నీటి వనరులు పరిమితంగా ఉన్న మెట్ట ప్రాంతంలోనూ మంచినీటి చెరువుల్లో ముత్యాల పెంపకంతో మంచి ఆదాయం గడించవచ్చని మహారాష్ట్రలోని మరఠ్వాడా రైతులు నిరూపిస్తున్నారు. ఔరంగాబాద్ పరిసర ప్రాంతాల్లో గత 10–15 ఏళ్లుగా మంచినీటిలో ముత్యాల సాగు పుంజుకుంటున్నది. కరువు ప్రాంతం అయినప్పటికీ భువనేశ్వర్‌లోని కేంద్రీయ మంచినీటి ఆక్వాకల్చర్ పరిశోధనా సంస్థ (సిఫా) శాస్త్రవేత్తల పర్యవేక్షణలో శిక్షణ పొంది ఆధునిక మెలకువలు పాటిస్తూ ముత్యాల సాగు చేస్తుండటం విశేషం. కనీసం 4,500 మంది రైతులు ముత్యాల సాగు చేస్తున్నారని ఔరంగాబాద్‌కు చెందిన ముత్యాల వ్యాపారి అరుణ్ అంబోర్ చెబుతున్నారు. మంచి ఆదాయం వస్తుండటంతో మరఠ్వాడా ప్రాంతంలో ముత్యాల సాగు ఏటేటా విస్తరిస్తోంది.
ఎఫ్.పి.ఓ. ద్వారా సమష్టి సేద్యం
రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఎఫ్.పి.ఓ.)ల ద్వారా కూడా రైతులు సమష్టిగా ముత్యాల సాగు చేపడుతున్నారు. ఒస్మానాబాద్ జిల్లా షహపూర్ గ్రామానికి చెందిన రైతు సంజయ్ పవార్ మరో 9 మంది రైతులతో కలిసి త్రివేణి పెరల్స్ అండ్ ఫిష్ ఫామ్ పేరిట ఎఫ్.పి.ఓ.ను నెలకొల్పారు. రెండేళ్ల క్రితం కరోనా కష్టాలను సైతం లెక్క చేయకుండా భువనేశ్వర్‌లో సిఫాకు వెళ్లి ముత్యాల పెంపకంలో శిక్షణ పొంది సాగు చేశారు. తొలి ఏడాదే రూ.14 లక్షల నికరాదాయం పొందారు.
సొంత పొలంలో 300 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతున రూ. 8.5 లక్షల పెట్టుబడితో 2020–21లో చెరువు తవ్వారు. నీరు ఇంకిపోకుండా అడుగున పాలిథిన్ షీట్ వేశారు. ఔరంగాబాద్‌లోని ముత్యాల వ్యాపారి అరుణ్ అంబోర్ దగ్గర నుంచి 25 వేల మంచినీటి ఆల్చిప్పలను ఒక్కొక్కటి రూ. 90 చొప్పున కొనుగోలు చేశారు. 2021 జూలైలో ఆల్చిప్పలను ఇనుప మెష్‌లో అమర్చి, చెరువు నీటిలో మునిగేలా తాళ్లతో లాగి గట్టుపై పోల్స్‌కు కట్టారు. చెరువులో నీరు ఆవిరైపోకుండా చెరువుపైన కూడా పాలిథిన్ షీట్ కలిపారు. చెరువు చుట్టూతా మెష్ వేశారు.
ముత్యం ధర రూ. 400
చెరువు నీటిలో నాచును ఆహారంగా తీసుకుంటూ ఆల్చిప్ప పెరుగుతుంది. నాచు పెరగడం కోసం (నెలకో వెయ్యి చొప్పున రోజుకు కొన్ని) స్పైరులినా టాబ్లెట్లను వేశారు. ఆల్చిప్పను రెండుగా చీల్చి మధ్యలోకి చిన్నపాటి నమూనాను చొప్పిస్తే.. దాని చుట్టూ కొద్దినెలల్లో తెల్లటి పదార్థం పోగుపడి.. ముత్యంగా తయారవుతుంది. లోపలికి చొప్పించేది ఏ ఆకారంలో ఉంటే ముత్యం ఆ (ఉదా.. దేవతామూర్తి/ బియ్యపు గింజ/ గుండ్రటి చిరుధాన్యం) ఆకారంలో తయారవుతుంది. 2022 సెప్టెంబర్‌లో పది వేల ముత్యాలు వచ్చాయి. ముత్యం రూ. 400కి అమ్మారు. రూ. 40 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను తొలి ఏడాదే రూ.14 లక్షల నికరాదాయం వచ్చిందని సంజయ్ తెలిపారు. ‘ముత్యాల పెంపకం మరీ కష్టమేమీ కాదు, మెలకువలను పాటిస్తే చాల’ని రైతు గోవింద్ షిండే అన్నారు. (క్లిక్ చేయండి: చదివింది 8వ తరగతే.. ఆవిష్కరణలు అద్భుతం.. ఎవరా ఘనాపాటి!)
Comments
Please login to add a commentAdd a comment