టూకీగా ప్రపంచ చరిత్ర -37
చరాచర పదార్థాలన్నిటికీ వ్యక్తిత్వం ఆపాదించే అలవాటు (personification) మన పురాతన సాహిత్యానికి ఈ తలీతలుగా ఉన్న కారణంగా, ఆ మహిషాసురుడు నిజంగా రాక్షసుడేనో, లేక భీభత్సంగా చెలరేగిన అడవి దున్నకు అసురునిగా ఆపాదించిన వ్యక్తిత్వమో చెప్పేందుకు వీలుగాదు. సూర్యుణ్ణి పురుషునిగా వర్ణించి, ‘ఛాయాదేవి’ని - అంటే నీడను, అతనికి భార్యగా సంపాదించారు. సర్వభక్షకుడైన అగ్నిని వ్యక్తిగా చూపించి, ‘స్వాహా దేవి’ని అతనికి భార్యగా అంటగట్టారు. ఇదేవిధంగా, శక్తివంతమైన ప్రకృతులన్నింటినీ పురుషులుగానూ, వాటి ఫలితాన్ని భార్యలుగానూ కథలల్లడం మన సాహిత్యంలో కొల్లలుగా కనిపిస్తుంది. కాళి కూడా అదే కోవలో, తన గుంపును క్రియాశీలకంగా సమన్వయించి, ఆ ఎనుబోతును ముక్కలకింద నరికిన స్త్రీ ఆయ్యిండొచ్చు. ఒకవేళ ఆమె నివాసం మైసూరు ప్రాంతమే అయ్యుంటే, దక్షిణాది నుండి ఉత్తర భారతం స్వీకరించిన ఏకైక సంప్రదాయం ‘దశరా’, లేక ‘నవరాత్రి’ ఉత్సవంగా చెప్పుకోవచ్చు.
ఒక్క కాళికా శక్తినే కాదు. ఆమె అవతరాలుగా చెప్పబడే దుర్గ, చండి, భవాని తదితర దేవతలు గూడా దక్షిణ భారతదేశంలో విశిష్టమైన స్థాయిలో ఆరాధ్యులుగా ఉన్నారు. అదనంగా పెద్దమ్మ, చిన్నమ్మ, మారెమ్మ ఆరాధన కూడా దక్షిణాదిలో ముమ్మరంగా సాగుతూంది. విగ్రహం రూపంలో కనిపించే ప్రతి గ్రామదేవత చేతిలో, మొనకు నిమ్మకాయ గుచ్చిన కత్తి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. వీళ్ళల్లో గంగమ్మ నీటికి, లేదా నదీప్రవాహానికి ప్రతీక; ఎల్లమ్మ వెల్లువెత్తిన ప్రవాహానికి ప్రతీక. సముద్రతీరాలు మినహాయిస్తే, మిగతా గుళ్ళల్లో సాధారణంగా గంగమ్మ, ఎల్లమ్మ కలిసే ఉంటారు. వీళ్ళ పూజకు అనుబంధంగా ప్రస్తావించే కులాలు విధిగా నీటితో విడదీయరాని సంబంధం కలిగిన చాకలి, బెస్త, యాదవ, రైతు వృత్తులవాళ్ళవే అయ్యుంటాయి.
పెద్దమ్మ, చిన్న, మారెమ్మ వంటి ఇతర దేవతలను మశూచి, మంపులు, కలరా వంటి వ్యాధులతో పోల్చుకోవడం గమనిస్తే, ఈ గ్రామదేవతలు మానవుని భయాందోళనల నుండి పుట్టుకొచ్చిన (ఆపాదిత) వ్యక్తిత్వాలైనా అయ్యుండాలి. లేదా కుటుంబ వ్యవస్థ ఏర్పడక పూర్వం నివసించిన స్త్రీలైనా అయ్యుండాలి. ఈ గ్రామదేవతల్లో ఏవొక్కరికీ భర్త ఉండడుగానీ, సంతతి ఉంటుంది. అందుకే వీళ్ళ పురుషస్థానాన్ని ‘లింగం’ అంటారు. ఋగ్వేదంలో కనిపించే ‘అదితి’ పాత్రగూడా ఇంచుమించు ఇలాంటిదే. ఆమె ఇంద్ర, వరుణ మిత్ర దేవతలకు తల్లి. కశ్యప ప్రజాపతిని ఆమెకు భర్తగా పేర్కొన్నా, యజ్ఞానికి అందించే ఆహ్వానంలో ఏవొక్క చోటా ఆమెకు భర్తతో అనుసంధానం కనిపించదు.
దక్షిణ భారతదేశంలోని ‘మళయాల’ ప్రాంతం ఆడవాళ్ళ రాజ్యంగా ఎలా ప్రచారమైందో ఆధారాలు దొరకవుగానీ, ఆ పునాది మీద తయారైన సాహిత్యం మాత్రం తెలుగులో బోలెడంత దొరుకుతుంది. వాటిల్లో ప్రధానమైంది ‘ప్రమీలార్జునీయం’ ఇందులో అర్జునుడు తన దక్షిణాది దండయాత్రలో భాగంగా, స్త్రీలు పరిపాలించే ‘ప్రమీల’ రాజ్యాన్ని గాండీవంతో కాకుండా మన్మథబాణాల సాయంతో జయిస్తాడు. ఇది మహాభారతంలో కనిపించే కథ కాదు; ‘శశిరేఖా పరిణయం’లో లాగే పాత్రల పేర్ల మతలబుతో మహా భారతంలోనిదిగా భ్రమింపజేసే పుక్కిటి పురాణం. అదే కోవలో మళయాలాన్ని చిత్రీకరించిన సాహిత్యం కందుకూరు విరేశలింగంగారి రచనలతో సహా, అనేక సందర్భాల్లో మనకు ఎదురౌతుంది.
రచన: ఎం.వి.రమణారెడ్డి