పొగలు కక్కే మిఠాయి కొద్దికాలంగా ఇండోనేషియాలో వేలంవెర్రిగా మారింది. రంగురంగుల్లో నోరూరించే ఈ మిఠాయిపేరు ‘చికి ఎంగెబుయి’. ఇది సాదాసీదా క్యాండీలాంటి మిఠాయే! అయితే, పొగలు కక్కుతూ కనిపించేందుకు దీనిపై లిక్విడ్ నైట్రోజన్ చల్లి తినడానికి అందిస్తారు. దట్టమైన ఆవిరిలాంటి పొగలు కక్కుతూ ఉండటంతో దీనికి ‘డ్రాగన్ బ్రీత్’ అని ముద్దుపేరు కూడా పెట్టుకున్నారు.
ఇక ఇండోనేసియాలో ఈ క్యాండీ పెద్ద తంటానే తెచ్చిపెట్టింది. దీనిని తినడం వల్ల పశ్చిమ జావా ప్రాంతంలో దాదాపు ముప్పయిమంది పిల్లలు గతంలో ఆస్పత్రిపాలయిన సంగతి తెలిసిందే. పొగలు కక్కే ఈ చిరుతిండి కడుపులోకి వెళ్లాక, పేగులు చిల్లులు పడేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై గగ్గోలు చెలరేగడంతో పశ్చిమ జావా గవర్నర్ రిద్వాన్ కామిల్ జనవరి 10న ఈ చిరుతిండిపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇండోనేసియాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ పొగలు కక్కే మిఠాయి వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని, దేశవ్యాప్తంగా దీనిని నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మన దేశంలోనూ అక్కడక్కడా కొన్నిరకాల చిరుతిళ్లపై లిక్విడ్ నైట్రోజన్ చల్లుతున్నారు. మన ప్రభుత్వాలు దీనిపై ఎప్పుడు దృష్టిసారిస్తాయో చూడాలి మరి!
Comments
Please login to add a commentAdd a comment