pearls
-
ముత్యాలే డ్రెస్సులుగా!
ముత్యాల ఆభరణాలు మనసును ఆహ్లాదంగా మార్చేస్తాయి. ముత్యాల వరసలతో చేసిన డ్రెస్సులు వేసుకుంటే.. వేడుకలలో హైలైట్‌గా నిలుస్తున్న ఈ స్టైలిష్ డ్రెస్సులను సెలబ్రిటీలే కాదు నవతరమూ కోరుకుంటోంది.వెస్ట్రన్, ఇండియన్ పార్టీ ఏదైనా ముత్యాల డిజైనరీ డ్రెస్సులను ధరిస్తున్నారు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు.సాధారణంగా ఆభరణాలలో చూసే ముత్యాలను డ్రెస్ డిజైనింగ్‌లో విరివిగా ఉపయోగిస్తున్నారు. అందుకే, ముత్యాలు ఇటీవల ఫ్యాషన్‌లో కీలకమైన అంశంగా మారాయి. తెలుపు, సిల్వర్, వైట్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్న మెటీరియల్పైన తెల్లని ముత్యాలను మరింత ఆకర్షణీయమైన ఎంపికగా డిజైనర్లు ఎంచుకుంటున్నారు. ఈ తరహా దుస్తులు స్వచ్ఛతకు, క్లాసీ లుక్కు ఉదాహరణగా నిలుస్తున్నాయి. శారీస్, స్కర్ట్స్ మీదకు టాప్స్‌గా ఉపయోగించే వాటిలో కోర్ జాకెట్స్, ష్రగ్స్, బ్లౌజ్ బ్యాక్ డిజైన్‌కి ఎక్కువ శాతం ముత్యాల వరసలను ఎంచుకుంటున్నారు. లెహంగా, శారీ ఎంబ్రాయిడరీలోనూ జర్దోసీ, సీక్వెన్స్‌తోపాటు కాంబినేషన్‌గా ముత్యాల వరసలు విరివిగా కనిపిస్తున్నాయి. వింటర్–సమ్మర్ పార్టీవేర్‌కి, ఇండోవెస్ట్రన్ స్టైల్స్‌కి చిన్న, పెద్ద ముత్యాలను ఉపయోగిస్తూ చేసే డ్రెస్ డిజైన్స్ ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ముత్యాలతో చేసే డిజైన్స్ ఖరీదులో ఘనంగా ఉంటే వాటి స్థానంలో ఉపయోగించే వైట్ బీడ్స్‌తో రెప్లికా డిజైన్లు యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీనితో తక్కువ ఖరీదులోనూ ఈ తరహా డిజైన్స్ లభిస్తున్నాయి. ఈ డిజైనరీ డ్రెస్సులే ఓ పెద్ద అట్రాక్షన్ కావడంతో మరే ఇతర ఆభరణాలు, హంగుల అవసరం ఉండదు. (చదవండి: కృష్ణభక్తురాలిగా ఐపీఎస్ అధికారిణి .. పదేళ్ల సర్వీస్ ఉండగానే..) -
ముత్యాలతో చేసిన చీరలో షానాయ కపూర్..!
ముత్యాలతో చేసిన నగలు, వాచ్‌లు అదిరిపోతాయి. ముత్యపు కాంతి, అందమే ఓ రేంజ్లో ఉంటుంది. వాటిని ధరిస్తే ఏదో ప్రకాశవంతమైన అనుభూతి కలుగుతుంది. ఎంత ఖరీదు చేసే డైమండ్లు ఉన్నా.. ముత్యాల ముందు అవన్నీ పక్కకు వెళ్లిపోవాల్సిందే అన్నంతగా ప్రకాశిస్తుంటాయి. అలాంటి ముత్యాలతో చీరనే రూపొందిస్తే.. ముత్యాల చీర దాని అందమే మతిపోయేలా ఉంటుంది. అలాంటి చీరనే ధరించింది బాలీవుడ్ నటి షానాయ కపూర్.ఆమె ఇటీవల జరిగిన అనంత్ రాధికల పెళ్లికి హాజరైన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ఆ వేడుకలో అందరూ పలు ఖరీదైన డిజైనర్ చీరలు,లెహంగాలతో దర్శనమివ్వగా. షానాయ మాత్రం ఓ డిఫెరెంట్ లుక్‌లో ప్రత్యేక ఆకర్షగా కనిపించింది. ఆమె ఈ గ్రాండ్ వివాహ వేడుకకి మల్హోత్రా డిజైన్ చేసిన ముత్యాలతో చీరలో తళుక్కుమంది. దాదాపు లక్ష ముత్యాలతో రూపొందించిన చీరలో ప్రకాశవంతమైన లుక్‌తో మెస్మరైజ్ చేసింది. వాటికి తగ్గట్టు చెవులకు సింపుల్ డైమండ్ స్టడ్లు, చేతికి చక్కటి ముత్యాలతో కూడిన బ్రాస్లెట్తో అదిరిపోయింది. హెయిర్‌ని చాలా సింపుల్ పోనీస్టైల్ని ఎంచుకుంది. అలాగే ప్రకాశవంతంగా కనిపించే లైట్ మేకప్‌కి ప్రాధాన్యత ఇచ్చింది షానాయ. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి.(చదవండి: వైద్యురాలు కమ్ మోడల్: తొలి మిస్ యూనివర్సల్ పెటైట్‌గా కన్నడ బ్యూటీ!) -
రత్నగిరీశునికి ముత్యాల వస్త్రం
అన్నవరం: దేవతామూర్తులకు బంగారు, వజ్ర, వైఢూర్యాలతో ఆభరణాలు తయారుచేసి భక్తితో అలంకరించి తరిస్తుంటాం. అలాగే మంచి ముత్యాలతో నఖశిఖ పర్యంతం ఉండే ఒక ముత్యాల వస్త్రం (ముత్తంగి) అలంకరించడం కూడా పలు దేవాలయాల్లో ఆనవాయితీగా వస్తోంది. శ్రీరంగంలో శ్రీరంగనాథుడు, తిరుమల బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామి, భద్రాద్రిలో సీతారాములు ముత్తంగి అలంకరణలో దర్శనమిస్తూ ఉంటారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి, ఈశ్వరుడు కార్తీకమాసం నుంచి ముత్తంగి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. దీని తయారీకి అయ్యే ఖర్చు రూ.8 లక్షలు సమకూర్చేందుకు దేవస్థానం వ్రత పురోహిత సంఘం ముందుకు వచ్చింది. ప్రాచీన కళను కాపాడుతూ.. ముత్తంగి తయారీ ప్రాచీనమైన కళ. దీన్ని హైదరాబాద్‌కు చెందిన సుధీర్ చరణ్ కుటుంబం వంశపారంపర్యంగా కాపాడుతూ వస్తోంది. తమిళనాడులోని శ్రీరంగంలో సుమారు 12 అడుగుల పొడవున పవళించి ఉండే శ్రీరంగనాథునికి 17వ శతాబ్దంలో నాయకర్ రాజులు ముత్తంగి తయారు చేయించి అలంకరించారు. వందేళ్ల తరువాత వన్నె తగ్గడంతో దాన్ని తీసి భద్రపరిచారని సుదీర్ చరణ్ ‘సాక్షి’కి చెప్పారు. తరువాత 1932లో చెన్నైకి చెందిన ఆయన ముత్తాత కృష్ణాజీని శ్రీరంగం దేవస్థానం ప్రతినిధులు సంప్రదించి, భద్రపరిచిన ముత్తంగిని మళ్లీ ముత్యాలు, వజ్రాలు, కెంపులతో తయారు చేయించి శ్రీరంగనాథునికి అలంకరించారు. ఎలా తయారు చేస్తారంటే.. ముత్తంగి తయారీ చాలా శ్రమ, నైపుణ్యం, ఏకాగ్రతతో కూడిన కళ. ఇందుకు అవసరమయ్యే ముత్యాల వ్యయం తక్కువే అయినప్పటికీ వాటిని వస్త్రంగా తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. శిరస్సు దగ్గర నుంచి పాదాల వేళ్ల వరకూ దేవతామూర్తుల కొలతలు తీసుకుని, ముందుగా వెండి లేదా రాగి రేకుతో వస్త్రంలా తయారు చేసి, దానికి వివిధ సైజుల్లో ముత్యాలు అతికిస్తారు. వీటి మధ్యలో ఎటువంటి ఖాళీ ఉండదు. కేవలం స్వామి, అమ్మవార్ల ముఖాలు మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన భాగమంతా మంచిముత్యాలే కనిపిస్తాయి. సత్యదేవునికీ ముత్తంగి సేవ సత్యదేవుడు, అమ్మవారు, శంకరులకు ప్రతి సోమవారం ముత్తంగి అలంకరించి, ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించాం. దీనికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కూడా అంగీకరించారు. దాతల ద్వారా ముత్తంగి చేయించాలనుకున్నాం. అదే సమయంలో వ్రతపురోహిత సంఘం ముందుకు వచ్చింది. – ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో, అన్నవరం దేవస్థానం -
ఎవాస్క్యులార్ నెక్రోసిస్ అంటే?
మన దేహంలోని నడుము భాగంలో కటి ఎముకలో రెండు గిన్నెల (సాకెట్స్) వంటి ఖాళీ భాగాలుంటాయి. ఆ రెండింటిలో తొడ ఎముక చివరన బంతిలా గుండ్రంటి భాగం (బాల్) సరిగ్గా అమరి ఉంటుంది. ఈ బంతి వంటి భాగాన్ని ‘ఫీమోరల్ హెడ్’ అంటారు. గిన్నె వంటి భాగంలో బంతి అమరి ఉండటం వల్లనే దీన్ని బంతి గిన్నె కీలుగా చెబుతారు. ఈ నిర్మాణమూ, ఈ అమరికే మనల్ని నిలబెడుతుంది, నిటారుగా ఉంచుతుంది, కదిలేందుకు ఉపకరిస్తుంది. కొంతమందిలో తొడ ఎముక చివర్న ఉండే ఆ బంతి వంటి భాగానికి ఆహారం, పోషకాలు, ఆక్సిజన్ అందక చచ్చుబడినట్లుగా అవుతుంది. ఆ కండిషన్‌ను ‘ఎవాస్క్యులార్ నెక్రోసిస్’ అంటారు. అలా అయినప్పుడు దాన్ని చక్కదిద్దడానికి తుంటి ఎముక సర్జరీ చేయాల్సి వస్తుంది. భారత్‌లోని తుంటి ఎముక సర్జరీల్లో ఈ కారణంగా జరిగేవే చాలా ఎక్కువ. ఈ ఎవాస్క్యులార్ నెక్రోసిస్ గురించి అవగాహన కోసమే ఈ కథనం. తొడ ఎముకలోని బంతి వంటి భాగం (ఫీమోరల్ హెడ్) చచ్చుబడిపోయిపోవడం వల్ల వచ్చే ఎవాస్క్యులార్ నెక్రోసిస్ కేసులు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి. ఇలా చచ్చుబడ్డాక తుంటి ఎముక కూడా క్రమంగా అరుగుతూ ఉంటుంది. గతంలో (ఇప్పటికీ) ఏ మూత్రపిండాల జబ్బుల కారణంగానో లేదా ఏ ఇతర ఆరోగ్య సమస్యల వల్లనో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినప్పుడు ఎవాస్క్యులార్ నెక్రోసిస్‌కు దారితీయడానికి అవకాశాలు ఎక్కువ. అయితే ఇటీవల కోవిడ్–19 వచ్చినప్పుడు స్టెరాయిడ్స్‌తో చికిత్స చేయడం చాలా ముమ్మరంగా జరగడంతో 20 – 30 ఏళ్ల వారిలో సైతం ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వీళ్లలోనూ యువతులతో పోలిస్తే యువకులే ఎవాస్క్యులార్ నెక్రోసిస్‌కు ఎక్కువగా గురవుతున్నారు (యువకులు, యువతుల నిష్పత్తి 3 : 2గా ఉంది). ఈమధ్య ఈ కేసులు గతంతో పోలిస్తే ఐదు నుంచి పదింతలు ఎక్కువ కావడం ఆందోళన కలిగించే అంశం. ఎందుకు వస్తుందంటే..? ఏదైనా ప్రమాదంలోగానీ లేదా ఏదైనా కారణంతో తుంటి ఎముకకు గాయం కావడం. ఎసెటాబ్యులర్ ఫ్రాక్చర్ (అంటే బాల్ అండ్ సాకెట్ ప్రాంతంలోని స్కెలిటల్ స్ట్రక్చర్‌లో ఎక్కడైనా ఫ్రాక్చర్ కావడం) వంటి కారణాలతో ఫీమోరల్ హెడ్‌కు రక్తసరఫరా సరిగా జరగకపోవడం. ∙ఇతర ఆరోగ్య సమస్యలను మాయం చేయడానికి స్టెరాయిడ్స్ వాడాల్సి రావడంతో.. ఆ దుష్ప్రభావం ఫీమోరల్ హెడ్‌పై పడి, దానికి పోషకాలు, ఆక్సిజన్ ఆగిపోవడం. ∙ముందుగా చెప్పుకున్నట్లు కోవిడ్ సమయంలో కొందరు రోగులను ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడాల్సి రావడం.. రెండేళ్ల తర్వాత ఆ దుష్ప్రభావాలు ఈ రూపంలో ఇప్పుడు కనిపించడం. ∙కొన్ని సందర్భాల్లో నిర్దిష్టంగా ఏ కారణమూ కనిపించకుండా కూడా ఈ పరిణామం చోటు చేసుకోవచ్చు. లక్షణాలు.. తుంటి ఎముక ప్రాంతంలో, గజ్జెల్లో నొప్పి రావడం. ∙తుంటి ప్రాంతంలో తీవ్రమైన నొప్పితో నడకకష్టం కావడం. కొన్ని సందర్భాల్లో కనీసం నిలబడలేకపోవడం లేదా ఏమాత్రం కదల్లేకపోవడం. ఎక్కువ సేపు కూర్చుని, ఆ తర్వాత నిలబడ్డప్పుడు కీళ్లు స్టిఫ్‌గా అయినట్లు అనిపించడం. నడిచే సామర్థ్యం క్రమక్రమంగా తగ్గిపోతుండటం.. ఎక్కువ దూరం నడవలేక కుంటుతున్నట్లుగా నడవడం. వ్యాధి బాగా ముదిరాక... పై కారణాలతో బాధితులు తమ రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోవడం. చికిత్స స్టేజ్1, స్టేజ్2లో సాధారణంగా స్టేజ్–1, స్టేజ్–2 లలో ఫీమోరల్ హెడ్ కొంతవరకు నొక్కుకుపోయినట్లుగా కావడంతో దానికి మందులతోనే చికిత్స చేస్తారు. ఇలా ఫీమోరల్ హెడ్ నొక్కుకుపోవడంతో కొంతమంది బాధితుల్లో చాలా తీవ్రమైన నొప్పి, కదలలేకపోవడం, కుంటటం వంటివి జరుగుతుంటే తొలిదశలో ‘కోర్ డికంప్రెషన్’ అనే శస్త్రచికిత్స చేస్తారు. దీంతోపాటు దెబ్బతిన్న / నశించిపోయిన అక్కడి కణాలు తిరిగి పుట్టేందుకు స్టెమ్‌సెల్స్‌ను పంపించి చికిత్స అందిస్తారు. అయితే ఈ తరహా ‘కోర్ డి–కంప్రెషన్’ శస్త్రచికిత్స గానీ, స్టెమ్‌సెల్ థెరపీగానీ అందరిలోనూ ఒకేలాంటి ఫలితాలు ఇవ్వదు. కేవలం 65% మాత్రమే సక్సెస్ రేటు ఉంటుంది. అందునా ఫీమోరల్ హెడ్ పూర్తిగా దెబ్బతినక ముందు మాత్రమే ఈ ‘కోర్ డి–కంప్రెషన్’ శస్త్రచికిత్స సాధ్యమవుతుంది. చికిత్స స్టేజ్-3, స్టేజ్-4లలో స్టేజ్–3, స్టేజ్–4 స్థాయి బాధితుల్లో సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం, ఫీమోరల్ హెడ్ అనే ఆ బాల్ పూర్తిగా దెబ్బతినడంతో ‘హిప్ రీప్లేస్మెంట్’ అనే తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అవసరమవుతుంది. పైగా ఆ దశలో ఆ శస్త్రచికిత్స తప్పక అవసరం. ఒకవేళ సరైన సమయంలో చికిత్స జరగకపోతే అది ఆ తర్వాత ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అనే ఎముకల తీవ్రమైన అరుగుదల, అవి బోలుగా మారిపోవడం వంటి కండిషన్స్ ఏర్పడతాయి. నిజానికి ఇప్పడున్న పరిస్థితుల్లో 20, 30 ఏళ్ల యువత ‘ఎవాస్క్యులార్ నెక్రోసిస్’ బారిన పడుతున్న తరుణంలో, ఈ వయసువాళ్లను కదల్లేకుండా ఒకేచోట కుదురుగా ఉంచే పరిస్థితులు ఉండవు. అది సరికాదు కూడా. ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత, తుంటి ఎముక మార్పిడికి దోహదపడేందుకు వాడే సిరామిక్, పాలీ సిరామిక్ వంటి నాణ్యమైన పదార్థాలు, రోబోటిక్ సర్జరీ వంటి ప్రక్రియల వల్ల ఈ యువత బాగా కోలుకునేలా చేసే అవకాశాలున్నాయి. ఎవాస్క్యులార్ నెక్రోసిస్ రాకమునుపు ఉన్న పరిస్థితే పునరావృతమయ్యేలా, నొప్పి ఏమాత్రం లేకుండా పూర్తిగా బాసిపట్లు వేసుకుని కూర్చునేలా చేయగలగడం ఇప్పుడు సాధ్యమే. అయితే లక్షణాలు కనిపించగానే, ముందు దశల్లోనే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. నిర్ధారణ ఎవాస్క్యురాల్ నెక్రోసిస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు.. వారికి ఎక్స్–రే, ఎమ్మారై స్కాన్ పరీక్షలు చేసి, ఎవాస్క్యులార్ నెక్రోసిస్‌ను నిర్ధారణ చేస్తారు. చికిత్స ఎవాస్క్యులార్ నెక్రోసిస్ సమస్య స్టేజ్–1, స్టేజ్–2, స్టేజ్–3, స్టేజ్–4 అనే నాలుగు దశల్లో జరుగుతుంది. అంటే... ఫీమోరల్ హెడ్ అనే బంతి లాంటి నిర్మాణానికి ఏమేరకు రక్తసరఫరా, పోషకాలు, ఆక్సిజన్ తగ్గుతాయనే అంశాన్ని బట్టి ఎవాస్క్యులార్ నెక్రోసిస్ తీవ్రత, స్టేజ్ అనేవి ఆధారపడి ఉంటాయి. నివారణ నిజానికి దీనికి నివారణ అంటూ లేదు. ఎందుకంటే ఫీమోరల్ హెడ్‌గా పేర్కొనే ఆ బాల్వంటి ప్రాంతానికి రక్తప్రసరణలో అంతరాయం కలగడం లేదా ఆగిపోయాక మాత్రమే లక్షణాలు బయటపడతాయి. అందుకే ముందుగా నివారణ అన్నది సాధ్యం కాదు. అయితే స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకునేవారిలో ఇది కనిపిస్తుందన్న అంశాన్ని బట్టి... ఈ విషయంలో కాస్త నియంత్రణ పాటిస్తే నివారణకు కొంతవరకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు... స్టెరాయిడ్స్ తీసుకునే బాధితులు రోజుకు 20 మి.గ్రా. నుంచి 30 మి.గ్రా. వాడేవారూ, అలాగే చాలాకాలం పాటు స్టెరాయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారు తమ ఫిజీషియన్‌ను సంప్రదించి, మున్ముందు తమకు హానికరం కాని మోతాదుల్లో మాత్రమే స్టెరాయిడ్స్ తీసుకునేలా జాగ్రత్త వహించవచ్చు. (చదవండి: 127 గంటలు.. డ్యాన్స్!) -
రోజుకు రూ. 1500.. ఎకరంన్నరలో ఏటా 4 లక్షలు! ఇలా చేస్తే లాభాలే!
ఏదో ఒక పంట సాగుపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఆదాయపరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటాయి. ముఖ్యంగా, ఎకరం, రెండెకరాల భూమి మాత్రమే కలిగి ఉన్న చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఏక పంటల సాగుతో తగినంత ఆదాయం పొందలేక అప్పుల పాలవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ దుస్థితి నుంచి రైతులు బయటపడాలంటే సమీకృత సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం. సమీకృత సేద్యం అంటే.. చిన్న కమతం నుంచి కూడా ఒకటికి నాలుగు విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చెయ్యటం అన్నమాట. నిరంతర ఆదాయం వచ్చేలా సమీకృత సేంద్రియ సేద్యం చేపట్టి.. నిరంతరం ఆదాయం పొందే మార్గాలను ఆచరించి చూపుతున్నారు సూర్యాపేట జిల్లాకు చెందిన రైతు దంపతులు వాసికర్ల శేషుకుమార్, లక్ష్మీప్రియ. ఎమ్మే చదువుకొని రెక్కల కష్టాన్ని నమ్ముకునే చిన్న, సన్నకారు రైతు దంపతులకు ఏడాది పొడవునా అనుదినం ఆదాయాన్ని అందించే విధంగా సమీకృత సేంద్రియ సేద్య పద్ధతులను విజయవంతంగా ఆచరించి చూపిస్తున్నారు వాసికర్ల శేషుకుమార్(53), లక్ష్మీప్రియ దంపతులు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన శేషుకుమార్(53) ఎమ్మే చదువుకొని గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. అభ్యుదయ భావాలు కలిగిన ఆయన 25 ఎకరాల్లో డ్రమ్‌సీడర్, వెద పద్ధతుల్లో వరి పండిస్తున్నారు. నాగార్జునసాగర్ కాల్వ పక్కనే పొలం ఉండటంతో సాగు నీటికి దిగులు లేదు. వరి సాగు నష్టదాయకంగా పరిణమిస్తున్న నేపథ్యంలో వరికి బదులుగా.. కాయకష్టం చేసే రైతు కుటుంబాలకు రోజూ ఆదాయాన్నిచ్చే సమీకృత సేంద్రియ వ్యవసాయ నమూనా వైపు ఏడాదిన్నర క్రితం దృష్టి సారించారు. నాలుగు రకాలుగా నిరంతరం ఆదాయం పొందటమే ఎకరంన్నర విస్తీర్ణంలో సమీకృత సేంద్రియ సేద్యం చేపట్టారు. ఈ క్షేత్రం ప్రదర్శన క్షేత్రంగా, రైతులకు శిక్షణా కేంద్రంగా మారింది. శేషు అనుసరిస్తున్న సమీకృత సేంద్రియ సేద్య నమూనా రైతులను ఆకర్షిస్తోంది. కూరగాయలు, పశుగ్రాస పంటలతో పాటు దీర్ఘకాలిక పండ్ల చెట్లను పూర్తి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. దీనితో పాటు.. మేకలు గొర్రెలు, నాటుకోళ్లు, పుట్టగొడుగులు, ముత్యాల పెంపకాన్ని చేపట్టి ఒకటికి నాలుగు రకాలుగా నిరంతరం ఆదాయం పొందటమే ఈ నమూనాలో ప్రత్యేకత. 5 వేల ఆల్చిప్పల్లో ముత్యాల సాగు ఎకరంన్నరలో మొదట గొర్రెలు, మేకలు పెంచేందుకు ప్రత్యేకంగా ఎలివేటెడ్ షెడ్‌ను రూ. 5 లక్షల ఖర్చుతో నిర్మించారు. షెడ్ పైఅంతస్థులో మేకలు, గొర్రెలు పెరుగుతూ ఉంటే.. షెడ్ కింద కొంత భాగంలో నాటు కోళ్ళ పెంపకకానికి శ్రీకారం చుట్టారు. షెడ్ కింద మిగతా భాగంలో ఒక డార్క్ రూమ్‌ను నిర్మించి పాల పుట్టగొడుగుల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. 3 సిమెంటు ట్యాంకులు నిర్మించి స్థానికంగా సేకరించిన 5 వేల ఆల్చిప్పల్లో 3 నెలల క్రితం ముత్యాల సాగు ప్రారంభించారు. వంగ, టమాటో, మిర్చి, బోడ కాకర.. ఇంకా.. ఈ సమీకృత వ్యవసాయం క్షేత్రం చుట్టూ ప్రత్యేకంగా కంచె ఏర్పాటు చేశారు. చుట్టూతా కొబ్బరి, డ్రాగన్‌ఫ్రూట్ తదితర దీర్ఘకాలిక పండ్ల మొక్కలు నాటారు. ప్లాస్టిక్ షీట్‌తో మల్చింగ్ చేసి.. బోడ కాకర, బీర, సొర, కాకర సాగు చేపట్టారు. వంగ, టమాటో, మిర్చి, బోడ కాకర, బీర, సొర, నేతి బీర, కాకర, పొట్ల, చిక్కుడు, మునగ, బంతి, గులాబీ తదితర రకాల పంటల సాగు చేపట్టారు. పశువుల కోసం నేపియర్, దశరధ గడ్డి, మొక్కజొన్న గడ్డిని పెంచుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడా చోటు వృథా కాకుండా అధిక సాంద్రతలో అనేక పంటలు, పండ్ల మొక్కలు నాటారు. ఈ క్షేత్రంలో ఎలాంటి రసాయనాలను ఉపయోగించటం లేదు. ఒకటికి నాలుగు దారుల్లో ఆదాయం పొందే సాగు పద్ధతిపై చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు స్ఫూర్తినిస్తున్న శేషుకుమార్ దంపతులు ధన్యులు. – మొలుగూరి గోపి, సాక్షి, నడిగూడెం, సూర్యాపేట జిల్లా చిన్న రైతులు నిత్యం ఆదాయం పొందాలి వరి పంట సాగులో పెట్టుబడులు బాగా పెరిగాయి. కూలీల కొరత ఇబ్బందిగా మారింది. దీంతో నిత్యం ఆదాయం పొందే విధంగా ఈ సమీకృత వ్యవసాయంపై ఆసక్తి కలిగింది. తక్కువ భూమిలో విభిన్న రకాల పంటల సాగు చేపట్టాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికతో ముందుకువెళ్తున్నాం. – వాసికర్ల లక్ష్మీప్రియ, సమీకృత సేంద్రియ మహిళా రైతు, సిరిపురం, సూర్యాపేట జిల్లా సులువుగా సేంద్రియ పుట్టగొడుగుల పెంపకం సమీకృత వ్యయసాయ క్షేత్రంలో షెడ్డులో సేంద్రియ పద్ధతుల్లో పాల పుట్టగొడుగుల పెంపకం చేపట్టారు. వరిగడ్డి ముక్కలను, మట్టిని ప్రత్యేక పద్ధతుల్లో శుద్ధి చేసి, పుట్టగొడుగుల పెంపకానికి పాలిథిన్ బ్యాగ్‌లను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పరిశుద్ధమైన 27 డిగ్రీల వాతావరణంలో గాలి, వెల్తురు తగలని చీకటి గదిలో జరుగుతుంది. బ్యాగ్‌లలో నింపిన గడ్డిపై మైసీలియం అనే శిలీంధ్రం అభివృద్ధి చెందిన తర్వాత బ్యాగ్‌లను మామూలు గదిలోకి మార్చుతారు. వారం తర్వాత నుంచి పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది. వరిగడ్డి ముక్కలను స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్స్ సహాయంతో ఆవిరి ద్వారా శుద్ధి చేసే ప్రత్యేక పద్ధతిని శేషు అనుసరిస్తున్నారు. దీని వల్ల గడ్డి వెంటనే తడి ఆరిపోతుందన్నారు. ఈ విధంగా సేంద్రియ పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకం సులభతరమైందని శేషు చెప్పారు. ముత్యాల సాగును ఒక్క రోజులో నేర్చుకోవచ్చు ఎకరంన్నరలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్న శేషుకుమార్ దంపతులు ప్రత్యేక షెడ్లో మూడు సిమెంటు ట్యాంకులను నిర్మించి ముత్యాల సాగు చేపట్టారు. దేవతా రూపాల్లో డిజైనర్ ముత్యాలైతే 14 నెలల్లో, ఎం.ఓ.పి. న్యూక్లియస్‌ల ద్వారా గుండ్రటి ముత్యాలైతే 18 నెలల్లో దిగుబడి వస్తుందన్నారు. ఒక ఆల్చిప్పకు రెండు ముత్యాలు వస్తాయి. నాణ్యతను బట్టి ధర ఉంటుంది. సగటున ధర రూ. 150–200 ఉంటుంది. ఒక రోజు శిక్షణతో మహిళలు కూడా ముత్యాల సాగును నేర్చుకోవచ్చు. చిన్న రైతులకు దారి చూపాలని.. భూమి తక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతు దంపతులు ఏదో ఒకే పంట సాగుపై ఆధారపడితే తగినంత ఆదాయం రాదు. సమీకృత సేంద్రియ సాగు చేపడితే రోజువారీగా మంచి ఆదాయం పొందే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందుకని, ఎకరంన్నర పొలంలో ఈ క్షేత్రాన్ని రూపొందించాం. ఎకరంన్నర భూమిలో భార్య, భర్త స్వయంకృషి చేస్తే అన్ని ఖర్చులూ పోను రూ. 4 లక్షలకు పైగా నికరాదాయం వస్తోంది. ఈ సందేశం రైతులందరికీ తెలియజెప్పాలనేదే మా తపన. రోజుకు రూ.1,500 ఆదాయం వస్తున్నది. రెండు వేలకు పెంచాలనేది లక్ష్యం. ప్రతి రైతూ ముందుకు రావాలి. ప్రభుత్వం అవగాహన కల్పించాలి. – వాసికర్ల శేషుకుమార్ (91824 06310), సమీకృత సేంద్రియ రైతు, సిరిపురం, సూర్యాపేట జిల్లా చదవండి: నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో కూరగాయల సాగు.. నగరంలో కిచెన్ గార్డెనింగ్ ప్రయోజనాలివే! 70 ఎకరాలు 30 పంటలు.. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా -
Pearl Culture: ముత్యాల సాగు.. ఏడాదికి 14 లక్షల నికరాదాయం
నీటి వనరులు పరిమితంగా ఉన్న మెట్ట ప్రాంతంలోనూ మంచినీటి చెరువుల్లో ముత్యాల పెంపకంతో మంచి ఆదాయం గడించవచ్చని మహారాష్ట్రలోని మరఠ్వాడా రైతులు నిరూపిస్తున్నారు. ఔరంగాబాద్ పరిసర ప్రాంతాల్లో గత 10–15 ఏళ్లుగా మంచినీటిలో ముత్యాల సాగు పుంజుకుంటున్నది. కరువు ప్రాంతం అయినప్పటికీ భువనేశ్వర్‌లోని కేంద్రీయ మంచినీటి ఆక్వాకల్చర్ పరిశోధనా సంస్థ (సిఫా) శాస్త్రవేత్తల పర్యవేక్షణలో శిక్షణ పొంది ఆధునిక మెలకువలు పాటిస్తూ ముత్యాల సాగు చేస్తుండటం విశేషం. కనీసం 4,500 మంది రైతులు ముత్యాల సాగు చేస్తున్నారని ఔరంగాబాద్‌కు చెందిన ముత్యాల వ్యాపారి అరుణ్ అంబోర్ చెబుతున్నారు. మంచి ఆదాయం వస్తుండటంతో మరఠ్వాడా ప్రాంతంలో ముత్యాల సాగు ఏటేటా విస్తరిస్తోంది. ఎఫ్.పి.ఓ. ద్వారా సమష్టి సేద్యం రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఎఫ్.పి.ఓ.)ల ద్వారా కూడా రైతులు సమష్టిగా ముత్యాల సాగు చేపడుతున్నారు. ఒస్మానాబాద్ జిల్లా షహపూర్ గ్రామానికి చెందిన రైతు సంజయ్ పవార్ మరో 9 మంది రైతులతో కలిసి త్రివేణి పెరల్స్ అండ్ ఫిష్ ఫామ్ పేరిట ఎఫ్.పి.ఓ.ను నెలకొల్పారు. రెండేళ్ల క్రితం కరోనా కష్టాలను సైతం లెక్క చేయకుండా భువనేశ్వర్‌లో సిఫాకు వెళ్లి ముత్యాల పెంపకంలో శిక్షణ పొంది సాగు చేశారు. తొలి ఏడాదే రూ.14 లక్షల నికరాదాయం పొందారు. సొంత పొలంలో 300 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతున రూ. 8.5 లక్షల పెట్టుబడితో 2020–21లో చెరువు తవ్వారు. నీరు ఇంకిపోకుండా అడుగున పాలిథిన్ షీట్ వేశారు. ఔరంగాబాద్‌లోని ముత్యాల వ్యాపారి అరుణ్ అంబోర్ దగ్గర నుంచి 25 వేల మంచినీటి ఆల్చిప్పలను ఒక్కొక్కటి రూ. 90 చొప్పున కొనుగోలు చేశారు. 2021 జూలైలో ఆల్చిప్పలను ఇనుప మెష్‌లో అమర్చి, చెరువు నీటిలో మునిగేలా తాళ్లతో లాగి గట్టుపై పోల్స్‌కు కట్టారు. చెరువులో నీరు ఆవిరైపోకుండా చెరువుపైన కూడా పాలిథిన్ షీట్ కలిపారు. చెరువు చుట్టూతా మెష్ వేశారు. ముత్యం ధర రూ. 400 చెరువు నీటిలో నాచును ఆహారంగా తీసుకుంటూ ఆల్చిప్ప పెరుగుతుంది. నాచు పెరగడం కోసం (నెలకో వెయ్యి చొప్పున రోజుకు కొన్ని) స్పైరులినా టాబ్లెట్లను వేశారు. ఆల్చిప్పను రెండుగా చీల్చి మధ్యలోకి చిన్నపాటి నమూనాను చొప్పిస్తే.. దాని చుట్టూ కొద్దినెలల్లో తెల్లటి పదార్థం పోగుపడి.. ముత్యంగా తయారవుతుంది. లోపలికి చొప్పించేది ఏ ఆకారంలో ఉంటే ముత్యం ఆ (ఉదా.. దేవతామూర్తి/ బియ్యపు గింజ/ గుండ్రటి చిరుధాన్యం) ఆకారంలో తయారవుతుంది. 2022 సెప్టెంబర్‌లో పది వేల ముత్యాలు వచ్చాయి. ముత్యం రూ. 400కి అమ్మారు. రూ. 40 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను తొలి ఏడాదే రూ.14 లక్షల నికరాదాయం వచ్చిందని సంజయ్ తెలిపారు. ‘ముత్యాల పెంపకం మరీ కష్టమేమీ కాదు, మెలకువలను పాటిస్తే చాల’ని రైతు గోవింద్ షిండే అన్నారు. (క్లిక్ చేయండి: చదివింది 8వ తరగతే.. ఆవిష్కరణలు అద్భుతం.. ఎవరా ఘనాపాటి!) -
Recipe: మైదా ఎందుకు? సజ్జపిండితో ఆరోగ్యకరమైన కేక్ తయారీ ఇలా!
మైదాతో కాకుండా సజ్జపిండితో ఇలా కేక్ తయారు చేసుకోండి! ఎంచక్కా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పెర్ల్ మిల్లెట్ కేక్‌తో ఆస్వాదించండి. కావలసినవి: ►సజ్జ పిండి– వంద గ్రాములు ►చక్కెర – 80 గ్రాములు ►పాలు – 30 ఎమ్ఎల్ ►కోడిగుడ్లు – 3 ►వెనిలా ఎసెన్స్– 2 చుక్కలు ►వెన్న – టీ స్పూన్ తయారీ: ►సజ్జలను మందపాటి పెనంలో దోరగా వేయించి, చల్లారిన తరవాత మెత్తగా పొడి చేసి జల్లెడ పట్టి పక్కన ఉంచుకోవాలి. ►ఒవెన్‌లో పెట్టే పాత్రకు వెన్న రాసి సిద్ధంగా ఉంచుకోవాలి. ►వెడల్పుగా లోతుగా ఉండే పాత్రలో కోడిగుడ్ల సొన వేసి బీటర్‌తో నురగ వచ్చే వరకు బీట్ చేయాలి. ►ఇప్పుడు అందులో చక్కెర వేసి మరికొంత సేపు గిలక్కొట్టాలి. ►సజ్జ పిండిని జల్లెడలో వేసి కోడిగుడ్ల మిశ్రమం ఉన్న పాత్రలో జల్లించినట్లు వేయాలి. ►ఇలా చేస్తే పిండి ఉండలు లేకుండా సమంగా కలుస్తుంది. పాలు, వెనిలా ఎసెన్స్ కూడా వేసి సమంగా కలిసే వరకు బీట్ చేయాలి. ►బీట్ చేయడం తగ్గిస్తే కేక్ సరిగా పొంగదు. ►కాబట్టి పిండి మిశ్రమాన్ని గుల్లబారే వరకు బీట్ చేయాలి. ►బాగా కలిసిన కేక్ మిశ్రమాన్ని వెన్నరాసిన కేక్ మౌల్డ్ లేదా మామూలు పాత్రలో పోసి ఒవెన్‌ను 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసి అందులో పెట్టాలి. ►అర గంట సేపటికి చక్కగా బేక్ అవుతుంది. ►టూత్ పిక్‌తో కేక్ పై నుంచి గుచ్చి బయటకు తీసి చూస్తే తేమ అంటకపోతే మిశ్రమం పూర్తిగా బేక్ అయినట్లు, తేమ ఉన్నట్లనిపిస్తే మరో ఐదు నిమిషాల సేపు ఉంచాలి. ►కేక్‌ను ఒవెన్ నుంచి తీసి వేడి తగ్గిన తరవాత ముక్కలు కట్ చేసి సర్వ్ చేసుకోవాలి. ►ఇష్టమైన వాళ్లు కేక్ మీద ఐసింగ్ షుగర్‌తో డెకరేట్ చేసుకోవచ్చు. -
Pearl Farming In Bucket Special Video: బకెట్లో ముత్యాలు
-
కొంప ముంచిన అత్యాశ.. రూ.2 కోట్లతో ఉడాయించిన వ్యాపారి
సాక్షి, హన్మకొండ చౌరస్తా: ఇంటి వద్దే కూర్చొని నెలకు రూ.20 వేల వరకు సంపాదించండి అంటూ వచ్చిన ప్రకటన పలువురిలో ఆశలు రేకెత్తించింది. చివరకు ఆ అత్యాశే కొంపముంచింది. ఏకంగా రూ.2 కోట్లు కుచ్చుటోపీ పరారయ్యాడో వ్యాపారి. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఓ కాంప్లెక్స్‌లో విజయవాడకు చెందిన శ్రీనివాసరావు మార్చిలో ముత్యాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఇంటి వద్దే కూర్చోండి, నెలకు రూ.20 నుంచి రూ.30 వేల వరకు సంపాదించండి అంటూ ప్రకటనలు ఇచ్చాడు. దండ అల్లేందుకు సరిపడా ముత్యాలు తామే ఇస్తామని, ఆ ముత్యాలతో మాల అల్లుకుని వస్తే రూ.300 చెల్లిస్తానని చెప్పాడు. కానీ తొలుత దండ విలువ ఆధారంగా రూ.2 వేలు పెట్టుబడి పెట్టాలని, అలా ఎన్ని దండలకు సరిపడా డబ్బు చెల్లిస్తే అన్ని ముత్యాలను అందిస్తామని తెలిపారు. దీంతో దాదాపు 165 మంది రూ.రెండు కోట్ల మేరకు వ్యాపారి శ్రీనివాసరావుకు చెల్లించారు. ఇదే అదనుగా భావించిన అతను ఉడాయించాడు. -
ముత్యాల పందిరి
-
మంచి ముత్యాలు వచ్చేదిలా..
ముత్యాల దండలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదూ. వాటితో కేవలం మెడలో హారాలే కాదు.. చెవులకు ధరించే హ్యాంగింగ్స్, చేతులకు గాజులు.. ఇలా రకరకాల ఆభరణాలు తయారుచేస్తారు. హైదరాబాద్ మంచి ముత్యాలంటే దేశవిదేశాల్లో కూడా ఎంతో పేరుంది. మరి అలాంటి మంచి ముత్యాలు ఎలా వస్తాయో తెలుసా? చూడాలని కూడా ఉందా? సముద్రపు జీవి అయిన ముత్యపుచిప్పను పట్టుకుని, దాన్ని సరిగ్గా సగానికి చీల్చిన తర్వాత.. దాని శరీరం లోంచి ఈ ముత్యాలను తీస్తారు. వాటిని సేకరించి.. శుభ్రం చేసిన తర్వాత అప్పుడు మార్కెట్లకు తరలిస్తారు. ఇదంతా చాలా సంక్లిష్టమైన ప్రాసెస్. ఇంత అయిన తర్వాత గానీ మనకు ముత్యాలు చేతికి రావు. -
'హైదరాబాద్ ముత్యాలకు ప్రసిద్ధి'
హైదరాబాద్: చారిత్రక హైదరాబాద్ నగరం ముత్యాలకు ప్రసిద్ధిగాంచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం నగరంలోని రసిక్ జెమ్స్ అండ్ జ్యుయెలర్స్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా మహమూద్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మేలైన ముత్యాలను వినియోగదారులకు అందించడం ద్వారా నగర ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని నిర్వాహకులకు ఆయన సూచించారు.