World History
-
కోట్లాది మంది ఊచకోత.. ఏం జరిగిందో తెలుసుకుంటే..
-
టూకీగా ప్రపంచ చరిత్ర
సృష్టిలోని సంఘటనల గురించే తప్ప, ‘సృష్టికర్త’ను గురించి తలబాదుకునే ప్రయాసకు చైనీయులు పూనుకోలేదు. సృష్టిని గురించి క్రీ.పూ. 3000 నాటి నుండో అంతకు పూర్వం నుండో కలిగిన ఆలోచనల్లో బాగా ప్రచారంలో ఉండే సిద్ధాంతం కుప్లంగా - ‘‘ఆకాశమూ భూమీ అనే రూపాలు ఏర్పడక ముందు సర్వం నిరాకారంగా, అస్పష్టంగా ఉండేది. అందువల్ల ఆ స్థితిని అనంతమైన ప్రారంభంగా స్వీకరిస్తాం. ఆ అనంత ప్రారంభం నుండి శూన్యం జనించింది. ఆ శూన్యం నుండి విశ్వం ఏర్పడింది. విశ్వం నుండి అన్నిటికీ అధారభూతమైన ‘శక్తి’ కొన్ని పరిమితులకు లోబడి జనించింది. స్పష్టంగా, తేలిగ్గా ఉండేది పైకి తేలి అంతరిక్షం అయింది. చిక్కగా బరువుగా ఉండేది గట్టిపడి భూమిగా ఏర్పడింది. భూమి అంతరిక్షాల సారమే ‘ఎన్, యాంగ్’లు. ఈ రెంటినీ వేరు చేస్తూ మధ్యగా నిలుచున్న శక్తి ‘పాన్ గు’. అతని కాళ్ళు భూమి మీద నిలదొక్కుకున్నాయి. అతని తలమీద ఆకాశం నిలబడింది.’’ ఇందులో గమనించవలసింది ఏమంటే - పాన్ గు సృష్టికర్త కాడు. అనంత ప్రారంభానికి ఒక ప్రతినిధి మాత్రమే. ఇందుకు కొంత భిన్నమైంది రెండవ సిద్ధాంతం. దాని ప్రకారం - ‘‘ఒక తండ్రి, అతని భార్య, నలుగురు సంతానం గల ఒక కుటుంబం ఈ విశ్వాన్ని ఉరువుల ప్రాతిపదికన (ఐటెమ్ వైజ్) విడదీసి, ఆయా స్థానాల్లో నిలబెట్టారు. వాళ్లు ఆ పదార్థాలను చలనంలో పెట్టారు; కాలాన్ని విభజించారు; ఆకాశాన్నీ భూమినీ వేరుచేశారు; పర్వతాలకూ, నదులకూ నామకరణం చేశారు.’’ మూడవది - ‘‘మొదట అంతా చీకటి. సూర్యచంద్రులు పుట్టలేదు. నలుగురు దేవతల వల్ల పర్వతాలూ నదులూ తెలిసేంత వెలుగు ప్రసరించింది. ఆ నలుగురు దేవతలు రుతువులు. మరోసారి దేవతలు జోక్యం చేసుకోవలసి వచ్చింది. సూర్యుడూ చంద్రుడూ వెలిశారు. దేవతలు ఆకాశాన్ని పైకి లేపారు. దాన్ని పట్టుకునేందుకు ఐదు పోట్లను ఏర్పాటుచేశారు. ఆ పోట్లే ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎరుపు, తెలుపు, నలుపు రంగులు. ఆ ఐదుపోట్లే పంచభూతాల పరిణామం.’’ భూమ్యాకాశాలను వేరు చేసి, వాటి మధ్య అనధికారిక ప్రయాణాలను నియంత్రించిన ఘనత ఒక పౌరాణిక చక్రవర్తికి ఆపాదించేది నాల్గవ సిద్ధాంతం. మొత్తంమీద, చైనా పౌరాణిక ప్రతిపాదనల్లో తేడా ఎంతున్నా, కొన్నిట్లో దేవతలకు స్థానం దొరికినా, ఏవొక్క తత్వంలోనూ ‘సృష్టికర్త’కు తావు దొరకలేదు. క్రీ.పూ. 5వ శతాబ్దంలో పుట్టి, బహుళ ప్రాచుర్యాన్ని సంపాదించిన ‘కన్ఫూసియన్’ సిద్దాంతం సామాజిక ప్రవర్తనకు ప్రాధాన్యత ఇచ్చిందేగానీ, జన్మలూ పునర్జన్మలూ దేవతల వంటి విషయాలను తాకదు. క్రీ.పూ. 3 నుండి క్రీ.శ. 1 దాకా కన్ఫూసియన్ సిద్ధాంతానికి భిన్నంగా సాగిన ‘టావోయిజం’లో వేరు చేసేందుకు వీలుగానంత ముద్దగా పితరులూ, దేవతలూ, దయ్యాల రాసి ఏర్పడింది. కారణం ఏదైనా, క్రీ.శ. 800ల్లో బౌద్ధం ప్రవేశించేదాకా చైనాలో ఆలయాలు అరుదు. ఆ దేశంలో ఇప్పటికి వెలుగుజూసిన దేవాలయాలు రెండే రెండు. మొదటిది క్రీ.పూ. 1600 ప్రాంతంలో ‘షాంగ్ వంశం’నాటి ‘టాయ్జోంగ్’ ఆలయం. రెండవది క్రీ.పూ. 206దిగా గుర్తించబడిన ‘హన్ వంశం’ నాటి ‘టియాన్’ ఆలయం. క్రీ.పూ. 8వ శతాబ్దం పరిసరాల్లో బౌద్ధమతం చైనాలో ప్రవేసించి, అనతికాలంలోనే చైనా మొత్తాన్ని దావానలంలా కబళించింది. ‘సృష్టికర్త’ను ఖాతరు చెయ్యని తన పురాతన తాత్విక నేపథ్యానికి అతి చేరువగా ఉన్న కొత్త సిద్ధాంతం కావడం వల్లనేమో, చైనీయులు బౌద్ధమతాన్ని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. -
టూకీగా ప్రపంచ చరిత్ర - 65
ఆచారాలు-నమ్మకాలు అతని గుహాచిత్రాల విషయానికొస్తే - రాతియుగం చివరి దశకి చెందిన చిత్రాల్లో గూడా కేవలం తనకు ఇష్టమైన వేట జంతువులే కనిపిస్తాయి తప్ప, చెట్లూ గుట్టలూ, కొండలూ వాగులూ, సూర్యుడూ చంద్రుడూ వంటి చిత్రీకరణ కనిపించదు. కనీసం తనకు భయాన్ని కలిగించే క్రూర జంతువుల బొమ్మలైనా కనిపించవు. చెట్లూ గుట్టలవంటి జడ పదార్థాలుగానీ, సూర్యుడూ చంద్రుడూ వంటి ప్రకృతి శక్తులు గానీ అతనికి సర్వసాధారణమైన దృశ్యాలే తప్ప, తన ప్రయోజనానికి ఏ మాత్రం పనికొచ్చేవి కావని అతని భావన. అతని కుండేది కడుపు నింపుకోవాలనే ఆశ, తనను తాను కాపాడుకునే ఉపాయం. గుహల చీకట్లలో బొమ్మ వేస్తే, అలాంటి జంతువు తనకు వేటగా దొరుకుతుందని అతడి నమ్మకం. నమ్మకానికి హేతువుతో నిమిత్తం లేదు; తను ఆశించిన ఫలితానికీ సంప్రాప్తించిన ఫలితానికీ పొంతన ఉందో లేదో విశ్లేషించుకోవడం అతనికి చేతగాదు. వీటిని బట్టి మనకు తెలిసేది పునాది దశలో ఆచారమూ నమ్మకమూ వేరు వేరని. ఆచారానికి పూనాది ఆత్మీయత; నమ్మకానికి పునాది ఆశ. కాలక్రమేణా ఆశతో ‘భయం’ జతగట్టి, నమ్మకమనేది ఆశలూ భయాల సమ్మేళనంగా రూపొందింది. నమ్మకానికి హేతువుతో నిమిత్తం లేదు; తను ఆశించిన ఫలితానికీ సంప్రాప్తించిన ఫలితానికీ పొంతన ఉందో లేదో విశ్లేషించుకోవడం అతనికి చేతగాదు. వీటిని బట్టి మనకు తెలిసేది పునాది దశలో ఆచారమూ నమ్మకమూ వేరు వేరని. ఆచారానికి పూనాది ఆత్మీయత; నమ్మకానికి పునాది ఆశ. ‘భయం’ అనేది ఎప్పుడు పుట్టుకొచ్చింది? పాత రాతియుగం మానవునికి భయమనేది లేదా? - ఎందుకులేదు; తప్పకుండా ఉంది. ఒకసారి వలను తప్పించుకున్న పిట్టలు మరోసారి ఆ ప్రదేశంలో వాలవు. ఒకసారి ఉచ్చులు తప్పించుకున్న జంతువు తిరిగి ఆ తావుకు వెళ్ళక తప్పనప్పుడు జంకుతుంది. బెదురు అనేది పక్షుల్లో, పశువుల్లోనే తెలుస్తూంటే, మరి మనిషికి అది ఉండదని ఎలా అనుకోగలం? జోగాడే పాప మెట్లమీదికి చకచకా పాకిపోతుంది. దిగే వాటం తెలిసిందాకా దిగటానికి జింక కెవ్వున ఏడుస్తుంది. మేధోపరంగా పక్షులూ, పశువులూ, పసికూనల కంటే ఎదిగిన ఆ మానవునికి భయం ఎందుకుండదు? క్రూరజంతువులంటే భయం; పాము కాటేస్తుందని భయం; అలవిగానంత పెద్దదిగావుండే ఏనుగు నలగదొక్కుతుందనే భయం - ఇలాంటి ఎన్నెనో భయాలు ఉండేవుంటాయి. కానీ, భయానికి కారణమైన జంతువులేవీ అతని చిత్రాల్లో కనిపించవు. అలాంటి ప్రమాదాలు తనకు ఎదురవ్వాలని అతని కోరిక కాకపోవడంతో చిత్రించేందుకు సమ్మతిపడి ఉండకపోవచ్చు; లేదా, చెట్టూ గుట్టలూ తదితర నిరుపయోగమైన దృశ్యాలకు మల్లే, ప్రమాదాలను గూడా సర్వసాధారణమైనవిగా భావించాడో ఏమో! కాలక్రమేణా వేటాడే పరికరాల్లో నాణ్యత, వైవిధ్యం పెరిగింది. వేటాడే పద్ధతులూ, నైపుణ్యం పెరిగింది. పెద్దపెద్ద జంతువులను వేటాడే సమయంలో వేటగాళ్ళ గుంపుకు దిశానిర్దేశం ఇచ్చేందుకు తగినంత అనుభవం సంపాదించిన నాయకత్వం అవసరమయింది. మేధోసంపత్తిలో వ్యక్తికీ వ్యక్తికీ మధ్య పెద్దగా తారతమ్యం ఏర్పడని కాలంలో ఆ నాయకత్వం సహజంగా వయసులో పెద్దవాడైన వ్యక్తికి దక్కుతుంది. ఇంటాబయటా ఆ గుంపు కొన్ని కట్టుబాట్లతో నడుచుకునేలా అదుపు చేసే బాధ్యత కూడా అతని భుజానికే ఎత్తుంటారు. దానివల్ల, ఆ పెద్దమనిషి పట్ల ప్రత్యేకమైన గౌరవం ఏర్పడి వుండక తప్పదు. అతనికి వేటలో పాల్గొనే శక్తి ఉడిగినా, సలహాలూ హెచ్చరికల రూపంలో అతని అనుభవం గుంపుకు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు, అతని స్థానం ఎప్పటిలాగే కొనసాగక తప్పదు. భాషకు విస్తృతి పెరగడం వల్ల, అతని విశ్రాంతి సమయం పిల్లలకు వేట అనుభవాన్ని మాటల ద్వారానూ ఆటల ద్వారానూ నేర్పించే కాలక్షేపంతో, ఆ వృద్ధుడు గురువుగా పరిణమించాడు. పితామహుడు, నాయకుడు, గురువు స్థానాలన్నిటికీ ఒకడే కావటంతో, తదుపరి కాలంలో ఆ స్థానానికి ఒక హోదా ఏర్పడి ఉండాలి. అతనికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఆచారాల పేరుకు రెండవ వాయి కూర్పుగా చేరుండాలి. రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర - 64
