టూకీగా ప్రపంచ చరిత్ర - 64 | story of M.V. Ramanaa Reddy | Sakshi
Sakshi News home page

టూకీగా ప్రపంచ చరిత్ర - 64

Published Wed, Mar 18 2015 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

story of M.V. Ramanaa Reddy

ఆచారాలు-నమ్మకాలు
‘శవసంస్కారం’ ప్రధానంగా మూడు పద్ధతుల్లో కనిపిస్తుంది. మొదటిది శవాన్ని చెట్టుమీదికి చేర్చడం. మహాభారతం విరాటపర్వంలోని ‘శమీవృక్ష సంఘటన’ ద్వారా ఇలాంటి పద్ధతి ఒకటుండేదని మనకు తెలుస్తుంది. టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో ఇప్పటికీ ఈ పద్ధతి కొనసాగుతుందని వినికిడి. నేలను తవ్వేందుకు తగిన సాధనాలు లేకనో, తవ్వకానికి ఆ నేల అనుకూలించకనో ఈ ఆచారం ఏర్పడి వుండొచ్చు.

రెండవది, ఆర్య సంతతి అనుసరించే శవదహనం. లోతైన గోతిని తొలిచే అవకాశం లేక, లోతు తక్కువైన గోతిలో పాతిపెడితే, పై మట్టిని కుక్కలూ నక్కలూ తేలిగ్గా తొలగించి, శవాన్ని పూర్తిగానో ముక్కలుముక్కలుగానో ఎత్తుకొచ్చి కొరుకుతున్న బీభత్సానికి తీవ్రమైన ప్రతీకారంగా శవాన్ని దహించటానికి చేసుకున్న నిర్ణయంతో ఈ పద్ధతి ఉనికిలోకి వచ్చి వుండొచ్చు. ఇక మూడవది, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా అనుసరించే శవఖననం. అంటే, నక్కల వంటి జంతువులకు తోడే ఆస్కారం లేనంత లోతుగా శవాన్ని పాతిపెట్టడం.
 
ఆచారం వేరు, నమ్మకం వేరు; దాని పునాది వేరు, దీని పునాది వేరు. వంశపారంపర్యంగా అనసరించేది ఆచారం. ఇది ఎన్నోతరాల పరంపరగా, వ్యక్తిగత వైరుధ్యాలకు పెద్దగా చోటివ్వకుండా కొనసాగే చర్యల సమ్మేళనం. సమ్మకం లేదా విశ్వాసం అనేది సంపూర్ణంగా వ్యక్తిగతమైన వ్యవహారం. ఒకే కుటుంబంలోని సభ్యులందరివల్ల ఆచారాలు ఒకే రకంగా పాటించబడొచ్చుగానీ, నమ్మకాలు మాత్రం వేరు వేరుగా ఉండగలవు.
 
‘శవసంస్కారం’లో పై మూడు పద్ధతులే కాక, మరో విచిత్రమైన పద్ధతి కూడా భారతదేశంలో కనిపిస్తుంది. ఇది అతి తక్కువ సంఖ్యాకులైన పారసీలు లేదా పారసీకులు ఇప్పటికీ ఆచరిస్తున్న పద్ధతి. వీళ్ళు పూనా, బొంబాయి నగరాల్లోనూ, వాటి పరిససరాల్లోనూ నివసిస్తున్నారు. ప్రార్థనా సంబంధమైన కార్యక్రమాల్లో వాళ్ళు ఉచ్చరించే మంత్రాలు అవెస్టాలోనికి కావడం వల్ల, వీళ్ళను ఒకనాటి జొరాస్ట్రియన్లుగా భావించొచ్చు.

శవాన్ని ఎత్తై భవనం పైకప్పుకు చేర్చి, దాన్ని రాబందులకు ఆహారం అయ్యేలు వదిలెయ్యడం వీళ్ళ ఆచారం. చనిపోయిన తరువాత గూడా తన శరీరం ఏదోవొక ప్రాణికి ఉపయోగపడాలన్న సంకల్పం ఇందులో కనిపిస్తుంది. తీవ్రమైన ప్రతీకార ధోరణిగా కనిపించే ఆర్యుల ‘దహన’ పద్ధతికి సంపూర్ణమైన విరుద్ధదృవంగా కనిపించేది పారసీల పద్ధతి. మొత్తంమీద, పద్ధతి ఏదైనా, శవసంస్కారమనే ఆచారం మూలంగా మానవుడు జంతువు నుండి సంపూర్ణంగా వేరుపడి, తన స్థాయిని ఎన్నో అంతస్తులు పెంచుకున్నాడు.
 
ఆచారం వేరు, నమ్మకం వేరు; దాని పునాది వేరు, దీని పునాది వేరు. వంశపారంపర్యంగా అనుసరించేది ఆచారం. ఇది ఎన్నోతరాల పరంపరగా, వ్యక్తిగత వైరుధ్యాలకు పెద్దగా చోటివ్వకుండా కొనసాగే చర్యల సమ్మేళనం. సమ్మకం లేదా విశ్వాసం అనేది సంపూర్ణంగా వ్యక్తిగతమైన వ్యవహారం. ఒకే కుటుంబంలోని సభ్యులందరివల్ల ఆచారాలు ఒకే రకంగా పాటించబడొచ్చుగానీ, నమ్మకాలు మాత్రం వేరు వేరుగా ఉండగలవు. ఆచారాలూ నమ్మకాలూ కలగాపులగంగా పెన వేసుకున్న దశలో జీవిస్తున్న మనకు వాటిలో ఒకదాన్నుండి మరొకదాన్ని విడదీయడం సులభం కాకపోయినా, చరిత్రలో మానవుని తొలిమెట్టుకు వెనుదిరిగితే వాటి విడివిడి పునాదులు స్పష్టంగా గోచరిస్తాయి.
 
గరిష్టమైన స్థాయికి ఎదిగిన మెదడుకన్నా, దాని సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకునే అవసరం ఆ మానవునికి కలుగలేదు. ‘ఇదిగో జింక - దీన్ని పడగొట్టడం ఎలా ? అదిగో ఉడుత  - దాన్ని పట్టుకోవడం ఎలా?’ వంటి తక్షణ ప్రయోజనాలూ, ‘అది కీకారణ్యం. అందులో క్రూరమృగాలుండొచ్చు; ఇది చిక్కటి పొద. ఇందులో పాము దాక్కోనుండొచ్చు’ వంటి జాగ్రత్తలకు మాత్రమే అతని ఆలోచన పరిమితం. ఐనా, అతనికి జ్ఞాపకాలూ, కలలూ ఉండేవని అతడు ఆచరించిన శవసంస్కారం, అతడు వేసిన గుహాచిత్రాలు నిరూపిస్తున్నాయి.
 
రచన: ఎం.వి.రమణారెడ్డి
రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement