టూకీగా ప్రపంచ చరిత్ర..48
రచన: ఎం.వి.రమణారెడ్డి
నాగరికత
చైనాలోని ‘హ్వాంగ్ హో’ లేదా ‘ఎల్లో నది’ పరీవాహక ప్రాంతంలో విస్తరించింది ‘చైనా నాగరికత’. ఈ నది ‘బేయన్‌హార్' పర్వతశ్రేణిలో పుట్టి, కొన్నిచోట్ల ఉత్తరానికీ, కొన్నిచోట్ల దక్షిణానికీ మెలికలు తిరుగుతూ, చివరకు తూర్పుముఖంగా సాగి పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది. దీని మలుపుల్లో అత్యంత ప్రధానమైన ‘ఆర్డోస్ వంపు’ చైనా నాగరికతకు పీఠం. ఇప్పుడు బీడుభూమిగా మారిన ‘టారిం నది’ లోయ క్రీ.పూ. 7000 కాలం నాటి నాగరికతకు మూలస్థానమనీ, క్రమంగా అది ఎల్లో నదిని అనుసరించి తూర్పుదిశగా జరిగిందనీ చరిత్రకారుల అభిప్రాయం.
భారతదేశంలో లాగే పురాతన చరిత్రకు సంబంధించిన విశేషాల్లో కల్పనలూ, అతిశ,ఞక్తులూ, మహాత్మ్యాలూ కొల్లలుగా కలిసిపోయిన చైనా గాథలను ఆధారం చేసుకుని వాస్తవ చరిత్రను నిర్మించడం అసాధ్యమైన ప్రయత్నం కావడంతో, చైనా నాగరికతను గురించి కూడా చరిత్ర అందుకోగలిగింది చాలా స్వల్పమే. శిథిలాలను బట్టి, ఆర్డోస్ వంపులో వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని జీవించిన గ్రామాలు విస్తారంగా ఉండేవనీ, వాళ్ళు జొన్న పైరును ప్రధానంగా సాగుచేసేవాళ్ళనీ తెలుస్తూ వుంది. క్రీ.పూ. 3000 ప్రాంతంలో ఇది పట్టుగూళ్ళకు ప్రపంచంలో మొదటి స్థావరంగా ఏర్పడడం మినహా, మిగతా విషయాల్లో వాళ్ళ జీవితం ఇతర నాగరికతలకు పోలిందే.
ప్రధానమైన ఈ నాలుగు నాగరికతలకు తోడు, ఎక్కడో విసిరేసినట్టు మరో రెండు నాగరికతలు - ఒకటి ఉత్తర అమెరికాలోని మెక్సికోలో, రెండవది దక్షిణ అమెరికాలోని పెరూలో - అభివృద్ధికావడం అబ్బురపాటు కలిగించే విషయం. విస్తీర్ణంలో చిన్నవైనా, పురాతనత్వంలో ఇవి తక్కినవాటికి ఏమాత్రం తీసిపోయేవిగావు. అమెరికా ఖండంలో మానవుని పరిణామం జరుగలేదనీ, దక్షిణాసియా నుండి చైనా, కొరియా, సైబీరియాల మీదుగా కొత్తరాతియుగం మానవుడు మొదట ఉత్తర అమెరికా, ఆపైన దక్షిణ అమెరికా చేరుకున్నాడని ఇదివరకే మనం అనుకున్నాం.
అదే మానవుడు ఇంతగా ఎదిగి, ఆ కొత్తనేల మీద వ్యవసాయదారుడై నాగరికతను నెలకొల్పుతాడని మనం ఊహించైనా ఉండం. కానీ అది జరిగింది. ‘యాండియెన్' పేరుతో పిలువబడే పెరూ దేశపు నాగరికతలో క్రీ.పూ. 7000 నాడే మొక్కజొన్న, పత్తి పైర్లను సాగుచేశారు. చిన్నసైజు ఒంటెల్లా కనిపించే ‘ల్లామా'లను పెంపుడు జంతువులుగా పోషించారు. అదే సమయంలో మెక్సికో దేశపు దక్షిణభాగంలో ‘ఆజ్‌టెక్' పేరుతో పిలువబడే నాగరికతలో మొక్కజొన్న, గుమ్మడికాయలు సాగయ్యాయి.
మరింత ఆశ్చర్యం కలిగించే విశ్లేషణ ఏమిటంటే - పురాతన నాగరికతలకు మూలమైన ప్రజలందరూ నల్లజాతీయులేగానీ ఏవొక్క తావులోనూ తెల్లజాతీయులు కాకపోవడం. ‘‘చర్మంరంగు గోధుమ ఛాయ (చామనఛాయ) దగ్గరినుండి మసకతెలుపు వరకు పలు వైవిధ్యాలుండే ద్రవిడులు దక్షిణభారతదేశం నుండి కొత్తరాతియుగంలో బయలుదేరి, సముద్ర తీరాల వెంట పొడవాటి పట్టీలా విస్తరిస్తూ, ఒకవైపు ఈజిప్టు, స్పెయిన్ ప్రాంతాలనూ, మరోవైపు పసిఫిక్ తీర ప్రాంతాలనూ చేరుకుని మనం ఈనాడు ‘నాగరికత' అని పిలుస్తున్నదానికి మూలపురుషులైనార’’ని డార్విన్ సమకాలికుడైన ప్రఖ్యాత యాంత్రోపాలజిస్టు థామస్ హెన్రీ హక్స్‌లే చెప్పింది నిజమేనేమో! ఈ విస్తరణను ‘బెల్ట్ ఆఫ్ హక్స్‌లే’గా ‘ది ఔట్ లైన్ ఆఫ్ హిస్టరీ’లో హెచ్.జి.వెల్స్ ప్రస్తావించారు. కానీ, మన దురదృష్టంకొద్దీ, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రాకకు ముందటికాలం చరిత్రలో ఉత్తరభారతదేశానికున్న ప్రాముఖ్యత దక్షిణాదికి కరువయింది.
(సశేషం)