ఆచారాలు-నమ్మకాలు ‘శవసంస్కారం’ ప్రధానంగా మూడు పద్ధతుల్లో కనిపిస్తుంది. మొదటిది శవాన్ని చెట్టుమీదికి చేర్చడం. మహాభారతం విరాటపర్వంలోని ‘శమీవృక్ష సంఘటన’ ద్వారా ఇలాంటి పద్ధతి ఒకటుండేదని మనకు తెలుస్తుంది. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో ఇప్పటికీ ఈ పద్ధతి కొనసాగుతుందని వినికిడి. నేలను తవ్వేందుకు తగిన సాధనాలు లేకనో, తవ్వకానికి ఆ నేల అనుకూలించకనో ఈ ఆచారం ఏర్పడి వుండొచ్చు. రెండవది, ఆర్య సంతతి అనుసరించే శవదహనం. లోతైన గోతిని తొలిచే అవకాశం లేక, లోతు తక్కువైన గోతిలో పాతిపెడితే, పై మట్టిని కుక్కలూ నక్కలూ తేలిగ్గా తొలగించి, శవాన్ని పూర్తిగానో ముక్కలుముక్కలుగానో ఎత్తుకొచ్చి కొరుకుతున్న బీభత్సానికి తీవ్రమైన ప్రతీకారంగా శవాన్ని దహించటానికి చేసుకున్న నిర్ణయంతో ఈ పద్ధతి ఉనికిలోకి వచ్చి వుండొచ్చు. ఇక మూడవది, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా అనుసరించే శవఖననం. అంటే, నక్కల వంటి జంతువులకు తోడే ఆస్కారం లేనంత లోతుగా శవాన్ని పాతిపెట్టడం. ఆచారం వేరు, నమ్మకం వేరు; దాని పునాది వేరు, దీని పునాది వేరు. వంశపారంపర్యంగా అనసరించేది ఆచారం. ఇది ఎన్నోతరాల పరంపరగా, వ్యక్తిగత వైరుధ్యాలకు పెద్దగా చోటివ్వకుండా కొనసాగే చర్యల సమ్మేళనం. సమ్మకం లేదా విశ్వాసం అనేది సంపూర్ణంగా వ్యక్తిగతమైన వ్యవహారం. ఒకే కుటుంబంలోని సభ్యులందరివల్ల ఆచారాలు ఒకే రకంగా పాటించబడొచ్చుగానీ, నమ్మకాలు మాత్రం వేరు వేరుగా ఉండగలవు. ‘శవసంస్కారం’లో పై మూడు పద్ధతులే కాక, మరో విచిత్రమైన పద్ధతి కూడా భారతదేశంలో కనిపిస్తుంది. ఇది అతి తక్కువ సంఖ్యాకులైన పారసీలు లేదా పారసీకులు ఇప్పటికీ ఆచరిస్తున్న పద్ధతి. వీళ్ళు పూనా, బొంబాయి నగరాల్లోనూ, వాటి పరిససరాల్లోనూ నివసిస్తున్నారు. ప్రార్థనా సంబంధమైన కార్యక్రమాల్లో వాళ్ళు ఉచ్చరించే మంత్రాలు అవెస్టాలోనికి కావడం వల్ల, వీళ్ళను ఒకనాటి జొరాస్ట్రియన్లుగా భావించొచ్చు. శవాన్ని ఎత్తై భవనం పైకప్పుకు చేర్చి, దాన్ని రాబందులకు ఆహారం అయ్యేలు వదిలెయ్యడం వీళ్ళ ఆచారం. చనిపోయిన తరువాత గూడా తన శరీరం ఏదోవొక ప్రాణికి ఉపయోగపడాలన్న సంకల్పం ఇందులో కనిపిస్తుంది. తీవ్రమైన ప్రతీకార ధోరణిగా కనిపించే ఆర్యుల ‘దహన’ పద్ధతికి సంపూర్ణమైన విరుద్ధదృవంగా కనిపించేది పారసీల పద్ధతి. మొత్తంమీద, పద్ధతి ఏదైనా, శవసంస్కారమనే ఆచారం మూలంగా మానవుడు జంతువు నుండి సంపూర్ణంగా వేరుపడి, తన స్థాయిని ఎన్నో అంతస్తులు పెంచుకున్నాడు. ఆచారం వేరు, నమ్మకం వేరు; దాని పునాది వేరు, దీని పునాది వేరు. వంశపారంపర్యంగా అనుసరించేది ఆచారం. ఇది ఎన్నోతరాల పరంపరగా, వ్యక్తిగత వైరుధ్యాలకు పెద్దగా చోటివ్వకుండా కొనసాగే చర్యల సమ్మేళనం. సమ్మకం లేదా విశ్వాసం అనేది సంపూర్ణంగా వ్యక్తిగతమైన వ్యవహారం. ఒకే కుటుంబంలోని సభ్యులందరివల్ల ఆచారాలు ఒకే రకంగా పాటించబడొచ్చుగానీ, నమ్మకాలు మాత్రం వేరు వేరుగా ఉండగలవు. ఆచారాలూ నమ్మకాలూ కలగాపులగంగా పెన వేసుకున్న దశలో జీవిస్తున్న మనకు వాటిలో ఒకదాన్నుండి మరొకదాన్ని విడదీయడం సులభం కాకపోయినా, చరిత్రలో మానవుని తొలిమెట్టుకు వెనుదిరిగితే వాటి విడివిడి పునాదులు స్పష్టంగా గోచరిస్తాయి. గరిష్టమైన స్థాయికి ఎదిగిన మెదడుకన్నా, దాని సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకునే అవసరం ఆ మానవునికి కలుగలేదు. ‘ఇదిగో జింక - దీన్ని పడగొట్టడం ఎలా ? అదిగో ఉడుత - దాన్ని పట్టుకోవడం ఎలా?’ వంటి తక్షణ ప్రయోజనాలూ, ‘అది కీకారణ్యం. అందులో క్రూరమృగాలుండొచ్చు; ఇది చిక్కటి పొద. ఇందులో పాము దాక్కోనుండొచ్చు’ వంటి జాగ్రత్తలకు మాత్రమే అతని ఆలోచన పరిమితం. ఐనా, అతనికి జ్ఞాపకాలూ, కలలూ ఉండేవని అతడు ఆచరించిన శవసంస్కారం, అతడు వేసిన గుహాచిత్రాలు నిరూపిస్తున్నాయి. రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర - 63
ఆచారాలు-నమ్మకాలు సింహం కలలోకొచ్చిన ఏనుగు, తిరిగి మెలకువలోకి రాకుండా, అదే నిద్రలో చనిపోతుందనేది ఒక నమ్మకం. ఏనుగు కాదుకదా, మాటలొచ్చిన మనిషైనా నిద్రలో హఠాత్తుగా చనిపోతే, తను ఏ కల కారణంగా అంతటి అవాంతరానికి గురయ్యాడో చెప్పుకోలేడు. పైగా, జంతువులకు కలలుగనే స్థోమత ఉందో లేదో మనకు తెలీదు. కలలు కనాలంటే అనేక సోపానాలుగా పనిచేయగల స్థాయికి మెదడు ఎదిగుండాలి. మైకంలోకి జారిపోయిన మనిషికి ‘ఉలుకూ లేదు, పలుకూ లేదు’ అంటుంటాం. పలుకు అనేది స్పృహలో ఉంటే తప్ప జరగని చర్య. ఉలుకు అంటే అసంకల్పిత చర్య. బాగా నిద్రలో వున్న మనిషికి ఎక్కడైనా ఏదైనా చురుకు తగిలితే మెలకువలోకి రాకుండానే దూరంగా సర్దుకుంటాడు. లేదా చేత్తో రుద్దుకుంటాడు. అది అసంకల్పిత చర్య. ఈ రెండు చర్యలు మెదడు అనే పదార్థం శరీరంలో ఏర్పడిన ప్రతి జీవిలో కనిపిస్తాయి. సందర్భ శుద్ది లేకుండా ఎవరైనా మాట్లాడితే - ‘మన లోకంలో ఉండే మాట్లాడుతున్నావా?’ అంటాం. లేదా ‘స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా?’ అంటాం. అంటే మాట్లాడడం అనే చర్య స్పృహలోనూ జరుగుతుంది, స్పృహ తగ్గినప్పుడూ జరుగుతుంది కానీ, స్పృహ కోల్పోయినప్పుడు జరగదు అని మనందరికీ తెలుసు. దీన్నిబట్టి, మనిషి మెదడు స్పృహ, మగత, లేదా మత్తు, మైకం అనే సోపానాల్లో పనిచేయగల స్థాయికి ఎదిగిపోయిందని తెలుస్తుంది. ఏళ్ల తరబడి సంపాదించిన అనుభవాలను విశ్లేషించి, ప్రోగు చేసుకుని, ఎన్నో ఏళ్లు గడిచేదాకా దాచుకుని, అవసరమైన ప్రతి సందర్భంలోనూ ఆలోచనతో అనుసంధానం చేసే ప్రక్రియ ‘స్పృహ’. ఆలోచనా సంబంధంగా కాకుండా, దాచుకున్న సమాచారాన్ని అస్తవ్యస్తంగా వెళ్లగక్కే ప్రక్రియ ‘మగత’. ఇది కలలో దృశ్యంగానూ జరగొచ్చు, ప్రేలాపనలోనూ జరగచ్చు. ఈ రెండే కాకుండా మరిన్ని సోపానాల్లో ఆరోహణ, అవరోహణ చేయగల సమర్థత మనిషిలోని పెద్దమెదడుకు ఏర్పడింది. అందువల్లే మనిషికి ‘కల’ అనే ఒక అవస్థ సాధ్యపడింది. ఉదాహరణకు - మందలో తనతోటి జంతువొకటి చనిపోతే, ఆ ఎడబాటు మందలో మిగతా జంతువులకు ఎంతసేపు గుర్తుంటుందో చెప్పలేం. చావును వాసనబట్టే శక్తి ఉందిగాబట్టి అది చనిపోయిందని తెలుసుకోగలవు. అయినా దాన్ని అక్కడే వదిలేసి దూరంగా తొలగిపోతాయి. చంటిబిడ్డ చనిపోయినప్పుడు, చావు వాసన తెలిసికూడా, కడుపు తీపితోనో లేక తిరిగి ప్రాణం తెచ్చుకుంటుందనే ఆశతోనో రెండు మూడు రోజులదాకా శవం దగ్గరే కాపలా కాచే జంతువులు కూడా కనిపిస్తాయి. ఆ స్వల్పమైన వ్యవధి దాటిపోయిన తరువాత ఆ జంతువు జ్ఞాపకాల్లో ఆ బిడ్డ ఎన్నిరోజులు నిలుస్తుందో మనకు అర్థం కాదు. ఆ విషయంగా జంతువు ప్రవర్తనకూ, మనిషి ప్రవర్తనకూ పోలిక లేనంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం పాత రాతియుగం కాలానికే ఏర్పడిందని మనం కచ్చితంగా చెప్పుకోవచ్చు. సన్నిహితుల్లో ఎవరైనా చనిపోతే, వాళ్ల జ్ఞాపకాలు మనిషిని ఏళ్ల తరబడి వెంటాడడమే కాదు,అడపాదడపా వాళ్లు కలలో కనిపించడం కూడా కద్దు. పాత రాతియుగం మనిషి కూడా చనిపోయిన నేస్తానికి తిరిగి ప్రాణం వస్తుందనే ఆశతో కొంతకాలం దాకా కాచుకుని గడిపి వుండొచ్చు. నిరాశతో శవాన్ని వదిలేసి ముందుకు సాగిపోయిన తరువాత కూడా జ్ఞాపకాల దాడిని తట్టుకోలేక శవమున్న చోటికి తిరిగిరాగానే - కుక్కలూ, నక్కలూ, కాకులూ, గద్దలూ ఛిద్రం చేసిన దృశ్యాన్ని సహించలేక, తనకు కావలసినవారి మృతదేహం వాటి బారిన పడకుండా చూసే మార్గాలను ఆలోచించే అవసరం అప్పుడు కలిగుండొచ్చు. ఆ ఆలోచన ఫలితంగా పుట్టిన ఆచారమే ‘శవసంస్కారం’. ఈ సంస్కారం ప్రధానంగా మూడు పద్ధతుల్లో కనిపిస్తుంది. (సశేషం) రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర..48
రచన: ఎం.వి.రమణారెడ్డి నాగరికత చైనాలోని ‘హ్వాంగ్ హో’ లేదా ‘ఎల్లో నది’ పరీవాహక ప్రాంతంలో విస్తరించింది ‘చైనా నాగరికత’. ఈ నది ‘బేయన్హార్' పర్వతశ్రేణిలో పుట్టి, కొన్నిచోట్ల ఉత్తరానికీ, కొన్నిచోట్ల దక్షిణానికీ మెలికలు తిరుగుతూ, చివరకు తూర్పుముఖంగా సాగి పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది. దీని మలుపుల్లో అత్యంత ప్రధానమైన ‘ఆర్డోస్ వంపు’ చైనా నాగరికతకు పీఠం. ఇప్పుడు బీడుభూమిగా మారిన ‘టారిం నది’ లోయ క్రీ.పూ. 7000 కాలం నాటి నాగరికతకు మూలస్థానమనీ, క్రమంగా అది ఎల్లో నదిని అనుసరించి తూర్పుదిశగా జరిగిందనీ చరిత్రకారుల అభిప్రాయం. భారతదేశంలో లాగే పురాతన చరిత్రకు సంబంధించిన విశేషాల్లో కల్పనలూ, అతిశ,ఞక్తులూ, మహాత్మ్యాలూ కొల్లలుగా కలిసిపోయిన చైనా గాథలను ఆధారం చేసుకుని వాస్తవ చరిత్రను నిర్మించడం అసాధ్యమైన ప్రయత్నం కావడంతో, చైనా నాగరికతను గురించి కూడా చరిత్ర అందుకోగలిగింది చాలా స్వల్పమే. శిథిలాలను బట్టి, ఆర్డోస్ వంపులో వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని జీవించిన గ్రామాలు విస్తారంగా ఉండేవనీ, వాళ్ళు జొన్న పైరును ప్రధానంగా సాగుచేసేవాళ్ళనీ తెలుస్తూ వుంది. క్రీ.పూ. 3000 ప్రాంతంలో ఇది పట్టుగూళ్ళకు ప్రపంచంలో మొదటి స్థావరంగా ఏర్పడడం మినహా, మిగతా విషయాల్లో వాళ్ళ జీవితం ఇతర నాగరికతలకు పోలిందే. ప్రధానమైన ఈ నాలుగు నాగరికతలకు తోడు, ఎక్కడో విసిరేసినట్టు మరో రెండు నాగరికతలు - ఒకటి ఉత్తర అమెరికాలోని మెక్సికోలో, రెండవది దక్షిణ అమెరికాలోని పెరూలో - అభివృద్ధికావడం అబ్బురపాటు కలిగించే విషయం. విస్తీర్ణంలో చిన్నవైనా, పురాతనత్వంలో ఇవి తక్కినవాటికి ఏమాత్రం తీసిపోయేవిగావు. అమెరికా ఖండంలో మానవుని పరిణామం జరుగలేదనీ, దక్షిణాసియా నుండి చైనా, కొరియా, సైబీరియాల మీదుగా కొత్తరాతియుగం మానవుడు మొదట ఉత్తర అమెరికా, ఆపైన దక్షిణ అమెరికా చేరుకున్నాడని ఇదివరకే మనం అనుకున్నాం. అదే మానవుడు ఇంతగా ఎదిగి, ఆ కొత్తనేల మీద వ్యవసాయదారుడై నాగరికతను నెలకొల్పుతాడని మనం ఊహించైనా ఉండం. కానీ అది జరిగింది. ‘యాండియెన్' పేరుతో పిలువబడే పెరూ దేశపు నాగరికతలో క్రీ.పూ. 7000 నాడే మొక్కజొన్న, పత్తి పైర్లను సాగుచేశారు. చిన్నసైజు ఒంటెల్లా కనిపించే ‘ల్లామా'లను పెంపుడు జంతువులుగా పోషించారు. అదే సమయంలో మెక్సికో దేశపు దక్షిణభాగంలో ‘ఆజ్టెక్' పేరుతో పిలువబడే నాగరికతలో మొక్కజొన్న, గుమ్మడికాయలు సాగయ్యాయి. మరింత ఆశ్చర్యం కలిగించే విశ్లేషణ ఏమిటంటే - పురాతన నాగరికతలకు మూలమైన ప్రజలందరూ నల్లజాతీయులేగానీ ఏవొక్క తావులోనూ తెల్లజాతీయులు కాకపోవడం. ‘‘చర్మంరంగు గోధుమ ఛాయ (చామనఛాయ) దగ్గరినుండి మసకతెలుపు వరకు పలు వైవిధ్యాలుండే ద్రవిడులు దక్షిణభారతదేశం నుండి కొత్తరాతియుగంలో బయలుదేరి, సముద్ర తీరాల వెంట పొడవాటి పట్టీలా విస్తరిస్తూ, ఒకవైపు ఈజిప్టు, స్పెయిన్ ప్రాంతాలనూ, మరోవైపు పసిఫిక్ తీర ప్రాంతాలనూ చేరుకుని మనం ఈనాడు ‘నాగరికత' అని పిలుస్తున్నదానికి మూలపురుషులైనార’’ని డార్విన్ సమకాలికుడైన ప్రఖ్యాత యాంత్రోపాలజిస్టు థామస్ హెన్రీ హక్స్లే చెప్పింది నిజమేనేమో! ఈ విస్తరణను ‘బెల్ట్ ఆఫ్ హక్స్లే’గా ‘ది ఔట్ లైన్ ఆఫ్ హిస్టరీ’లో హెచ్.జి.వెల్స్ ప్రస్తావించారు. కానీ, మన దురదృష్టంకొద్దీ, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ రాకకు ముందటికాలం చరిత్రలో ఉత్తరభారతదేశానికున్న ప్రాముఖ్యత దక్షిణాదికి కరువయింది. (సశేషం) -
టూకీగా ప్రపంచ చరిత్ర -37
చరాచర పదార్థాలన్నిటికీ వ్యక్తిత్వం ఆపాదించే అలవాటు (personification) మన పురాతన సాహిత్యానికి ఈ తలీతలుగా ఉన్న కారణంగా, ఆ మహిషాసురుడు నిజంగా రాక్షసుడేనో, లేక భీభత్సంగా చెలరేగిన అడవి దున్నకు అసురునిగా ఆపాదించిన వ్యక్తిత్వమో చెప్పేందుకు వీలుగాదు. సూర్యుణ్ణి పురుషునిగా వర్ణించి, ‘ఛాయాదేవి’ని - అంటే నీడను, అతనికి భార్యగా సంపాదించారు. సర్వభక్షకుడైన అగ్నిని వ్యక్తిగా చూపించి, ‘స్వాహా దేవి’ని అతనికి భార్యగా అంటగట్టారు. ఇదేవిధంగా, శక్తివంతమైన ప్రకృతులన్నింటినీ పురుషులుగానూ, వాటి ఫలితాన్ని భార్యలుగానూ కథలల్లడం మన సాహిత్యంలో కొల్లలుగా కనిపిస్తుంది. కాళి కూడా అదే కోవలో, తన గుంపును క్రియాశీలకంగా సమన్వయించి, ఆ ఎనుబోతును ముక్కలకింద నరికిన స్త్రీ ఆయ్యిండొచ్చు. ఒకవేళ ఆమె నివాసం మైసూరు ప్రాంతమే అయ్యుంటే, దక్షిణాది నుండి ఉత్తర భారతం స్వీకరించిన ఏకైక సంప్రదాయం ‘దశరా’, లేక ‘నవరాత్రి’ ఉత్సవంగా చెప్పుకోవచ్చు. ఒక్క కాళికా శక్తినే కాదు. ఆమె అవతరాలుగా చెప్పబడే దుర్గ, చండి, భవాని తదితర దేవతలు గూడా దక్షిణ భారతదేశంలో విశిష్టమైన స్థాయిలో ఆరాధ్యులుగా ఉన్నారు. అదనంగా పెద్దమ్మ, చిన్నమ్మ, మారెమ్మ ఆరాధన కూడా దక్షిణాదిలో ముమ్మరంగా సాగుతూంది. విగ్రహం రూపంలో కనిపించే ప్రతి గ్రామదేవత చేతిలో, మొనకు నిమ్మకాయ గుచ్చిన కత్తి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. వీళ్ళల్లో గంగమ్మ నీటికి, లేదా నదీప్రవాహానికి ప్రతీక; ఎల్లమ్మ వెల్లువెత్తిన ప్రవాహానికి ప్రతీక. సముద్రతీరాలు మినహాయిస్తే, మిగతా గుళ్ళల్లో సాధారణంగా గంగమ్మ, ఎల్లమ్మ కలిసే ఉంటారు. వీళ్ళ పూజకు అనుబంధంగా ప్రస్తావించే కులాలు విధిగా నీటితో విడదీయరాని సంబంధం కలిగిన చాకలి, బెస్త, యాదవ, రైతు వృత్తులవాళ్ళవే అయ్యుంటాయి. పెద్దమ్మ, చిన్న, మారెమ్మ వంటి ఇతర దేవతలను మశూచి, మంపులు, కలరా వంటి వ్యాధులతో పోల్చుకోవడం గమనిస్తే, ఈ గ్రామదేవతలు మానవుని భయాందోళనల నుండి పుట్టుకొచ్చిన (ఆపాదిత) వ్యక్తిత్వాలైనా అయ్యుండాలి. లేదా కుటుంబ వ్యవస్థ ఏర్పడక పూర్వం నివసించిన స్త్రీలైనా అయ్యుండాలి. ఈ గ్రామదేవతల్లో ఏవొక్కరికీ భర్త ఉండడుగానీ, సంతతి ఉంటుంది. అందుకే వీళ్ళ పురుషస్థానాన్ని ‘లింగం’ అంటారు. ఋగ్వేదంలో కనిపించే ‘అదితి’ పాత్రగూడా ఇంచుమించు ఇలాంటిదే. ఆమె ఇంద్ర, వరుణ మిత్ర దేవతలకు తల్లి. కశ్యప ప్రజాపతిని ఆమెకు భర్తగా పేర్కొన్నా, యజ్ఞానికి అందించే ఆహ్వానంలో ఏవొక్క చోటా ఆమెకు భర్తతో అనుసంధానం కనిపించదు. దక్షిణ భారతదేశంలోని ‘మళయాల’ ప్రాంతం ఆడవాళ్ళ రాజ్యంగా ఎలా ప్రచారమైందో ఆధారాలు దొరకవుగానీ, ఆ పునాది మీద తయారైన సాహిత్యం మాత్రం తెలుగులో బోలెడంత దొరుకుతుంది. వాటిల్లో ప్రధానమైంది ‘ప్రమీలార్జునీయం’ ఇందులో అర్జునుడు తన దక్షిణాది దండయాత్రలో భాగంగా, స్త్రీలు పరిపాలించే ‘ప్రమీల’ రాజ్యాన్ని గాండీవంతో కాకుండా మన్మథబాణాల సాయంతో జయిస్తాడు. ఇది మహాభారతంలో కనిపించే కథ కాదు; ‘శశిరేఖా పరిణయం’లో లాగే పాత్రల పేర్ల మతలబుతో మహా భారతంలోనిదిగా భ్రమింపజేసే పుక్కిటి పురాణం. అదే కోవలో మళయాలాన్ని చిత్రీకరించిన సాహిత్యం కందుకూరు విరేశలింగంగారి రచనలతో సహా, అనేక సందర్భాల్లో మనకు ఎదురౌతుంది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర - 36
కులాసాలు అదనపు పాలతో పోషించిన కుక్కలు ఎంత రబ్బసంగా బలుస్తాయో గమనించిన తరువాత, వాటిని తమ పిల్లలకు ప్రయత్నించాలనే ఉబలాటం ఏ తల్లికో కలిగుండాలి. పాలను ఆహారంగా తీసుకోవడం అలా మొదలయ్యుండాలి. కుండల్లో నిలువచేసిన పాలు వూట మారితే తోడుకోవడం తేలిగ్గానే తెలిసొచ్చే సమాచారం. అలా పేరుకున్న ‘పెరుగు’ది అదోరకమైన వింత రుచి. పిండితో కలిపితే మధురంగా కూడా ఉంటుంది. బెల్లంతో కలిపి దంచిన పేల పిండి (వేయించిన గింజలతో కొట్టిన పిండి) ఇప్పటికీ ఉత్తరభారతదేశంలో ‘సత్తు’గా ప్రతి ఇంట అపురూపంగా దాచుకుంటారు. కొత్తరాతియుగంలో బెల్లం లేదు. తీపికోసం వాళ్ళకు అందుబాటైన ఏకైక పదార్థం తేనె. పేల పిండిని పెరుగుతో కలిపి, తేనెతో రంగరించిన ముద్దలు ‘కరంభం’ పేరుతో అప్పటి కాలానికి ప్రీతిపాత్రమైన పిండివంట. సంచార జీవితంలో ఉన్నప్పుడు మనిషికి సొంత ఆస్తి లేదు. మహా ఉంటే చేతి అలవాటును బట్టి ఆయుధాల వరకు సొంతవిగా ఉండొచ్చు. గవ్వల హారాలు సొంతవిగా ఉండొచ్చు. పశువుల మందలు మాత్రం ఉమ్మడి ఆస్తి. వేట మీద హక్కు కూడా అందరికీ సమానమే. వేటాడిన జంతువును శిబిరానికి మోసుకురాగానే, రాతి ఉలితో చర్మం ఒలిచి, రాతి కత్తులతో ముక్కలు నరికి, నెగడు చుట్టూ చేరిన కుటుంబసభ్యులందరికి తగుపాళ్ళతో పంచడం, ఎవరి వాటాను వాళ్ళు కాల్చుకుంటూ ఆరగించడం నిత్యం జరగవలసిన యజ్ఞం. కాలేయం, ఉలవకాయలవంటి సున్నితమైన మాంసం అప్పుడప్పుడే పళ్లొస్తున్న పిల్లలకు ఆహారం. ఇండో-ఇరానియన్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ‘సత్రయాగం’ అన్నారు. ఇదే వ్యవస్థకు సామాజికశాస్త్రం ‘ఆదిమ కమ్యూనిజ’మని నామకరణం చేసింది. ఆ తరువాత ప్రవేశించిన వ్యవసాయం కూడా మొదట్లో ఉమ్మడి కార్యక్రమమే. దుక్కి దున్నేందుకు ఉపయోగించిన నాగలి వంటి సాధనం సంపూర్ణంగా కొయ్యది కావడంతో వాళ్ళ ఇతర వస్తువులతోపాటు అది మనకు దొరకలేదు. తొలిరోజుల్లో నాగలితో కాకుండా, బలమైన కర్రలతో నేలను పైపైన కుళ్ళగించేవారేమో చెప్పలేం. ఎందుకంటే, పశువులను కాడిగా కట్టి దున్నేందుకు ఉపయోగించేంత లోతైన సేద్యం అప్పట్లో లేదు. విత్తనం గాలికి కొట్టుకుపోకుండా నేలను గరుకు చేయడమే తప్ప, లోతైన దుక్కితో కలిగే ప్రయోజనాలు ఇంకా వాళ్ళకు తెలిసిరాలేదు. అందువల్ల, ఆరోజుల్లో తేలికైన చేతి సేద్యం స్త్రీలద్వారా జరిగుండొచ్చు. కారణం ఎవరైనా, వ్యవసాయం మూలంగా వాతావరణ పరిస్థితులను బహుజాగ్రత్తగా గమనించే అవసరం మనిషికి ఏర్పడింది. ఆరుబయట నెగళ్ళ దగ్గర పడుకుని, ఆకాశంలో నక్షత్రాలను ఆహ్లాదం కోసం వీక్షిస్తూ, వాటి గమనాన్ని ఇదివరకే పరిశీలించిన మనిషికి, ఇప్పుడు వాతావరణంలో మార్పులకూ నక్షత్రాల స్థానాలకూ మధ్యనున్న సంబంధం తెలిసొచ్చింది. దరిమిలా రుతువులను వేరువేరుగా గుర్తించడం వీలుపడింది. స్వేచ్ఛ వరకు స్త్రీల హక్కులు ఆ తరువాత చాలాకాలం దాకా కొనసాగినా, హోదాలో పురుషుని ప్రాముఖ్యత పెరిగేందుకు కూడా పశుపోషణే దోహదం చేసింది. మందలను వృద్ధిచేసే వనరుల కోసం అన్వేషించే మనిషి, పెంటి కడుపులో బిడ్డగా ఎదుగుతున్నది పోతు వీర్యమేననే అభిప్రాయం ఏర్పరుచుకున్నాడు. వ్యవసాయంతో కలిగిన అనుభవాన్ని దానికి జోడించి, స్త్రీది కేవలం క్షేత్రస్థానంగా, బీజం పురుషస్థానంగా నిర్ధారించి, ఏ బీజం నాటితే అదేజాతి మొక్కలు మొలకెత్తే రీతిలో, పురుషబీజానికి ఏర్పడే సంతానం పురుషునికి ఆనవాలుగా తీర్మానించాడు. అండాశయం ఉత్పత్తిజేసే గుడ్డును గురించి తమకే తెలియనందున, ఈ కొత్త సిద్ధాంతానికి తలవొగ్గక స్త్రీలకు తప్పిందిగాదు. దాంతో ‘వంశం’, ‘వారసత్వం’ అనే విధానాలు సమాజంలో సర్వజనామోదంగా ప్రవేశించాయి. పశుపోషణకు ఉపక్రమించని క్రోమాన్యాన్ ప్రాథమిక దశలో అనేకచోట్ల ‘మాతృస్వామ్య’ వ్యవస్థ నడిచిందని కొందరు శాస్త్రజ్ఞుల వాదన. ఆ వాదనకు ప్రధానమైన ఆధారం భారతదేశంలో ఆచరించే శక్తిపూజలూ, పురాణాలు. శక్తికి నరబలి ఇచ్చే ప్రస్తావన మహాభారతంలో కూడా కనిపిస్తున్నందున, కాళి ఆరాధన అత్యంత పురాతనమైనదే కాక, ఆసేతు హిమాచలం భారతదేశాన్ని మానసికంగా అనుసంధించే సంస్కృతిలో భాగంగా దాన్ని చెప్పుకోవచ్చు. పురాణాల ఆధారంగా కాళికాదేవి ఏ ప్రాంతంలో నివసించేదో తేల్చుకోవడం సాధ్యపడదు. ఆమె సంహరించిన ‘మహిషాసుర’ అనే రాక్షసుని పేరుకు శబ్దసాన్నిహిత్యం కలిగిన ‘మైసూరు’ పట్టణం ఉండేది దక్షిణ భారతదేశంలో! ఆ నగరం కాళికాదేవికి సంబంధించిన ‘దశరా’ ఉత్సవాలకు ప్రసిద్ధి కూడా! రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర - 35
రచన: ఎం.వి.రమణారెడ్డి కులాసాలు అప్పట్లో మానవునికి ‘దేవుడు’ అనే ఊహ ఇంకా ఏర్పడలేదు. వెలుగునిచ్చే సూర్యుడూ, చంద్రుడూ వంటి ప్రకృతి శక్తులు అతనికి ఆహ్లాదం; గాలి, వానల పట్ల భయమూ, భక్తి - అంతకుమించి ఆలోచన సాగే పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. అందువల్ల, విందులూ వినోదాలతో ఆత్మీయతలు ప్రకటించుకోవడం మాత్రమే ఆ మేళాల ప్రయోజనం. విందుకోసం వేరువేరు తావుల్లో దొరికే వేటలు ప్రత్యేక వంటకాలు; వేరువేరు గుడారాల విద్వాంసులు ప్రదర్శించే పాటవాలు వైవిధ్యభరితమైన వినోదాలు. ఆకర్షణీయమైన ఇతివృత్తాలు పొలిమేరలు దాటుకుని విస్తరించేందుకు కారణం ఇలాంటి కార్యక్రమాలే. దాయాది తెగల్లోని పురుషునిమీద స్త్రీకి ఏర్పడే మోజు ‘వరుసలు’గా ఏర్పడేందుకు పునాదులు బహుశా ఇలాంటి సందర్భాల్లోనే పుట్టుకొచ్చుండొచ్చు. తరువాత కొద్దికాలానికి అదే జనావాసంలో పుట్టిన ఆడవాళ్ళంతా సోదరులుగానూ, పొరుగున జన్మించిన ఆడవాళ్ళు మిథునంగానూ ఆలోచించే ఆచారం ప్రవేశించింది. శిల్పం, చిత్రకళల మీద కొత్త రాతియుగం మానవునికి ఆసక్తి నశించిందని ఇదివరకు మనం అనుకున్నాం. అలా చెప్పుకోవడం కంటే, ఆ కళ పురుషుల నుండి స్త్రీలకు బదిలీ అయిందని చెప్పుకోవడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే, గోడల మీద చిత్రకళ అంతరించిన తరువాత, అది మట్టి పాత్రల మీద పూజల రూపంలో (వంకరటింకర గీతలతో, చుక్కలతో తీర్చే అలంకరణ) తిరిగి ప్రత్యక్షమైంది. దోసిళ్ళతో నీళ్లు తాగడం, దొన్నెలతో తెచ్చుకోవడం తప్ప మగవాడు పాత్రలను గురించి ఊహించుకోలేడు. బహుశా చిన్నపిల్లలకు చేపను కాల్చి తినిపించే సందర్భాల్లో బంకమట్టి స్వభావాన్ని ఆడవాళ్లే గమనించి ఉండాలి. జంతు మాంసంలాగా చేపమాంసం నిప్పుల సెగను పెద్దగా ఓర్చుకోలేదు. చుట్టూ బంకమట్టిని దట్టిస్తే, మాడిపోయే నష్టాన్ని నివారించడం సాధ్యమని గుర్తించడం ఈ పంథాలో తొలిపాఠం. అలా బంకమట్టిని పూసి నిప్పుల మీద చేపను కాల్చుకునే అలవాటు ఏటివార పల్లెల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. కుండల తయారీ ప్రయోగాల్లో బంకమట్టికి ఆకారం కల్పించేందుకు ఆకుదొన్నె చుట్టూ పూత పూయడం మలిపాఠం. కాల్చిన బంకమట్టి నీళ్లల్లో కరగకుండా నిలుస్తుందని తెలుసుకోవడం మూడవ పాఠం. దాంతో ఖుద్దుగా కుండల తయారీ మొదలయింది. నీళ్లు తెచ్చుకునేందుకు వాటమైనవి కొన్నీ, రాలిన గింజను ఊడ్చి నిలువచేసేందుకు వీలయ్యేవి కొన్ని - ఇలా మట్టిపాత్రల తయారీ ఒక వ్యాపకంగా పరిణమించింది. వాళ్లు చేసిన మట్టిపాత్రలో దేన్ని తీసుకున్నా, దాని చుట్టూరా పూజలతో అలంకరించిన కళానైపుణ్యం కనిపిస్తుంది. ఆహార పదార్థంగా ‘గింజ’ను ప్రవేశపెట్టిన ప్రశంసకు కూడా అర్హత ఆడవాళ్ళదే. చాలాకాలం దాకా అవి పశువుల దాణా కిందనే మానవుడు జమకట్టాడు. వేవిళ్లతో వున్న స్త్రీలకు ఏదిపడితే అది కొరికే అలవాటు ప్రకృతిసిద్ధమైన స్వభావం. గడ్డికి కాసే గింజ కూడా రుచిగా ఉంటుందని తెలుసుకునే అవకాశం అలాంటి సందర్భంలోనే కలిగుండాలి. గింజను పిండిగా చితగ్గొట్టి, నిప్పు నుండి దిగిన వేడివేడి మాంసానికి అద్ది, వేవిళ్ళ సమయంలో తినిపించడంతో గింజల ప్రయోజనం మానవ జీవితానికి వ్యాపించి వుండాలి. ఈనాడు మాంసాహార పదార్థాలకు ప్రపంచ ప్రఖ్యాతి వహించిన కంపెనీల నుండి ఆప్యాయంగా కొనుగోలు చేసే వంటకాలు ఇలా పిండిలో పొర్లించిన మాంసపు కండలే. దైనందిన కృత్యంలో భాగంగా తారసపడే దృశ్యాలకు కొద్దిగా మేధస్సును జోడిస్తే ఎన్ని ప్రయోగాలు ఫలిస్తున్నాయో, తద్వారా నిత్యజీవితానికి ఎన్ని సరుకులు అదనంగా తోడౌతున్నాయో గమనిస్తే ఒక్కోసారి దిగ్భ్రాంతి కలుగుతుంది. ‘పాడి’ అనే సంపద కూడా మానవుని జీవితంలో ఆవిధంగా ప్రవేశించిందే. దూడను కోల్పోయిన పెంటి జంతువుకు పొదుగు సలుపు చెయ్యకుండా చూసేందుకు పాలను పిండేస్తారు. కుండలు రాకముందు ఆ పాలు నేలపాలుగాక తప్పేది కాదు. పాలతో తడిసిన నేలను కుక్కలు నాకడం చూసినప్పుడు ఆ పదార్థం కుక్కలకు ఇష్టమని ఎవరికైనా తెలుస్తుంది. కుండలు వాడకంలోకి వచ్చిన తరువాత, పాలను అలా వృథాగా పిండేసేకంటే, కుక్కలకు పనికొచ్చినా ప్రయోజనమేనన్న అభిప్రాయం కలిగుండాలి. పాలతో కుక్కలను తృప్తిపరిచే అలవాటు ఇప్పటికీ గొర్రెల కాపరుల్లో కనిపిస్తుంది. సంకటిముద్ద మధ్యలో గుంతచేసి, అందులోకి గొర్రె పాలు పిండి, కొద్దికొద్దిగా సంకటిని ఆ పాలల్లో తడుపుతూ కుక్కకు విసిరేస్తారు. ఆ ఉండను నేలమీద పడనీయకుండా, ఎంతో హుషారుగా గాలిలోనే అందుకుంటుంది ఆ కుక్క. (సశేషం) రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
కొత్త దొంతర
టూకీగా ప్రపంచ చరిత్ర 33 అంతేగాదు, పశువుల పెంపకం మూలంగా మనిషికి మరికొన్ని విషయాల మీద దృష్టిని కేంద్రీకరించే అగత్యం ఏర్పడింది. వాటిల్లో మొదటిది సంఖ్యా పరిజ్ఞానం. పశుపెంపకం ఇప్పటికీ చేపట్టని ఆటవిక తెగలకు ఈనాడు కూడా నాలుగు లేదా ఐదుకు మించి లెక్కించడం చేతగాదు. అంతకుమించిన సంఖ్యలతో వాళ్ళకు అవసరం కూడా ఉండదు. మేత నుండి మంద మొత్తం తిరిగొచ్చిందో లేక ఒకటిరెండు జీవాలు తప్పిపోయాయో తెలుసుకోవాలంటే పశువుల కాపరికి ఎక్కువ సంఖ్యలను లెక్కించడం నేర్చుకోక తప్పేదిగాదు. అలా ఒకటిరెండ్లు పన్నెండుదాకా పెరిగాయి. గుమిగా లెక్కించేందుకు ఉడ్డాలూ, డజన్లూ ఏర్పాటయ్యాయి. మరో ఐదువేల సంవత్సరాల దాకా గణితంలో సున్నా ప్రవేశించలేదు కాబట్టి, దశమస్థానంలో తెంచుకుని లెక్కించడం వాళ్ళకు పరిచయం లేదు. ఆ తరువాత, స్థల కాలాలను అంచనా వేసే విధానం గూడా తప్పనిసరిగా సాధించుకోవలసిన పరిజ్ఞానమైంది. ఆ ప్రయత్నంలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే పేర్లతో దిక్కులను గుర్తించే ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న చిన్న దూరాలను అడుగుల్లోనూ, మధ్యరకం దూరాలను ‘పగ్గం’తోనూ, ఇంకా ఎక్కువ దూరాన్ని ‘గవ్యూతి’తోనూ కొలవడం నేర్చుకున్నాడు. దినాలు లెక్క పెట్టేందుకు చంద్రుణ్ణి ఆసరా చేసుకున్నాడు. సూర్యుడు రోజూ ఒకేలా కనిపిస్తాడు గాబట్టి, రోజుల నడక తెలుసుకునేందుకు సూర్యునితో ప్రయోజనం లేదనుకున్నాడు. క్రీ.శ. 16వ శతాబ్దంలో సూర్యమానం మీద ఏర్పడిన ‘సివిల్ క్యాలెండర్’ వాడుకలోకి వచ్చేవరకు ప్రపంచవ్యాప్తంగా అనుసరించిన క్యాలెండర్ చాంద్రమానమే. హిందువుల ముహూర్తాలూ, మహమ్మదీయుల పండుగలూ ఇప్పటికీ చాంద్రమానాన్నే అనుసరిస్తున్నాయి. చంద్రుని ఆధారంగా ఏర్పడిన పంచాంగంలో ఏడాదికి ఏర్పడే 336 రోజులను తిథులుగా, పక్షాలుగా, మాసాలుగా గుణిస్తారు. వారాలుగానీ, ఆది సోమ వంటి దినాలుగానీ అందులో ఉండవు. అందుకే మహాభారతంలో తిథులే కనిపిస్తాయి తప్ప వారాలు కనిపించవు. ఏడాదికుండే 365 1/4 రోజులను పూరించేందుకు ‘అధిక మాసాలు’ గుణించడం గమనిస్తే, సూర్యమానం ఏడాది గురించి ఋగ్వేదకాలం నాటికే కొంత తెలిసినట్టు కనిపిస్తుంది. అయితే, ఋగ్వేదం చెప్పిన సూర్యమాన సంవత్సరానికి 360 రోజులే. ఆ తరువాత క్రీ.శ.5వ శతాబ్దంవాడైన ఆర్యభట్టు, 6వ శతాబ్దం వాడైన వరాహమిహురుడు భారతదేశంలో సూర్యమాన పంచాంగాన్ని ప్రవేశపెట్టగా, 12వ శతాబ్దంవాడైన భాస్కరుడు కొన్ని సవరణలతో దాన్ని స్థిరీకరించాడు. పగ్గాల కోసం రకరకాల ‘నార’ను అన్వేషించే క్రమంలో కొత్తరాతి యుగం మానవునికి ‘అగిసె’నార తటస్థించింది. అది మిగతా పీచుపదార్థాలకంటే చాలా మృదువు, పోగు సన్నం. చాపల అల్లకంలాగా పోగుమార్చి పోగు దాన్ని అల్లుకోవడం మొదట్లో సరదాకింద తీసుకున్నా, తరువాత తరువాత అది నారబట్టల నేతకు దారితీసింది. ఆ వస్త్రం ఎంత ముతకదైనా, జంతు చర్మాలకంటే, భూర్జర పత్రాలకంటే చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి, నారబట్టలు కట్టుకునే అలవాటు సమాజంలో ప్రవేశించింది. ఆ బట్టలకు రంగులు అద్దిన ఆనవాళ్ళు మాత్రం ఇంతవరకు కనిపించలేదు. ఆ మాటకొస్తే, కొత్తరాతియుగం మానవునికి రంగులపట్లా, చిత్రకళపట్లా, శిల్పంపట్లా అభిరుచేలేనట్టుంది. ఎందుకంటే, అతని హయాంలో ఒక్కచోటున్నైనా గుహాచిత్రాలుగాని, దంతపు బొమ్మలుగాని నిదర్శనంగా దొరకలేదు. బహుశా, ఇప్పుడు సొంత సామర్థ్యం మీద కుదిరిన నమ్మకం అతన్ని తాంత్రిక విశ్వాసాల నుండి దూరంగా నడిపించిందో ఏమో! రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర
రచన: ఎం.వి.రమణారెడ్డి వెనుక తరాలు అందుకు నిదర్శనం గుహాంతరాల్లో క్రోమాన్యాన్ మానవుని చిత్రకళ. గుహ గోడల మీద, వీలైనంత ఎత్తున, రంగులతో అతడు రకరకాల జంతువులను చిత్రించాడు. ఎరుపు, పసుపు, నలుపు, ఇటుకవర్ణాలు అతడు వాడిన రంగులు. బొమ్మల్లో ఎద్దులూ, అడవి దున్నలూ, జింకలూ, గుర్రాలూ, ఎలుగుబంట్లూ, బొచ్చు ఏనుగులూ ఉన్నాయి. గుర్రం, బొచ్చు ఏనుగు బొమ్మల సంఖ్య మిగతావాటికంటే చాలా ఎక్కువ. ఒకటి రెండు చోట్ల జంతుకొమ్ములు ధరించి మంత్రగాడిలా తోచే మనిషిని తప్ప, ఇతరత్రా మనిషి బొమ్మలను అతడు సంపూర్ణంగా నిషేధించాడు. ఏ బొమ్మ తీసుకున్నా నిలుచున్న జంతువును పక్కల నుండి చూస్తే ఎలా కనిపిస్తుందో అదే భంగిమలో (ప్రొఫైల్‌లో) ఉంటుంది. ఎదురుగా చూస్తే కనిపించినట్టు చిత్రించడం అతని శక్తికి మించిన నైపుణ్యంలా ఉంది. ఒకటి రెండు తావుల్లో మినహా నాలుగుకాళ్ళూ కనిపించేలా గీసిన బొమ్మలు కనబడవు. ఆవలివైపుగా ఉండే కాళ్ళను చిత్రించడం గూడా అంత తేలికైన విద్యగాదు.చీకటిమయంగా ఉండే లోతైనగుహల్లో, కష్టంతోగాని చేరుకోలేని తావుల్లో, అందనంత ఎత్తున బొమ్మలను చిత్రించడం చూస్తే అవి వినోదం కోసం వేసినవి కావనీ, వాటి వెనుక ఏదో గూఢార్థం ఉందనీ సందేహం కలుగుతుంది. అందులోనూ ఆ జంతువుల్లో కొన్నిటికి బరిసెలు గుచ్చుకున్నట్టూ, గాయపడినట్టూ చూపడం అనుమానాన్ని బలపరుస్తుంది. క్రోమాన్యాన్ మానవుడు వాటిని ఏవో తాంత్రిక ప్రయోజనాల కోసం చిత్రించాడని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. జంతువులను అలా చిత్రించడం వల్ల వేటలో తనకు లాభం జరుగుతుందని అతని నమ్మకమైవుండొచ్చు. ఒక్క యూరప్‌లోనే కాక, ఇటువంటి గుహాచిత్రాలు ఇతర ఖండాల్లోనూ వెలుగులోకి వస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోనే ఇటీవల అనేక గుహల్లో ఇలాంటివి కనిపించాయి. వందల వేల మైళ్ళు ఎడంగా జీవించిన మనుషుల్లో, ఒకరితో ఒకరికి సంబంధాలు ఊహించేందుకే వీలులేని కాలంలో, ఒకే తరహా విశ్వాసం ఇంత విస్తృతంగా నెరసుకోవడం ఎలా సాధ్యపడింది? జటిలమైన ఈ సవాలుకు జవాబు దొరకాలంటే, ‘అవసరం ఏమొస్తుందిలే’ అనుకుంటూ వదిలేసిన మరో పాతరను పెళ్ల్లగించాలి. ఇది జీవుల ప్రవర్తనకు సంబంధించిన రసాయనిక ప్రేరకాల సమాచారం దాగున్న పాతర. వెలుతురు ప్రసరించగానే వానపాము నేలపొరల లోతులకు కూరుకుపోవడం అందరికీ తెలిసిన విషయమే. అది చీకటిని ఆశ్రయించి బతికే జీవిగనుక, అలా వెలుతురును తప్పుకోవడంలో చోద్యం కనిపించదు. కానీ, చోద్యమల్లా - వెలుగును గ్రహించే ‘చూపు’గానీ, ఎలా నడుచుకోవాలో చెప్పే మెదడుగానీ సంతరించుకోని జీవి అంత చురుగ్గా స్పందించడమే. ఇంద్రియాలకు అతీతమైన ఈ స్పందననే మనం ‘ప్రాణం’ అంటున్నాం. ‘ప్రాణం’ అనే నిర్వచనానికి నాంది పలికిన ఏకకణజీవి మొదలు, ప్రాణికి ప్రాథమిక లక్షణాలైన ఆహార సముపార్జన, ఆత్మరక్షణ, చలనం, పెరుగుదల, సంతానోత్పత్తి వంటి అవసరాలకు ప్రేరేపించే జీవరసాయనిక పదార్థాలు ప్రతిజీవిలోనూ ఊరుతుంటాయి. ‘కణవిభేదన’ ఏర్పడిన ‘పురిటిదశ’ జీవుల్లో ఈ రసాయనాల ఉత్పత్తి ఏ కణానికి ఆ కణంలో జరిగిపోతుంది. ఆ తరువాతి దశలో వాటి ఉత్పత్తికి ప్రత్యేకకణాలు ఏర్పడి, అవి శరీరవ్యాప్తంగా విస్తరించి, తమ ఉత్పత్తులను రక్తప్రవాహంలో కలిపేయడం ద్వారా శరీరంలోని ప్రతి కణానికి వాటిని అందజేస్తాయి. మరింత ఎదిగిన దశ జీవుల్లో ఒకే తరహా పదార్థాల్ని ఉత్పత్తిజేసే కణాలన్నీ ఒక తావున పోగై గ్రంథులుగా రూపొందుతాయి. వీటికి నాళం ఉండదు గనుక, ‘వినాళ గ్రంథులు’గా వ్యవహరిస్తారు. ఇవి ఉత్పత్తి చేసే ద్రవాలను ‘హార్మోన్లు’ అంటారు. ఆత్మరక్షణ అవసరాల్లో తనకు తెలీకుండానే ఊసరవెల్లి చర్మంలో రంగులు మారేందుకు కారణం ఈ హార్మోన్లే. లింగవ్యత్యాసానికి కారకాలైన ‘స్టీరాయిడ్’ పేరుగల హార్మోన్ల ప్రేరణకు ఫలితం ఎలాంటిదో పరిశీలిస్తే, మానవుని శరీరం మీద వీటి పట్టు ఎంత పటిష్టంగా ఉంటుందో తెలిసొస్తుంది. నడకలో గానీ, నిలుచునే వాలకంలోగానీ, కూర్చునే తీరులోగానీ, మాటలను అనుసరించే ఆంగిక ప్రదర్శనలోగానీ, ఆటపాటలకు సంబంధించిన అభిరుచుల్లోగానీ ఆడపిల్లలకూ మగపిల్లలకూ తేడా నాలుగైదేళ్ళ ప్రాయంలోనే ప్రారంభమౌతుంది. యవ్వనం సమీపించే సమయానికి అవి కరుడుగట్టి, స్వరం మారుతుందీ, చర్మం నిగారింపు మారుతుందీ, వెండ్రుకల పంపిణీ మారుతుందీ, ఒంటి వాసన గూడా వేరౌతుంది. ఈ మార్పుల ప్రవేశంలో ఆలోచించే మెదడుకూ, నేర్చుకునే విద్యలకూ ప్రమేయమే ఉండదు. -
చుట్టరికాలు
టూకీగా ప్రపంచ చరిత్ర- 17 అసలు, ఏ వానరానికైనా శాఖోపజీవితానికి విడాకులిచ్చి నేలమీదికి మారే అవసరం ఏమొచ్చుంటుంది? అలాంటి ఒత్తిడి వచ్చే ఉండాలి. ఎన్నో కోతులు అడవులు వదిలేసి కొబ్బరిముక్కల కోసం దేవాలయాలను ఆశ్రయించడం మనం చూస్తూనే వున్నాం. మరికొన్ని గుంపులు జనావాసాల్లోనే స్థిరపడ్డాయి. ఇవి మచ్చిక జంతువులైనా కాదు. తిండిని దొంగిలిస్తూ జీవనం సాగిస్తుంటాయి. ఒకప్పటి నివాసాన్ని ఇవి వదిలేసిన కారణం ఏడాది పొడవునా ఆహారం దొరికే సౌలభ్యమే. ఆదిమకాలంలోనూ అలాంటి అవసరమేదో వానర జీవితం మీదికి తోసుకొచ్చేవుండాలి. సీనోజోయిక్ యుగం మొదలైన మూడు నాలుగు కోట్ల సంవత్సరాల తరువాత భూమి మీద మంచుకురిసే వాతావరణం మొదలయిందని ఇదివరకే అనుకున్నాం. అప్పటి చెట్లు హిమపాతాన్ని ఓర్చుకునే సామర్థ్యం కలిగేందుకు అవకాశం లేదు. ఆ సామర్థ్యాన్ని సంపాదించుకునేందుకు కొన్ని చెట్లు ప్రకృతితో ఘర్షణ పడుతుండగా, మిగతావన్నీ మోడు వారడంతో వానరాలకు ఆహార సముపార్జనేకాక, ఆత్మరక్షణ కూడా సమస్యగా మారుండాలి. చెట్లు పలుచబడడంతో చెట్టు నుండి చెట్టుకు మారాలంటే నేలమీది నడక తప్పనిసరి అయ్యుండాలి. వెచ్చని వాతావరణంలో ఒకప్పటి చెట్లు ఏడాది పొడవునా ఫలాలనిచ్చేవే అయ్యుంటే, రుతుచక్ర ప్రవేశంతో వాటి స్వభావం మారుండాలి. ఇలాంటి ఏవేవో కారణాల ప్రోద్బలంతో కొన్ని వానరాలు బ్రతికేందుకు వీలుగా అలవాట్లనూ, శరీర నిర్మాణాన్నీ మార్చుకుంటూ రాగా, కొన్ని వానరాలు పాత వాతావరణాన్ని వెదుక్కుంటూ దక్షిణానికి వలసమార్గం చేపట్టాయి. వాటిల్లో ఏదోవొక మార్గాన్ని అనుసరించేందుకు వీలుపడని జంతువులు వారసత్వాన్ని మిగుల్చకుండా కాలగర్భంలో కలిసిపోయాయి. ఆఫ్రికా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల్లో ఇటువంటి మరికొన్ని అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. కానీ, ఒకచోట పుర్రెలూ, ఇంకొకచోట తొడ ఎముకలూ, మరొకచోట తుంటి ఎముకలూ చెల్లాచెదురుగా దొరుకుతున్నాయే తప్ప, పూర్తి అస్థిపంజరం ఎక్కడా లభించలేదు. ఆ దొరికిన ఆధారాలతోనే ఆ జంతువులు నిటారుగా నడిచేవనీ, శాఖాజీవితాన్ని వదిలేసినవనీ, వాలిడి జాతులకు ఎంతమాత్రం సంబంధంలేనివనీ తేల్చి, ఆ జాతికి ‘ఆస్ట్రలో పిథికస్’గా నామకరణం చేశారు. నేలపొరల విశ్లేషణ ద్వారా అవి 20 లక్షల సంవత్సరాలకు పూర్వం నివసించినవిగా నిర్ణయించారు. వాలిడికీ, వాలిడిగాని వానరానికీ ఎముకల్లో ఉండే తేడాల్లో ప్రధానమైన కొన్నింటిని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అవి ఏమంటే - 1. మెదడుతో వెన్నుపాము కలిసేందుకు అనుకూలంగా పుర్రెలో ఉండే పెద్ద రంధ్రాన్ని ‘బృహద్రంధ్రం (ఫొరామెన్ మ్యాగ్నం)’ అంటారు. నాలుగుకాళ్ళ మీద నడిచే జంతువుకు ఇది పుర్రెకు పూర్తిగా వెనుకవైపు ఉంటుంది. అందుకే మొండెం నుండి వాటి తల ముందుకు చొచ్చుకొస్తుంది. వాలిడిలో ఈ రంధ్రం పుర్రెకు ఏటవాలుగా ఉంటుంది. అందువల్ల, ఎద మీద తల కూర్చోబెట్టినట్టు కనిపిస్తుందిగానీ, నిటారుగా తూకం పట్టుకునేందుకు అనుకూలించదు. మనిషి పుర్రెలో అది పూర్తిగా కిందిభాగాన ఉండడం మూలంగా, ఎదమీద తల కుదురుగా నిలిచింది. ఆస్ట్రలో పిథికస్ పుర్రెలో బృహద్రంధ్రం కిందివైపుగా ఉంది. అందువల్ల, నిటారుగా ఎంతసేపైనా నిలువగలదు. 2. వాలిడి జాతులకు కోరలు పెద్దవిగా ఉంటాయిగాబట్టి, నోరు మూతపడేందుకు అనుకూలంగా దవడలో వాటికోసం సందులు ఏర్పడివుంటాయి. ఆస్ట్రలో పిథికస్ కోరపళ్ళు చిన్నవిగా ఉండడంతో దవడల్లో సందులులేవు. 3. వాలిడికి కింది దవడ పెద్దదిగా ఉండడంతో, దాన్ని ఆడించేందుకు ఆ కండరాలు కూడా బలమైనవిగా ఉండాలి. దవడ కండరాలు అంత బలమైనవి కాబట్టి, పుర్రె పార్శాల్లో అవి పుట్టుకొచ్చిన తావున ఎముక మీద కుదుములు ఏర్పడివుంటాయి. ఆస్ట్రలో పిథికస్ పుర్రెకు అవిలేనందున, వాటి కిందిదవడ ఏమంత బరువైంది కాదని తేలింది. 4. వాలిడి జాతుల్లో జంతువులకు కాళ్ళకంటే చేతులు పొడవుగా ఉంటాయి. ఆస్ట్రలో పిథికస్ చేతులు కురచ. అవి శాఖాజీవితానికి పని కొచ్చేవిగావు. 5. వాలిడి తుంటి ఎముకలు కోసుగా కిందికి జారుంటాయి. వాటి జఘనం వెనకకాళ్ళ మీద కుదురుగా నిలబడేంత విశాలంగా విచ్చుకోనుండదు. ఆస్ట్రలో పిథికస్ తుండి ఎముక వెడల్పాటిది. జఘనం విచ్చుకోనుంటుంది. రెండు కాళ్ళ మీద నడవడానికే కాదు, పరిగెత్తేందుకు కూడా ఇది అనుకూలం. ఈ పరిశోధన మరింతమంది శాస్త్రజ్ఞులను ఆకర్షించడంతో, ఆఫ్రికా ఖండంలో తవ్వకాలు ఊపందుకుని, తరువాతి కాలంలో ఎముకలతో పాటు రాతి పనిముట్లు కూడా కలిసి కనిపించాయి. దాంతో, పనిముట్లను ఉపయోగించిన జంతువులు అవేనని నిస్సందేహంగా తేలిపోయింది. సీనోజోయిక్ యుగంలోని రెండవ ఘట్టంలో, తొలి ‘గ్లేసియల్ పిరియడ్ (హిమానీశకం)’ కంటే ఇవి 10 లక్షల సంవత్సరాల పూర్వానివి. పనిముట్లు చాలా చాలా మోటువి. ఆ జంతువులు ఆరుబయట నివసించే జీవితానికి అలవాటైనవి. పెద్దపెద్ద తండాలుగా నివసించాయని చెప్పేందుకు అవకాశం లేకపోయినా, పనిముట్లు కుప్పగా దొరకడాన్ని ఆధారం చేసుకుని, కనీసం గుంపులు గుంపులుగా కలిసి ఉమ్మడి జీవితాన్ని గడిపుంటాయని చెప్పుకోవచ్చు. ఆస్ట్రలో పిథికస్ అవశేషాలు ఆఫ్రికా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో విశేషంగా దొరకడం మూలంగా మానవుని మొదటి నివాసం ఆఫ్రికాఖండమే అనే అపోహ బయలుదేరింది. కొంతమంది శాస్త్రజ్ఞులు దాన్ని సుతరామూ అంగీకరించలేదు. ఆస్ట్రలో పిథికస్ తరువాతి పరిణామదశకు చేరుకోలేదనీ, అది ఎప్పుడో అంతరించిపోయిన జంతువనీ వాళ్ళ అభిప్రాయం. మానవుని తొలినివాసం ఆసియాఖండంలోని దక్షిణ ప్రాంతాలు అయ్యుంటాయని వాళ్ళ అంచనా. ఆ వాదనకు బీజం 19వ శతాబ్దం మధ్యకాలానికే పడింది. ఆ శతాబ్ది చివరిరోజుల్లో, హాలెండుకు చెందిన యూజిస్ డుబోయ్ అనే శాస్త్రజ్ఞుడు దీన్ని నిరూపించేందుకు పూనుకున్నాడు. చేస్తున్న అనాటమీ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలేసి, ఆయన ఇండోనేషియా దీవుల్లో తవ్వకాలు ప్రారంభించాడు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
ముంగిలి
టూకీగా ప్రపంచ చరిత్ర 2 రచన: ఎం.వి.రమణారెడ్డి సూర్య మండలంలో ఉండే తొమ్మిది గ్రహాలూ సూర్యబింబం నుండి తెగిపడి దూరంగా విసరబడ్డ ముక్కలేనని ఒక సిద్ధాంతం. వేగం మీద తెగిపడ్డాయి కాబట్టి అవి అదే వేగంతో సూర్యుని చుట్టూనూ తిరుగుతుంటాయి, సూర్యునిలాగే ఆత్మపరిభ్రమణంలోనూ ఉంటాయి. భూమి ఆకారం, హోదాల మీద బలమైన వాదోపవాదాలు మనదేశంలో జరిగిన దాఖలాలు లేవుగానీ, యూరప్ ఖండాన్ని ఆ చర్చ తీవ్రమైన సంక్షోభంలోకి నడిపించింది. శాస్త్రీయ విజ్ఞానం ఫలితంగా మతం పునాదులు కదలడంతో బైబిలుకు భిన్నంగా వాదించేవాళ్ళను ‘దైవద్రోహులు’ గానో, ‘మతిభ్రష్టులు’గానో ప్రకటించి క్రిస్టియన్ పీఠాధిపతులు వాళ్ళను క్రూరంగా హింసించారు. గ్రహాలన్నిటికీ సూర్యుడు కేంద్రమనీ, భూమితోపాటు ఇతర గ్రహాలన్నీ సూర్యునిచుట్టూ తిరుగుతున్నాయని మొట్టమొదటిసారి సహేతుకంగా ప్రతిపాదించిన కోపర్నికస్ అనే శాస్త్రజ్ఞుణ్ణి క్రిస్టియన్ శ్మశానంలో పూడ్చేందుకు అనుమతి నిరాకరించారు. కోపర్నికస్‌ను సమర్థించిన బ్రూనోను సజీవదహనం చేశారు. దూరదర్శినిని కనుగొన్న గెలీలియోను ‘హౌస్ అరెస్టు’కు గురిచేశారు. మతవిశ్వాసాలకూ శాస్త్రవిజ్ఞానానికీ వందలాది సంవత్సరాలు జరిగిన పోరాటంలో చివరకు విజ్ఞానమే విజయం సాధించింది. ఆధునిక ఖగోళశాస్త్రం రీత్యా భూమి సూర్యకుటుంబానికి చెందిన గ్రహాల్లో ఒకటి; ఆ కుటుంబానికి కేంద్రం సూర్యుడు. అనంతవిశ్వంలో విస్తరించిన కోట్లాది నక్షత్రాల్లో సూర్యగోళం కూడా ఒక నక్షత్రం. కాకపోతే, అది మిగతా నక్షత్రాలకంటే మనకు చేరువలో ఉన్నందున, మొనలు మొనలుగా కాకుండా, స్పష్టమైన వృత్తంగా కనిపిస్తుంది. చేరువగా అంటే అదేదో అమెరికా వెళ్ళేందుకో జపాన్ వెళ్ళేందుకో ప్రయాణం చేసే దూరంతో పోల్చుకునేంత చిన్నదిగాదు - కొంచెం ఇటూఅటుగా పదికోట్ల మైళ్ళు! దాని వ్యాసం 8,66,000 మైళ్లు; పరిమాణంలో భూమికంటే పన్నెండున్నర లక్షల రెట్లు పెద్దది. భూమి వ్యాసం సగటున 7895 మైళ్ళు. మిగతా నక్షత్రాలకు మల్లే సూర్యగోళం ఒక నిప్పుల ముద్ద. ఊహించేందుకు వీలుగానంత వేడితో, వెలుతురుతో, నాలుకలు చాచే మంటలతో, తన చుట్టూ తాను విపరీతమైన వేగంతో తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగే దురుసుతనంలో ఎప్పుడో తెగిపోయిన ఒకానొక నాలుక మన భూగోళం. సూర్య మండలంలో ఉండే తొమ్మిది గ్రహాలూ (ఇటీవల మరొకటి అదనంగా ఉన్నట్టు అనుమానం) అలా సూర్యబింబం నుండి తెగిపడి దూరంగా విసరబడ్డ ముక్కలేనని ఒక సిద్ధాంతం. వేగం మీద తెగిపడ్డాయి కాబట్టి అవి అదే వేగంతో సూర్యుని చుట్టూనూ తిరుగుతుంటాయి, సూర్యునిలాగే ఆత్మపరిభ్రమణంలోనూ ఉంటాయి. కాలక్రమంలో సూర్యునికి దూరందూరం జరగడంతో వాటికి వేడీ తగ్గింది. పరిభ్రమణ వేగమూ తగ్గింది. అన్నిటికంటే ముందు పుట్టి, అన్నికంటే దూరం జరిగిన గ్రహం ‘ఫ్లూటో’. పూర్తిగా చల్లబడి, అతి మెల్లగా తిరిగే గ్రహం కావడంతో దీన్ని ‘మృతగ్రహం’ (డెడ్ ప్లానెట్) గా వ్యవహరిస్తారు. సూర్యకిరణాల తేజస్సుకు అందనంత దూరం జరగడంతో దీన్ని ‘చీకటిగ్రహం’ అనిగూడా అంటారు. తొమ్మిది తోబుట్టువుల్లో మిక్కిలి పిన్నవయసుది బుధగ్రహం. ఇది సూర్యునికి అత్యంత సమీపంలో ఉండడమేగాక, మిగతావాటికంటే వేగంగా సూర్యుని చుట్టూ తిరిగొస్తుంది. దీనికంటే ముందు పుట్టిన గ్రహం శుక్రుడు. సూర్యునికి మరికొంచెం ఎడంగా ఉంటుంది. వరుసలో మూడవది భూమి. ఆ తరువాత కుజుడు (అంగారకుడు), గురువు, శని, యురేనస్, నెఫ్యూన్, ఫ్లూటో ఉంటాయి. చంద్రుడు భూమికి ఉపగ్రహం. పుట్టిన మొదట్లో, ఇతర గ్రహాల్లాగే, భూమిగూడా నిప్పులబంతిగా ఉండేది. సూర్యునికి దూరంగా జరిగే ప్రక్రియలో దీని ఉపరితలం చల్లబడడమే కాక, ఒక ప్రత్యేక రసాయనిక సంయోగంతో ‘నీరు’ అనే పదార్థం దీని వాతావరణంలో ఏర్పడింది. నీరంటే మనకు అలవాటైన ద్రవరూపంలో ఉండేది గాదు; సెగలు కక్కే ఆవిరి. అయినా, యాదృచ్ఛికంగా జరిగిన ఈ రసాయనిక సంయోగం జీవరాసి ఆవిర్భావానికీ, యుగయుగాల