Marathwada Farmers
-
Pearl Culture: ముత్యాల సాగు.. ఏడాదికి 14 లక్షల నికరాదాయం
నీటి వనరులు పరిమితంగా ఉన్న మెట్ట ప్రాంతంలోనూ మంచినీటి చెరువుల్లో ముత్యాల పెంపకంతో మంచి ఆదాయం గడించవచ్చని మహారాష్ట్రలోని మరఠ్వాడా రైతులు నిరూపిస్తున్నారు. ఔరంగాబాద్ పరిసర ప్రాంతాల్లో గత 10–15 ఏళ్లుగా మంచినీటిలో ముత్యాల సాగు పుంజుకుంటున్నది. కరువు ప్రాంతం అయినప్పటికీ భువనేశ్వర్‌లోని కేంద్రీయ మంచినీటి ఆక్వాకల్చర్ పరిశోధనా సంస్థ (సిఫా) శాస్త్రవేత్తల పర్యవేక్షణలో శిక్షణ పొంది ఆధునిక మెలకువలు పాటిస్తూ ముత్యాల సాగు చేస్తుండటం విశేషం. కనీసం 4,500 మంది రైతులు ముత్యాల సాగు చేస్తున్నారని ఔరంగాబాద్‌కు చెందిన ముత్యాల వ్యాపారి అరుణ్ అంబోర్ చెబుతున్నారు. మంచి ఆదాయం వస్తుండటంతో మరఠ్వాడా ప్రాంతంలో ముత్యాల సాగు ఏటేటా విస్తరిస్తోంది. ఎఫ్.పి.ఓ. ద్వారా సమష్టి సేద్యం రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఎఫ్.పి.ఓ.)ల ద్వారా కూడా రైతులు సమష్టిగా ముత్యాల సాగు చేపడుతున్నారు. ఒస్మానాబాద్ జిల్లా షహపూర్ గ్రామానికి చెందిన రైతు సంజయ్ పవార్ మరో 9 మంది రైతులతో కలిసి త్రివేణి పెరల్స్ అండ్ ఫిష్ ఫామ్ పేరిట ఎఫ్.పి.ఓ.ను నెలకొల్పారు. రెండేళ్ల క్రితం కరోనా కష్టాలను సైతం లెక్క చేయకుండా భువనేశ్వర్‌లో సిఫాకు వెళ్లి ముత్యాల పెంపకంలో శిక్షణ పొంది సాగు చేశారు. తొలి ఏడాదే రూ.14 లక్షల నికరాదాయం పొందారు. సొంత పొలంలో 300 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతున రూ. 8.5 లక్షల పెట్టుబడితో 2020–21లో చెరువు తవ్వారు. నీరు ఇంకిపోకుండా అడుగున పాలిథిన్ షీట్ వేశారు. ఔరంగాబాద్‌లోని ముత్యాల వ్యాపారి అరుణ్ అంబోర్ దగ్గర నుంచి 25 వేల మంచినీటి ఆల్చిప్పలను ఒక్కొక్కటి రూ. 90 చొప్పున కొనుగోలు చేశారు. 2021 జూలైలో ఆల్చిప్పలను ఇనుప మెష్‌లో అమర్చి, చెరువు నీటిలో మునిగేలా తాళ్లతో లాగి గట్టుపై పోల్స్‌కు కట్టారు. చెరువులో నీరు ఆవిరైపోకుండా చెరువుపైన కూడా పాలిథిన్ షీట్ కలిపారు. చెరువు చుట్టూతా మెష్ వేశారు. ముత్యం ధర రూ. 400 చెరువు నీటిలో నాచును ఆహారంగా తీసుకుంటూ ఆల్చిప్ప పెరుగుతుంది. నాచు పెరగడం కోసం (నెలకో వెయ్యి చొప్పున రోజుకు కొన్ని) స్పైరులినా టాబ్లెట్లను వేశారు. ఆల్చిప్పను రెండుగా చీల్చి మధ్యలోకి చిన్నపాటి నమూనాను చొప్పిస్తే.. దాని చుట్టూ కొద్దినెలల్లో తెల్లటి పదార్థం పోగుపడి.. ముత్యంగా తయారవుతుంది. లోపలికి చొప్పించేది ఏ ఆకారంలో ఉంటే ముత్యం ఆ (ఉదా.. దేవతామూర్తి/ బియ్యపు గింజ/ గుండ్రటి చిరుధాన్యం) ఆకారంలో తయారవుతుంది. 2022 సెప్టెంబర్‌లో పది వేల ముత్యాలు వచ్చాయి. ముత్యం రూ. 400కి అమ్మారు. రూ. 40 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను తొలి ఏడాదే రూ.14 లక్షల నికరాదాయం వచ్చిందని సంజయ్ తెలిపారు. ‘ముత్యాల పెంపకం మరీ కష్టమేమీ కాదు, మెలకువలను పాటిస్తే చాల’ని రైతు గోవింద్ షిండే అన్నారు. (క్లిక్ చేయండి: చదివింది 8వ తరగతే.. ఆవిష్కరణలు అద్భుతం.. ఎవరా ఘనాపాటి!) -
ఆగని ‘మహా’ వ్యథ
సాక్షి ముంబై: అతివృష్టి లేదంటే అనావృష్టి.. ఆదుకునే నాథుడు లేడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటు ఇంకా కొలిక్కి రాలేదు. రాష్ట్రపతి పాలన పెట్టడంతో తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక మహారాష్ట్రలో అన్నదాతలు కుంగిపోతున్నారు. గత కొన్నేళ్లుగా కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడిన రైతాంగం ఈ ఏడాది కురిసిన వర్షాలకు ఆనందం చెందారు. తమ పంట పండిందని సంబరాలు చేసుకున్నారు. అయితే అక్టోబర్‌లో రుతుపవనాల తిరుగు ప్రయాణ సమయంలో భారీగా వర్షాలు కురవడంతో చేతికందిన పంట నీళ్లపాలైంది. దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. కేవలం మరాఠ్వాడా ప్రాంతంలో 41 లక్షల హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, కందితో పాటు ఇతర పండ్ల తోటలకు తీవ్రంగా నష్టం వాటిల్లడంతో రైతన్నలు తట్టుకోలేకపోయారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో 68 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈ ఏడాది జనవరి నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో 746 మంది బలవన్మరణం పొందారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై తమను ఆదుకుంటుందేమోనని రైతాంగం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలోనే రాష్ట్రపతి పాలన పెట్టడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. అయితే రాష్ట్ర గవర్నర్ పంట నష్టపోయిన వారికి ప్రతీ హెక్టార్‌కు రూ.8 వేలు, పండ్ల తోటలకు ప్రతీ హెక్టార్‌కు రూ.18 వేలు ప్రకటించడం కాస్త ఊరటనిచ్చినా కష్టాల ఊబి నుంచి రైతుల్ని బయటపడవేయలేకపోయాయి. ప్రభుత్వ లెక్కలన్నీ తప్పులే ‘సాక్షి’తో పి. సాయినాథ్ రైతు కష్టాల్లో మహారాష్ట్ర అత్యంత దయనీయ స్థితిలో ఉందని సీనియర్ జర్నలిస్టు, ది హిందూ పత్రిక గ్రామీణ వ్యవహారాల మాజీ ఎడిటర్ పి. సాయినాథ్ అన్నారు. రైతుల ఆత్మహత్య వివరాల్లో ప్రభుత్వ గణాంకాలన్నీ తప్పుడువేనని చెప్పారు. ఈ విషయమై ఆయన సాక్షితో మాట్లాడుతూ 1995 నుంచి 2015 వరకు 20 ఏళ్లలో మహారాష్ట్రలో 65 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెబుతున్నారు కానీ, ఇది సరైనది కాదని అన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలను సేకరించే పద్ధతిలో లోపాలున్నాయని అన్నారు. వారు సరిగ్గా లెక్కలు వేసి ఉంటే ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న డేటా కూడా మూడేళ్ల నాటిదని సాయినాథ్ వ్యాఖ్యానించారు. రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలోనే కనీసం ప్రభుత్వం కూడా లేకపోవడం పులి మీద పుట్రవంటిదేనని వ్యాఖ్యానించారు. -
మరాఠ్వాడా రైతులను ఆదుకోండి
సాక్షి, ముంబై: మరాఠ్వాడాలో కరువు కరాళనృత్యం చేస్తోందని, రైతుల పరిస్థితి దైన్యంగా మారిందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే పేర్కొన్నారు. మరాఠ్వాడా పర్యటనలో చివరి రోజైన మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరాఠ్వాడాలో కరువు పరిస్థితి రోజురోజుకూ తీవ్రతరమవుతోందని చెప్పారు. పశువులకు కనీసం గ్రాసం కూడా దొరకడంలేదన్నారు. ఈ ఏడాది ఇక్కడ కేవలం 414 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని.. దాంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ఈ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, రైతుల నుంచి రుణ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మరాఠ్వాడా రైతులకు శివసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఇక్కడి కరువు పరిస్థితిని గవర్నర్ దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. అలాగే కొంకణ్‌లోని అదనపు నీటిని మరాఠ్వాడాకు తరలించవచ్చా.. అనే విషయంపై కూడా చర్చించాలని కోరతామన్నారు. ఇదిలా ఉండగా, రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సేపై మరోసారి ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు. ముందు అజిత్ పవార్ మాదిరిగా మాట్లాడిన ఆయన మంగళవారం శరద్ పవార్‌లాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉద్ధవ్ వ్యాఖ్యలు పట్టించుకోను: ఖడ్సే వ్యవసాయం తెలియనివాళ్లు తనపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోనని రెవెన్యూ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే ధ్వజమెత్తారు. పంటల గురించి తనకు చెప్పాల్సిన అవసరం లేదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు చురక అంటించారు. రైతులకు మొబైల్ ఫోన్ల బిల్లులు చెల్లించేందుకు డబ్బులుంటాయి.... కాని విద్యుత్ బిల్లులు ఎందుకు కట్టడం లేదని సోమవారం ఖడ్సే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా రైతులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఖడ్సేను ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. దీనిపై ఖడ్సే మంగళవారం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల గురించి తాను చెప్పిందాన్ని మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. మొబైల్ బిల్లు డబ్బును ఆదా చేసుకుని వాటిని విద్యుత్ బిల్లుకు వాడుకోవాలని చెప్పానే తప్ప వేరే వ్యాఖ్యలు చేయలేదన్నారు. కరువు పీడిత ప్రాంతాల్లో 10,11,12 తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా కరువు ప్రాంతాల రైతులకు ప్రభుత్వం విద్యుత్ బిల్లుల్లో 33 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. వారిద్దరూ ఒకటైతే మాకేంటి : శరద్‌పవార్ శివసేన, బీజేపీలపై తనదైన శైలిలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ చురకంటించారు. శివసేన, బీజేపీలు ఒక్కటైతే ఎవరి మద్దతు అవసరం ఉండదన్నారు. ముఖ్యంగా బీజేపీకి శివసేన మద్దతు పలికినట్టయితే మందు తీసుకోకుండానే రోగం కుదిరినట్టు అవుతుందని వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో భాగంగా సాంగ్లీ జిల్లాలోని కరాడ్కి వచ్చిన శరద్ పవార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలా లేదా అనేది శివసేన, బీజేపీ అంతర్గత విషయమన్నారు. దాంతో తమకు ఎలాంటి సంబంధంలేదని చెప్పారు. స్థిరప్రభుత్వం ఉండాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీకి ఎన్సీపీ బయటినుంచి మద్దతు పలికిందన్నారు.