సల్లంగ బతుకమ్మ
దేశంలో అనేక పండుగలు - పర్వాలు కొద్దిపాటి తేడాతో అనేకచోట్ల జరుగుతాయి. కాని తెలంగాణ ప్రాంత ఆత్మను ప్రకటించే పండుగ బతుకమ్మ. జనసామాన్యంలో నుండి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ ఇది. ‘జీవించు-బ్రతికించు’. అన్నదే ఈ బతుకమ్మ అర్థం. అదే తెలంగాణ సంస్కృతికి ఆయువుపట్టుగా నిలిచింది. అన్యోన్య అనురాగం, ప్రేమించే తత్త్వం తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉందంటే ఆ మూలసూత్రం బతుకమ్మలో కన్పిస్తుంది.
బతుకమ్మ పండుగ... చారిత్రక ఆధారం... తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయరాజు ‘గుండన’ పొలం దున్నుతుండగా గుమ్మడి తోటలో ఓ స్త్రీ దేవతా విగ్రహం లభించింది. గుమ్మడిని సంస్కృతంలో ‘కాకతి’ అని పిలుస్తారు. గుమ్మడి తోటలో లభించినందువల్ల ‘కాకతమ్మ’ అనే పేరుతో రాజులు ఆమెను పూజించారు. కాకతి విగ్రహాన్ని రాజవంశమే కాదు ఈ ప్రాంత ప్రజలంతా పూజించడం మొదలుపెట్టారు. రాను రాను విగ్రహం కన్నా, విగ్రహం ముందు (విగ్రహం మునిగేటట్టుగా) పూలకుప్పలు పోసి ఆ కుప్పను పూజించడం మొదలుపెట్టారు. ఆ పూలకుప్పే దేవతాస్వరూపంగా మారిపోయింది. కాకతమ్మ శబ్దమే కాలక్రమంలో ‘బతుకమ్మ’గా మారి ఉండొచ్చన్నది పరిశోధకుల మాట. కాకతీయులకు శక్తి, పరాక్రమాలందించిన ఈ దేవతను మాతృస్వరూపిణిగా ఆరాధించి అటు శక్తితత్వాన్ని, ఇటు మాతృదేవతారాధనను వారు స్థిరీకరించారు. ఆమే అందరికీ బతుకనిచ్చే తల్లిగా మారడం చారిత్రక పరిణామం.
ఇంకో జానపదగాథ బతుకమ్మ చుట్టూ తిరుగుతున్నది. భట్టు నరసింహకవి రచించిన పాటే ఈ బతుకమ్మ పేరుకు ఆధారంగా ఉంది.
ధర్మాంగదుడనే చోళరాజు, సత్యవతి దంపతులు ఎన్నో నోములు నోచి కుమారులను కన్నారు. కాని ఏదో కారణంతో వారంతా చనిపోయారు. సత్యవతి మళ్లీ ఎన్నో పూజలు చేయగా సాక్షాత్తూ ‘లక్ష్మీదేవి’యే అనుగ్రహించి నీ కూతురుగా వస్తానన్నదట. పుట్టిన బిడ్డను ఆశీర్వదించడానికి దేవాధిదేవతలు, మహర్షులు వచ్చి
‘బ్రతుకగనె ఈ తల్లి ఉయ్యాలో
బ్రతుకమ్మ అనిరంత ఉయ్యాలో’’ అని ఆమెకు ‘బతుకమ్మ’ అని నామకరణం చేశారని ధర్మాంగదుని జానపదగాథ తెల్పుతుంది.
బతుకమ్మ ఏ దేవి స్వరూపం?
శ్రీలక్ష్మీ నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ...అనే పాట బతుకమ్మను త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ, లక్ష్మీ, గౌరీ స్వరూపంగా తెలియజేస్తుంది. బతుకమ్మకు సంబంధించి ఎలాంటి పౌరాణిక ఆధారాలు, శ్లోకాలు దొరకవు కాబట్టి బతుకమ్మ పాటలే మనకు ఆధారం. మొత్తానికి బతుకమ్మ కాకతీయుల కాలం నుండే ఆవిర్భవించినట్లు ఒక నిర్ధారణకు రావచ్చు. అలాగే కాకతీయుల సేనాని అయిన జాయప సేనాని రచించిన ‘నృత్తరత్నావళి’ లోని ఒక చిందు (దరువు) ‘బతుకమ్మ ఆట’కు మూలం అని కూడా పరిశోధకుల అభిప్రాయం.
బతుకమ్మ సందేశం...
ప్రకృతి నుండి సేకరించిన పూలను ఉపయోగించి దేవతగా సిద్ధం చేసే బతుకమ్మ ఆరాధన విశిష్టమైంది. ఇది నిరాకార నిర్గుణ ఆరాధనగా చెప్పవచ్చు. మట్టి నుండి పుట్టిన చెట్టు, ఆ చెట్టు నుండి వచ్చే పూలు మళ్ళీ నీటిలో కలిసిపోయి మట్టిగా మారినట్లే జీవులన్నీ ఎక్కడినుండి పుడతాయో భోగాలను అనుభవించి అక్కడికే చేరతాయి అన్న అధ్యాత్మ, తాత్విక సందేశం ఈ పండుగ మనకు ఇస్తుంది. ఎన్నో రకాల పూలు ఒకటిన ఒకటి కూర్పబడి అందంగా బతుకమ్మ నిర్మాణం అవుతుంది. అలాగే ఎన్నో కులాల, వర్గాల మనుషులు కలిసిమెలిసి అందమైన సమాజంగా మారాలనే సామాజిక సందేశం ఈ పండుగలో కన్పిస్తుంది. వర్ష ఋతువు సమాప్తమై శరదృతువు ప్రారంభం అయ్యే సూచనను బతుకమ్మ ఇస్తుంది.
బతుకమ్మ ఉత్సవంలో ఆటపాటలకు చాలా ప్రాధాన్యం ఉంది. ‘బతుకమ్మ ఆట’ అని ఈ నృత్యానికి పేరు. గ్రామాల్లో ఏ ఉత్సవమైనా, ఏ ఊరేగింపు అయినా ‘బతుకమ్మ ఆట’ (నృత్యం) చేస్తూ ఆ సందర్భానికి అనుగుణంగా పాడతారు. అంతగా చొచ్చుకుపోయింది ఈ ఆట - పాట. మొదటి బతుకమ్మను-
‘ఒక్కేసి పువ్వేసి చందమామ
ఒక్క ఝామాయె చందమామ
శివుడింక రాడాయే చందమామ
శివపూజ యాల్లాయె చందమామ’ అని పాడుతూ 9వ రోజున
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అని ముగిస్తారు. మధ్య మధ్యలో సందర్భానికి తగినట్లు పాటలుంటాయి. ఈ పాటలు ‘ఉయ్యాల పాటలు’గా బతుకమ్మ పాటలుగా ఎన్నో రూపాలను సంతరించుకొన్నాయి.
బతుకమ్మ స్త్రీల పండుగ. బతుకమ్మ కన్నా ముందు ‘బొడ్డెమ్మ’ ఆడటం యువతులకు అలవాటు. ‘బోణి’ అంటే స్త్రీ శ్రీమూర్తిని స్త్రీమూర్తులు ఆరాధించే ఈ పండుగలో స్త్రీల కళానైపుణ్యం, సహజీవనతత్వం, ప్రకృతి తాదాత్మ్యం కనిపిస్తాయి. అందరినీ బతుకమనీ, అందరికీ బ్రతుకునివ్వమనీ కోరుకొనే తెలంగాణ సాంస్కృతిక మహోత్సవం ‘మన బతుకమ్మ’.
-డా॥పి. భాస్కరయోగి
రోజుకో రూపం... రూపానికో నైవేద్యం
మొదటిరోజు: ‘ఎంగిలిపూల బతుకమ్మ’
నైవేద్యం: తులసి ఆకులు, వక్కలు.
రెండవరోజు: ‘అటుకుల బతుకమ్మ’
నైవేద్యం: సప్పిడిపప్పు, బెల్లం, అటుకులు
మూడవరోజు: ‘ముద్దపప్పు బతుకమ్మ’
నైవేద్యం: ముద్దపప్పు, బెల్లం, పాలు
నాల్గవరోజు: ‘నానబియ్యం బతుకమ్మ’
నైవేద్యం: నానేసిన బియ్యం, పాలు, బెల్లం
అయిదోరోజు: ‘అట్ల బతుకమ్మ’.
నైవేద్యం: అట్లు (దోసెలు)
ఆరోరోజు: ‘అలిగిన బతుకమ్మ’
నైవేద్యం: ఈ రోజు బతుకమ్మ ఆడరు.
ఏడోరోజు: ‘వేపకాయల బతుకమ్మ’
నైవేద్యం: సకినాల పిండిని వేపకాయల్లా చేసినూనెలో వేస్తారు.
ఎనిమిదోరోజు: ‘వెన్నముద్దల బతుకమ్మ’
నైవేద్యం: నువ్వులు, వెన్న ముద్ద, బెల్లం
చివరిరోజు: సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ.
నైవేద్యం: పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వుపొడి.