టూకీగా ప్రపంచ చరిత్ర
రచన: ఎం.వి.రమణారెడ్డి
వెనుక తరాలు
అందుకు నిదర్శనం గుహాంతరాల్లో క్రోమాన్యాన్ మానవుని చిత్రకళ. గుహ గోడల మీద, వీలైనంత ఎత్తున, రంగులతో అతడు రకరకాల జంతువులను చిత్రించాడు. ఎరుపు, పసుపు, నలుపు, ఇటుకవర్ణాలు అతడు వాడిన రంగులు. బొమ్మల్లో ఎద్దులూ, అడవి దున్నలూ, జింకలూ, గుర్రాలూ, ఎలుగుబంట్లూ, బొచ్చు ఏనుగులూ ఉన్నాయి. గుర్రం, బొచ్చు ఏనుగు బొమ్మల సంఖ్య మిగతావాటికంటే చాలా ఎక్కువ. ఒకటి రెండు చోట్ల జంతుకొమ్ములు ధరించి మంత్రగాడిలా తోచే మనిషిని తప్ప, ఇతరత్రా మనిషి బొమ్మలను అతడు సంపూర్ణంగా నిషేధించాడు. ఏ బొమ్మ తీసుకున్నా నిలుచున్న జంతువును పక్కల నుండి చూస్తే ఎలా కనిపిస్తుందో అదే భంగిమలో (ప్రొఫైల్‌లో) ఉంటుంది. ఎదురుగా చూస్తే కనిపించినట్టు చిత్రించడం అతని శక్తికి మించిన నైపుణ్యంలా ఉంది.
ఒకటి రెండు తావుల్లో మినహా నాలుగుకాళ్ళూ కనిపించేలా గీసిన బొమ్మలు కనబడవు. ఆవలివైపుగా ఉండే కాళ్ళను చిత్రించడం గూడా అంత తేలికైన విద్యగాదు.చీకటిమయంగా ఉండే లోతైనగుహల్లో, కష్టంతోగాని చేరుకోలేని తావుల్లో, అందనంత ఎత్తున బొమ్మలను చిత్రించడం చూస్తే అవి వినోదం కోసం వేసినవి కావనీ, వాటి వెనుక ఏదో గూఢార్థం ఉందనీ సందేహం కలుగుతుంది. అందులోనూ ఆ జంతువుల్లో కొన్నిటికి బరిసెలు గుచ్చుకున్నట్టూ, గాయపడినట్టూ చూపడం అనుమానాన్ని బలపరుస్తుంది. క్రోమాన్యాన్ మానవుడు వాటిని ఏవో తాంత్రిక ప్రయోజనాల కోసం చిత్రించాడని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. జంతువులను అలా చిత్రించడం వల్ల వేటలో తనకు లాభం జరుగుతుందని అతని నమ్మకమైవుండొచ్చు.
ఒక్క యూరప్‌లోనే కాక, ఇటువంటి గుహాచిత్రాలు ఇతర ఖండాల్లోనూ వెలుగులోకి వస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోనే ఇటీవల అనేక గుహల్లో ఇలాంటివి కనిపించాయి. వందల వేల మైళ్ళు ఎడంగా జీవించిన మనుషుల్లో, ఒకరితో ఒకరికి సంబంధాలు ఊహించేందుకే వీలులేని కాలంలో, ఒకే తరహా విశ్వాసం ఇంత విస్తృతంగా నెరసుకోవడం ఎలా సాధ్యపడింది? జటిలమైన ఈ సవాలుకు జవాబు దొరకాలంటే, ‘అవసరం ఏమొస్తుందిలే’ అనుకుంటూ వదిలేసిన మరో పాతరను పెళ్ల్లగించాలి. ఇది జీవుల ప్రవర్తనకు సంబంధించిన రసాయనిక ప్రేరకాల సమాచారం దాగున్న పాతర. వెలుతురు ప్రసరించగానే వానపాము నేలపొరల లోతులకు కూరుకుపోవడం అందరికీ తెలిసిన విషయమే. అది చీకటిని ఆశ్రయించి బతికే జీవిగనుక, అలా వెలుతురును తప్పుకోవడంలో చోద్యం కనిపించదు. కానీ, చోద్యమల్లా - వెలుగును గ్రహించే ‘చూపు’గానీ, ఎలా నడుచుకోవాలో చెప్పే మెదడుగానీ సంతరించుకోని జీవి అంత చురుగ్గా స్పందించడమే. ఇంద్రియాలకు అతీతమైన ఈ స్పందననే మనం ‘ప్రాణం’ అంటున్నాం.
‘ప్రాణం’ అనే నిర్వచనానికి నాంది పలికిన ఏకకణజీవి మొదలు, ప్రాణికి ప్రాథమిక లక్షణాలైన ఆహార సముపార్జన, ఆత్మరక్షణ, చలనం, పెరుగుదల, సంతానోత్పత్తి వంటి అవసరాలకు ప్రేరేపించే జీవరసాయనిక పదార్థాలు ప్రతిజీవిలోనూ ఊరుతుంటాయి. ‘కణవిభేదన’ ఏర్పడిన ‘పురిటిదశ’ జీవుల్లో ఈ రసాయనాల ఉత్పత్తి ఏ కణానికి ఆ కణంలో జరిగిపోతుంది. ఆ తరువాతి దశలో వాటి ఉత్పత్తికి ప్రత్యేకకణాలు ఏర్పడి, అవి శరీరవ్యాప్తంగా విస్తరించి, తమ ఉత్పత్తులను రక్తప్రవాహంలో కలిపేయడం ద్వారా శరీరంలోని ప్రతి కణానికి వాటిని అందజేస్తాయి. మరింత ఎదిగిన దశ జీవుల్లో ఒకే తరహా పదార్థాల్ని ఉత్పత్తిజేసే కణాలన్నీ ఒక తావున పోగై గ్రంథులుగా రూపొందుతాయి. వీటికి నాళం ఉండదు గనుక, ‘వినాళ గ్రంథులు’గా వ్యవహరిస్తారు. ఇవి ఉత్పత్తి చేసే ద్రవాలను ‘హార్మోన్లు’ అంటారు. ఆత్మరక్షణ అవసరాల్లో తనకు తెలీకుండానే ఊసరవెల్లి చర్మంలో రంగులు మారేందుకు కారణం ఈ హార్మోన్లే.
లింగవ్యత్యాసానికి కారకాలైన ‘స్టీరాయిడ్’ పేరుగల హార్మోన్ల ప్రేరణకు ఫలితం ఎలాంటిదో పరిశీలిస్తే, మానవుని శరీరం మీద వీటి పట్టు ఎంత పటిష్టంగా ఉంటుందో తెలిసొస్తుంది. నడకలో గానీ, నిలుచునే వాలకంలోగానీ, కూర్చునే తీరులోగానీ, మాటలను అనుసరించే ఆంగిక ప్రదర్శనలోగానీ, ఆటపాటలకు సంబంధించిన అభిరుచుల్లోగానీ ఆడపిల్లలకూ మగపిల్లలకూ తేడా నాలుగైదేళ్ళ ప్రాయంలోనే ప్రారంభమౌతుంది. యవ్వనం సమీపించే సమయానికి అవి కరుడుగట్టి, స్వరం మారుతుందీ, చర్మం నిగారింపు మారుతుందీ, వెండ్రుకల పంపిణీ మారుతుందీ, ఒంటి వాసన గూడా వేరౌతుంది. ఈ మార్పుల ప్రవేశంలో ఆలోచించే మెదడుకూ, నేర్చుకునే విద్యలకూ ప్రమేయమే ఉండదు.