పాత వస్త్రాలే పెళ్ళికానుక
సంస్కృతి
పెళ్లి పేరు చెప్పగానే ముందుగా తలపుకొచ్చేవి కట్నకానుకలు. ఇక్కడ భారీ అలంకరణతో కనిపిస్తున్న గిరిజన మహిళను చూశారుగా...ఆమె పెళ్లికి ఆమెకిచ్చిన కట్నం ఆ అలంకరణ మాత్రమే. అవును... ఆ అలంకరణనకు ఉన్న ప్రత్యేకత అలాంటిది. వందల సంవత్సరాల నుంచి వారసత్వంగా వస్తున్న ఆ వస్తువులే అక్కడి అమ్మాయిలకిచ్చే ఆస్తిపాస్తులు.
అలంకరణ వస్తువులొక్కటే కాదు వస్త్రాలు కూడా వారసత్వంగా వస్తాయి. పెళ్లనగానే కొత్త బట్టలు, కొత్త వస్తువులు ఉంటాయని తెలుసు మనకి. కాని ‘డ్రోక్పా’ తెగ గిరిజనులు మాత్రం దీనికి భిన్నంగా ఏళ్లనాటి పాతవస్త్రాలకు, వస్తువులకే ప్రాధాన్యం ఇస్తారు.
భారత్- పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం జమ్మూ కాశ్మీర్ దగ్గర ధహను లోయల్లో నివసించే ‘డ్రోక్పా’ తెగకు చెందిన గిరిజనులు పాటించే సంప్రదాయమిది. ఆ లోయలో ఉన్న మూడు గ్రామాల్లో 2,500మంది డ్రోక్పా తెగవారు ఇప్పటికీ వారి సంప్రదాయాలను తు.చ తప్పకుండా పాటిస్తున్నారు. తమ సొంత తెగవారిని మాత్రమే పెళ్లాడే ఈ గిరిజనులు పెళ్లప్పుడు పెళ్లికూతురుని తయారుచేయడమొక్కటే పెద్దపనిగా భావిస్తారు.
ఒంటినిండా రకరకాల ఆభరణాలతో అమ్మాయిని అలంకరిస్తారు. రెండు మూడు వందల ఏళ్లనాటి అలంకరణ వస్తువులు వారి దగ్గర భద్రంగా ఉంటాయట! వాటితో నిండుగా పెళ్లికూతురికి అలంకరణ చేశాక తలపై ప్రత్యేకమైన పూలముస్తాబు చేస్తారు.
అడవి మొత్తం తిరిగి ప్రత్యేకంగా ఉండే పూలను సేకరించి పెళ్లికూతురు, పెళ్లికొడుకు తలపై పూలగుత్తులు విరబూసినట్టు అలంకరిస్తారు. ఆ సమయంలో మిగతావారి ముస్తాబు కూడా భారీగా ఉంటుంది. ఈ తెగకున్న మరో ప్రత్యేకత... వీరి పూర్వీకులు కొందరు అలెగ్జ్జాండర్ సైన్యంలో పనిచేశారట. ఇప్పటికీ ఈ విషయాన్ని వారు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.