లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు విస్తృతంగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఇదే సమయంలో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. ఇదేవిధంగా ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ముద్రితమైన ఓ పెళ్లి కార్డు ఇప్పుడు వార్తల్లో నిలిచింది.
యూపీలోని అలీఘర్‌లో త్వరలో ఓ ఇంట వివాహ వేడుక జరగనుంది. ఇందుకోసం వారు ముద్రించిన పెళ్లి కార్డు అతిథులకు ఓటు హక్కు విలువను తెలియజేస్తోంది. సాధారణంగా పెళ్లిలో వధూవరులు అగ్ని సాక్షిగా ఏడడుగులు వేస్తారు. అయితే ఈ కార్డులో ఎనిమిదో అడుగు ప్రస్తావన కూడా ఉంది.
అలీఘర్‌కు చెందిన అంకిత్, సుగంధిల వివాహం ఏప్రిల్ 21 న జరగనుంది. అంకిత్ తండ్రి ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించేందుకు వినూత్న రీతిలో పెళ్లి కార్డు ముద్రింపజేశారు. అంకిత్ తండ్రి కాళీచరణ్ వృత్తిరీత్యా బేకరీ వ్యాపారి. ఆయన తన కుమారుని పెళ్లి శుభలేఖలో ‘ఓటు వేసే రోజున మీ పనులన్నీ పక్కన పెట్టి ఓటు వేయండి. దేశాన్ని ఉద్ధరించేవాడిని ఎన్నుకోండి’ అని రాశారు.
పెళ్లిలో నూతన దంపతులు సాధారణంగా ఏడడుగులు వేస్తారని, అయితే భరత మాత సాక్షిగా పెళ్లి జంటతోపాటు అతిథులంతా ఎనిమిదో అడుగు వేయాలని, అది ఓటు వేసేందుకు చేసే ప్రమాణం లాంటిదని పేర్కొన్నారు. ఓటర్లను చైతన్యపరిచేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కాళీచరణ్ పేర్కొన్నారు. అలీఘర్‌లో ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment