టూకీగా ప్రపంచ చరిత్ర - 35
రచన: ఎం.వి.రమణారెడ్డి
కులాసాలు
అప్పట్లో మానవునికి ‘దేవుడు’ అనే ఊహ ఇంకా ఏర్పడలేదు. వెలుగునిచ్చే సూర్యుడూ, చంద్రుడూ వంటి ప్రకృతి శక్తులు అతనికి ఆహ్లాదం; గాలి, వానల పట్ల భయమూ, భక్తి - అంతకుమించి ఆలోచన సాగే పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. అందువల్ల, విందులూ వినోదాలతో ఆత్మీయతలు ప్రకటించుకోవడం మాత్రమే ఆ మేళాల ప్రయోజనం.
విందుకోసం వేరువేరు తావుల్లో దొరికే వేటలు ప్రత్యేక వంటకాలు; వేరువేరు గుడారాల విద్వాంసులు ప్రదర్శించే పాటవాలు వైవిధ్యభరితమైన వినోదాలు. ఆకర్షణీయమైన ఇతివృత్తాలు పొలిమేరలు దాటుకుని విస్తరించేందుకు కారణం ఇలాంటి కార్యక్రమాలే. దాయాది తెగల్లోని పురుషునిమీద స్త్రీకి ఏర్పడే మోజు ‘వరుసలు’గా ఏర్పడేందుకు పునాదులు బహుశా ఇలాంటి సందర్భాల్లోనే పుట్టుకొచ్చుండొచ్చు. తరువాత కొద్దికాలానికి అదే జనావాసంలో పుట్టిన ఆడవాళ్ళంతా సోదరులుగానూ, పొరుగున జన్మించిన ఆడవాళ్ళు మిథునంగానూ ఆలోచించే ఆచారం ప్రవేశించింది.
శిల్పం, చిత్రకళల మీద కొత్త రాతియుగం మానవునికి ఆసక్తి నశించిందని ఇదివరకు మనం అనుకున్నాం. అలా చెప్పుకోవడం కంటే, ఆ కళ పురుషుల నుండి స్త్రీలకు బదిలీ అయిందని చెప్పుకోవడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే, గోడల మీద చిత్రకళ అంతరించిన తరువాత, అది మట్టి పాత్రల మీద పూజల రూపంలో (వంకరటింకర గీతలతో, చుక్కలతో తీర్చే అలంకరణ) తిరిగి ప్రత్యక్షమైంది. దోసిళ్ళతో నీళ్లు తాగడం, దొన్నెలతో తెచ్చుకోవడం తప్ప మగవాడు పాత్రలను గురించి ఊహించుకోలేడు.
బహుశా చిన్నపిల్లలకు చేపను కాల్చి తినిపించే సందర్భాల్లో బంకమట్టి స్వభావాన్ని ఆడవాళ్లే గమనించి ఉండాలి. జంతు మాంసంలాగా చేపమాంసం నిప్పుల సెగను పెద్దగా ఓర్చుకోలేదు. చుట్టూ బంకమట్టిని దట్టిస్తే, మాడిపోయే నష్టాన్ని నివారించడం సాధ్యమని గుర్తించడం ఈ పంథాలో తొలిపాఠం. అలా బంకమట్టిని పూసి నిప్పుల మీద చేపను కాల్చుకునే అలవాటు ఏటివార పల్లెల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. కుండల తయారీ ప్రయోగాల్లో బంకమట్టికి ఆకారం కల్పించేందుకు ఆకుదొన్నె చుట్టూ పూత పూయడం మలిపాఠం. కాల్చిన బంకమట్టి నీళ్లల్లో కరగకుండా నిలుస్తుందని తెలుసుకోవడం మూడవ పాఠం. దాంతో ఖుద్దుగా కుండల తయారీ మొదలయింది.
నీళ్లు తెచ్చుకునేందుకు వాటమైనవి కొన్నీ, రాలిన గింజను ఊడ్చి నిలువచేసేందుకు వీలయ్యేవి కొన్ని - ఇలా మట్టిపాత్రల తయారీ ఒక వ్యాపకంగా పరిణమించింది. వాళ్లు చేసిన మట్టిపాత్రలో దేన్ని తీసుకున్నా, దాని చుట్టూరా పూజలతో అలంకరించిన కళానైపుణ్యం కనిపిస్తుంది.
ఆహార పదార్థంగా ‘గింజ’ను ప్రవేశపెట్టిన ప్రశంసకు కూడా అర్హత ఆడవాళ్ళదే. చాలాకాలం దాకా అవి పశువుల దాణా కిందనే మానవుడు జమకట్టాడు. వేవిళ్లతో వున్న స్త్రీలకు ఏదిపడితే అది కొరికే అలవాటు ప్రకృతిసిద్ధమైన స్వభావం.
గడ్డికి కాసే గింజ కూడా రుచిగా ఉంటుందని తెలుసుకునే అవకాశం అలాంటి సందర్భంలోనే కలిగుండాలి. గింజను పిండిగా చితగ్గొట్టి, నిప్పు నుండి దిగిన వేడివేడి మాంసానికి అద్ది, వేవిళ్ళ సమయంలో తినిపించడంతో గింజల ప్రయోజనం మానవ జీవితానికి వ్యాపించి వుండాలి. ఈనాడు మాంసాహార పదార్థాలకు ప్రపంచ ప్రఖ్యాతి వహించిన కంపెనీల నుండి ఆప్యాయంగా కొనుగోలు చేసే వంటకాలు ఇలా పిండిలో పొర్లించిన మాంసపు కండలే.
దైనందిన కృత్యంలో భాగంగా తారసపడే దృశ్యాలకు కొద్దిగా మేధస్సును జోడిస్తే ఎన్ని ప్రయోగాలు ఫలిస్తున్నాయో, తద్వారా నిత్యజీవితానికి ఎన్ని సరుకులు అదనంగా తోడౌతున్నాయో గమనిస్తే ఒక్కోసారి దిగ్భ్రాంతి కలుగుతుంది. ‘పాడి’ అనే సంపద కూడా మానవుని జీవితంలో ఆవిధంగా ప్రవేశించిందే. దూడను కోల్పోయిన పెంటి జంతువుకు పొదుగు సలుపు చెయ్యకుండా చూసేందుకు పాలను పిండేస్తారు. కుండలు రాకముందు ఆ పాలు నేలపాలుగాక తప్పేది కాదు.
పాలతో తడిసిన నేలను కుక్కలు నాకడం చూసినప్పుడు ఆ పదార్థం కుక్కలకు ఇష్టమని ఎవరికైనా తెలుస్తుంది. కుండలు వాడకంలోకి వచ్చిన తరువాత, పాలను అలా వృథాగా పిండేసేకంటే, కుక్కలకు పనికొచ్చినా ప్రయోజనమేనన్న అభిప్రాయం కలిగుండాలి. పాలతో కుక్కలను తృప్తిపరిచే అలవాటు ఇప్పటికీ గొర్రెల కాపరుల్లో కనిపిస్తుంది. సంకటిముద్ద మధ్యలో గుంతచేసి, అందులోకి గొర్రె పాలు పిండి, కొద్దికొద్దిగా సంకటిని ఆ పాలల్లో తడుపుతూ కుక్కకు విసిరేస్తారు. ఆ ఉండను నేలమీద పడనీయకుండా, ఎంతో హుషారుగా గాలిలోనే అందుకుంటుంది ఆ కుక్క.
(సశేషం)
రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com