మడగాస్కర్ | A look into the world of Madagascar | Sakshi
Sakshi News home page

మడగాస్కర్

Published Sat, Dec 27 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

మడగాస్కర్

మడగాస్కర్

ప్రపంచవీక్షణం
 
నైసర్గిక స్వరూపం

వైశాల్యం    :     5,87,041 చదరపు కిలోమీటర్లు
జనాభా    :     2,37,52,887 (తాజా అంచనాల ప్రకారం)
రాజధాని    :    అంటనానారివో
కరెన్సీ    :     మలగాసీ అరియారీ
ప్రభుత్వం    :  యూనిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్
భాషలు    :     అధికార భాష-మలగాసీ, ఫ్రెంచ్ భాషలు
మతం    :     {Mైస్తవులు 40 శాతం, ముస్లిములు 7 శాతం, షెడ్యూల్డ్ తెగలు 50 శాతం.
వాతావరణం    : సాధారణంగా చల్లగా ఉంటుంది. జులైలో 9 నుండి 20 డిగ్రీలు , డిసెంబర్‌లో 16 నుండి 27 డిగ్రీలు ఉంటుంది.
పంటలు    :   వరి, కస్సావా, మామిడి, బంగాళదుంపలు, అరటి, చెరకు, మొక్క  జొన్న, కాఫీ, మిరియాలు.
పరిశ్రమలు    :  వస్త్ర, సముద్ర ఉత్పత్తులు,  పొగాకు, చక్కెర, ప్లాస్టిక్, ఫార్మా, తోలు వస్తువుల పరిశ్రమలు మొదలైనవి.
 సరిహద్దులు    : నలువైపులా హిందూమహాసముద్రం                 ఉంది. ఆఫ్రికా ఖండానికి సమీపంలో                 ఉంది.
 స్వాతంత్య్రం    :  26 జనవరి, 1960
 
 
చరిత్ర:
తూర్పు ఆఫ్రికాకు 400 కిలోమీటర్లు దూరంలో ఉన్నా కూడా ఈ మడగాస్కర్ దీవి దేశం 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండోనేషియా దేశపు సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. హిందూమహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం మడగాస్కర్. ఈ దీవిలో పూర్వం ఆసియా దేశస్థులే వలసవెళ్లి ఉండడం వల్ల ఇప్పటికీ అక్కడ ఆసియా ప్రజల ఛాయలే ఉన్నాయి. దీవిలో మొత్తం 18 రకాల తెగల ప్రజలు ఉన్నారు. తెగలు వేరున్నా అందరూ మాట్లాడేది మలగాసీ భాషనే. ఈ దీవి వైశాల్యంలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. క్రీ.శ. 1500లో పోర్చుగీసువారు ఈ దీవిని మొదట కనుగొన్నారు. 18వ శతాబ్దం ఆరంభం నుండి ఫ్రెంచి రాజులు దీనిని పరిపాలించారు. ఈ దీవిలో ప్రాణుల ఉనికి 150 మిలియన్ సంవత్సరాల క్రితం నుండే ఉండేదని శాస్రవేత్తలు పరిశోధించారు.

అనేక రకాల ఖనిజాలు ఈ దీవిలో లభ్యమవుతున్నప్పటికీ ప్రపంచంలోని బీదదేశాల జాబితాలో మడగాస్కర్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది. జనాభాలో 80 శాతం మంది ప్రజలు కేవలం జీవనం కొనసాగడానికే వ్యవసాయం చేస్తున్నారు. వరిధాన్యం ఈ దీవిలో అధికంగా పండుతుంది. 1960లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మలగాసీ ప్రభుత్వం ఏర్పడింది.
 
అంటనానారివో: రాజధాని అంటనానారివో సందర్శకులను ఆకర్షించే ఒక గొప్ప నగరం. ఈ నగరం సముద్ర మట్టానికి 2643 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నగర ప్రదేశమంతా కొండలతో ఉండడం వల్ల ఇళ్ళ సముదాయాలు కూడా అలాగే నిర్మించడంతో ఒక కొత్త నిర్మాణశైలి కనబడుతుంది. నగరంలో క్యాథిడ్రిల్‌లు అనేకం ఉన్నాయి. నగరం రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి అప్పర్‌టౌన్ రెండోది లోయర్‌టౌన్. నగరంలో ఉన్న జకరండా చెట్లు వేసవికాలంలో గొడుగుల మాదిరిగా ఉండి ఎంతో ఆకర్షణీయమైన ఊదా రంగులో దర్శనమిస్తాయి. మ్యూజియంలు, సాంస్కృతిక కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. ఇళ్ళ నిర్మాణం విచిత్రమైన శైలిలో ఉంటుంది.
 
నగరంలో 17వ శతాబ్దంలో నిర్మించిన ఇమెరినా రాణి రాజ భవనం ‘రోవా’ చూడదగ్గది. దీనికి సమీపంలోనే ప్రధానమంత్రి భవనం ఉన్నాయి. రాజధాని నగరానికి సమీపంలో అండిసిబె-మంటాడియా, రానోమఫానా, అంకారనా జాతీయ పార్కులు ఉన్నాయి. నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉంది.
 
చూడదగిన ప్రదేశాలు
 
సింగీ రోగ్

 ఈ సింగీ రోగ్ ఎర్రమట్టి రెడ్ లాటరైట్‌తో సహజసిద్ధంగా ఏర్పడి పైకి లేచిన ముళ్లమాదిరిగా కనబడతాయి. ఈ ప్రాంతం అంకరానా పట్టణానికి దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతం భారీవర్షాల కారణంగా మట్టి కోసుకుపోయి, కోపులు కోపులుగా తయారై ఒక వినూత్న డిజైనుగా మారిపోయింది.  వేలాది ఏళ్ళ క్రితం ఏర్పడిన ఈ వింత ఆకారాలు ఇప్పుడు కఠినమైన రాతి శిలలుగా మారిపోయాయి. క్రమంగా ఇసుక వీటిమీద చేరిపోయి ఎరుపు రంగుకు చేరుకొని ఇప్పుడవి సహజసిద్ధ నిర్మాణాలుగా మారిపోయాయి. ఇక్కడే చిన్న చిన్న నీటి కొలనులు ఉన్నాయి. సందర్శకులకు ఈ ప్రాంతం ఒక భూమి మీది స్వర్గం మాదిరిగా అనిపిస్తుంది.
                   
బావోబాబ్ చెట్లు
 
మడగాస్కర్ దీవిలో చాలా విచిత్రమైన ప్రకృతి కనబడుతుంది. ఎన్నో అగ్నిపర్వతాలు, రహస్యంగా ప్రవహించే వాటర్‌ఫాల్స్ ఉన్నాయి. ఒకప్పుడు మొత్తం దీవి అంతా అడవే. బావోబాబ్ చెట్లు ఈ ఒక్కదేశంలోనే కనిపిస్తాయి. వీటిని చూస్తేనే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. వీటి మొదళ్ళు ఎంతో లావుగా ఉండి, మూడు నుండి నాలుగు మీటర్లు పెరిగిన తర్వాత ఒక్కసారిగా ఆ కాండం నాలుగైదు కొమ్మలుగా విడిపోయి ఆగిపోతుంది. ఆ కొమ్మలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. చివర్లలో కొన్ని ఆకులు ఉంటాయి. కాండం ఎంతో నునుపుగా ఉంటుంది. చూస్తుంటే మానవుని చెయ్యి, అయిదు వేళ్ళు విచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది.
 
నోసీ బే

 
మడగాస్కర్ దీవికి ఉత్తర ప్రాంతంలో ఈ నోసీ బే ఉంది. ఈ ప్రాంతంలో అనేక చిన్న చిన్న దీవులు ఉన్నాయి. కొన్ని దీవులు కొన్ని అడుగుల వెడల్పే ఉండి చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ నోసీ బేకి సమీపంలోనే నోస్ సకాటియా, నోసీ టకినేలీ, నోసీ కోంబా, రష్యన్స్ బే, నోసీ ఇరంజా, రదను ద్వీపాలు, నోసీ ఫ్రాలీ, మిట్సియో ఆర్చిసెలాగో మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రాంతమంతా స్వర్గధామంగా కనిపిస్తుంది. నోసీ సకాటియాను ఆర్బెడ్ ద్వీపం అంటారు. ఇక్కడ కేవలం 300 జనాభా ఉంది. ఇక్కడే ప్రపంచంలోనే అతి చిన్న కెమిలియన్ కనబడుతుంది. ఈ ఊసరవెల్లి కేవలం ఒక సెంటీమీటరు ఉంది. రాక్షస గబ్బిలాలు కూడా ఇక్కడ ఉంటాయి.
 నోసీ కోంబా ఒక చిన్నద్వీపం. గుండ్రంగా ఉండి ఆకాశంలోంచి చూస్తే సముద్రానికి బొట్టుపెట్టినట్లు కనబడుతుంది. ఈ ద్వీపంలో మనకు ఎగిరే నక్కలు కనిపిస్తాయి. అలాగే రాక్షస గబ్బిలాలు కూడా కనబడతాయి. ఈ ద్వీపంలో అగ్నిపర్వతం ఉంది. లెబార్ జంతువులు ఎక్కువగా సంచరిస్తాయి. రష్యన్ బే కూడా చిన్న ద్వీపం. ఈ ద్వీపంలో సందర్శకులు రెండు మూడు రోజులు ఉండడానికి వీలుగా హోటళ్ళు ఉంటాయి. సందర్శకులు ఈ దీవిలోని ప్రకృతి రమణీయతని పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఇక్కడ తెలుపు రంగులో ఉండే ఇసుక బీచ్‌లు ఉన్నాయి. వివిధ జాతుల పక్షులు, జలచరాలు కనిపిస్తాయి. బవోబాబ్ వృక్షాలు కూడా ఇక్కడే ఉన్నాయి.
 ఇంకా ఈ ప్రాంతంలో నోసీనింజా, రదమ ఆర్బిపెలాగోలు ఉన్నాయి. ముఖ్య భూభాగంనుండి బోటులో గానీ, హెలికాప్టర్‌లో కాని వెళ్ళవచ్చు.
 
ప్రజలు- సంస్కృతి  - పాలన రీతులు
 
ప్రజలు- సంస్కృతి: ఈ దేశంలో అనేక మానవ తెగలు ఉన్నాయి. ముఖ్యంగా మెరినా, బెట్సి మిసరాకా, బెట్సిలియో, సిమిహేతి, సకలావ, అంటాయసక, అంటన్‌డ్రాయ్ మొదలైన తెగలున్నాయి. జనాభాలో సగభాగం పురాతన సంస్కృతిని అనుసరిస్తున్నారు. వీరంతా క్రైస్తవ మతావలంబకులు. ముస్లిం మతం కూడా ఉంది. భారతీయులు కూడా మడగాస్కర్‌లో ఉన్నారు. వీరు హిందీ, గుజరాతీ భాషలు మాట్లాడతారు. గ్రామాలలో గుడిసెలలాంటి ఇళ్లు నిర్మించుకుంటారు. స్త్రీలు, పురుషులు దాదాపు సమాన భావనతో జీవిస్తారు. పురుషులు కుటుంబాన్ని పోషించేందుకు కావలసిన వనరులను సేకరిస్తారు. వ్యవసాయం స్త్రీలు, పురుషులు కలిసిచేస్తారు. ప్రభుత్వం విద్యాలయాలను నెలకొల్పింది. ముఖ్యంగా క్రిస్టియన్ మిషినరీలు విద్యావ్యాప్తిని బాధ్యతగా కొనసాగిస్తున్నాయి.
 
 పరిపాలనరీతులు: మడగాస్కర్ దీవి పరిపాలన సౌలభ్యం కోసం ఆరు ప్రాంతాలుగా విభజింపబడింది. ఈ ఆరు ప్రాంతాలు తిరిగి 22 రీజియన్‌లుగా విభజింపబడి ఉన్నాయి. ఈ రీజియన్‌లను ఫరిత్ర అంటారు. అంట్‌సిరనానా, అంటనానారివో, మహజంగ, టోమాసినా, ఫియానారంట్‌సోవా, టోలియారాలు ఆరు ప్రాంతాలు. దేశంలో మొత్తం 119 జిల్లాలు ఉన్నాయి. మడగాస్కర్ దేశంలో పదినగరాలు ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. అవి - అంటనానారికో, టోమాసిన, అంట్‌సిరాబే, ఫియానారంట్‌సోవా, మహజంగ, టోలియారా, అంట్‌సిరనానా, అంటానిఫోట్సీ, అంబోవోంబే, అంపరఫరవోలా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement