చుట్టరికాలు | the World History 17 | Sakshi
Sakshi News home page

చుట్టరికాలు

Published Thu, Jan 29 2015 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

చుట్టరికాలు

చుట్టరికాలు

టూకీగా ప్రపంచ చరిత్ర- 17
 
అసలు, ఏ వానరానికైనా శాఖోపజీవితానికి విడాకులిచ్చి నేలమీదికి మారే అవసరం ఏమొచ్చుంటుంది? అలాంటి ఒత్తిడి వచ్చే ఉండాలి.
 ఎన్నో కోతులు అడవులు వదిలేసి కొబ్బరిముక్కల కోసం దేవాలయాలను ఆశ్రయించడం మనం చూస్తూనే వున్నాం. మరికొన్ని గుంపులు జనావాసాల్లోనే స్థిరపడ్డాయి. ఇవి మచ్చిక జంతువులైనా కాదు. తిండిని దొంగిలిస్తూ జీవనం సాగిస్తుంటాయి. ఒకప్పటి నివాసాన్ని ఇవి వదిలేసిన కారణం ఏడాది పొడవునా ఆహారం దొరికే సౌలభ్యమే. ఆదిమకాలంలోనూ అలాంటి అవసరమేదో వానర జీవితం మీదికి తోసుకొచ్చేవుండాలి. సీనోజోయిక్ యుగం మొదలైన మూడు నాలుగు కోట్ల సంవత్సరాల తరువాత భూమి మీద మంచుకురిసే వాతావరణం మొదలయిందని ఇదివరకే అనుకున్నాం. అప్పటి చెట్లు హిమపాతాన్ని ఓర్చుకునే సామర్థ్యం కలిగేందుకు అవకాశం లేదు. ఆ సామర్థ్యాన్ని సంపాదించుకునేందుకు కొన్ని చెట్లు ప్రకృతితో ఘర్షణ పడుతుండగా, మిగతావన్నీ మోడు వారడంతో వానరాలకు ఆహార సముపార్జనేకాక, ఆత్మరక్షణ కూడా సమస్యగా మారుండాలి. చెట్లు పలుచబడడంతో చెట్టు నుండి చెట్టుకు మారాలంటే నేలమీది నడక తప్పనిసరి అయ్యుండాలి. వెచ్చని వాతావరణంలో ఒకప్పటి చెట్లు ఏడాది పొడవునా ఫలాలనిచ్చేవే అయ్యుంటే, రుతుచక్ర ప్రవేశంతో వాటి స్వభావం మారుండాలి. ఇలాంటి ఏవేవో కారణాల ప్రోద్బలంతో కొన్ని వానరాలు బ్రతికేందుకు వీలుగా అలవాట్లనూ, శరీర నిర్మాణాన్నీ మార్చుకుంటూ రాగా, కొన్ని వానరాలు పాత వాతావరణాన్ని వెదుక్కుంటూ దక్షిణానికి వలసమార్గం చేపట్టాయి. వాటిల్లో ఏదోవొక మార్గాన్ని అనుసరించేందుకు వీలుపడని జంతువులు వారసత్వాన్ని మిగుల్చకుండా కాలగర్భంలో కలిసిపోయాయి.

 ఆఫ్రికా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల్లో ఇటువంటి మరికొన్ని అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. కానీ, ఒకచోట పుర్రెలూ, ఇంకొకచోట తొడ ఎముకలూ, మరొకచోట తుంటి ఎముకలూ చెల్లాచెదురుగా దొరుకుతున్నాయే తప్ప, పూర్తి అస్థిపంజరం ఎక్కడా లభించలేదు. ఆ దొరికిన ఆధారాలతోనే ఆ జంతువులు నిటారుగా నడిచేవనీ, శాఖాజీవితాన్ని వదిలేసినవనీ, వాలిడి జాతులకు ఎంతమాత్రం సంబంధంలేనివనీ తేల్చి, ఆ జాతికి ‘ఆస్ట్రలో పిథికస్’గా నామకరణం చేశారు. నేలపొరల విశ్లేషణ ద్వారా అవి 20 లక్షల సంవత్సరాలకు పూర్వం నివసించినవిగా నిర్ణయించారు.
 వాలిడికీ, వాలిడిగాని వానరానికీ ఎముకల్లో ఉండే తేడాల్లో ప్రధానమైన కొన్నింటిని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అవి ఏమంటే - 1. మెదడుతో వెన్నుపాము కలిసేందుకు అనుకూలంగా పుర్రెలో ఉండే పెద్ద రంధ్రాన్ని ‘బృహద్రంధ్రం (ఫొరామెన్ మ్యాగ్నం)’ అంటారు. నాలుగుకాళ్ళ మీద నడిచే జంతువుకు ఇది పుర్రెకు పూర్తిగా వెనుకవైపు ఉంటుంది. అందుకే మొండెం నుండి వాటి తల ముందుకు చొచ్చుకొస్తుంది. వాలిడిలో ఈ రంధ్రం పుర్రెకు ఏటవాలుగా ఉంటుంది. అందువల్ల, ఎద మీద తల కూర్చోబెట్టినట్టు కనిపిస్తుందిగానీ, నిటారుగా తూకం పట్టుకునేందుకు అనుకూలించదు. మనిషి పుర్రెలో అది పూర్తిగా కిందిభాగాన ఉండడం మూలంగా, ఎదమీద తల కుదురుగా నిలిచింది. ఆస్ట్రలో పిథికస్ పుర్రెలో బృహద్రంధ్రం కిందివైపుగా ఉంది. అందువల్ల, నిటారుగా ఎంతసేపైనా నిలువగలదు. 2. వాలిడి జాతులకు కోరలు పెద్దవిగా ఉంటాయిగాబట్టి, నోరు మూతపడేందుకు అనుకూలంగా దవడలో వాటికోసం సందులు ఏర్పడివుంటాయి. ఆస్ట్రలో పిథికస్ కోరపళ్ళు చిన్నవిగా ఉండడంతో దవడల్లో సందులులేవు. 3. వాలిడికి కింది దవడ పెద్దదిగా ఉండడంతో, దాన్ని ఆడించేందుకు ఆ కండరాలు కూడా బలమైనవిగా ఉండాలి. దవడ కండరాలు అంత బలమైనవి కాబట్టి, పుర్రె పార్శాల్లో అవి పుట్టుకొచ్చిన తావున ఎముక మీద కుదుములు ఏర్పడివుంటాయి. ఆస్ట్రలో పిథికస్ పుర్రెకు అవిలేనందున, వాటి కిందిదవడ ఏమంత బరువైంది కాదని తేలింది. 4. వాలిడి జాతుల్లో జంతువులకు కాళ్ళకంటే చేతులు పొడవుగా ఉంటాయి. ఆస్ట్రలో పిథికస్ చేతులు కురచ. అవి శాఖాజీవితానికి పని కొచ్చేవిగావు. 5. వాలిడి తుంటి ఎముకలు కోసుగా కిందికి జారుంటాయి. వాటి జఘనం వెనకకాళ్ళ మీద కుదురుగా నిలబడేంత విశాలంగా విచ్చుకోనుండదు. ఆస్ట్రలో పిథికస్ తుండి ఎముక వెడల్పాటిది. జఘనం విచ్చుకోనుంటుంది. రెండు కాళ్ళ మీద నడవడానికే కాదు, పరిగెత్తేందుకు కూడా ఇది అనుకూలం.

 ఈ పరిశోధన మరింతమంది శాస్త్రజ్ఞులను ఆకర్షించడంతో, ఆఫ్రికా ఖండంలో తవ్వకాలు ఊపందుకుని, తరువాతి కాలంలో ఎముకలతో పాటు రాతి పనిముట్లు కూడా కలిసి కనిపించాయి. దాంతో, పనిముట్లను ఉపయోగించిన జంతువులు అవేనని నిస్సందేహంగా తేలిపోయింది. సీనోజోయిక్ యుగంలోని రెండవ ఘట్టంలో, తొలి ‘గ్లేసియల్ పిరియడ్ (హిమానీశకం)’ కంటే ఇవి 10 లక్షల సంవత్సరాల పూర్వానివి. పనిముట్లు చాలా చాలా మోటువి. ఆ జంతువులు ఆరుబయట నివసించే జీవితానికి అలవాటైనవి. పెద్దపెద్ద తండాలుగా నివసించాయని చెప్పేందుకు అవకాశం లేకపోయినా, పనిముట్లు కుప్పగా దొరకడాన్ని ఆధారం చేసుకుని, కనీసం గుంపులు గుంపులుగా కలిసి ఉమ్మడి జీవితాన్ని గడిపుంటాయని చెప్పుకోవచ్చు.

 ఆస్ట్రలో పిథికస్ అవశేషాలు ఆఫ్రికా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో విశేషంగా దొరకడం మూలంగా మానవుని మొదటి నివాసం ఆఫ్రికాఖండమే అనే అపోహ బయలుదేరింది. కొంతమంది శాస్త్రజ్ఞులు దాన్ని సుతరామూ అంగీకరించలేదు. ఆస్ట్రలో పిథికస్ తరువాతి పరిణామదశకు చేరుకోలేదనీ, అది ఎప్పుడో అంతరించిపోయిన జంతువనీ వాళ్ళ అభిప్రాయం. మానవుని తొలినివాసం ఆసియాఖండంలోని దక్షిణ ప్రాంతాలు అయ్యుంటాయని వాళ్ళ అంచనా. ఆ వాదనకు బీజం 19వ శతాబ్దం మధ్యకాలానికే పడింది. ఆ శతాబ్ది చివరిరోజుల్లో, హాలెండుకు చెందిన యూజిస్ డుబోయ్ అనే శాస్త్రజ్ఞుడు దీన్ని నిరూపించేందుకు పూనుకున్నాడు. చేస్తున్న అనాటమీ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలేసి, ఆయన ఇండోనేషియా దీవుల్లో తవ్వకాలు ప్రారంభించాడు.

రచన: ఎం.వి.రమణారెడ్డి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement