హోరాహోరీగా సాగిన లోక్‌సభ ఎన్నికల్లో పలు అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. కొన్ని చోట్ల ప్రత్యర్థులు.. సీనియర్టీ, డబ్బు, పలుకుబడి, కుల సమీకరణాల అనుకూలతలతో బరిలో నిలిచారు. అయితే వాటన్నింటికి భయపడకుండా.. తీవ్రమైన ప్రతికూలతలను సైతం ఎదుర్కొని కొందరు ఈ లోక్ సభ ఎన్నికల్లో గెలిచి వార్తల్లో నిలిచారు.
ఇలా గెలిచిన వారిలో తక్కువ, అధిక వయసు ఉన్న అభ్యర్థులు, తక్కువ మెజార్టితో గెలుపొందినవారున్నారు. అదీకాక జైలులో ఉండి మరీ విజయం సాధించిన అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ మైనార్టీ ముస్లిం మహిళ గెలుపొందింది. ఇలా ఓ ముస్లిం మహిళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఒడిశా చరిత్రలో తొలిసారి కావటం గమనార్హం.
అతి తక్కువ మెజార్టీతో గెలుపు
ఎన్నికల్లో కొన్నిసార్లు ఒక్క ఓటు కూడా అభ్యర్థి గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) వర్సెస్ శివసేన (సీఎం ఏక్‌నాథ్ షిండే) నేతృత్వంలోని పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఇద్దరి మధ్య గెలుపు దోబూచులాడింది. చివరికి 48 ఓట్ల అతితక్కువ మెజారిటీతో శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారాం వాయ్‌కర్ తన సమీప ప్రత్యర్థి అమోల్ కీర్తికర్‌పై గెలుపొందారు. వాయ్‌కర్‌కు 4,52,644 ఓట్లు లభించగా అమోల్‌కు 4,52,596 ఓట్లు లభించాయి. ఇక.. కేరళలోని అత్తింగల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాశ్ కేవలం 684 ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. రాజస్తాన్‌లోని జైపూర్ రూరల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రావు రాజేంద్ర సింగ్ 1,615 ఓట్ల తేడాతో గెలిచారు.
అత్యంత పిన్న వయసు, అత్యంత వృద్ధుడు గెలుపు
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులుగా కౌశంబీ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పుష్పేంద్ర సరోజ్, మచిలీషహర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రియా సరోజ్ విజయం సాధించారు. వారిద్దరి వయసు 25 ఏళ్లే కావడం విశేషం. వీరిద్దరే ఈసారి అత్యంత పిన్నవయస్కులైన ఎంపీలుగా రికార్డు సృష్టించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి టి.ఆర్.బాలు సులువుగా నెగ్గారు. 82 ఏళ్ల టి.ఆర్.బాలు ఈ ఎన్నికల్లో అత్యంత వృద్ధుడైన ఎంపీగా రికార్డుకెక్కారు.
దాతల సాయంతో గెలుపు
లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలంటే ప్రజాభిమానం, పార్టీ మద్దతుతో పాటు డబ్బు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యర్థులకు ధీటుగా కాకపోయిన ఎన్నికల ప్రచారానికైనా లక్షల్లో డబ్బులు ఖర్చు చేయాల్సిందే. అయితే గుజురాత్‌లో మాత్రం ఓ అభ్యర్థికి దాతలు ముందుకువచ్చి క్రౌడ్ సోర్సింగ్ ద్వారా నిధులను సేకరించారు. గుజరాత్ బనస్కాంతా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెనిబెన్ థాకూర్ గెలుపొందారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హవా నడిచిన గుజరాత్‌లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సీటు ఇదే.
జైలులో నుంచే గెలుపు
లోక్ సభ ఎన్నికల్లో ఓ ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఏకంగా జైలులో ఉండి మరీ.. ప్రజల మద్దతు, అభిమానంలో విజయం సాధించారు. అందులో సిక్కు వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని కాదూర్ సాహిబ్ స్థానం నుంచి గెలుపొందారు. ఉగ్రవాదలకు నిధులు సమకూరుస్తున్నారనే కేసులో ఆయన అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
ఇక.. మరో అభ్యర్థి జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లాలో ఇంజనీర్ రషీద్ కూడా జైలులో ఉండి ఎన్నకల్లో ఎంపీగా విజయం సాధించారు. ఇంజనీర్ రషీద్ 2019 నుంచి తిహార్ జైలులో ఉన్నారు. ఆయనపై ఉగ్రవాదులకు నిధలు సేకరిస్తున్నరనే ఆరోపణలపై కేసు నమోందైంది. ఇక.. వీరి ప్రమాణస్వీకారంపై చర్చ జరుగుతోంది.
ఒడిశా చరిత్రలో తొలి ముస్లిం మహిళ గెలుపు
ఒడిశాలో బీజేపీ 78 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. బీజేడీ 51 స్థానాల్లో గెలుపొంది అధికారం కోల్పోయింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో గెలిచి మూడో స్థానానికి పరిమిమైంది. అయితే కాంగ్రె పార్టీ తరఫున బారాబతి-కటక్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో సోఫియా ఫిర్దౌస్ అనే ముస్లిం మహిళా అభ్యర్థి విజయం సాధించారు. ఒడిశాలో చరిత్రలో ఓ ముస్లిం మహిళ ఎమ్యెల్యేగా విజయం సాధించటం ఇదే తొలిసారి.
Comments
Please login to add a commentAdd a comment