చరిత్రకూ కీలకమై నిలిచింది. తనకున్న శక్తియుక్తులతో ఆధునిక మానవుడు నీటికణాల జాడ కోసం అంతరిక్షమంతా గాలించడం గమనిస్తే ఆ రసాయనిక సంయోగం ప్రాముఖ్యత ఎంత విలువైందో ఇట్టే తెలిసిపోతుంది. ‘నీరు’ అనేది ఒక రసాయనిక సంయోగంతో ఏర్పడే పదార్థం. ఒక ఆక్సిజన్ (ప్రాణవాయువు) పరమాణువుతో రెండు హైడ్రోజన్ (ఉదజని) పరమాణువులు కలిస్తే - మిశ్రమంగా కాదు, సంయోగంగా కలిస్తే - ‘నీరు’ అనేది ఏర్పడుతుంది. మిశ్రమంగా కలవడం వేరు, సంయోగంగా కలవడం వేరు. మిశ్రమమంటే మనకు తరచు వినిపించే ‘నవధాన్యాలు’ వంటిది. తొమ్మిది రకాల తిండిగింజలను కలిపి తొలకరిలో మొలకబోయడం తెలుగువారి ఆచారం. ఆ కలిసిన గింజలు ఒకదాని సరసన మరొకటి చేరివుంటాయే తప్ప రూపాన్ని కోల్పోయి కొత్త పదార్థంగా ఏర్పడవు. కావాలనుకుంటే ఏ గింజకు ఆ గింజను ఏరుకుని వేరుచేయొచ్చు. ఇలాటిదాన్ని ‘మిశ్రమం’ అంటాం. భోజనం తరువాత తాంబూలం వేసుకోవడమూ తెలుగువారి ఆచారమే. ఆకూ, వక్కా, సున్నమూ కలిపి బాగా నమిలితే ఎర్రటి ద్రవం ఊరుతుంది. ఆ ద్రవంలో ఆకురసం, వక్కరసం, సున్నం కలిసిపోయి వుంటాయి. ఎంతగా కలిసివుంటాయంటే - తిరిగి వాటిని విడివిడిగా పొందలేనంత సన్నిహితంగా కలిసిపోయివుంటాయి. దీన్ని ‘సంయోగం’ అంటాం. ఆకాశంలో ఆక్సిజనూ హైడ్రోజను కలిసి ఇంత తేలిగ్గా తేమను పుట్టించే అవకాశమున్నప్పుడు, అదే మనకు వర్షంగా కురవకుండా, సముద్రంలో నీరు ఆవిరై, ఆ ఆవిరి మేఘాలుగా తయారై, ఆ మేఘాలు చల్లబడితే గాని చినుకు రాలనంత డొంకతిరుగుడు వ్యవహారం ఎందుకు ప్రవేశించిందో అనుమానం కలుగుతూందిగదా? -
ముంగిలి
టూకీగా ప్రపంచ చరిత్ర తనను గురించి తాను తెలుసుకోవాలనే కుతూహలంలేని మానవుడు ప్రపంచంలో పుట్టి వుండడు. మనిషికి తెలీకుండానే అది ఎదలో పుట్టుకొచ్చే కోరిక. ఆ కోరికే మానవుని ప్రత్యేకత. చరిత్ర గురించి ఆలోచించడం చేతయ్యేది ఒక్క మనిషికి మాత్రమే. మన కళ్ళముందు మెదిలే జంతువులన్నిటికీ ఆలోచన ఉంటుంది. ‘తిండి ఎక్కడ దొరుకుతుంది’, ‘సుఖంగా పడుకునేందుకు చోటు ఎక్కడ దొరుకుతుంది’, ‘ప్రమాదమా కాదా’ అనే పరిమితమైన పరిధిలో మాత్రమే అవి ఆలోచించగలవు. ‘నేను ఎవరు’, ‘ఎప్పుడు పుట్టాను, ఎక్కడ పుట్టాను’, ‘నా అమ్మా నాన్నా ఎవరు’, ‘ఈ వర్షం ఇలానే కురుస్తూ పోతే ఏం జేయాలి’ వంటి భూత భవిష్యత్తులకు సంబంధించిన ఆలోచనలు జంతువులో ఉండవు. ‘నిటారుగా నడవడం, మాట్లాడడం వంటి కొన్ని లక్షణాలు అదనంగా వున్నా మనిషి గూడా ఒక జంతువే’ అని ఎవరైనా అంటే, అతడు శాస్త్రజ్ఞుడైనా సరే, అది ఎంత వాస్తవమైనా సరే, వినేందుకు మనకు కష్టంగా ఉంటుంది. ఈ ఇరకాటం ఇటీవలి కాలంలో పుట్టుకొచ్చిందే. మన పూర్వీకులకు తమను జంతువుతో బేరీజు వేసుకునే అవసరమూ కలుగలేదు, ఆలోచనా పుట్టలేదు. మానవజన్మ ఎంతో విశిష్టమైనదనీ, దేవుడు మనిషిని ప్రత్యేకంగా సృష్టించాడనీ వాళ్ళ అభిప్రాయం. హిందువుల ఇతిహాసాల మొదలు పాశ్చాత్యుల ‘బైబిల్’ దాకా ఈ విషయాన్ని ఘంటాపథంగా ప్రకటించాయి. బైబిల్ ప్రకారం ఈ చరాచర ప్రపంచం దేవుని సృష్టి. మొట్టమొదట ఆయన వెలుగు ప్రవేశించేలా ఆజ్ఞాపించి, వెలుతురును పగలుగానూ చీకటిని రాత్రిగానూ విభజించాడు. ఒక పగలూ ఒక రాత్రీ కలిసి ఏర్పడిన సమయాన్ని ‘దినము’ అన్నాడు. అది ఆయన మొదటిరోజు కార్యక్రమం. రెండవరోజు ఆకాశాన్నీ, మూడవరోజు భూమినీ సృష్టించాడు. భూమిమీద చెట్లూ చేమలూ మొలకెత్తేలా ఆజ్ఞాపించాడు. అవి విత్తనాల ద్వారా ఉత్తరోత్తరా స్వయంసమృద్ధి పొందేలా ఏర్పాటు చేశాడు. నాలుగవరోజు సూర్యచంద్రులనూ నక్షత్రాలనూ ఆకాశంలో నిర్మించాడు. ఐదవ రోజు రకరకాల పక్షులనూ జంతువులనూ సృష్టించాడు. ఉత్తరోత్తరా అవి సంతానోత్పత్తితో భూమి మీద విస్తరించేలా దీవించాడు. ఆరవరోజు తనకు ప్రతిబింబంగా మనిషిని సృష్టించాడు. మిగతా జీవకోటి మీద మనిషికి పెత్తనం అప్పగించాడు. ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత, మనిషి ఒంటరితనం పోగొట్టాలనుకున్నాడు. పురుషుని పక్కటెముక తీసి, దాన్ని స్త్రీగా రూపొందించాడు. ఆ ఇరువురిని సంతానోత్పత్తితో విస్తరించేలా దీవించాడు. ఇక హిందువుల విశ్వాసానికి వస్తే - ఆదిమధ్యాంత రహితుడైన పరమాత్ముని బొడ్డులోనుండి పద్మం మొలిచింది. ఆ పద్మంలో పుట్టిన బ్రహ్మ ఈ చరాచర ప్రపంచాన్ని నిర్మించాడు. అందువల్ల బ్రహ్మ మొట్టమొదటి ప్రజాపతి. ఆ పద్మమే భూమి. విషయాంతరాలు అనేకంగా ఉన్నా, సనాతనుల్లో అధికసంఖ్యాకులు అంగీకరించేది ఈ వాదాన్నే. మహాభారతం ఆదిపర్వంలో సృష్టిని వివరించే సందర్భం ఒకటుంది. దాని ప్రకారం, (అలా పద్మంలో ఉద్భవించిన) బ్రహ్మకు మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే ఆరుగురు ప్రజాపతులు మానస పుత్రులుగా జన్మించారు. వీళ్ళుగాక, కుడిబొటనవేలు నుండి దక్షుడనే ప్రజాపతి, ఎడమ బొటనవేలి నుండి ధరణి అనే స్త్రీ పుట్టుకొచ్చారు. కుడిచేతి నుండి ‘ధర్మువు’అనే కుమారుడు మనువుగా జన్మించాడు. ఆ మనువుకు సహాయంగా ధాత, విధాత అనే మరో ఇద్దరు పురుషులు బ్రహ్మకు జన్మించారు. హృదయం నుండి భృగుమహర్షి జన్మించాడు. దక్షునికి ధరణి ద్వారా యాభైమంది (భాగవతంలో అరవైమంది) కుమార్తెలు పుట్టగా, వాళ్ళల్లో పదిమందిని ధర్మువుకూ, ఇరవయ్యేడు మందిని చంద్రునికీ, పదముగ్గురిని మరీచి కుమారుడైన కశ్యపునికీ ఇస్తాడు. వాళ్ల సంతానం ద్వారా మానవజాతి విస్తరిస్తుంది. కశ్యవుని సంతానంలో దేవతలూ, రాక్షసులూ, పక్షులూ, పాములూ, రకరకాల జంతువులూ ఉండడం విశేషం. ఇలా ప్రపంచంలోని ఏ ప్రాచీన సాహిత్యం చూసినా, ఏ ప్రాంతంలోని దేవుళ్ళు ఆ ప్రాంతంలోని మానవులను సృష్టించినట్టు కనిపిస్తుంది. పైన వివరించిన బైబిల్ సమాచారానికీ మహాభారత సమాచారానికీ మధ్య కొద్దిపాటి తేడాలు కనిపించినా, మనిషి ప్రత్యేకంగా సృష్టించబడ్డాడని చెప్పడం వరకు తేడాలేదు. అంతేగాదు, మనిషి పుట్టుకకు ముందు విధిగా భూమి పుట్టుకను గురించి ప్రస్తావించడంలో గూడా తేడాలేదు. సృష్టి సమస్తానికి భూమి కేంద్రమనీ, ఆ భూమి మనిషి కోసం ఏర్పడిందనీ, సూర్యచంద్రులు భూమిచుట్టూ తిరుగుతూ పగటినీ రాత్రినీ కలిగించే ప్రకృతిశక్తులనీ ఆనాటి విశ్వాసం. ఇటీవలి కాలంలో భూమిని మనం గోళంగా చెప్పుకుంటున్నాంగానీ, ప్రాచీనుల అభిప్రాయంలో ఇది బల్లపరుపుగా ఉండే ప్రదేశం. పురాతన భారతీయ సాహిత్యంలో గూడా ‘భూవలయం’, ‘ఇలాతలం’ వంటి మాటలే కనిపిస్తాయిగానీ, ‘గోళం’గా సూచించిన ఆధారాలు కనిపించవు. సాంకేతిక పరికరాల సహాయం లేకుండా భూమిని గోళంగా భావించడం తేలికైన ఆలోచన కాదు. ఎంతదూరం పయనించినా కంటిచూపుకున్న పరిమితులు భూమిని బల్లపరుపుగా భావించేందుకే అనుకూలిస్తాయి. అందువల్ల, ‘మిట్టలూ పల్లాలూ ఉంటాయేతప్ప, స్థూలంగా భూమి చదునుగా విస్తరించిన ప్రదేశం’ అనుకోవడంలో ఆనాటి మానవునికి ఎలాంటి సందేహం కలుగలేదు. గోళంగా ఉందేమోననే సందేహం మీద క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరాలకు ముందే గ్రీకు తత్త్వవేత్తలు చర్చించినట్టు తెలిసినా, మతగ్రంథాలు బల్లపరుపుగా ఉన్నట్టు చెబుతుండడంతో చాలాకాలం దాకా అది విభేదించేందుకు ఏమాత్రం వీలుపడని విశ్వాసంగా కొనసాగింది.