దేశంలో ఎన్నికల పండుగ జరుగుతోంది. ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ఓటు కోసం ఓటరు దేవుళ్లను వేడుకుంటున్నారు. అదేసమయంలో ఎన్నికల సంఘంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు ఓటు విలువపై అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్థానిక స్వచ్ఛంద సంస్థలు, దుకాణాలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి.
మే 13న ఇండోర్‌లో ఓటింగ్ జరగనుంది. ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహం అందించేందుకు స్థానిక ఫుడ్ మార్కెట్‌లలో ప్రత్యేక రాయితీలు అందిస్తున్నారు. మరోవైపు వేసవిని దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు ఉపశమనం కలిగించేలా ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు.
ఓటింగ్ జరిగే రోజున ఓటర్లకు ఉచితంగా ఐస్ క్రీం, పోహా, జలేబీ, శీతల పానీయాలు, ఇతర తినుబండారాలు అందించనున్నారు. ఈ ఆఫర్‌లలో వివిధ కేటగిరీలు, ఎంపికలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం వివిధ దుకాణాలకు ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. అయితే ఓటర్లు ఈ విధమైన ప్రయోజనం పొందేందుకు తమ ఓటరు కార్డుతో పాటు వారి వేలిపై ఇంక్ గుర్తును చూపించాల్సి ఉంటుంది.
అంతే కాదు తొలిసారి ఓటు వేయబోతున్న యువతకు ప్రత్యేక ఆఫర్‌ను కూడా ప్రకటించారు. పోలింగ్ జరిగే రోజున ఉదయం 9 గంటలలోపు ఓటు వేసే యువత, సీనియర్ సిటిజన్లకు పోహా, జిలేబీ, ఐస్ క్రీంలను ఉచితంగా అందించనున్నారు. అలాగే మంచూరియా, నూడుల్స్ కూడా ఉచితంగా అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఇండోర్‌లోని కొన్ని షాపింగ్ మాల్స్‌లో పోలింగ్ జరిగే రోజున పలు వస్తువులపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment