న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్‌సభలో ఏకంగా 280 మంది ఎంపీలు మొదటిసారిగా దిగువసభకు ఎన్నికైన వారున్నారు. ఇందులో మాజీ సీఎంలు, సినీ తారలు, వారసులు, హైకోర్టు మాజీ జడ్డి తదితరులున్నారు. అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ నుంచి ఏకంగా 45 కొత్తముఖాలు కనిపించునున్నాయి. వీరిలో టీవీ రాముడు అరుణ్ గోవిల్, జెయింట్ కిల్లర్ కిశోరీలాల్ శర్మ, దళిత హక్కుల ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ తదితరులున్నారు.
మహారాష్ట్రలో 48 స్థానాలుండగా 33 మంది తొలిసారిగా ఎంపీలుగా గెలిచారు. స్కూల్ టీచర్ భాస్కర్ భాగ్రే ఎన్సీపీ (పవార్) తరఫున ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం డిండోరి నుంచి గెలుపొందారు. పీయూష్ గోయల్ కూడా లోక్‌సభకు రావడం ఇదే తొలిసారి.
మాజీ ముఖ్యమంత్రులు నారాయణ్ రాణే (మహారాష్ట్ర), త్రివేంద్ర సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), మనోహర్‌లాల్ ఖట్టర్ (హరియాణా), బిప్లవ్‌కుమార్ దేవ్ (త్రిపుర), జితిన్‌రామ్ మాంఝి (బిహార్), బస్వరాజ బొమ్మై (కర్నాటక), జగదీశ్ షెట్టర్ (కర్నాటక), చరణ్‌జిత్ సింగ్ చన్నీ (పంజాబ్)లు తొలిసారిగా దిగువసభలో అడుగుపెట్టనున్నారు.
సినీ తారల్లో సురేష్ గోపి (త్రిసూర్), కంగనా రనౌత్ (మండి)లు తొలిసారి నెగ్గినవారే. రాజకుటుంబీకుల్లో ఛత్రపతి సాహు (కొల్హాపూర్), యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ (మైసూర్), కీర్తి దేవి దేవ్‌బర్మన్ (త్రిపుర ఈస్ట్)లు, ఎన్నికలకు ముందు హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసి బీజేపీ టికెట్‌పై పశి్చమబెంగాల్‌లోని తమ్లుక్ నుంచి పోటీ చేసిన గెలిచిన అభిజిత్ గంగోపాధ్యాయ్‌లు మొదటిసారి ఎంపీలుగా గెలిచిన వారే.
ముస్లిం ఎంపీలు 24 మంది
నూతన లోక్‌సభకు 24 మంది ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ (టీఎంసీ), అసదుద్దీన్ ఓవైసీ, అస్సాంలో 10 లక్షల పైచిలుకు మెజారిటీతో నెగ్గిన కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్‌లు ఉన్నారు. ఈసారి మొత్తం 78 మంది ముస్లిం అభ్యర్థులు పోటీచేయగా 24 మంది గెలిచారు. కిందటి లోక్‌సభలో 26 మంది ముస్లిం ఎంపీలు ఉండగా.. ఈసారి వారి సంఖ్య రెండు తగ్గింది. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా ఏడుగురు ముస్లిం ఎంపీలు ఎన్నికకాగా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు, సమాజ్‌వాది నుంచి నలుగురు, ఇండియన్ ముస్లిం లీగ్ నుంచి ముగ్గురు ముస్లింలు ఎంపీలుగా గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment