మన దేహంలోని నడుము భాగంలో కటి ఎముకలో రెండు గిన్నెల (సాకెట్స్) వంటి ఖాళీ భాగాలుంటాయి. ఆ రెండింటిలో తొడ ఎముక చివరన బంతిలా గుండ్రంటి భాగం (బాల్) సరిగ్గా అమరి ఉంటుంది. ఈ బంతి వంటి భాగాన్ని ‘ఫీమోరల్ హెడ్’ అంటారు. గిన్నె వంటి భాగంలో బంతి అమరి ఉండటం వల్లనే దీన్ని బంతి గిన్నె కీలుగా చెబుతారు. ఈ నిర్మాణమూ, ఈ అమరికే మనల్ని నిలబెడుతుంది, నిటారుగా ఉంచుతుంది, కదిలేందుకు ఉపకరిస్తుంది. కొంతమందిలో తొడ ఎముక చివర్న ఉండే ఆ బంతి వంటి భాగానికి ఆహారం, పోషకాలు, ఆక్సిజన్ అందక చచ్చుబడినట్లుగా అవుతుంది. ఆ కండిషన్‌ను ‘ఎవాస్క్యులార్ నెక్రోసిస్’ అంటారు. అలా అయినప్పుడు దాన్ని చక్కదిద్దడానికి తుంటి ఎముక సర్జరీ చేయాల్సి వస్తుంది. భారత్‌లోని తుంటి ఎముక సర్జరీల్లో ఈ కారణంగా జరిగేవే చాలా ఎక్కువ. ఈ ఎవాస్క్యులార్ నెక్రోసిస్ గురించి అవగాహన కోసమే ఈ కథనం.
తొడ ఎముకలోని బంతి వంటి భాగం (ఫీమోరల్ హెడ్) చచ్చుబడిపోయిపోవడం వల్ల వచ్చే ఎవాస్క్యులార్ నెక్రోసిస్ కేసులు ఇటీవల ఎక్కువగా వస్తున్నాయి. ఇలా చచ్చుబడ్డాక తుంటి ఎముక కూడా క్రమంగా అరుగుతూ ఉంటుంది. గతంలో (ఇప్పటికీ) ఏ మూత్రపిండాల జబ్బుల కారణంగానో లేదా ఏ ఇతర ఆరోగ్య సమస్యల వల్లనో స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినప్పుడు ఎవాస్క్యులార్ నెక్రోసిస్‌కు దారితీయడానికి అవకాశాలు ఎక్కువ. అయితే ఇటీవల కోవిడ్–19 వచ్చినప్పుడు స్టెరాయిడ్స్‌తో చికిత్స చేయడం చాలా ముమ్మరంగా జరగడంతో 20 – 30 ఏళ్ల వారిలో సైతం ఈ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. వీళ్లలోనూ యువతులతో పోలిస్తే యువకులే ఎవాస్క్యులార్ నెక్రోసిస్‌కు ఎక్కువగా గురవుతున్నారు (యువకులు, యువతుల నిష్పత్తి 3 : 2గా ఉంది). ఈమధ్య ఈ కేసులు గతంతో పోలిస్తే ఐదు నుంచి పదింతలు ఎక్కువ కావడం ఆందోళన కలిగించే అంశం.
ఎందుకు వస్తుందంటే..?
ఏదైనా ప్రమాదంలోగానీ లేదా ఏదైనా కారణంతో తుంటి ఎముకకు గాయం కావడం. ఎసెటాబ్యులర్ ఫ్రాక్చర్ (అంటే బాల్ అండ్ సాకెట్ ప్రాంతంలోని స్కెలిటల్ స్ట్రక్చర్‌లో ఎక్కడైనా ఫ్రాక్చర్ కావడం) వంటి కారణాలతో ఫీమోరల్ హెడ్‌కు రక్తసరఫరా సరిగా జరగకపోవడం. ∙ఇతర ఆరోగ్య సమస్యలను మాయం చేయడానికి స్టెరాయిడ్స్ వాడాల్సి రావడంతో.. ఆ దుష్ప్రభావం ఫీమోరల్ హెడ్‌పై పడి, దానికి పోషకాలు, ఆక్సిజన్ ఆగిపోవడం. ∙ముందుగా చెప్పుకున్నట్లు కోవిడ్ సమయంలో కొందరు రోగులను ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడాల్సి రావడం.. రెండేళ్ల తర్వాత ఆ దుష్ప్రభావాలు ఈ రూపంలో ఇప్పుడు కనిపించడం. ∙కొన్ని సందర్భాల్లో నిర్దిష్టంగా ఏ కారణమూ కనిపించకుండా కూడా ఈ పరిణామం చోటు చేసుకోవచ్చు.
లక్షణాలు..
తుంటి ఎముక ప్రాంతంలో, గజ్జెల్లో నొప్పి రావడం. ∙తుంటి ప్రాంతంలో తీవ్రమైన నొప్పితో నడకకష్టం కావడం. కొన్ని సందర్భాల్లో కనీసం నిలబడలేకపోవడం లేదా ఏమాత్రం కదల్లేకపోవడం. ఎక్కువ సేపు కూర్చుని, ఆ తర్వాత నిలబడ్డప్పుడు కీళ్లు స్టిఫ్‌గా అయినట్లు అనిపించడం. నడిచే సామర్థ్యం క్రమక్రమంగా తగ్గిపోతుండటం.. ఎక్కువ దూరం నడవలేక కుంటుతున్నట్లుగా నడవడం. వ్యాధి బాగా ముదిరాక... పై కారణాలతో బాధితులు తమ రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోవడం.
చికిత్స స్టేజ్1, స్టేజ్2లో
సాధారణంగా స్టేజ్–1, స్టేజ్–2 లలో ఫీమోరల్ హెడ్ కొంతవరకు నొక్కుకుపోయినట్లుగా కావడంతో దానికి మందులతోనే చికిత్స చేస్తారు. ఇలా ఫీమోరల్ హెడ్ నొక్కుకుపోవడంతో కొంతమంది బాధితుల్లో చాలా తీవ్రమైన నొప్పి, కదలలేకపోవడం, కుంటటం వంటివి జరుగుతుంటే తొలిదశలో ‘కోర్ డికంప్రెషన్’ అనే శస్త్రచికిత్స చేస్తారు. దీంతోపాటు దెబ్బతిన్న / నశించిపోయిన అక్కడి కణాలు తిరిగి పుట్టేందుకు స్టెమ్‌సెల్స్‌ను పంపించి చికిత్స అందిస్తారు. అయితే ఈ తరహా ‘కోర్ డి–కంప్రెషన్’ శస్త్రచికిత్స గానీ, స్టెమ్‌సెల్ థెరపీగానీ అందరిలోనూ ఒకేలాంటి ఫలితాలు ఇవ్వదు. కేవలం 65% మాత్రమే సక్సెస్ రేటు ఉంటుంది. అందునా ఫీమోరల్ హెడ్ పూర్తిగా దెబ్బతినక ముందు మాత్రమే ఈ ‘కోర్ డి–కంప్రెషన్’ శస్త్రచికిత్స సాధ్యమవుతుంది.
చికిత్స స్టేజ్-3, స్టేజ్-4లలో
స్టేజ్–3, స్టేజ్–4 స్థాయి బాధితుల్లో సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం, ఫీమోరల్ హెడ్ అనే ఆ బాల్ పూర్తిగా దెబ్బతినడంతో ‘హిప్ రీప్లేస్‌మెంట్’ అనే తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అవసరమవుతుంది. పైగా ఆ దశలో ఆ శస్త్రచికిత్స తప్పక అవసరం. ఒకవేళ సరైన సమయంలో చికిత్స జరగకపోతే అది ఆ తర్వాత ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అనే ఎముకల తీవ్రమైన అరుగుదల, అవి బోలుగా మారిపోవడం వంటి కండిషన్స్ ఏర్పడతాయి. నిజానికి ఇప్పడున్న పరిస్థితుల్లో 20, 30 ఏళ్ల యువత ‘ఎవాస్క్యులార్ నెక్రోసిస్’ బారిన పడుతున్న తరుణంలో, ఈ వయసువాళ్లను కదల్లేకుండా ఒకేచోట కుదురుగా ఉంచే పరిస్థితులు ఉండవు.
అది సరికాదు కూడా. ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత, తుంటి ఎముక మార్పిడికి దోహదపడేందుకు వాడే సిరామిక్, పాలీ సిరామిక్ వంటి నాణ్యమైన పదార్థాలు, రోబోటిక్ సర్జరీ వంటి ప్రక్రియల వల్ల ఈ యువత బాగా కోలుకునేలా చేసే అవకాశాలున్నాయి. ఎవాస్క్యులార్ నెక్రోసిస్ రాకమునుపు ఉన్న పరిస్థితే పునరావృతమయ్యేలా, నొప్పి ఏమాత్రం లేకుండా పూర్తిగా బాసిపట్లు వేసుకుని కూర్చునేలా చేయగలగడం ఇప్పుడు సాధ్యమే. అయితే లక్షణాలు కనిపించగానే, ముందు దశల్లోనే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.
నిర్ధారణ
ఎవాస్క్యురాల్ నెక్రోసిస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించినప్పుడు.. వారికి ఎక్స్–రే, ఎమ్మారై స్కాన్ పరీక్షలు చేసి, ఎవాస్క్యులార్ నెక్రోసిస్‌ను నిర్ధారణ చేస్తారు.
చికిత్స ఎవాస్క్యులార్ నెక్రోసిస్ సమస్య స్టేజ్–1, స్టేజ్–2, స్టేజ్–3, స్టేజ్–4 అనే నాలుగు దశల్లో జరుగుతుంది. అంటే... ఫీమోరల్ హెడ్ అనే బంతి లాంటి నిర్మాణానికి ఏమేరకు రక్తసరఫరా, పోషకాలు, ఆక్సిజన్ తగ్గుతాయనే అంశాన్ని బట్టి ఎవాస్క్యులార్ నెక్రోసిస్ తీవ్రత, స్టేజ్ అనేవి ఆధారపడి ఉంటాయి.
నివారణ
నిజానికి దీనికి నివారణ అంటూ లేదు. ఎందుకంటే ఫీమోరల్ హెడ్‌గా పేర్కొనే ఆ బాల్‌వంటి ప్రాంతానికి రక్తప్రసరణలో అంతరాయం కలగడం లేదా ఆగిపోయాక మాత్రమే లక్షణాలు బయటపడతాయి. అందుకే ముందుగా నివారణ అన్నది సాధ్యం కాదు. అయితే స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకునేవారిలో ఇది కనిపిస్తుందన్న అంశాన్ని బట్టి...
ఈ విషయంలో కాస్త నియంత్రణ పాటిస్తే నివారణకు కొంతవరకు అవకాశం ఉంటుంది. ఉదాహరణకు... స్టెరాయిడ్స్ తీసుకునే బాధితులు రోజుకు 20 మి.గ్రా. నుంచి 30 మి.గ్రా. వాడేవారూ, అలాగే చాలాకాలం పాటు స్టెరాయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నవారు తమ ఫిజీషియన్‌ను సంప్రదించి, మున్ముందు తమకు హానికరం కాని మోతాదుల్లో మాత్రమే స్టెరాయిడ్స్ తీసుకునేలా జాగ్రత్త వహించవచ్చు.
(చదవండి: 127 గంటలు.. డ్యాన్స్!)
Comments
Please login to add a commentAdd a comment