ఆచారాలు-నమ్మకాలు
సింహం కలలోకొచ్చిన ఏనుగు, తిరిగి మెలకువలోకి రాకుండా, అదే నిద్రలో చనిపోతుందనేది ఒక నమ్మకం. ఏనుగు కాదుకదా, మాటలొచ్చిన మనిషైనా నిద్రలో హఠాత్తుగా చనిపోతే, తను ఏ కల కారణంగా అంతటి అవాంతరానికి గురయ్యాడో చెప్పుకోలేడు. పైగా, జంతువులకు కలలుగనే స్థోమత ఉందో లేదో మనకు తెలీదు. కలలు కనాలంటే అనేక సోపానాలుగా పనిచేయగల స్థాయికి మెదడు ఎదిగుండాలి.
మైకంలోకి జారిపోయిన మనిషికి ‘ఉలుకూ లేదు, పలుకూ లేదు’ అంటుంటాం. పలుకు అనేది స్పృహలో ఉంటే తప్ప జరగని చర్య. ఉలుకు అంటే అసంకల్పిత చర్య. బాగా నిద్రలో వున్న మనిషికి ఎక్కడైనా ఏదైనా చురుకు తగిలితే మెలకువలోకి రాకుండానే దూరంగా సర్దుకుంటాడు. లేదా చేత్తో రుద్దుకుంటాడు. అది అసంకల్పిత చర్య. ఈ రెండు చర్యలు మెదడు అనే పదార్థం శరీరంలో ఏర్పడిన ప్రతి జీవిలో కనిపిస్తాయి.
సందర్భ శుద్ది లేకుండా ఎవరైనా మాట్లాడితే - ‘మన లోకంలో ఉండే మాట్లాడుతున్నావా?’ అంటాం. లేదా ‘స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా?’ అంటాం. అంటే మాట్లాడడం అనే చర్య స్పృహలోనూ జరుగుతుంది, స్పృహ తగ్గినప్పుడూ జరుగుతుంది కానీ, స్పృహ కోల్పోయినప్పుడు జరగదు అని మనందరికీ తెలుసు. దీన్నిబట్టి, మనిషి మెదడు స్పృహ, మగత, లేదా మత్తు, మైకం అనే సోపానాల్లో పనిచేయగల స్థాయికి ఎదిగిపోయిందని తెలుస్తుంది.
ఏళ్ల తరబడి సంపాదించిన అనుభవాలను విశ్లేషించి, ప్రోగు చేసుకుని, ఎన్నో ఏళ్లు గడిచేదాకా దాచుకుని, అవసరమైన ప్రతి సందర్భంలోనూ ఆలోచనతో అనుసంధానం చేసే ప్రక్రియ ‘స్పృహ’. ఆలోచనా సంబంధంగా కాకుండా, దాచుకున్న సమాచారాన్ని అస్తవ్యస్తంగా వెళ్లగక్కే ప్రక్రియ ‘మగత’. ఇది కలలో దృశ్యంగానూ జరగొచ్చు, ప్రేలాపనలోనూ జరగచ్చు. ఈ రెండే కాకుండా మరిన్ని సోపానాల్లో ఆరోహణ, అవరోహణ చేయగల సమర్థత మనిషిలోని పెద్దమెదడుకు ఏర్పడింది. అందువల్లే మనిషికి ‘కల’ అనే ఒక అవస్థ సాధ్యపడింది.
ఉదాహరణకు - మందలో తనతోటి జంతువొకటి చనిపోతే, ఆ ఎడబాటు మందలో మిగతా జంతువులకు ఎంతసేపు గుర్తుంటుందో చెప్పలేం. చావును వాసనబట్టే శక్తి ఉందిగాబట్టి అది చనిపోయిందని తెలుసుకోగలవు. అయినా దాన్ని అక్కడే వదిలేసి దూరంగా తొలగిపోతాయి. చంటిబిడ్డ చనిపోయినప్పుడు, చావు వాసన తెలిసికూడా, కడుపు తీపితోనో లేక తిరిగి ప్రాణం తెచ్చుకుంటుందనే ఆశతోనో రెండు మూడు రోజులదాకా శవం దగ్గరే కాపలా కాచే జంతువులు కూడా కనిపిస్తాయి. ఆ స్వల్పమైన వ్యవధి దాటిపోయిన తరువాత ఆ జంతువు జ్ఞాపకాల్లో ఆ బిడ్డ ఎన్నిరోజులు నిలుస్తుందో మనకు అర్థం కాదు. ఆ విషయంగా జంతువు ప్రవర్తనకూ, మనిషి ప్రవర్తనకూ పోలిక లేనంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం పాత రాతియుగం కాలానికే ఏర్పడిందని మనం కచ్చితంగా చెప్పుకోవచ్చు.
సన్నిహితుల్లో ఎవరైనా చనిపోతే, వాళ్ల జ్ఞాపకాలు మనిషిని ఏళ్ల తరబడి వెంటాడడమే కాదు,అడపాదడపా వాళ్లు కలలో కనిపించడం కూడా కద్దు. పాత రాతియుగం మనిషి కూడా చనిపోయిన నేస్తానికి తిరిగి ప్రాణం వస్తుందనే ఆశతో కొంతకాలం దాకా కాచుకుని గడిపి వుండొచ్చు. నిరాశతో శవాన్ని వదిలేసి ముందుకు సాగిపోయిన తరువాత కూడా జ్ఞాపకాల దాడిని తట్టుకోలేక శవమున్న చోటికి తిరిగిరాగానే - కుక్కలూ, నక్కలూ, కాకులూ, గద్దలూ ఛిద్రం చేసిన దృశ్యాన్ని సహించలేక, తనకు కావలసినవారి మృతదేహం వాటి బారిన పడకుండా చూసే మార్గాలను ఆలోచించే అవసరం అప్పుడు కలిగుండొచ్చు. ఆ ఆలోచన ఫలితంగా పుట్టిన ఆచారమే ‘శవసంస్కారం’. ఈ సంస్కారం ప్రధానంగా మూడు పద్ధతుల్లో కనిపిస్తుంది.
(సశేషం)
రచన: ఎం.వి.రమణారెడ్డి
రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com
టూకీగా ప్రపంచ చరిత్ర - 63
Published Tue, Mar 17 2015 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM
Advertisement