గొంతెండనీయం | Each household drinking water 24 hours a day - kcr | Sakshi
Sakshi News home page

గొంతెండనీయం

Published Mon, May 4 2015 12:45 AM | Last Updated on Mon, Aug 13 2018 4:03 PM

గొంతెండనీయం - Sakshi

గొంతెండనీయం

ప్రతి ఇంటికీ 24 గంటలపాటు తాగునీరు
కార్యాచరణకు త్వరలోనే మంత్రుల కమిటీ
రెండోరోజు టీఆర్‌ఎస్ శిక్షణ శిబిరంలో ముఖ్యమంత్రి కేసీఆర్


నల్లగొండ: రాష్ట్రంలో ప్రతి ఇంటికీ 24 గంటలపాటు మంచినీటిని సరఫరా చేస్తామని, కార్యాచరణ కోసం త్వరలోనే మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు తాగునీటిని ఉచితంగా ఇస్తామన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద విజయవిహార్‌లో టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం ఆది వారం రెండోరోజూ కొనసాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వంటి అంశాలపై పలువురు నిపుణులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో పలు అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను ప్రపంచానికే ఆదర్శంగా నిలపాలని, ఇందుకోసం ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. వ్యవసాయం లాభసాటి కాదనే భావనను పోగొట్టాలని, సాగును ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఈ అంశంపై జరిగిన చర్చలో సీఎం పేర్కొన్నారు.

త్వరలోనే నిజమైన ఆదర్శ రైతులను హైదరాబాద్ పిలిపించి, వారితో మాట్లాడి వ్యవసాయ విధానాన్ని ఖరారు చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో ఇద్దరు రైతులను ఎంపిక చేసి ఆధునిక వ్యవసాయం చేయిస్తామన్నారు. ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘మనం ఇజ్రాయెల్ వెళ్లడం కాదు.. ఆ దేశస్థులే అధ్యయనం కోసం మన దగ్గరకు వచ్చేలా వ్యవసాయం వృద్ధి చెందాలి’ అని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ చొరవ తీసుకోవాలన్నారు. వ్యవసాయాభివృద్ధికి నిధుల కొరత రానీయబోమని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమిస్తామని చెప్పారు. సాగులో ఉత్పాదకత పెరగాలని, తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండేలా వ్యవసాయాన్ని ఆధునీకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని, గోదాముల సంఖ్యను పెంచుతున్నామని వివరించారు. ఇప్పటివరకు గ్రామం యూనిట్‌గా ఉన్న పంటల బీమాను రైతు యూనిట్‌గా చేయడానికి ప్రయత్నిస్తున్నామని, దీనిపై కేంద్రంతో చర్చిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.

సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం

ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం వంటి సౌకర్యాల వల్ల పట్టణాలు పెరుగుతున్నాయని, జనాభాకు తగ్గట్టు కనీస సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ సౌకర్యాలు మెరుగుపడాలన్నారు. ప్రజాప్రతినిధి ఏ పనిచేసినా మన మంచికేనన్న నమ్మకం ప్రజల్లో కలిగితే ప్రభుత్వ పథకాలకు మద్దతు లభిస్తుందన్నారు. ఇందుకు సిద్ధిపేట మంచినీటి పథకమే ఉదాహరణ అని, ఆ పథకాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో నల్లాలు ఏర్పాటు చేయించాలని, ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలు విధిగా పాఠశాలలకు మంచినీటిని సరఫరా చేయాలని సూచించారు.
 
పాత్ర ఉంటేనే ఆసక్తి..

బడ్జెట్ రూపకల్పనను ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పట్టించుకోవాలని సీఎం సూచించారు. ప్రతి రాజకీయ పార్టీలో బడ్జెట్‌పై చర్చ జరగాలని, ఇందుకోసం పార్టీలు అంతర్గతంగా సెక్రటేరియట్‌లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌లోనూ ఈ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసి సభ్యులకు శాఖలను కేటాయిస్తామని చెప్పారు. ఏ అంశంలోనైనా పాత్ర ఉన్నప్పుడే దానిపై ఆసక్తి ఉంటుందన్నారు. సభలో ఏ సభ్యుడైనా బిల్లును పెట్టవచ్చని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లును సి.హెచ్. విద్యాసాగర్‌రావు పెట్టారని, దాన్ని సభ ఆమోదించిందని గుర్తుచేశారు. ఇటీవలి కాలంలో సభా మర్యాదలు మంట కలుస్తున్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొత్త విధానాలను తెచ్చేటప్పుడు సభ్యులంతా పాలుపంచుకునే వారని, ఇప్పుడు పరస్పర విమర్శలే మిగులుతున్నాయన్నారు. సభలో కొట్టుకుంటున్నారని, సస్పెన్షన్లు అనివార్యమవుతున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని సీఎం వ్యాఖ్యానించారు. పరిస్థితిలో మార్పు రావాలని, సభ్యులు ప్రవర్తనా నియమావళిని తెలుసుకోవాలని సూచించారు. కొత్త సభ్యులు ప్రమాణ  స్వీకారం చేయకముందే సభలో నినాదాలు, ధర్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులకు సహనం ఉండాలని హితవు పలికారు.
 
అర్థమయ్యే భాషలో చెబుతాం

వ్యవసాయంపై జరిగిన చర్చలో భాగంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు వాడిన కొన్ని సాంకేతిక పదాలు కొందరు నేతలకు అర్థం కాలేదు. గ్రీన్‌హౌస్ గ్యాస్, ఫామ్ మెకనైజేషన్‌లాంటి పదాలపై వారు సందేహాలు వ్యక్తం చేసినా లాభం లేకపోయింది. దీంతో కేసీఆర్ కలుగజేసుకుని వ్యవసాయ నిపుణులు చెప్పిన అంశాలు బాగున్నాయని, అయితే వాటిని సభ్యులకు అర్థమయ్యే భాషలో చెప్పాలని సూచించారు. టీఆర్‌ఎస్ పార్టీ బలం కూడా అదేనని, తమ విధానాలేంటో ప్రజలకు అర్థమయ్యేలా చెబుతామని పేర్కొన్నారు. గ్రీన్‌హౌస్‌గ్యాస్, ఫామ్ మెకనైజేషన్ అనే పదాలకు అర్థాలను సభ్యులకు కేసీఆరే వివరించారు.
 
 రెండో రోజు శిక్షణలో..


 రెండో రోజు వ్యవసాయంపై జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పెషలాఫీసర్ వి.ప్రవీణ్‌రావు, పట్టణాభివృద్ధిపై ఆస్కి డెరైక్టర్ శ్రీనివాసాచారి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-చట్టసభలు అనే అంశంపై అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్. రాజాసదారం, శాంతిభద్రతలపై హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి శిక్షణనిచ్చారు. వీరిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సోమవారం నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల అధ్యక్షులు కూడా పాల్గొంటారు.
 
 పోలీస్ పైరవీలు వద్దు

పోలీస్ కార్యకలాపాల్లో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోకుంటేనే మంచిదని సీఎం సూచిం చారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు పోలీసులను ప్రతినిధులుగా, సాధనాలుగా మార్చుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌లో అదనంగా బస్‌బేలను, లక్ష వరకు సీసీ టీవీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆధునిక పోలీస్‌స్టేషన్లను కూడా నిర్మిస్తామన్నారు. వరంగల్, ఖమ్మం, రామగుండంను పోలీస్ కమిషనరేట్‌లుగా మారుస్తామన్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ తెలిపారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement