విందామా నది గీతం | sacred waters of the river in our culture | Sakshi
Sakshi News home page

విందామా నది గీతం

Published Thu, Mar 12 2015 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM

విందామా నది గీతం

విందామా నది గీతం

మన సంస్కృతిలో నదీ జలాలు అత్యంత పవిత్రమనే భావన ఉంది. కేవలం అవసరాల కోసమే నదీ జలాలనీ,  అదే వాటి ఉపయోగమనీ భారతీయులు భావించరు. నదిలో ఒక్కసారి మునిగితే పాపప్రక్షాళన అవుతుందని, మోక్షం ప్రాప్తిస్తుందని విశ్వసిస్తారు. తల్లి తర్వాత పుణ్యస్థలిగా నదీమతల్లులను కొలిచే దేశం మనది. ఆధ్యాత్మిక జీవనానికి ప్రధాన భూమిక పోషించేవి నదులే! దేవతాస్వరూపాలుగా ప్రతి భారతీయుడూ భావించే నదుల సందర్శన జీవితకాల ధన్యతను చేకూర్చుతుందని నమ్మేవారెందరో!  ప్రకృతి ప్రేమికులూ నదుల చుట్టూ అల్లుకుపోయిన ఆహ్లాదకరవాతావరణాన్ని ఆస్వాదించడానికి ఎప్పుడూ ఆసక్తి చూపుతూనే ఉంటారు. ఆ విధంగా నదులు పర్యాటకరంగంలో ఓ భాగమయ్యాయి. మార్చి 14 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్’ సందర్భంగా మన దేశంలో నదీ విహారం గురించి ఈ ప్రత్యేక వ్యాసం..
 -నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 
 
నాగరికతలన్నీ నదీ తీరాన వెలసినవే. పంట పొలాలకు నీరందించి, వాటిని సస్యశ్యామలం చేయడమే కాకుండా రవాణా, విద్యుచ్ఛక్తి, చేపల పెంపకం.. ఇంకా అనేకానేక మానవావసరాలకు ఉపయోగపడుతున్నవి. హిమాలయాల్లో పుట్టి భారతదేశాన్నంతటినీ పలకరిస్తున్న నదుల జాబితా మన దగ్గర పెద్దదే! ఒక కొత్త అనుభూతి కోసం మన దేశంలో నదీ ప్రయాణం ఓ ప్రత్యేకమైన మార్గాన్ని చూపుతోంది. నదుల ఉపయోగం తెలుసుకోవాలన్నా, నదీ జలాలను కాపాడడానికి మనదైన గొంతుకను వినిపించాలన్నా వాటిని దగ్గరగా సందర్శించాలి. అందుకే, రండి నదీ విహారానికి...
 
ఆధ్యాత్మిక ప్రయాణం గంగ...
 
మనదేశంలో అతి ప్రధానమైనది, అత్యంత పవిత్రమైనది గంగానది. ఒక్కసారి ఈ నదిలో మునిగితే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని హిందువుల నమ్మిక. హిమాలయాల్లో పుట్టిన ఈ నదీ తీరాన ఎన్నో పుణ్యక్షేతాలు వెలిశాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది కాశీ పుణ్యక్షేతం. ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్న ఈ నది బెంగాల్‌లోని ఫరక్కా, కలకత్తాల మధ్య పడవ ప్రయాణం యాత్రికులు మర్చిపోలేనిది. ఈ ప్రయాణంలో ఉత్తర భారతదేశంలోని వారసత్వ కట్టడాలతో పాటు ఇతర సందర్శనీయ స్థలాల వీక్షించవచ్చు. అయితే, ఎంతో ఘన ఖ్యాతి గంగా నది మానవ తప్పిదాల వల్లే కాలుష్యం బారిన పడిందని పర్యావరణ నివేదికలు చెబుతున్నాయి. అయినా ఎన్నో మార్గాలలో ఆహ్లాదంగా పలకరించే ఈ నది రిషీకేష్ దగ్గర శివపురి నుంచి లక్ష్మణ్ ఝూలా వరకు ఏడాది పొడవునా తెప్పల పోటీలు జరుగుతాయి. ఈ రివర్ రాఫ్టింగ్ సాహసకృత్యాలలో పాల్గొనేవారి సంఖ్య ప్రతీ ఏడాదీ పెరుగుతూనే ఉంది.
 
పొడవైన ప్రయాణం బ్రహ్మపుత్ర...
 
హిమాలయాలలోని మానస సరోవరం సమీపంలో పుట్టి టిబెట్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లో బంగాళాఖాతంలో కలుస్తున్నది బ్రహ్మపుత్ర.  బ్రహ్మపుత్రా నదీ ప్రయాణం ప్రధానంగా అస్సామ్‌లో 850 కిలోమీటర్లు ఉంటుంది.
 ఇక్కడ కజిరంగా జాతీయ ఉద్యానంలోని ఎలిఫెంట్ సఫారీ చెప్పుకోదగినది. నదీ తీరాన ఎన్నో దేవాయాలు, తేయాకు తోటలు, గ్రామాలలో పట్టు పరిశ్రమలు.. చూడదగినవి.  బ్రహ్మపుత్రా నది పసిఘాట్ వద్ద 180 కిలోమీటర్ల పొడవున సాగే తెప్పల ప్రయాణం అత్యంత ఉల్లాసాన్ని కలిగిస్తుంది. 300 ఏళ్ల నాటి ప్రాచీన దేవాలయాలను ఈ న దీ ప్రయాణ గమనంలో వీక్షించవచ్చు.
 
ప్రాచీన నాగరికత ప్రయాణం సింధు...

సింధునది హిమాలయాలలోని కైలాస పర్వత సానువులలో పుట్టి.. మార్గంలో జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఉపనదులను కలుపుకుంటూ పాకిస్థాన్‌లో అరేబియా సముద్రంలో కలుస్తున్నది. భారత, పాకిస్తాన్‌లు రెండు దేశాలకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ నది వల్ల మనదేశంలో పంజాబీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు అధిక ప్రయోజనం పొందుతున్నాయి. కైలాసగిరి నుంచి మొదలైన సింధు నది ప్రయాణం జమ్మూ, కాశ్మీర్‌లో 550 కి.మీ ఉంటుంది. ఇక్కడే లడాఖ్, జన్స్‌కర్  ప్రాంతాలలో ప్రతి జులైలో సింధు నదీ ఉత్సవాలు జరుపుతారు. వేసవిలో ఈ నదీ ప్రయాణం అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే ఇక్కడ జూన్ నుంచి ఆగస్టు వరకు నీటి స్థాయి హెచ్చుగా ఉండటంతో తెప్పల (రివర్‌రాఫ్టింగ్) పోటీలతో ఈ నదీ ప్రాంతం కళకళలాడుతుంటుంది.
 
నదీ విహారం ఎందుకంటే...

 
ప్రకృతి సౌందర్య వీక్షణకు.  నదుల పరిరక్షణ అవసరం తెలుసుకోవడానికి. తమ వంతు ప్రయత్నంగా పరిశోధనకు పూనుకోవడానికి.  నదీ జలాలు కలుషితం అవడానికి గల కారణాలను వెతకడానికి. అందమైన ప్రకృతి దృశ్యాలను కెమెరా కన్నుతో వీక్షించడానికి.  ఫిల్మ్ డాక్యుమెంటరీ నిర్మాణానికి.  సూర్యోదయ, సూర్యాస్తమయాల వీక్షణకు.  ఆధ్యాత్మికంగా మన గురించి మనం తెలుసుకోవడానికి.
 పర్యాటకులు ప్రధానంగా వీటిని దృష్టిలో పెట్టుకొని టూర్‌ప్యాకేజీలు, టూర్ గైడ్‌లను ఎంచుకుంటారు. అయితే ఇవి ఆయా ప్రాంతాలలో ఉన్న నదీ సౌందర్యాన్ని బట్టి పర్యాటకుల ఆసక్తి ఉంటుంది. ఎక్కువగా విదేశీ పర్యాటకులు నదీ తీరాలలో, నదీ జలాలలో విహరించడానికి వస్తుంటారు. ఎంచుకున్న ప్రాంతం, వారికున్న పని, బడ్జెట్‌ను బట్టి ప్యాకేజీలు ఉంటాయి.
 
సురక్షిత ప్రయాణం గోదావరి...
 
పక్షుల కువకువలు వింటూ, పచ్చని ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ పెద్ద పెద్ద కొండలను దాటుకుంటూ, నదీ తీరంలో గిరిజన గ్రామాలను చూస్తూ సాగే ప్రయాణంలో గోదావరిది అగ్రతాంబూలం.  దక్షిణ భారతదేశంలో అతిపెద్దదైన గోదావరి నాసిక్ సమీపంలోని త్రయంబకంలో పుట్టి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు ఉపనదులు కలుపుకుంటూ సాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద మొదలయ్యే ఈ పడవ ప్రయాణం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. చిన్న చిన్న పడవల ద్వారానూ ప్రయాణికులు నది ఆవలి ఒడ్డుకు చేరుకుంటూ ఆనందోల్లాసాలను పొందుతుంటారు. ప్రకృతి ఆరాధకుల్లో చాలా మంది ఒక్కొక్కరుగానే ఈ నదీ తీర సందర్శనకు చేరుకునేవారుంటారు.ఆహ్లాదకర ఆనందాలను, ఆధ్యాత్మిక సౌరభాలను ఎద నిండా నింపే గోదావరి పర్యాటకులకు సురక్షితమైనదిగా పేరుంది.

అయితే, మధ్య భారతదేశంతో పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో నదీ విహారం అనేది చాలా పరిమితంగానే ఉంటోంది. గోదావరి నదీ తీరంలో ఉన్న దేవాలయాలు, కొన్ని సాంస్కృతిక కేంద్రాలకే పర్యటనలు పరిమితమయ్యాయి. ఇక్కడితో పోల్చుకుంటే కేరళ రాష్ట్రంలోని బ్యాక్‌వాటర్ క్రూయిజ్ విహారం అత్యద్భుతంగా ఉంటోంది. ఇక్కడి క్రూయిజ్ ప్యాకేజీలు, వినోదకార్యక్రమాలు సెలవుదినాల్లో ప్రత్యేక ఆఫర్లతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.నదుల ప్రయాణంలో మమేకమైన వారికి ఎన్నో ఆనందాలే కాదు.. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, విజ్ఞానమూ చేరువవుతుంది.
 
పచ్చందనాల పరవశం కృష్ణ...

 
పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం వద్ద పుట్టిన కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నది. తుంగభద్ర, భీమ, మూసీ, ఘట ప్రభ, మున్నేరు ఉపనదులను కలుపుకుంటూ ఈ ప్రయాణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానదిలో పడవ ప్రయాణానికి ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ లాంచీ సదుపాయాన్ని కల్పిస్తోంది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి సాగే పడవ ప్రయాణంలో  ప్రకృతి సోయగాలను, గిరిజన గ్రామాలను, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను సందర్శిస్తూ ఉల్లాసంగా గడపవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement