అవి మనకు ఇదివరకే పరిచయమున్నట్టు తోస్తాయి. అందుకే వాటి మేళవింపుగా ఉన్న కొరియన్ డ్రామాలు మన దగ్గర అంత హిట్ అవుతున్నాయి’ అంటారు దక్షిణ కొరియాలోని భారతీయ రాయబారి శ్రీప్రియ రంగనాథన్.
చవకకే..
భారతీయులు ఇలా ఏకబిగిన కొరియన్ డ్రామాలను చూడడం వల్ల నెట్‌ఫ్లిక్స్ వ్యూయర్‌షిప్ 2019తో పోలిస్తే 2020లో ఏకంగా 370 శాతం పెరిగిందని తేలింది.. యూరోమానిటర్ సర్వేలో! దీంతో మన దగ్గర కొరియన్ డ్రామాలకున్న క్రేజ్, డిమాండ్ మిగిలిన ఓటీటీ చానెల్స్‌కూ అర్థౖమైపోయింది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి జీ గ్రూప్ శాటిలైట్ ప్రొవైడర్ డిష్ టీవీ హిందీలోకి డబ్ అయిన కొరియన్ డ్రామాలను అతి చవక (రూ. 1.3.. అంటే ఒక సెంట్ కన్నా తక్కువ) ప్యాకేజీకే స్ట్రీమ్ చేయడం మొదలుపెట్టింది. ఎమ్‌ఎక్స్ ప్లేయర్ (ఓటీటీ ప్లాట్‌ఫామ్) అయితే ఇంకో అడుగు ముందుకేసి హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోకి అనువదించిన కొరియన్ డ్రామాలను స్ట్రీమ్ చేస్తోంది. ఈ ప్రయత్నం ఇక్కడి ఔత్సాహిక కంటెంట్ రైటర్స్‌కూ అవకాశాలను పెంచి మంచి ఆదాయ మార్గాన్ని చూపిస్తోంది.
బిజినెస్ బూమ్
ఇదిగో ఇలా కొరియన్ డ్రామా రేకెత్తించిన కుతూహలం, జిజ్ఞాస మన మార్కెట్‌లో కొరియన్ కంపెనీలకు కాసుల పంట కురిపిస్తోంది. ‘అందేంటీ.. కొరియన్ ఉత్పత్తులు మనకేం కొత్త కాదే. సామ్‌సంగ్, ఎల్‌జీ, కియా మోటార్స్, లాటీ, హ్యూండైలాంటి 20కి పైగా కొరియన్ కంపెనీలే కదా మన మార్కెట్‌ను ఏలుతున్నది! అవన్నీ దాదాపుగా 17.45 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్నాయని మన ప్రభుత్వమే లెక్కలు చెప్తోంది! పైగా 2010లో మనకు, దక్షిణ కొరియాకు మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కూడా కుదిరింది.
దానిప్రకారం ఎలాంటి పన్ను లేకుండానే మనం దక్షిణ కొరియా ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటున్నాం’ అంటారా?! నిజమే.. అదేం కొత్త విషయం కాదు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్‌తో మన దగ్గర వ్యాపారం పెంచుకున్న .. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన కొరియన్ కంపెనీలే ఇక్కడ విషయం.. విశేషమూనూ. కే మోజు కొరియన్ తిండి, సోజూ( ్జౌu.. ఆల్కహాల్), బట్టలు, నగలు, బ్యూటీ ప్రొడక్ట్, కొరియన్ టూరిజం ఆఖరుకు కొరియన్ భాష, కొరియన్ కల్చర్ వరకూ సాగి.. కొరియన్ బ్రాండ్స్ డిమాండ్‌ను పెంచుతున్నాయి. నూడుల్స్ అమ్మే దక్షిణ కొరియా కంపెనీ నాన్షిన్ బ్రాండ్.. 2020లో మిలియన్ డాలర్ల అమ్మకాలు చేసింది.
మీకో విషయం తెలుసా.. 2020 కన్నా 2021లో మనం 178 శాతం అధికంగా కొరియన్ ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను వినియోగిం చామని యూరోమానిటర్ ఇంటర్నేషనల్ అంచనా. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ‘ఐల్ ఆఫ్ స్కిన్’ అనే కొరియన్ బ్యూటీ బ్రాండ్‌ను లాంచ్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి కే మేనియాను. ఇలా ఇన్నిస్‌ఫ్రీ, లనేజ్ ( ్చn్ఛజీజ్ఛ), ఎట్యూడ్ (్ఛ్టuఛ్ఛీ), స్లవషూ (టu ఠీజ్చిటౌౌ) వంటి దక్షిణ కొరియా బ్రాండ్స్‌కి, ది ఫేస్ షాప్ లాంటి ఆన్‌లైన్ స్టోర్స్‌కి భలే గిరాకీ మొదలైంది. ఇక్కడి కే క్రేజ్ వల్ల అమెజాన్‌లో కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ సేల్స్ ఇదివరకంటే మూడున్నర రెట్లు పెరిగాయని తెలిపింది అమెజాన్ సంస్థ ఒక ఇంటర్వ్యూలో. అయితే ఇప్పుడు దీన్ని క్యాచ్ చేసుకోవడానికి భారతీయ ఔత్సాహిక పారిశ్రామిక సంస్థలూ పోటీ పడుతున్నాయి. ఆ మేరకు మన మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిట్లోనూ వాటి ఔట్‌లెట్స్ వచ్చేశాయి. హైదరాబాద్‌లోనూ ఉన్నాయి.
భాష మీదా..
పరాయి భాష మరీ ముఖ్యంగా ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మనీ వంటి భాషలను నేర్చుకుంటున్నారు అంటే ఆయా దేశాల్లో చదువు, ఉద్యోగాల నిమిత్తమే అని చెప్పకనే అర్థమైపోతుంది. ఏ భాషనైనా దాని మీద అభిమానంతో నేర్చుకోవడమనేది అరుదే. కొరియన్ ఆ కోవలోకే వస్తుంది. కే డ్రామా మీద వీక్షకులకున్న అభిమానం ఆ భాష నేర్చుకునేలా ప్రోత్సహిస్తోంది. వారి సంఖ్యను పెంచుతోంది. ఫలితంగా దేశంలోని ప్రధాన నగరాలన్నిట్లో కొరియన్ భాషను నేర్పే ఇన్‌స్టిట్యూట్స్ వెలిశాయి.సెంట్రల్ సిలబస్‌ను బోధిస్తున్న అన్ని స్కూళ్లల్లో.. ఎనిమిదవ ఫారిన్ లాంగ్వేజ్‌గా కొరియన్‌ను బోధించాలని కేంద్రప్రభుత్వం 2020లో కొత్త విధానాన్నీ తీసుకువచ్చింది.
‘తమ కొరియన్ అభిమాన నటీనటులు, గాయనీగాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఏం పాడుతున్నారు అని ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో కాకుండా నేరుగానే తెలుసుకోవాలనుకుంటున్నారు వీక్షకులు. ఇంకా చెప్పాలంటే కొరియన్ భాష మీద ఆపేక్షను పెంచుకుంటున్నారు. తద్వారా ఆ దేశంతో ప్రత్యక్షానుబం«ధాన్ని కోరుకుంటున్నారు’ అని చెబుతారు తమిళనాడులోని ఇండో– కొరియన్ కల్చరల్ అండ్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్‌కు హెడ్‌గా పనిచేస్తున్న రతి జాఫర్.
ఫ్యాన్ క్లబ్స్..
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్సేకే కాదు కే డ్రామా, కే పాప్‌కీ మన దగ్గర ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకుంటే చాలు. ఆ క్లబ్‌లు ఎక్కడో డెహ్రాడూన్, అహ్మదాబాద్, పట్నా, ముంబై, పుణే, నాగపూర్‌లలోనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో కూడా వెలిశాయి. ఇవి తమ అభిమాన కొరియన్ నటీనటులు, కొరియన్ పాప్ సింగర్స్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటాయి.
ముంబైలోని కే పాప్ ఫ్యాన్ క్లబ్ .. 2021, మార్చి 24న బీటీఎస్ బ్యాండ్‌లోని ఓ మెంబర్ బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసింది. నిధులను సమీకరించి.. ముంబై శివారు ప్రాంతమైన ములుండ్‌లోని ఓ బస్ షెల్టర్‌ను వారం పాటు అద్దెకు తీసుకుని దాన్నిండా జియాన్ జంగ్‌కూక్ పోస్టర్లను అతికించి వీరాభిమానాన్ని చాటుకుంది. ఇదంతా గమనించిన కొరియన్ కల్చరల్ సెంటర్ (ఢిల్లీ).. క్రమం తప్పకుండా కే పాప్, డాన్స్ పోటీలను నిర్వహించేలా ఈ ఫ్యాన్ క్లబ్స్‌కు సహకారమందిస్తోంది. ఈ పోటీల్లో ఎవరైతే తమ అభిమాన గాయనీగాయకుల గాత్రాన్ని, డాన్స్‌ను, వస్త్రధారణను అనుకరిస్తారో వారికే ట్రోఫీలను అందించడం విశేషం.
2021లోనే చెన్నైలోని కొరియన్ కాన్సులేట్ అక్కడ అమ్మాయిలకు కే పాప్ డాన్స్ పోటీలను నిర్వహించి అయిదుగురు విజేతలను ఎంపిక చేసుకుని వాళ్లతో ‘డ్రీమ్ కే పాప్’ అనే బాండ్‌ను ఏర్పాటు చేసింది. ఈ బాండ్ కే డాన్స్‌లో శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. అలాగే పాపులర్ కే పాప్ సాంగ్స్‌ను తమ యూ ట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేస్తూంటుంది.
ఇక్కడ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను చేపట్టే దిశగా కొరియన్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ టూరిజం, ఫారిన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖలు యోచిస్తున్నాయట. ఇలా కే డ్రామా.. కే పాప్ వినోదాన్ని పంచుతూ మన వీక్షకుల, ప్రేక్షకుల మనసు దోచేస్తోంది. ఆ అభిమానాన్ని తన వ్యాపారానికి అనుగుణంగా మలచుకుంటోంది. ‘కే డ్రామా.. కే పాప్ మీద ఇండియన్స్ ప్రేమ ఇలాగే పెరిగి.. పెరిగి అది కే ఫుడ్, బ్యూటీ ఇంకా ఇతర కొరియన్ ప్రొడక్ట్స్‌కి ఇండియన్ మార్కెట్‌లో డిమాండ్‌ను పదింతలు చేయాలని కోరుకుంటున్నాం’ అంటాడు కొరియాలోని యూరోమానిటర్ కన్సల్టెంట్ సన్నీ మూన్. అదన్న మాట కే మేనియా ఫలితం!!
పట్టించుకోకపోయినా..
చిత్రమేంటంటే అటు కొరియన్ డ్రామాలు కానీ.. ఇటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ కానీ 60 ఏళ్ల పైబడిన వాళ్లను పట్టించుకోవడం లేదు. ఆ డ్రామాల్లోని కంటెంట్ సీనియర్ సిటిజన్స్‌ను భాగస్వాములుగా చేసుకోవడం లేదు. ఇటు ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వీళ్ల కోసం కంటెంట్‌ను జనరేట్ చేయడంలేదు. అయినా.. ఆ పెద్దవాళ్లు సారీ.. ఆ సెకండ్ యూత్ .. ఓటీటీలోని ఈ కొరియన్ డ్రామాలను కన్నార్పకుండా చూస్తున్నారు. టైమ్ తెలియకుండా అందులో మునిగిపోతున్నారు. ముఖ్యంగా 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కులు. అంతేకాదు కొరియన్ భాషా పదాలను నేర్చుకుని.. ఉపయోగిస్తున్నారు.
‘అన్యొహసేవ్ (హలో)’ అంటూ ఫోన్లలో, మెసేజెస్‌లో సంభాషణలు కావిస్తున్నారు. ముంబైకి చెందిన 67 ఏళ్ల సీఎస్ మణి ఇప్పటి వరకు 70కి పైగా కొరియన్ డ్రామాలను వీక్షించాడు. వాటి ద్వారా దాదాపు 60 కొరియన్ నుడికారాలను నేర్చుకున్నాడు. ఆ డ్రామాలు కలిగించిన ఆసక్తితో సియోల్ గురించి తెలుసుకున్నాడు. ‘సియోల్‌లో లక్షా డెబ్బయి ఐదువేల సీసీ కెమెరాలు ఉంటాయి తెలుసా! అక్కడ ఇంటర్‌నెట్ చాలా ఫాస్ట్. ప్రతి కారులో కెమెరా ఉండాల్సిందే. కొరియన్స్ భోజనప్రియులు. ఆల్కహాల్ ఫ్రీక్స్ కూడా’ అంటూ ఉత్సహంగా చెబుతుంటాడు.
హాల్యూ.. ఓటీటీ ద్వారా మనకు ఇన్‌ఫెక్ట్ అయ్యేకంటే ముందే భారతీయ చిత్రసీమను ఎఫెక్ట్ చేసింది. హాలీవుడ్ ఎట్‌సెట్రా రంగాల్లోని చిత్రాలు మన మీద ప్రభావం చూపినట్టే.. కొరియన్ చిత్రసీమా మన మీద ప్రభావం చూపింది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్.. టాలీవుడ్ దాకా చాలా వుడ్‌లలో కొరియన్ స్ఫూర్తి చిత్రాలు మన వెండి తెర మీద వెలుగు చూశాయి. తెలుగులో ‘అబ్బ.. భలే సినిమా’ అనిపించుకున్న ‘ఓ బేబీ’.. కొరియన్ ‘మిస్ గ్రానీ’కి రీ మేడ్. ఇలా తమిళంలోనూ కొన్ని కొరియన్ సినిమాలు రీమేడ్ అయ్యాయి. బాలీవుడ్‌లోనైతే ఆ జాబితా పదుల సంఖ్యలో ఉంది.
నిన్నటి ‘ధమాకా’ .. ‘ది టెర్రర్ లైవ్’, ‘రాధే’.. ‘ది అవుట్ లాస్’, అమితాబ్ బచ్చన్, విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ‘తీన్’.. ‘మాంటేజ్’, ప్రియాంక చోప్రా, రణ్‌బీర్ కపూర్, ఇలియానా సూపర్ హిట్ ‘బర్ఫీ’.. ‘లవర్స్ కన్సర్టో’, రితేశ్ దేశ్‌ముఖ్, శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా హిట్ ‘ఏక్ విలన్’.. ‘ఐ సా ది డెవిల్’కి రీమేడ్‌లే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ పెద్దదే! ఈ ప్రేరణ కథను చూసి సాక్షాత్తు కొరియన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లోని పెద్దలే వచ్చి మన దగ్గర చిత్రనిర్మాణం చేపడుతు న్నారు. అతియోశక్తి కాదు.. నిజం!
బెంగళూరులో నివాసముంటున్న మూన్ అనే అమ్మాయి (18) మంచి డాన్సర్. తన ఇంట్లోనే కే పాప్ సాంగ్స్ మీద డాన్స్‌ను షూట్ చేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూంటుంది. ఈ పోస్ట్‌లకు 86,700 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోయింగ్‌ను గమనించిన ఫ్లిప్‌కార్ట్ ఆమెను తమ మార్కెటింగ్ ప్రొడక్ట్స్‌కి మోడల్‌గా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment