Freshwater
-
Pearl Culture: ముత్యాల సాగు.. ఏడాదికి 14 లక్షల నికరాదాయం
నీటి వనరులు పరిమితంగా ఉన్న మెట్ట ప్రాంతంలోనూ మంచినీటి చెరువుల్లో ముత్యాల పెంపకంతో మంచి ఆదాయం గడించవచ్చని మహారాష్ట్రలోని మరఠ్వాడా రైతులు నిరూపిస్తున్నారు. ఔరంగాబాద్ పరిసర ప్రాంతాల్లో గత 10–15 ఏళ్లుగా మంచినీటిలో ముత్యాల సాగు పుంజుకుంటున్నది. కరువు ప్రాంతం అయినప్పటికీ భువనేశ్వర్‌లోని కేంద్రీయ మంచినీటి ఆక్వాకల్చర్ పరిశోధనా సంస్థ (సిఫా) శాస్త్రవేత్తల పర్యవేక్షణలో శిక్షణ పొంది ఆధునిక మెలకువలు పాటిస్తూ ముత్యాల సాగు చేస్తుండటం విశేషం. కనీసం 4,500 మంది రైతులు ముత్యాల సాగు చేస్తున్నారని ఔరంగాబాద్‌కు చెందిన ముత్యాల వ్యాపారి అరుణ్ అంబోర్ చెబుతున్నారు. మంచి ఆదాయం వస్తుండటంతో మరఠ్వాడా ప్రాంతంలో ముత్యాల సాగు ఏటేటా విస్తరిస్తోంది. ఎఫ్.పి.ఓ. ద్వారా సమష్టి సేద్యం రైతు ఉత్పత్తిదారుల సంఘా(ఎఫ్.పి.ఓ.)ల ద్వారా కూడా రైతులు సమష్టిగా ముత్యాల సాగు చేపడుతున్నారు. ఒస్మానాబాద్ జిల్లా షహపూర్ గ్రామానికి చెందిన రైతు సంజయ్ పవార్ మరో 9 మంది రైతులతో కలిసి త్రివేణి పెరల్స్ అండ్ ఫిష్ ఫామ్ పేరిట ఎఫ్.పి.ఓ.ను నెలకొల్పారు. రెండేళ్ల క్రితం కరోనా కష్టాలను సైతం లెక్క చేయకుండా భువనేశ్వర్‌లో సిఫాకు వెళ్లి ముత్యాల పెంపకంలో శిక్షణ పొంది సాగు చేశారు. తొలి ఏడాదే రూ.14 లక్షల నికరాదాయం పొందారు. సొంత పొలంలో 300 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతున రూ. 8.5 లక్షల పెట్టుబడితో 2020–21లో చెరువు తవ్వారు. నీరు ఇంకిపోకుండా అడుగున పాలిథిన్ షీట్ వేశారు. ఔరంగాబాద్‌లోని ముత్యాల వ్యాపారి అరుణ్ అంబోర్ దగ్గర నుంచి 25 వేల మంచినీటి ఆల్చిప్పలను ఒక్కొక్కటి రూ. 90 చొప్పున కొనుగోలు చేశారు. 2021 జూలైలో ఆల్చిప్పలను ఇనుప మెష్‌లో అమర్చి, చెరువు నీటిలో మునిగేలా తాళ్లతో లాగి గట్టుపై పోల్స్‌కు కట్టారు. చెరువులో నీరు ఆవిరైపోకుండా చెరువుపైన కూడా పాలిథిన్ షీట్ కలిపారు. చెరువు చుట్టూతా మెష్ వేశారు. ముత్యం ధర రూ. 400 చెరువు నీటిలో నాచును ఆహారంగా తీసుకుంటూ ఆల్చిప్ప పెరుగుతుంది. నాచు పెరగడం కోసం (నెలకో వెయ్యి చొప్పున రోజుకు కొన్ని) స్పైరులినా టాబ్లెట్లను వేశారు. ఆల్చిప్పను రెండుగా చీల్చి మధ్యలోకి చిన్నపాటి నమూనాను చొప్పిస్తే.. దాని చుట్టూ కొద్దినెలల్లో తెల్లటి పదార్థం పోగుపడి.. ముత్యంగా తయారవుతుంది. లోపలికి చొప్పించేది ఏ ఆకారంలో ఉంటే ముత్యం ఆ (ఉదా.. దేవతామూర్తి/ బియ్యపు గింజ/ గుండ్రటి చిరుధాన్యం) ఆకారంలో తయారవుతుంది. 2022 సెప్టెంబర్‌లో పది వేల ముత్యాలు వచ్చాయి. ముత్యం రూ. 400కి అమ్మారు. రూ. 40 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోను తొలి ఏడాదే రూ.14 లక్షల నికరాదాయం వచ్చిందని సంజయ్ తెలిపారు. ‘ముత్యాల పెంపకం మరీ కష్టమేమీ కాదు, మెలకువలను పాటిస్తే చాల’ని రైతు గోవింద్ షిండే అన్నారు. (క్లిక్ చేయండి: చదివింది 8వ తరగతే.. ఆవిష్కరణలు అద్భుతం.. ఎవరా ఘనాపాటి!) -
ఇదేం గురుకులం?
ఒకప్పుడు గురుకుల పాఠశాలలంటే చదువు.. సంధ్యలతోపాటు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవి. తల్లిదండ్రులు వీటిని కార్పొరేట్ పాఠశాలలకంటే గొప్పగా చూసేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర విభజన తరువాత వీటి మనుగడ రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. సమస్యలను పట్టించుకునేవారే లేకుండా పోయారు. జిల్లాలోని ఒక్కో పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేవంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. - సమస్యలతో విద్యార్థుల సావాసం - చాలాచోట్ల మంచినీటికి ఇక్కట్లు - పీడిస్తున్న సిబ్బంది కొరత - సీఎం ఇలాకాలో మరిన్ని ఖాళీలు పలమనేరు: సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రాభవం ఏటా తగ్గుముఖం పడుతోంది. సరైన సదుపాయాలు లేక విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. జిల్లాకు సంబంధించి జోన్-4లో మొత్తం 13 (రామకుప్పం, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట, చిత్తూరు, పీలేరు, బురకాయలకోట, పలమనేరు, సత్యవేడు, పుత్తూరు, మదనపల్లె, కుప్పం, జీడీ నెల్లూరు, పూతలపట్టు) పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ సోషియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఐదోతరగతి నుంచి ఇంటర్ ద్వితీయసంవత్సరం వరకు ఐదు వేలమందికిపైగా చదువుతున్నారు. గతంలో ఇక్కడ విద్యాబోధన, పాఠశాలల నిర్వహణ, నిధులు అన్నీ బాగుండేవి. కానీ ఇప్పుడు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. మంచినీటికి కటకట పలు పాఠశాలల్లో విద్యార్థులకు తాగేందుకు మంచినీళ్లు కూడా లేవు. ఇక ఇతరత్రాలకు ఇబ్బందులే. రోజూవారీ స్నానాలూ కరువే. వారానికొక్కసారి మాత్రమే దుస్తులు ఉతుక్కోవాలి. పలమనేరు పాఠశాలలో పలుబోర్లు వేసినా చుక్క నీరు రాలేదు. మున్సిపాలిటీ నుంచి అందే రెండు ట్యాంకర్లే దిక్కు.వీరు ప్రయివేటుగా నీటిని కొనుక్కొని ఎలా గో నెట్టుకొస్తున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని బొ.కొత్తకోట, రామకుప్పం, పీలేరు తదితర పాఠశాలల్లో నెలకొంది. పూర్తిస్థాయిలో అందని యూనిఫాం పాఠశాలలు ప్రారంభమై రెండునెలలు గడుస్తున్నా అందరికీ యూనిఫాంలు అందలేదు. వీటిని కుట్టేందుకు టెండర్లు దక్కించుకొన్నవారు చాలా పాఠశాలలకు ఒకరిద్దరు కావడంతో ఓ చోట కుట్టి మరో చోటుకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో సగం మందికి మాత్రమే యూనిఫాంలున్నాయి. వీటికి చున్నీలు కూడా ఇంతవరకూ రాలేదు. దాంతో గతేడాది యూనిఫాంనే వీరు ధరించాల్సి వస్తోంది. సీఎం సొంత ఇలాకాలో ఖాళీలు మెండు సీఎం సొంత నియోజకవర్గం కుప్పం గురుకుల పాఠశాల అంటే విద్యార్థులు, తల్లిదండ్రులు దడుసుకుంటున్నారు. ఇక్కడ అన్నీ సమస్యలే. ఇక్కడ 40 సీట్లు వరకు ఖాళీలున్నట్లు సమాచారం. ఇదే పరిస్థితి మిగిలిన పలు పాఠశాలల్లో ఉంది. కానీ సంబంధిత ప్రిన్సిపాళ్లు మాత్రం తమకు ఖాళీలు పెద్దగా లేవంటూ చెప్పుకురావడం విమర్శలకు తావిస్తోంది. ఇక టీచింగ్ స్టాఫ్‌కు సంబంధించి 40 శాతం మంది మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులున్నారు. మిగిలినవారంతా కాంట్రాక్టు సిబ్బందే. నాన్ టీచింగ్ సా్‌టఫ్ ఖాళీలూ 40కి పైగా ఉన్నాయి. ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తే తప్ప ఇవి భర్తీకాని పరిస్థితి. ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పోస్టులను కాంట్రాక్టు వారితో పూర్తిచేస్తే ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే విమర్శలున్నాయి. ఈ పోస్టుల నియామకాల్లోనూ సంబంధిత ప్రిన్సిపాళ్ల హవా కనిపిస్తోంది. మోడల్ స్కూళ్ల ఎఫెక్ట్ జిల్లాలో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు, కస్తూర్బా పాఠశాలల కారణంగా వీటిల్లో చేరేవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఏదేమైనా భవిష్యత్‌లో ఈ పాఠశాలల వన్నె తగ్గకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. అన్ని సమస్యలు సర్దుకుంటాయిలే.. జిల్లాలోని పలు చోట్ల నీటి సమస్య ఉంది. ప్రయివేటుగానే నీటిని కొంటున్నాం. ఇక యూనిఫాంలు వచ్చేనెల 15లోపు అందేలా చర్యలు తీసుకుంటాం. కాంట్రాక్టు అధ్యాపకులకు కౌన్సెలింగ్ చేశాం. కుప్పంలో మాత్రం ఖాళీలున్నాయి. త్వరలో అన్నీ సర్దుకుంటాయిలే.. - స్వర్ణకుమారి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కన్వీనర్, శ్రీకాళహస్తి -
గొంతెండనీయం
ప్రతి ఇంటికీ 24 గంటలపాటు తాగునీరు కార్యాచరణకు త్వరలోనే మంత్రుల కమిటీ రెండోరోజు టీఆర్ఎస్ శిక్షణ శిబిరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండ: రాష్ట్రంలో ప్రతి ఇంటికీ 24 గంటలపాటు మంచినీటిని సరఫరా చేస్తామని, కార్యాచరణ కోసం త్వరలోనే మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు తాగునీటిని ఉచితంగా ఇస్తామన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద విజయవిహార్‌లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం ఆది వారం రెండోరోజూ కొనసాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వంటి అంశాలపై పలువురు నిపుణులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో పలు అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను ప్రపంచానికే ఆదర్శంగా నిలపాలని, ఇందుకోసం ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. వ్యవసాయం లాభసాటి కాదనే భావనను పోగొట్టాలని, సాగును ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఈ అంశంపై జరిగిన చర్చలో సీఎం పేర్కొన్నారు. త్వరలోనే నిజమైన ఆదర్శ రైతులను హైదరాబాద్ పిలిపించి, వారితో మాట్లాడి వ్యవసాయ విధానాన్ని ఖరారు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో ఇద్దరు రైతులను ఎంపిక చేసి ఆధునిక వ్యవసాయం చేయిస్తామన్నారు. ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘మనం ఇజ్రాయెల్ వెళ్లడం కాదు.. ఆ దేశస్థులే అధ్యయనం కోసం మన దగ్గరకు వచ్చేలా వ్యవసాయం వృద్ధి చెందాలి’ అని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ చొరవ తీసుకోవాలన్నారు. వ్యవసాయాభివృద్ధికి నిధుల కొరత రానీయబోమని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమిస్తామని చెప్పారు. సాగులో ఉత్పాదకత పెరగాలని, తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండేలా వ్యవసాయాన్ని ఆధునీకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని, గోదాముల సంఖ్యను పెంచుతున్నామని వివరించారు. ఇప్పటివరకు గ్రామం యూనిట్‌గా ఉన్న పంటల బీమాను రైతు యూనిట్‌గా చేయడానికి ప్రయత్నిస్తున్నామని, దీనిపై కేంద్రంతో చర్చిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం వంటి సౌకర్యాల వల్ల పట్టణాలు పెరుగుతున్నాయని, జనాభాకు తగ్గట్టు కనీస సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ సౌకర్యాలు మెరుగుపడాలన్నారు. ప్రజాప్రతినిధి ఏ పనిచేసినా మన మంచికేనన్న నమ్మకం ప్రజల్లో కలిగితే ప్రభుత్వ పథకాలకు మద్దతు లభిస్తుందన్నారు. ఇందుకు సిద్ధిపేట మంచినీటి పథకమే ఉదాహరణ అని, ఆ పథకాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో నల్లాలు ఏర్పాటు చేయించాలని, ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలు విధిగా పాఠశాలలకు మంచినీటిని సరఫరా చేయాలని సూచించారు. పాత్ర ఉంటేనే ఆసక్తి.. బడ్జెట్ రూపకల్పనను ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పట్టించుకోవాలని సీఎం సూచించారు. ప్రతి రాజకీయ పార్టీలో బడ్జెట్‌పై చర్చ జరగాలని, ఇందుకోసం పార్టీలు అంతర్గతంగా సెక్రటేరియట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్లోనూ ఈ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసి సభ్యులకు శాఖలను కేటాయిస్తామని చెప్పారు. ఏ అంశంలోనైనా పాత్ర ఉన్నప్పుడే దానిపై ఆసక్తి ఉంటుందన్నారు. సభలో ఏ సభ్యుడైనా బిల్లును పెట్టవచ్చని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లును సి.హెచ్. విద్యాసాగర్‌రావు పెట్టారని, దాన్ని సభ ఆమోదించిందని గుర్తుచేశారు. ఇటీవలి కాలంలో సభా మర్యాదలు మంట కలుస్తున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొత్త విధానాలను తెచ్చేటప్పుడు సభ్యులంతా పాలుపంచుకునే వారని, ఇప్పుడు పరస్పర విమర్శలే మిగులుతున్నాయన్నారు. సభలో కొట్టుకుంటున్నారని, సస్పెన్షన్లు అనివార్యమవుతున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని సీఎం వ్యాఖ్యానించారు. పరిస్థితిలో మార్పు రావాలని, సభ్యులు ప్రవర్తనా నియమావళిని తెలుసుకోవాలని సూచించారు. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకముందే సభలో నినాదాలు, ధర్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులకు సహనం ఉండాలని హితవు పలికారు. అర్థమయ్యే భాషలో చెబుతాం వ్యవసాయంపై జరిగిన చర్చలో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు వాడిన కొన్ని సాంకేతిక పదాలు కొందరు నేతలకు అర్థం కాలేదు. గ్రీన్హౌస్ గ్యాస్, ఫామ్ మెకనైజేషన్‌లాంటి పదాలపై వారు సందేహాలు వ్యక్తం చేసినా లాభం లేకపోయింది. దీంతో కేసీఆర్ కలుగజేసుకుని వ్యవసాయ నిపుణులు చెప్పిన అంశాలు బాగున్నాయని, అయితే వాటిని సభ్యులకు అర్థమయ్యే భాషలో చెప్పాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ బలం కూడా అదేనని, తమ విధానాలేంటో ప్రజలకు అర్థమయ్యేలా చెబుతామని పేర్కొన్నారు. గ్రీన్‌హౌస్‌గ్యాస్, ఫామ్ మెకనైజేషన్ అనే పదాలకు అర్థాలను సభ్యులకు కేసీఆరే వివరించారు. రెండో రోజు శిక్షణలో.. రెండో రోజు వ్యవసాయంపై జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పెషలాఫీసర్ వి.ప్రవీణ్‌రావు, పట్టణాభివృద్ధిపై ఆస్కి డెరైక్టర్ శ్రీనివాసాచారి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-చట్టసభలు అనే అంశంపై అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్. రాజాసదారం, శాంతిభద్రతలపై హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి శిక్షణనిచ్చారు. వీరిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సోమవారం నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల అధ్యక్షులు కూడా పాల్గొంటారు. పోలీస్ పైరవీలు వద్దు పోలీస్ కార్యకలాపాల్లో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోకుంటేనే మంచిదని సీఎం సూచిం చారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు పోలీసులను ప్రతినిధులుగా, సాధనాలుగా మార్చుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌లో అదనంగా బస్‌బేలను, లక్ష వరకు సీసీ టీవీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆధునిక పోలీస్స్టేషన్లను కూడా నిర్మిస్తామన్నారు. వరంగల్, ఖమ్మం, రామగుండంను పోలీస్ కమిషనరేట్లుగా మారుస్తామన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్లో మహిళలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ తెలిపారు. -
త్వరలో వాటర్‌బోర్డులో ఖాళీల భర్తీ
హోంమంత్రి నాయిని వెల్లడి నగరంలో నీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులకు సూచన పంజగుట్ట: మహానగరంలో మంచినీటి ఎద్దడి లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని హోం,కార్మికశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి జలమండలి అధికారులు,కార్మికులను కోరారు. సోమవారం ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నూతనంగా నియమితులైన జనరల్ పర్పస్ ఎంప్లాయి(జీపీఈ)లు పదిమంది కార్మికులకునియామకపత్రాలు అందజేసిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. బోర్డులో 23 ఏళ్లుగా నానా ఇబ్బందులు పడుతున్న ఎన్ఎంఆర్,హెచ్ఆర్ కార్మికుల విధులను క్రమబద్దీకరించిన ఘనత బోర్డు గుర్తింపు కార్మికసంఘం గౌరవ అధ్యక్షుడు, సాగునీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావుదేనని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీఠవేస్తున్నామని, సమ్మెలు, లాకౌట్లకు తావులేకుండా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీఇచ్చారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామంటూ..బోర్డులో ఖాళీ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. మంగళవారం నూతనంగా నియమితులైన సుమారు 600మంది ఎన్ఎంఆర్,హెచ్ఆర్ కార్మికులకు బోర్డు అధికారులు నియమాక పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో జలమండ లి ఎండీ శ్యామలరావు, కామ్‌గార్ యూనియన్ గౌరవాధ్యక్షుడు సతీష్‌కుమార్,ఈఎన్సీ సత్యనారాయణ ఉన్నతాధికారులు, అధికసంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. శాంతిభద్రతలకు పెద్దపీఠ: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తామని నాయిని ప్రకటించారు. పోలీసుశాఖకు తగినన్ని నిధులు కేటాయించడంతోపాటు ఆధునిక ఆయుధాలతోపాటు గల్లీకో కెమెరా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. -
ఆవు పేడతో మంచినీరు..!
న్యూయార్క్: ఆవు పేడతో మంచినీటిని సృష్టించవచ్చట. వినడానికి వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం అంటున్నారు అమెరికా పరిశోధకులు. తీవ్రమైన కరువు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందించేందుకు ఈ కొత్త పద్ధతి చాలా ఉపయుక్తమని వీరు చెపుతున్నారు. అంతేకాక ఆవు పేడ నుంచి మంచినీరు వేరు చేయగా మిగిలిన వ్యర్థాలను ఎరువుగా కూడా వినియోగించుకోవచ్చని చెపుతున్నారు. అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ‘ద మెక్‌లాహన్ నట్‌రైంట్ సెపరేషన్ సిస్టమ్ (ఎంఎన్‌ఎస్‌ఎస్)’ అనే అతి సూక్ష్మ వడపోత వ్యవస్థను రూపొందించారు. ఇది ఆవు పేడ నుంచి రసాయనాలు, ఇతర వ్యర్థాలను వేరు చేసి సురక్షితమైన మంచినీరు ను, అలాగే ఎరువులను అందిస్తుంది. దీనిపై మిచిగాన్ వర్సిటీ పరిశోధకుడు స్టీవ్ సఫ్ఫర్‌మన్ స్పందిస్తూ.. ‘‘మీ దగ్గర వెయ్యి ఆవులు ఉన్నట్లయితే వాటి నుంచి ఏటా పది మిలియన్ గ్యాలన్ల ఆవు పేడ ఉత్పత్తి అవుతుంది. ఇందులో 90 శాతం మంచినీరే. అయితే ఆవుపేడలో రసాయనాలు, కార్బన్లు, రోగకారకాలు ఉంటాయి. ఆవు పేడ నుంచి మంచినీటిని తీయడం సంక్లిష్టమై న ప్రక్రియ. మంచినీరును తీసిన తర్వాత మిగిలే వ్యర్థాలు పర్యావరణానికి హానికరం. వీటిని కచ్చితంగా ఎరువుగా ఉపయోగించుకోవాలి’’ అని చెప్పారు. ప్రస్తుతం తాము రూపొందించిన విధానం ప్రకారం వంద గ్యాలన్ల ఆవు పేడ నుంచి 50 గ్యాలన్ల సురక్షిత మంచినీరును అందించవచ్చని వెల్లడించారు. -
సేవతోనే ప్రజలకు చేరువ : బాలకృష్ణ
నిమ్మకూరు(గుడివాడ), న్యూస్‌లైన్ : సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతానని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ చైర్మన్, సినీ హీరో నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా రూ.3లక్షల వ్యయంతో నిర్మించిన మంచినీటి ఆర్వో ప్లాంటును ఆయన శనివారం ప్రారంభించారు. శుక్రవారం రాత్రి స్వగ్రామం నిమ్మకూరు చేరుకున్నారు. ఆయన బంధువు గ్రామ ఉపసర్పంచి నందమూరి శివరామకృష్ణ ఇంట్లో ఉన్నారు. శనివారం ఉదయం 8గంటల సమయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గ్రామంలో శ్రీపద్మావతి,గోదాదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామివారి దేవస్థానంలో ఆయన పూజలు నిర్వహించారు. బాలకృష్ణ తల్లిదండ్రులు, ఆయన భార్యతోపాటు కుమారుడు మోక్షజ్ఞ తారకరామతేజ, అల్లుళ్లు- కూతుర్లు లోకేష్, బ్రాహ్మణి, శ్రీభరత్, తేజశ్వినీ, బావ చంద్రబాబునాయుడు, భువనేశ్వరీ పేర్లతో పూజలు జరిపారు. ఎన్టీఆర్, బసవతారకంల విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. రానున్న కాలంలో అభిమానులను సేవా కార్యక్రమాల్లో నిమగ్నం చేసేందుకు గానూ తన ఆధ్వర్యంలో ఎన్బీకే ట్రస్టును ప్రారంభించనున్నట్లు వివరించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, పామర్రు నియోజకవర్గ ఇన్చార్జి వీ రామయ్య, ఎన్టీఆర్ ట్రస్టు సీఈఓ చల్లా కొండయ్య, విజయవాడ టీడీపీ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, బందరు మున్సిపల్ మాజీ చైర్మన్ బచ్చుల అర్జునుడు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పొట్లూరి కృష్ణబాబు, గుడివాడ టీడీపీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు, టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకటగురుమూర్తి, తెలుగు రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, నాయకులు మండపాక శంకరబాబు, గొట్టిపాటి లక్ష్మీదాసు, ఈడ్పుగంటి వెంకట్రామయ్య, నందమూరి శివరామకృష్ణ. గ్రామసర్పంచి జంపాని వెంకటేశ్వరరావు, కొల్లు రవీంద్ర, పామర్రు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుత్తికొండ పద్మ, కుదరవల్లి ప్రవీణ్‌కుమార్, జిల్లా బీసీ నాయకులు పొనిపిరెడ్డి శ్రీహరి, పామర్తి విజయశేఖర్, ఎన్.కిరణ్‌కుమార్, అనగాని మురళి పాల్గొన్నారు.