పందెం.. పరుగు | Bet run .. | Sakshi
Sakshi News home page

పందెం.. పరుగు

Published Thu, Jan 15 2015 4:47 AM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

Bet run ..

  • పక్క జిల్లాకు వెళ్తున్న కోడిపందేల రాయుళ్లు
  •  సత్తుపల్లి బిర్రు శీతానగరంలో...
  •  మరోవైపు లక్షల్లో పేకాట
  •  పల్లెల్లో సందడే సందడి
  • సత్తుపల్లి : సంక్రాంతి వచ్చేసింది.  పండుగ సరదాలు తీర్చుకునేందుకు పందెం రాయుళ్లు పక్క జిల్లాలకు తరలివెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. సత్తుపల్లి నియోజకవర్గం ఆంధ్ర సరిహద్దులో ఉండటంతో కోడిపందాల సంస్కృతి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటుంది.  ఈసారి పందాలు జరుగుతాయో.. లేదో అంటూ పందెం రాయుళ్లు తెగ హైరానా పడ్డారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఈసారి కోడిపందాలకు అనుమతి వస్తుందని పందెం రాయుళ్లు ఆశించారు.

    ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. తెలంగాణ  డబ్బులతో ఆంధ్రలో పందాలు కాయాల్సి వస్తోందని సరదా ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా శీతానగరంలో సత్తుపల్లికి చెందిన కొందరు పందెం రాయుళ్లు బిర్రు ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోతునూరు, ఉండీ భీమవరం, నాగిరెడ్డిగూడెం, కళ్లచెరువు, చింతంపల్లి, ముల్కలంపాడు, ధర్మాజీగూడెం, కలరాయిగూడెం, కృష్ణాజిల్లా చాట్రాయి మండలం జనార్దనవరం గ్రామాల్లో కోడిపందాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
     
    ఉత్సాహంగా.. ఉల్లాసంగా

    సంక్రాంతి సందర్భంగా మూడురోజులు పందాలు కాసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు.  ఎక్కడ చూసినా చంకలో కోడిపుంజు పట్టుకొని పందాలకు వెళ్లేవాళ్లే ఈ ప్రాంతంలో కనిస్తున్నారు. కోడి పందాలను వేసేందుకు.. తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివెళ్తుండటంతో పల్లె ల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉద యం నుంచే పందాలు ఎక్కడ జరుగుతున్నాయో ఆరా తీసే పనిలో పందెం రాయు ళ్లు నిమగ్నమయ్యారు. పట్టణాల నుంచి పండగలకు వచ్చిన అతిథులు, బంధువులు పందాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పల్లెల్లో ఖరీదైన కార్లలో పందెం రాయుళ్లు హల్‌చల్ చేస్తున్నారు.
     
    లక్షల్లో కోడి కోసాట

    ఉదయం పూట కోడి పందాలు అయిపోగానే రాత్రి వేళ్లల్లో ప్లడ్‌లైట్ల వెలుగులో లక్షల రూపాయల కోసాట(లోన, బయట) జరుగుతోందని సమాచారం. పందెం రాయుళ్లు ఉదయం నుంచి మద్యం మత్తులో ఉండటంతో లోన, బయట పేకాటలో సర్వం పోగొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. పందెం జరిగే తోటల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కోడిపందాలు ఓవైపు జరుగుతుండగానే కోసాట, గుండుపట్టాలు, పులిమేక జూదం నడుస్తున్నట్లు సమాచారం. జూదరులకు అందుబాటులో మద్యం, మాంసాహారం, బిర్యానీ ప్యాకెట్లు లభిస్తున్నాయి. రాత్రి వేళ్లల్లో జనరేటర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  
     
    పోలీస్ నిఘా ఉన్నా..

    కోడి పందాలు నియంత్రించేందుకు పోలీసులు నిఘా ముమ్మరం చేసి హెచ్చరికలు జారీచేసినా పందెం రాయుళ్లు ఖాతరు చేయటం లేదు. గురు, శుక్రవారాల్లో సత్తుపల్లి డివిజన్‌లో చిన్నచిన్న పందాలు ఎక్కడపడితే అక్కడ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది పండుగ మూడురోజులు పోలీసులు పందాలను నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పోలీసులు సరిహద్దుల్లో గస్తీ చేస్తున్నా  పందెం రాయుళ్లు కోడిపుంజులను వేరే దారిన పంపించి పందాల స్థావరాలను చేరుకుంటున్నారు. ఒక్కోసారి పోలీసులకు పందాలు ఓచోట నడుస్తున్నాయని సమాచారం అందించి అటు పోలీసులను పంపించి వేరేచోట దర్జాగా పందాలు వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పండగ మూడురోజులు కోడిపందాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ పందెం రాయుళ్లు డిమాండ్ చేయడం గమనార్హం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement