ఇదేం గురుకులం?
ఒకప్పుడు గురుకుల పాఠశాలలంటే చదువు.. సంధ్యలతోపాటు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవి. తల్లిదండ్రులు వీటిని కార్పొరేట్ పాఠశాలలకంటే గొప్పగా చూసేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర విభజన తరువాత వీటి మనుగడ రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. సమస్యలను పట్టించుకునేవారే లేకుండా పోయారు. జిల్లాలోని ఒక్కో పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేవంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది.
- సమస్యలతో విద్యార్థుల సావాసం
- చాలాచోట్ల మంచినీటికి ఇక్కట్లు
- పీడిస్తున్న సిబ్బంది కొరత
- సీఎం ఇలాకాలో మరిన్ని ఖాళీలు
పలమనేరు: సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రాభవం ఏటా తగ్గుముఖం పడుతోంది. సరైన సదుపాయాలు లేక విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. జిల్లాకు సంబంధించి జోన్-4లో మొత్తం 13 (రామకుప్పం, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట, చిత్తూరు, పీలేరు, బురకాయలకోట, పలమనేరు, సత్యవేడు, పుత్తూరు, మదనపల్లె, కుప్పం, జీడీ నెల్లూరు, పూతలపట్టు) పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ సోషియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఐదోతరగతి నుంచి ఇంటర్ ద్వితీయసంవత్సరం వరకు ఐదు వేలమందికిపైగా చదువుతున్నారు. గతంలో ఇక్కడ విద్యాబోధన, పాఠశాలల నిర్వహణ, నిధులు అన్నీ బాగుండేవి. కానీ ఇప్పుడు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి.
మంచినీటికి కటకట
పలు పాఠశాలల్లో విద్యార్థులకు తాగేందుకు మంచినీళ్లు కూడా లేవు. ఇక ఇతరత్రాలకు ఇబ్బందులే. రోజూవారీ స్నానాలూ కరువే. వారానికొక్కసారి మాత్రమే దుస్తులు ఉతుక్కోవాలి. పలమనేరు పాఠశాలలో పలుబోర్లు వేసినా చుక్క నీరు రాలేదు. మున్సిపాలిటీ నుంచి అందే రెండు ట్యాంకర్లే దిక్కు.వీరు ప్రయివేటుగా నీటిని కొనుక్కొని ఎలా గో నెట్టుకొస్తున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని బొ.కొత్తకోట, రామకుప్పం, పీలేరు తదితర పాఠశాలల్లో నెలకొంది.
పూర్తిస్థాయిలో అందని యూనిఫాం
పాఠశాలలు ప్రారంభమై రెండునెలలు గడుస్తున్నా అందరికీ యూనిఫాంలు అందలేదు. వీటిని కుట్టేందుకు టెండర్లు దక్కించుకొన్నవారు చాలా పాఠశాలలకు ఒకరిద్దరు కావడంతో ఓ చోట కుట్టి మరో చోటుకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో సగం మందికి మాత్రమే యూనిఫాంలున్నాయి. వీటికి చున్నీలు కూడా ఇంతవరకూ రాలేదు. దాంతో గతేడాది యూనిఫాంనే వీరు ధరించాల్సి వస్తోంది.
సీఎం సొంత ఇలాకాలో ఖాళీలు మెండు
సీఎం సొంత నియోజకవర్గం కుప్పం గురుకుల పాఠశాల అంటే విద్యార్థులు, తల్లిదండ్రులు దడుసుకుంటున్నారు. ఇక్కడ అన్నీ సమస్యలే. ఇక్కడ 40 సీట్లు వరకు ఖాళీలున్నట్లు సమాచారం. ఇదే పరిస్థితి మిగిలిన పలు పాఠశాలల్లో ఉంది. కానీ సంబంధిత ప్రిన్సిపాళ్లు మాత్రం తమకు ఖాళీలు పెద్దగా లేవంటూ చెప్పుకురావడం విమర్శలకు తావిస్తోంది. ఇక టీచింగ్ స్టాఫ్‌కు సంబంధించి 40 శాతం మంది మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులున్నారు. మిగిలినవారంతా కాంట్రాక్టు సిబ్బందే. నాన్ టీచింగ్ సా్‌టఫ్ ఖాళీలూ 40కి పైగా ఉన్నాయి. ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తే తప్ప ఇవి భర్తీకాని పరిస్థితి. ప్రధాన సబ్జెక్టులకు సంబంధించిన పోస్టులను కాంట్రాక్టు వారితో పూర్తిచేస్తే ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటాయనే విమర్శలున్నాయి. ఈ పోస్టుల నియామకాల్లోనూ సంబంధిత ప్రిన్సిపాళ్ల హవా కనిపిస్తోంది.
మోడల్ స్కూళ్ల ఎఫెక్ట్
జిల్లాలో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు, కస్తూర్బా పాఠశాలల కారణంగా వీటిల్లో చేరేవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఏదేమైనా భవిష్యత్‌లో ఈ పాఠశాలల వన్నె తగ్గకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
అన్ని సమస్యలు సర్దుకుంటాయిలే..
జిల్లాలోని పలు చోట్ల నీటి సమస్య ఉంది. ప్రయివేటుగానే నీటిని కొంటున్నాం. ఇక యూనిఫాంలు వచ్చేనెల 15లోపు అందేలా చర్యలు తీసుకుంటాం. కాంట్రాక్టు అధ్యాపకులకు కౌన్సెలింగ్ చేశాం. కుప్పంలో మాత్రం ఖాళీలున్నాయి. త్వరలో అన్నీ సర్దుకుంటాయిలే..
- స్వర్ణకుమారి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కన్వీనర్, శ్రీకాళహస్తి